ఆదికాండం 23:1-20

  • శారా మరణం, సమాధుల స్థలం (1-20)

23  శారా 127 ఏళ్లు బ్రతికి చనిపోయింది.+  ఆమె కనాను దేశంలోని+ కిర్యతర్బాలో+ అంటే హెబ్రోనులో+ చనిపోయింది. ఆమె చనిపోయినందుకు అబ్రాహాము చాలా దుఃఖించాడు, ఏడ్చాడు.  తర్వాత అబ్రాహాము తన భార్య మృతదేహం దగ్గర నుండి లేచి, హేతు+ కుమారులతో ఇలా అన్నాడు:  “నేను పరదేశిగా వచ్చి మీ మధ్య స్థిరపడ్డాను.+ నా భార్య మృతదేహాన్ని ఇక్కడి నుండి తీసి పాతిపెట్టడానికి మీ ప్రాంతంలో నాకు కొంత స్థలాన్ని ఇవ్వండి.”  అప్పుడు హేతు కుమారులు అబ్రాహాముతో ఇలా అన్నారు:  “ప్రభూ, మా మాట విను. నువ్వు మా మధ్య దేవుడు ఎంచుకున్న ప్రధానుడివి.*+ మా సమాధుల స్థలాల్లో శ్రేష్ఠమైన దానిలో నువ్వు నీ భార్య మృతదేహాన్ని పాతిపెట్టుకోవచ్చు. మాలో ఎవరి సమాధుల స్థలంలోనైనా నువ్వు నీ భార్యను పాతిపెట్టుకోవచ్చు, మేము ఎవ్వరం అడ్డుచెప్పం.”  దానికి అబ్రాహాము లేచి ఆ దేశ ప్రజలైన హేతు+ కుమారులకు వంగి నమస్కారం చేసి,  వాళ్లతో ఇలా అన్నాడు: “నా భార్య మృతదేహాన్ని ఇక్కడి నుండి తీసి పాతిపెట్టడానికి మీరు ఒప్పుకుంటే, నా మాట విని సోహరు కుమారుడు ఎఫ్రోనును వేడుకొని,  అతని పొలం చివర ఉన్న మక్పేలా గుహను నాకు అమ్మమనండి; ఆ భూమి ఎంత వెండి పలికితే అంతకు మీ సమక్షంలో దాన్ని నాకు అమ్మమనండి.+ అప్పుడు నాకు కూడా ఒక సమాధుల స్థలం ఉంటుంది.”+ 10  ఆ సమయంలో ఎఫ్రోను హేతు కుమారుల మధ్య కూర్చొని ఉన్నాడు. కాబట్టి, హిత్తీయుడైన ఎఫ్రోను హేతు కుమారుల ముందు, ఆ నగర ద్వారం+ దగ్గరున్న వాళ్లందరి ముందు ఇలా అన్నాడు: 11  “లేదు ప్రభూ! నా మాట విను. నీకు ఆ పొలాన్ని, అందులోని గుహను ఇచ్చేస్తాను. నా ప్రజల సమక్షంలో దాన్ని నీకు ఇచ్చేస్తాను. నీ భార్యను పాతిపెట్టుకో.” 12  అప్పుడు అబ్రాహాము ఆ దేశ ప్రజల ముందు వంగి నమస్కారం చేసి, 13  వాళ్లు వింటుండగా ఎఫ్రోనుతో ఇలా అన్నాడు: “లేదు, దయచేసి నా మాట విను. నీ పొలం ఎంత వెండి పలికితే అంత నేను నీకు ఇస్తాను. ఆ వెండిని నా దగ్గర తీసుకో, అప్పుడే నా భార్యను అక్కడ పాతిపెట్టుకుంటాను.” 14  దానికి ఎఫ్రోను అబ్రాహాముతో ఇలా అన్నాడు: 15  “నా ప్రభూ! నా మాట విను. ఈ భూమి విలువ 400 షెకెల్‌ల* వెండి. కానీ మన మధ్య డబ్బుదేముంది? నీ భార్యను పాతిపెట్టుకో.” 16  అబ్రాహాము ఎఫ్రోను మాట విని, హేతు కుమారుల ముందు ఎఫ్రోను చెప్పినంత వెండిని, అంటే అప్పటి వర్తకుల ప్రమాణాల ప్రకారం 400 షెకెల్‌ల* వెండిని తూచి అతనికి ఇచ్చాడు.+ 17  అలా మమ్రే దగ్గర మక్పేలాలో ఉన్న ఎఫ్రోను పొలాన్ని, అంటే ఆ పొలాన్ని, అందులోని గుహను, ఆ పొలం సరిహద్దుల లోపలున్న చెట్లన్నిటినీ అబ్రాహాము ఆస్తిగా ఖరారు చేశారు. 18  హేతు కుమారుల సమక్షంలో, ఆ నగర ద్వారం దగ్గరున్న వాళ్లందరి ముందు అబ్రాహాము దాన్ని కొన్నట్టు ఖరారు అయ్యింది. 19  ఆ తర్వాత అబ్రాహాము తన భార్య శారాను కనాను దేశంలో మమ్రే దగ్గర అంటే హెబ్రోను దగ్గర మక్పేలాలో ఉన్న పొలంలోని గుహలో పాతిపెట్టాడు. 20  అలా హేతు కుమారుల సమక్షంలో ఆ పొలం, అందులోని గుహ అబ్రాహాముకు చెందిన సమాధుల స్థలం అయ్యింది.+

అధస్సూచీలు

లేదా “నువ్వు మా మధ్య గొప్ప ప్రధానుడివి” అయ్యుంటుంది.
అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.
అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.