అపొస్తలుల కార్యాలు 27:1-44

  • పౌలు రోముకు ప్రయాణించడం (1-12)

  • తుఫాను ఓడను కొట్టడం (13-38)

  • ఓడ బద్దలవ్వడం (39-44)

27  మేము ఓడలో ఇటలీకి వెళ్లాలని నిర్ణయించారు+ కాబట్టి వాళ్లు పౌలును, ఇంకొంతమంది ఖైదీల్ని యూలికి అప్పగించారు. అతను ఔగుస్తు* దళంలో ఒక సైనికాధికారి. 2  మేము, అద్రముత్తియ నుండి ఆసియా ప్రాంత తీరం పొడవునా ఉన్న ఓడరేవులకు వెళ్లే ఓడ ఎక్కి ప్రయాణం మొదలుపెట్టాం. మాతోపాటు అరిస్తార్కు+ ఉన్నాడు. అతను మాసిదోనియలోని థెస్సలొనీక నగరానికి చెందినవాడు. 3  తర్వాతి రోజు మేము సీదోనుకు చేరుకున్నాం. యూలి మానవత్వంతో పౌలు మీద దయ చూపించి అతన్ని తన స్నేహితుల దగ్గరికి వెళ్లనిచ్చాడు. దానివల్ల వాళ్లు పౌలుకు సహాయం చేయగలిగారు. 4  అక్కడి నుండి మేము ఓడ ఎక్కి బయల్దేరాం. ఎదురుగాలి వీస్తుండడంతో మేము కుప్ర అనే ద్వీపం చాటున ప్రయాణించాం. 5  తర్వాత సముద్రం గుండా కిలికియ, పంఫూలియ వెంబడి ప్రయాణిస్తూ లుకియలోని మూర దగ్గరున్న ఓడరేవులో దిగాం. 6  అక్కడ సైనికాధికారి, అలెక్సంద్రియ నుండి ఇటలీకి వెళ్తున్న ఒక ఓడను చూసి మమ్మల్ని అందులోకి ఎక్కించాడు. 7  తర్వాత మేము చాలా రోజులు ఓడలో నెమ్మదిగా ప్రయాణించి, కష్టం మీద క్నీదుకు వచ్చాం. గాలి మమ్మల్ని నేరుగా ముందుకు వెళ్లనివ్వలేదు కాబట్టి మేము క్రేతు చాటున సల్మోనేకు ఎదురుగా ప్రయాణించాం. 8  మేము కష్టం మీద తీరం వెంబడి ప్రయాణిస్తూ మంచిరేవులు అనే చోటికి వచ్చాం. అది లసైయ నగరానికి దగ్గర్లో ఉంది. 9  చాలా రోజులు గడిచాయి. ప్రాయశ్చిత్త రోజు+ ఉపవాసం కూడా అయిపోయింది. కాబట్టి అప్పటికల్లా ప్రయాణం ప్రమాదకరంగా తయారైంది. దాంతో పౌలు వాళ్లకు ఇలా సలహా ఇచ్చాడు: 10  “స్నేహితులారా, ఈ ప్రయాణం వల్ల ఓడలో ఉన్న సరుకులకు, ఓడకు మాత్రమే కాదు మన ప్రాణాలకు కూడా హాని, గొప్ప నష్టం జరుగుతుందని నాకు అనిపిస్తుంది.” 11  కానీ సైనికాధికారి పౌలు చెప్పేది వినకుండా, ఓడ నడిపే వ్యక్తి మాటను, ఓడ యజమాని మాటను విన్నాడు. 12  అయితే చలికాలంలో ఉండడానికి ఆ రేవు అనుకూలంగా ఉండదు కాబట్టి అక్కడి నుండి బయల్దేరి ఎలాగోలా ఫీనిక్సుకి వెళ్లగలిగితే చలికాలం అక్కడ గడపవచ్చని చాలామంది సలహా ఇచ్చారు. ఫీనిక్సు క్రేతు ద్వీపంలో ఉన్న ఒక ఓడరేవు. ఈ రేవులోకి ప్రవేశించడానికి ఈశాన్యం నుండి, ఆగ్నేయం నుండి దారి ఉంది. 13  దక్షిణ దిక్కు నుండి గాలి మెల్లగా వీచే సరికి వాళ్లు తమ గమ్యం చేరుకోగలమని అనుకున్నారు. కాబట్టి వాళ్లు లంగరు పైకెత్తి క్రేతు వెంబడి, తీరానికి దగ్గర్లో ప్రయాణించడం మొదలుపెట్టారు. 14  అయితే ఎంతోసేపు కాకముందే, ఊరకులోను* అనే భయంకరమైన గాలి వీచింది. 