ఆదికాండం 25:1-34

  • అబ్రాహాము మళ్లీ పెళ్లి చేసుకోవడం (1-6)

  • అబ్రాహాము మరణం (7-11)

  • ఇష్మాయేలు కుమారులు (12-18)

  • యాకోబు, ఏశావు పుట్టడం (19-26)

  • ఏశావు జ్యేష్ఠత్వపు హక్కును ​అమ్మేయడం (27-34)

25  అబ్రాహాము మళ్లీ పెళ్లి చేసుకున్నాడు, ఆ స్త్రీ పేరు కెతూరా.  ఆమె అతనికి కన్న పిల్లలు ఎవరంటే: జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను,+ ఇష్బాకు, షూవహు.+  యొక్షానుకు షేబ, దెదాను పుట్టారు. దెదాను కుమారులు ఎవరంటే: అష్షూరీ, లెతూషీ, లెయుమీ.  మిద్యాను కుమారులు ఎవరంటే: ఏయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా. వీళ్లంతా కెతూరా మనవళ్లు.  తర్వాత అబ్రాహాము తనకు ఉన్నదంతా ఇస్సాకుకు ఇచ్చాడు.+  అయితే తన ఉపపత్నుల ద్వారా పుట్టిన కుమారులకు అబ్రాహాము బహుమతులు ఇచ్చాడు. ఆ తర్వాత అబ్రాహాము తాను ఇంకా బ్రతికి ఉండగానే, వాళ్లను ఇస్సాకుకు దూరంగా తూర్పు వైపుగా తూర్పు దేశానికి పంపించేశాడు.+  అబ్రాహాము మొత్తం 175 ఏళ్లు బ్రతికాడు.  అబ్రాహాము చాలా ఏళ్లు బ్రతికి, మంచి వృద్ధాప్యంలో సంతృప్తితో తుదిశ్వాస విడిచాడు; తన ప్రజల దగ్గరికి చేర్చబడ్డాడు.*  అతని కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలు అతన్ని మమ్రే ఎదురుగావున్న మక్పేలా గుహలో పాతిపెట్టారు. అది హిత్తీయుడైన సోహరు కుమారుడు ఎఫ్రోను పొలంలో ఉంది.+ 10  అబ్రాహాము ఆ పొలాన్ని హేతు కుమారుల దగ్గర కొన్నాడు. అబ్రాహాము అక్కడే తన భార్య శారా దగ్గర పాతిపెట్టబడ్డాడు.+ 11  అబ్రాహాము చనిపోయిన తర్వాత కూడా దేవుడు అతని కుమారుడు ఇస్సాకును దీవిస్తూనే ఉన్నాడు.+ ఇస్సాకు బెయేర్‌-లహాయిరోయి+ దగ్గర నివసించేవాడు. 12  శారా సేవకురాలు, ఐగుప్తీయురాలు అయిన హాగరు+ అబ్రాహాముకు కన్న ఇష్మాయేలు+ చరిత్ర ఇది: 13  ఇవి వాళ్లవాళ్ల వంశాల ప్రకారం ఇష్మాయేలు కుమారుల పేర్లు: ఇష్మాయేలు పెద్ద కుమారుడు నెబాయోతు,+ ఆ తర్వాత కేదారు,+ అద్బయేలు, మిబ్శాము,+ 14  మిష్మా, దూమా, మశ్శా, 15  హదదు, తేమా, యెతూరు, నాపీషు, కెదెమా. 16  ఇవి వాళ్లవాళ్ల గ్రామాల ప్రకారం, శిబిరాల* ప్రకారం ఇష్మాయేలు కుమారుల పేర్లు. ఈ 12 మంది వాళ్లవాళ్ల వంశాల ప్రధానులు.+ 17  ఇష్మాయేలు మొత్తం 137 ఏళ్లు బ్రతికి, తుదిశ్వాస విడిచాడు; తన ప్రజల దగ్గరికి చేర్చబడ్డాడు.* 18  వాళ్లు ఐగుప్తుకు సమీపాన షూరు+ దగ్గర ఉన్న హవీలా+ నుండి అష్షూరు వరకున్న ప్రాంతంలో నివాసం ఏర్పర్చుకున్నారు. అతను తన సహోదరులందరి ఎదుట* స్థిరపడ్డాడు.+ 19  ఇది అబ్రాహాము కుమారుడు ఇస్సాకు+ చరిత్ర. అబ్రాహాము ఇస్సాకును కన్నాడు. 20  ఇస్సాకు రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు అతని వయసు 40 ఏళ్లు. ఈ రిబ్కా పద్దనరాముకు చెందిన అరామీయుడైన బెతూయేలు కూతురు,+ అరామీయుడైన లాబాను సహోదరి. 