ఆదికాండం 29:1-35
29 ఆ తర్వాత యాకోబు తన ప్రయాణాన్ని కొనసాగించి తూర్పు ప్రజల దేశానికి వెళ్లాడు.
2 అక్కడ అతను పచ్చిక మైదానంలో ఒక బావిని చూశాడు. ఆ బావి పక్కనే మూడు గొర్రెల మందలు పడుకొని ఉన్నాయి. ఎందుకంటే కాపరులు సాధారణంగా ఆ గొర్రెలకు అక్కడే నీళ్లు పెడతారు. ఆ బావి ఒక పెద్ద రాయితో మూసేసి ఉంది.
3 గొర్రెల మందలన్నీ ఒక దగ్గరికి చేరాక, వాళ్లు ఆ బావి మీదున్న రాయిని పక్కకు దొర్లించి ఆ మందలకు నీళ్లు పెట్టి, ఆ తర్వాత మళ్లీ ఆ రాయితో బావిని మూసేస్తారు.
4 యాకోబు వాళ్లను, “నా సహోదరులారా, మీరు ఎక్కడివాళ్లు?” అని అడిగాడు. దానికి వాళ్లు, “మేము హారాను+ వాళ్లం” అని జవాబిచ్చారు.
5 అప్పుడు యాకోబు వాళ్లను, “మీకు నాహోరు+ మనవడు లాబాను+ తెలుసా?” అని అడిగాడు. దానికి వాళ్లు, “తెలుసు” అన్నారు.
6 తర్వాత యాకోబు వాళ్లను, “అతను బాగున్నాడా?” అని అడిగాడు. అందుకు వాళ్లు, “అతను బాగున్నాడు. ఇదిగో, అతని కూతురు రాహేలు+ గొర్రెలతో వస్తోంది!” అన్నారు.
7 అతను వాళ్లతో, “ఇది ఇంకా మధ్యాహ్నమే, మందల్ని ఒకచోటికి చేర్చే సమయం కాదు. కాబట్టి గొర్రెలకు నీళ్లు పెట్టి, వెళ్లి వాటిని మేపండి” అన్నాడు.
8 దానికి వాళ్లు, “మందలన్నీ ఒకచోటికి చేరి, బావి మీది రాయి దొర్లించబడే వరకు వాటికి నీళ్లు పెట్టడానికి మాకు అనుమతి లేదు. ఆ తర్వాతే మేము వాటికి నీళ్లు పెడతాం” అన్నారు.
9 అతను ఇంకా వాళ్లతో మాట్లాడుతుండగానే, రాహేలు తన తండ్రి గొర్రెలతో అక్కడికి వచ్చింది; ఆమె గొర్రెల్ని కాసేది.
10 యాకోబు తన మేనమామ లాబాను కూతురు రాహేలును, అతని గొర్రెల్ని చూసినప్పుడు, వెంటనే బావి దగ్గరికి వెళ్లి దాని మీదున్న రాయిని పక్కకు దొర్లించి, తన మేనమామ గొర్రెలకు నీళ్లు పెట్టాడు.
11 తర్వాత యాకోబు రాహేలును ముద్దుపెట్టుకొని, గట్టిగా ఏడ్చాడు.
12 తాను ఆమె తండ్రి బంధువునని,* రిబ్కా కుమారుణ్ణని యాకోబు రాహేలుకు చెప్పడం మొదలుపెట్టాడు. ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ విషయాన్ని తన తండ్రికి చెప్పింది.
13 లాబాను+ తన మేనల్లుడు యాకోబు గురించి విన్న వెంటనే, అతన్ని కలవడానికి పరుగెత్తుకుంటూ వెళ్లాడు. లాబాను అతన్ని కౌగిలించుకొని, ముద్దుపెట్టుకొని తన ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడు అతను లాబానుకు ఈ విషయాలన్నీ చెప్పడం మొదలుపెట్టాడు.
14 లాబాను అతనితో, “నిజంగా నువ్వు నా రక్తసంబంధివి”* అన్నాడు. కాబట్టి అతను లాబాను దగ్గర ఒక నెలంతా ఉన్నాడు.
15 ఆ తర్వాత లాబాను యాకోబుతో, “నువ్వు నా బంధువు*+ అయినంత మాత్రాన, జీతం తీసుకోకుండా నా దగ్గర పని చేయాలా? చెప్పు, నీకు జీతంగా ఏమివ్వమంటావు?”+ అన్నాడు.
16 లాబానుకు ఇద్దరు కూతుళ్లు. పెద్దామె లేయా, చిన్నామె రాహేలు.+
17 అయితే లేయా కళ్లు ఆకర్షణీయంగా ఉండేవి కావు, కానీ రాహేలు మాత్రం చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉండేది.
18 యాకోబు రాహేలును ప్రేమించాడు, కాబట్టి ఇలా అన్నాడు: “నీ చిన్న కూతురు రాహేలు కోసం నేను నీ దగ్గర ఏడేళ్లు పనిచేస్తాను.”+
19 దానికి లాబాను, “నా కూతుర్ని ఇంకెవరికో ఇచ్చే బదులు నీకు ఇవ్వడమే మంచిది, నా దగ్గరే ఉండు” అన్నాడు.
20 దాంతో యాకోబు రాహేలు కోసం లాబాను దగ్గర ఏడేళ్లు పనిచేశాడు.+ కానీ, ఆమె మీద ఉన్న ప్రేమ వల్ల ఆ ఏడేళ్లు అతనికి కేవలం కొన్ని రోజుల్లా అనిపించాయి.