15  బలమైన గాలి ఓడ మీదికి వీస్తుండడంతో గాలికి ఎదురుగా ఓడను నడపడం వీలుకాలేదు. దాంతో గాలి వీస్తున్న వైపు మా ఓడను కొట్టుకొనిపోనిచ్చాం. 16  తర్వాత మేము కౌద అనే చిన్న ద్వీపం చాటున వేగంగా ప్రయాణించాం. అయినాసరే, ఓడ వెనక భాగంలో ఉన్న పడవను* కాపాడుకోవడానికి చాలా కష్టపడ్డాం. 17  అయితే దాన్ని ఓడ పైకి ఎక్కించిన తర్వాత, ఓడ బద్దలు కాకుండా ఉండడం కోసం అడుగుభాగం నుండి పైవరకు తాళ్లతో బిగించి కట్టారు. ఓడ సూర్తిసు* అనే ఇసుక తిప్పల మీదికి దూసుకెళ్తుందేమో అని భయపడి తెరచాప తాళ్లను కొన్నిటిని లాగేసి ఓడను కొట్టుకొనిపోనిచ్చారు. 18  తుఫాను బలంగా కొడుతుండడంతో తర్వాతి రోజు వాళ్లు ఓడను తేలిక చేయడానికి సరుకుల్ని సముద్రంలో పడేయడం మొదలుపెట్టారు. 19  మూడో రోజు వాళ్లు ఓడ పరికరాల్ని తమ చేతులారా సముద్రంలో పడేశారు. 20  చాలారోజుల పాటు సూర్యుడు గానీ నక్షత్రాలు గానీ కనిపించలేదు. భయంకరమైన తుఫాను ఓడను కొడుతుండడంతో చివరికి మేము బ్రతికి బయటపడతామనే ఆశ సన్నగిల్లడం మొదలైంది. 21  చాలా రోజులుగా వాళ్లు ఆహారం ముట్టలేదు. అప్పుడు పౌలు వాళ్ల మధ్య నిలబడి ఇలా అన్నాడు: “స్నేహితులారా, మీరు నా సలహా విని క్రేతు నుండి బయల్దేరకుండా ఉండుంటే ఈ హాని, ఈ నష్టం జరిగేవి కావు.+ 22  అయినాసరే, ధైర్యం తెచ్చుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎందుకంటే, మీలో ఏ ఒక్కరూ చనిపోరు. ఓడ మాత్రం బద్దలౌతుంది. 23  నేను ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నానో, ఎవరికి పవిత్రసేవ చేస్తున్నానో ఆ దేవుని దూత+ నిన్న రాత్రి నా పక్కన నిలబడి, 24  ‘పౌలూ, భయపడకు. నువ్వు కైసరు ముందు నిలబడాలి.+ ఇదిగో! నీతోపాటు ప్రయాణిస్తున్నవాళ్ల ప్రాణాల్ని కూడా దేవుడు దయతో కాపాడతాడు’ అని చెప్పాడు. 25  కాబట్టి స్నేహితులారా, ధైర్యం తెచ్చుకోండి. నాకు దేవుని మీద నమ్మకం ఉంది, ఆయన ఆ దూత నాతో చెప్పినట్టే చేస్తాడు. 26  అయితే మన ఓడ ఏదైనా ఒక ద్వీపానికి+ తగిలి బద్దలవ్వాల్సి ఉంది.” 27  మేము సముద్రం మీద 14 రోజులు ఉన్నాం. మేము అద్రియ సముద్రం మీద గాలికి అటూఇటూ కొట్టుకొనిపోతుండగా, అర్ధరాత్రి వేళ ఓడ ఒక తీరానికి దగ్గరగా వెళ్తోందని నావికులకు అనిపించింది. 28  అక్కడ వాళ్లు లోతు కొలిచినప్పుడు, దాదాపు 36 మీటర్లు* ఉంది. కాబట్టి వాళ్లు ఇంకాస్త దూరం వెళ్లి కొలిచారు. అక్కడ లోతు దాదాపు 27 మీటర్లు* ఉంది. 29  ఓడ వెళ్లి రాళ్లకు కొట్టుకుంటుందేమో అని భయపడి వాళ్లు ఓడ వెనక భాగం నుండి నాలుగు లంగర్లు వేశారు. తర్వాత, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూశారు. 