21  తన భార్య గొడ్రాలిగా ఉంది కాబట్టి ఇస్సాకు ఆమె గురించి యెహోవాను వేడుకుంటూ ఉన్నాడు; యెహోవా అతని ప్రార్థనకు జవాబిచ్చాడు; అతని భార్య రిబ్కా గర్భవతి అయ్యింది. 22  ఆమె గర్భంలో ఉన్న కుమారులు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం మొదలుపెట్టారు.+ దాంతో ఆమె, “పరిస్థితి ఇలా ఉంటే, ఇక నేను ఎందుకు బ్రతకాలి?” అంది. అందుకే ఆమె దాని గురించి యెహోవాను అడిగింది. 23  అప్పుడు యెహోవా ఆమెతో ఇలా అన్నాడు: “నీ గర్భంలో+ రెండు జనాలు ఉన్నాయి. నీలో నుండి రెండు వేర్వేరు జనాలు పుడతాయి;+ ఒక జనం ఇంకో జనం కన్నా బలమైనదిగా ఉంటుంది;+ పెద్దవాడు చిన్నవాడికి సేవకుడు అవుతాడు.”+ 24  ఆమె ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఇదిగో, ఆమె గర్భంలో కవలలు ఉన్నారు! 25  మొదటివాడు బయటికి వచ్చాడు. వాడు మొత్తం ఎర్రగా, వెంట్రుకలతో నేసిన వస్త్రంలా ఉన్నాడు.+ కాబట్టి అతనికి ఏశావు*+ అని పేరు పెట్టారు. 26  ఆ తర్వాత అతని తమ్ముడు బయటికి వచ్చాడు, అతను ఏశావు మడిమెను పట్టుకొని ఉన్నాడు.+ కాబట్టి అతనికి యాకోబు* అని పేరు పెట్టారు.+ రిబ్కా వాళ్లను కన్నప్పుడు ఇస్సాకుకు 60 ఏళ్లు. 27  ఆ అబ్బాయిలు ఎదిగినప్పుడు, ఏశావు నైపుణ్యంగల వేటగాడు అయ్యాడు,+ అతను వేటాడుతూ ఎక్కువగా బయటే ఉండేవాడు; అయితే యాకోబు డేరాల్లో నివసించేవాడు,+ ఇతను ఏ నిందా లేని వ్యక్తి. 28  ఇస్సాకు ఏశావును ప్రేమించాడు, ఎందుకంటే అతను తెచ్చే వేటమాంసం అంటే ఇస్సాకుకు ఇష్టం. కానీ రిబ్కా మాత్రం యాకోబును ప్రేమించింది.+ 29  ఒకసారి, ఏశావు బాగా అలసిపోయి ఇంటికి వచ్చేసరికి యాకోబు ఒక కూర వండుతున్నాడు. 30  ఏశావు యాకోబుతో, “నేను బాగా అలసిపోయాను,* దయచేసి త్వరగా నీ దగ్గరున్న ఆ ఎర్రని కూరలో కొంచెం నాకు పెట్టు!” అన్నాడు. అందుకే అతనికి ఎదోము* అని పేరొచ్చింది.+ 31  అప్పుడు యాకోబు, “ముందు నీ జ్యేష్ఠత్వపు హక్కును+ నాకు అమ్ము” అన్నాడు. 32  అందుకు ఏశావు, “ఇక్కడ నేను ఆకలితో చచ్చిపోతున్నాను! జ్యేష్ఠత్వపు హక్కు వల్ల నాకేం ఉపయోగం?” అన్నాడు. 33  దానికి యాకోబు, “ముందు నాకు ఒట్టేయి!” అన్నాడు. కాబట్టి ఏశావు ఒట్టేసి తన జ్యేష్ఠత్వపు హక్కును యాకోబుకు అమ్మేశాడు.+ 34  అప్పుడు యాకోబు ఏశావుకు రొట్టెను, చిక్కుడుకాయల కూరను ఇచ్చాడు. ఏశావు తిని, తాగి, లేచి వెళ్లిపోయాడు. అలా ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించాడు.

అధస్సూచీలు

మరణాన్ని కావ్యరూపంలో ఇలా వర్ణించారు.
లేదా “ప్రాకారాలుగల శిబిరాల.”
మరణాన్ని కావ్యరూపంలో ఇలా వర్ణించారు.
లేదా “తన సహోదరులందరితో విరోధం కలిగివుండి” అయ్యుంటుంది.
“వెంట్రుకలతో నిండిన” అని అర్థం.
“మడిమెను పట్టుకునేవాడు; ఇంకొకరి స్థానాన్ని లాక్కునేవాడు” అని అర్థం.
లేదా “ఆకలితో చచ్చిపోతున్నాను.”
“ఎర్రని” అని అర్థం.