21 తర్వాత యాకోబు లాబానుతో, “నేను నీ దగ్గర పనిచేయాల్సిన రోజులు అయిపోయాయి, కాబట్టి నా భార్యను నాకు ఇచ్చేయి. నేను ఆమెతో కలవాలి”* అన్నాడు.
22 దాంతో లాబాను ఆ ప్రాంతంలో ఉన్న వాళ్లందర్నీ పిలిచి విందు ఏర్పాటు చేశాడు.
23 కానీ సాయంకాలమైనప్పుడు లాబాను తన కూతురు లేయాను యాకోబు దగ్గరికి తీసుకొచ్చాడు, యాకోబు లేయాతో కలవాలని* అతను అలా చేశాడు.
24 అంతేకాదు లాబాను తన సేవకురాలు జిల్పాను లేయాకు సేవకురాలిగా ఇచ్చాడు.+
25 తెల్లవారినప్పుడు, యాకోబు లేచి చూసేసరికి అతని పక్కన ఉన్నది లేయా! అప్పుడు అతను లాబానుతో, “నువ్వు చేసిందేంటి? నేను నీకు సేవ చేసింది రాహేలు కోసం కాదా? నన్ను ఎందుకు మోసం చేశావు?”+ అన్నాడు.
26 అందుకు లాబాను ఇలా అన్నాడు: “పెద్ద కూతురు కన్నా ముందు చిన్న కూతురికి పెళ్లి చేయడం ఇక్కడి ఆచారం కాదు.
27 ఈ వారమంతా ఆమెతో సంతోషించు, ఆ తర్వాత చిన్నామెను కూడా నీకు ఇస్తాను. కాకపోతే నువ్వు నాకు ఇంకో ఏడు సంవత్సరాలు సేవ చేయాలి.”+
28 లాబాను చెప్పినట్టే యాకోబు ఆమెతో ఆ వారమంతా సంతోషించాడు. ఆ తర్వాత లాబాను తన కూతురు రాహేలును యాకోబుకు ఇచ్చి పెళ్లి చేశాడు.
29 అంతేకాదు, లాబాను తన సేవకురాలు బిల్హాను+ తన కూతురు రాహేలుకు సేవకురాలిగా ఇచ్చాడు.+
30 యాకోబు రాహేలుతో కూడా కలిశాడు.* అతను లేయా కన్నా రాహేలును ఎక్కువగా ప్రేమించాడు. అతను ఇంకో ఏడు సంవత్సరాలు లాబానుకు సేవచేశాడు.+
31 యాకోబు లేయాను ప్రేమించట్లేదని* యెహోవా చూసి ఆమె గర్భవతి అయ్యేలా చేశాడు;*+ కానీ రాహేలు గొడ్రాలిగా ఉంది.+
32 కాబట్టి లేయా గర్భవతి అయ్యి ఒక కుమారుణ్ణి కని, అతనికి రూబేను*+ అని పేరు పెట్టింది. “ఎందుకంటే యెహోవా నా బాధను చూశాడు,+ ఇప్పుడు నా భర్త నన్ను ప్రేమించడం మొదలుపెడతాడు” అని ఆమె అనుకుంది.
33 ఆమె మళ్లీ గర్భవతి అయ్యి, కుమారుణ్ణి కని, “నా భర్త నన్ను ప్రేమించట్లేదని నేను పెట్టిన మొర యెహోవా విన్నాడు, అందుకే ఈ కుమారుణ్ణి కూడా అనుగ్రహించాడు” అనుకుంటూ అతనికి షిమ్యోను*+ అని పేరు పెట్టింది.
34 ఆమె మళ్లీ గర్భవతి అయ్యి, ఒక కుమారుణ్ణి కని, “ఇప్పుడు నా భర్త నన్ను అంటిపెట్టుకొని ఉంటాడు, ఎందుకంటే నేను అతనికి ముగ్గురు కుమారుల్ని కన్నాను” అనుకుంటూ, ఆ పిల్లవాడికి లేవి*+ అని పేరు పెట్టింది.
35 ఆమె మళ్లీ ఇంకోసారి గర్భవతి అయ్యి, ఒక కుమారుణ్ణి కని, “ఈసారి నేను యెహోవాను స్తుతిస్తాను” అనుకుంటూ, అతనికి యూదా*+ అని పేరు పెట్టింది. ఆ తర్వాత కొంతకాలం ఆమెకు పిల్లలు పుట్టలేదు.
అధస్సూచీలు
^ అక్ష., “సహోదరుణ్ణని.”
^ అక్ష., “నా ఎముకవి, నా మాంసానివి.”
^ అక్ష., “సహోదరుడివి.”
^ లేదా “లైంగిక సంబంధం పెట్టుకోవాలి.”
^ లేదా “లైంగిక సంబంధం పెట్టుకోవాలని.”
^ లేదా “లైంగిక సంబంధం పెట్టుకున్నాడు.”
^ అక్ష., “ద్వేషిస్తున్నాడని.”
^ అక్ష., “ఆమె గర్భాన్ని తెరిచాడు.”
^ “ఇదిగో, ఒక కుమారుడు!” అని అర్థం.
^ “వినడం” అని అర్థం.
^ “అంటిపెట్టుకొని ఉండడం; అంటిపెట్టుకున్న” అని అర్థం.
^ “స్తుతించబడిన; స్తుతిని పొందే” అని అర్థం.