30  అయితే, నావికులు ఓడ ముందు భాగం నుండి లంగర్లు దింపుతున్నట్టు నటిస్తూ చిన్న పడవను సముద్రంలోకి దించి పారిపోవడానికి ప్రయత్నిస్తుండడంతో 31  పౌలు సైనికాధికారితో, సైనికులతో ఇలా అన్నాడు: “వీళ్లు ఓడలో ఉంటేనే తప్ప మీరు ప్రాణాలతో బయటపడలేరు.”+ 32  దాంతో సైనికులు ఆ చిన్న పడవ తాళ్లను కోసేసి దాన్ని పడిపోనిచ్చారు. 33  తెల్లవారబోతున్నప్పుడు పౌలు వాళ్లందర్నీ కాస్త భోంచేయమని చెప్తూ ఇలా అన్నాడు: “ఇప్పటికి 14 రోజుల నుండి మీరు ఏమీ తినకుండా ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. 34  కాబట్టి కాస్త భోంచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇది మీ మంచి కోసమే. ఎందుకంటే, మీలో ఎవరికీ ఏ హానీ జరగదు.” 35  ఆ మాట అన్న తర్వాత అతను ఒక రొట్టె తీసుకొని, వాళ్లందరి ముందు దేవునికి కృతజ్ఞతలు చెప్పి, దాన్ని విరిచి, తినడం మొదలుపెట్టాడు. 36  దాంతో వాళ్లంతా ధైర్యం తెచ్చుకొని కాస్త భోంచేశారు. 37  ఓడలో మొత్తం 276 మందిమి ఉన్నాం. 38  వాళ్లు తృప్తిగా భోంచేసిన తర్వాత, ఓడను తేలిక చేయడం కోసం అందులో ఉన్న గోధుమల్ని సముద్రంలో పడేశారు.+ 39  తెల్లవారినప్పుడు, అది ఏ ప్రాంతమో వాళ్లు గుర్తుపట్టలేకపోయారు.+ అయితే ఒక ఇసుక తీరాన్ని చూసి సాధ్యమైతే ఓడను అక్కడికి చేర్చాలని నిశ్చయించుకున్నారు. 40  కాబట్టి వాళ్లు తాళ్లను కోసేసి లంగర్లను సముద్రంలో పడిపోనిచ్చారు. అదే సమయంలో తెడ్ల కట్లు విప్పారు. తర్వాత గాలి ఓడను తీరం వైపుకు నడిపించేలా ఓడ ముందు భాగంలో ఉన్న తెరచాపను పైకెత్తారు. 41  ఓడ రెండు ప్రవాహాలు కలిసిన చోట ఉన్న పెద్ద ఇసుక దిబ్బలోకి దూసుకెళ్లింది. దాంతో ఓడ ముందు భాగం అందులో ఇరుక్కుపోయి కదల్లేకపోయింది. అయితే ఓడ వెనక భాగం అలల తాకిడికి ముక్కలుముక్కలు అయింది.+ 42  కాబట్టి ఖైదీలెవ్వరూ ఈదుకుంటూ పారిపోకూడదని సైనికులు వాళ్లను చంపాలని నిర్ణయించుకున్నారు. 43  అయితే సైనికాధికారి పౌలును క్షేమంగా తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నాడు కాబట్టి సైనికులు తాము అనుకున్నట్టు చేయకుండా ఆపాడు. అతను, ఈత వచ్చినవాళ్లను సముద్రంలోకి దూకి ముందుగా ఒడ్డుకు చేరుకోమని ఆజ్ఞాపించాడు. 44  తర్వాత మిగతావాళ్లు అక్కడికి వెళ్లాలని చెప్పాడు. కొంతమంది చెక్క పలకల మీద, ఇంకొంతమంది పగిలిన ఓడ ముక్కల మీద వెళ్లాలని చెప్పాడు. అలా అందరూ క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు.+

అధస్సూచీలు

ఇది రోమా చక్రవర్తికి ఉన్న బిరుదు, పేరు కాదు.
అంటే, ఈశాన్య గాలి.
ఇది ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడే చిన్న పడవ.
పదకోశం చూడండి.
అక్ష., “20 ఫాథమ్‌లు.” అనుబంధం B14 చూడండి.
అక్ష., “15 ఫాథమ్‌లు.” అనుబంధం B14 చూడండి.