ఆదికాండం 16:1-16

  • హాగరు, ఇష్మాయేలు (1-16)

16  అబ్రాము భార్య శారయికి పిల్లలు లేరు.+ అయితే ఆమెకు హాగరు+ అనే సేవకురాలు ఉంది, ఈ హాగరు ఐగుప్తీయురాలు.  కాబట్టి శారయి అబ్రాముతో ఇలా అంది: “దయచేసి నా మాట విను! యెహోవా నాకు పిల్లలు పుట్టకుండా చేశాడు. దయచేసి నా సేవకురాలిని తీసుకో.* బహుశా ఆమె ద్వారా నాకు పిల్లలు కలుగుతారు.”+ అప్పుడు అబ్రాము శారయి మాట విన్నాడు.  అబ్రాము కనాను దేశంలో పదేళ్లు ఉన్న తర్వాత, అతని భార్య శారయి ఐగుప్తీయురాలైన తన సేవకురాలు హాగరును తన భర్త అబ్రాముకు భార్యగా ఇచ్చింది.  అతను హాగరుతో కలిసినప్పుడు ఆమె గర్భవతి అయ్యింది. ఆమె తాను గర్భవతిని అయ్యానని గ్రహించినప్పుడు తన యజమానురాలిని హీనంగా చూడడం మొదలుపెట్టింది.  అప్పుడు శారయి అబ్రాముతో ఇలా అంది: “నీ వల్లే నాకు ఈ హాని జరిగింది. నా సేవకురా​లిని నీ కౌగిటికి అప్పగించింది నేనే, కానీ తాను గర్భవతి అయ్యిందని తెలుసుకున్నప్పుడు ఆమె నన్ను హీనంగా చూడడం మొదలుపె​ట్టింది. నీకు, నాకు మధ్య యెహోవాయే తీర్పు తీర్చాలి.”  కాబట్టి అబ్రాము శారయితో ఇలా అన్నాడు: “ఇదిగో! నీ సేవకురాలు నీ చేతి కిందే ఉంది. ఆమె విషయంలో నీకు ఏది మంచిదనిపిస్తే అది చేయి.” అప్పుడు శారయి హాగరును అవమానించింది, దాంతో ఆమె శారయి దగ్గర నుండి పారిపోయింది.  తర్వాత యెహోవా దూత, ఎడారిలో షూరుకు+ వెళ్లే దారిలో ఉన్న ఒక నీటి ఊట దగ్గర ఆమెను కనుగొన్నాడు.  ఆ దూత, “శారయి సేవకురాలివైన హాగరూ, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు?” అని ఆమెను అడిగాడు. అందుకు ఆమె, “నేను నా యజమానురాలైన శారయి నుండి పారిపోతున్నాను” అంది.  అప్పుడు యెహోవా దూత ఆమెతో, “నీ యజమానురాలి దగ్గరికి తిరిగెళ్లి, ఆమె చేతి కింద అణిగిమణిగి ఉండు” అన్నాడు. 10  యెహోవా దూత ఇంకా ఇలా అన్నాడు: “నేను నీ సంతానాన్ని* చాలా ఎక్కువమంది అయ్యేలా చేస్తాను, వాళ్లు లెక్కపెట్టలేనంతమంది అవుతారు.”+ 11  తర్వాత యెహోవా దూత ఇలా అన్నాడు: “నువ్వు ఇప్పుడు గర్భవతివి, నువ్వు ఒక కుమారుణ్ణి కంటావు, అతనికి నువ్వు ఇష్మాయేలు* అని పేరు పెట్టాలి, ఎందుకంటే యెహోవా నీ గోడు విన్నాడు. 12  ఆ పిల్లవాడు అడవి గాడిద* లాంటివాడు అవుతాడు. అతని చెయ్యి ప్రతీ ఒక్కరికి విరోధంగా ఉంటుంది, ప్రతీ ఒక్కరి చెయ్యి అతనికి విరోధంగా ఉంటుంది, అతను తన సహోదరులందరి ఎదుట* నివసిస్తాడు.” 13  అప్పుడు ఆమె తనతో మాట్లాడుతున్న యెహోవా పేరును స్తుతిస్తూ, “నువ్వు చూసే ​దేవుడివి”+ అంది. అంతేకాదు, “నేను ఇక్కడ నిజంగా నన్ను చూసే వ్యక్తిని చూశాను” అని అంది. 14  అందుకే ఆ బావికి బెయేర్‌-లహాయిరోయి* అనే పేరొచ్చింది. (అది కాదేషుకు, బెరెదుకు మధ్య ఉంది.) 15  హాగరు అబ్రాముకు ఒక కుమారుణ్ణి కన్నది, అబ్రాము తన కుమారునికి ఇష్మాయేలు అని పేరు పెట్టాడు.+ 16  హాగరు తనకు ఇష్మాయేలును కన్నప్పుడు అబ్రాము వయసు 86 ఏళ్లు.

అధస్సూచీలు

అక్ష., “నా సేవకురాలితో లైంగిక సంబంధం పెట్టుకో.”
అక్ష., “విత్తనాన్ని.”
“దేవుడు వింటాడు” అని అర్థం.
ఇది బహుశా స్వతంత్ర వైఖరిని సూచిస్తుంది.
లేదా “తన సహోదరులందరితో విరోధం కలిగివుండి” అయ్యుంటుంది.
“నన్ను చూసే సజీవుడైనవాడి బావి” అని అర్థం.