అపొస్తలుల కార్యాలు 21:1-40

  • యెరూషలేముకు ప్రయాణం (1-14)

  • యెరూషలేముకు రావడం (15-19)

  • పెద్దల సలహాను పౌలు పాటించడం (20-26)

  • ఆలయంలో అలజడి; పౌలును బంధించడం (27-36)

  • ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడడానికి పౌలును అనుమతించడం (37-40)

21  మేము బరువైన హృదయాలతో వాళ్లను విడిచి ఓడలో బయల్దేరాం. మేము వేగంగా ప్రయాణించి నేరుగా కోసు ద్వీపానికి చేరుకున్నాం. తర్వాతి రోజు రొదుకి, అక్కడి నుండి పతరకి చేరుకున్నాం.  అక్కడ మాకు ఫేనీకేకి వెళ్తున్న ఒక ఓడ కనిపించడంతో అందులోకి ఎక్కి బయల్దేరాం.  మేము ప్రయాణిస్తుండగా మధ్యలో కుప్ర ద్వీపం కనిపించింది. అది మాకు ఎడమవైపున ఉంది. మేము దాన్ని దాటి సిరియా వైపుకు ప్రయాణించి తూరులో దిగాం. అది ఓడలోని సరుకుల్ని దించాల్సిన స్థలం.  అక్కడ మేము శిష్యుల కోసం వెతికాం. వాళ్లు కనిపించినప్పుడు మేము ఏడురోజులు తూరులోనే ఉన్నాం. పవిత్రశక్తి వాళ్లకు తెలియజేసిన దాన్నిబట్టి, యెరూషలేములో అడుగుపెట్టొద్దని వాళ్లు పౌలుకు పదేపదే చెప్పారు.+  మేము బయల్దేరాల్సిన సమయం వచ్చినప్పుడు, తిరిగి మా ప్రయాణం కొనసాగించాం. అయితే స్త్రీలు, పిల్లలతో సహా వాళ్లందరూ మమ్మల్ని సాగనంపడానికి సముద్రతీరం వరకు వచ్చారు. అక్కడ మేము మోకరించి ప్రార్థన చేసి,  ఒకరికొకరం వీడ్కోలు చెప్పుకున్నాం. తర్వాత మేము ఓడ ఎక్కి బయల్దేరాం, వాళ్లు తమ ఇళ్లకు వెళ్లిపోయారు.  మేము ఓడలో తూరును విడిచి తొలెమాయికి చేరుకున్నాం. అక్కడ మేము సహోదరుల్ని పలకరించి వాళ్లతో ఒక రోజు ఉన్నాం.  తర్వాతి రోజు మేము అక్కడి నుండి బయల్దేరి కైసరయకు చేరుకున్నాం. అక్కడ మేము మంచివార్త ప్రచారకుడైన* ఫిలిప్పు ఇంట్లో బస చేశాం. అతను యెరూషలేములో అపొస్తలులు ఎంచుకున్న ఏడుగురిలో ఒకడు.+  అతనికి పెళ్లికాని* నలుగురు కూతుళ్లు ఉన్నారు, వాళ్లు ప్రవచించేవాళ్లు.+ 10  అక్కడ మేము చాలా రోజులు ఉన్న తర్వాత, యూదయ నుండి అగబు+ అనే ప్రవక్త వచ్చాడు. 11  అతను మా దగ్గరికి వచ్చి, పౌలు నడికట్టు తీసుకొని, దానితో తన కాళ్లూచేతులు కట్టేసుకొని ఇలా అన్నాడు: “దేవుడు తన పవిత్రశక్తి ద్వారా ఇలా చెప్తున్నాడు: ‘ఈ నడికట్టు ఎవరిదో అతన్ని యెరూషలేములో ఉన్న యూదులు ఇలా బంధిస్తారు.+ వాళ్లు అతన్ని అన్యజనుల చేతికి అప్పగిస్తారు.’ ”+ 12  ఆ మాటలు విన్నప్పుడు మేము, అక్కడున్నవాళ్లు కలిసి పౌలును యెరూషలేముకు వెళ్లొద్దని వేడుకోవడం మొదలుపెట్టాం. 13  అప్పుడు పౌలు, “మీరెందుకు ఇలా ఏడుస్తూ నా గుండెను* బలహీనం చేస్తున్నారు? ప్రభువైన యేసు పేరు కోసం యెరూషలేములో బంధించబడడానికే కాదు చనిపోవడానికి కూడా నేను సిద్ధమే”+ అన్నాడు. 14  అతను ఎంతకీ ఒప్పుకోకపోయే సరికి, మేము అతన్ని ఒప్పించే ప్రయత్నం మానేసి,* “యెహోవా* ఇష్టమే జరగాలి” అన్నాం. 15  ఆ తర్వాత, మేము ప్రయాణానికి సిద్ధమై యెరూషలేముకు బయల్దేరాం. 16  తొలి శిష్యుల్లో ఒకడు, కుప్రవాడు అయిన మ్నాసోను ఇంటికి మమ్మల్ని తీసుకెళ్లడానికి కైసరయ నుండి కొంతమంది శిష్యులు మాతో పాటు వచ్చారు. మేము అతని ఇంట్లో ఉండడానికి ఆహ్వానించబడ్డాం. 17  మేము యెరూషలేముకు వచ్చినప్పుడు, అక్కడి సహోదరులు మాకు సంతోషంగా స్వాగతం పలికారు. 18  అయితే ఆ తర్వాతి రోజు పౌలు మాతో కలిసి యాకోబు+ దగ్గరికి వచ్చాడు, పెద్దలందరూ అక్కడున్నారు. 19  పౌలు వాళ్లను పలకరించి, తన పరిచర్య ద్వారా దేవుడు అన్యజనుల మధ్య చేసినవాటి గురించి వివరంగా చెప్పడం మొదలుపెట్టాడు. 20  పౌలు చెప్పింది విన్నాక వాళ్లు దేవుణ్ణి మహిమపర్చడం మొదలుపెట్టారు. అయితే వాళ్లు అతనితో ఇలా అన్నారు: “సహోదరుడా, యూదుల్లో ఎన్ని వేలమంది విశ్వాసులయ్యారో చూస్తున్నావు కదా. వాళ్లందరూ ధర్మశాస్త్రాన్ని ఉత్సాహంగా పాటిస్తున్నారు.+ 21  అయితే వాళ్లు నీ గురించి కొన్ని పుకార్లు విన్నారు. నువ్వు అన్యజనుల మధ్య ఉన్న యూదులందరితో తమ పిల్లలకు సున్నతి చేయించవద్దని, ఇతర ఆచారాలు పాటించవద్దని చెప్తూ మోషే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టమని* బోధించావని+ వాళ్లు విన్నారు. 22  దీని గురించి మనం ఏంచేయాలి? నువ్వు ఇక్కడికి వచ్చావనే సంగతి వాళ్లకు తప్పకుండా తెలుస్తుంది. 23  కాబట్టి మేము చెప్పినట్టు చేయి. మొక్కుబడి చేసుకున్న నలుగురు పురుషులు మా దగ్గర ఉన్నారు. 24  వాళ్లను నీతో తీసుకెళ్లి, ఆచారబద్ధంగా వాళ్లతోపాటు నువ్వు కూడా శుద్ధి చేసుకో; వాళ్లు తలవెంట్రుకలు కత్తిరించుకోవడానికి అయ్యే ఖర్చులు నువ్వే పెట్టుకో. అప్పుడు నీ గురించి విన్న పుకార్లు నిజం కాదని, నువ్వు క్రమపద్ధతిలో నడుచుకుంటున్నావని, నువ్వు కూడా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావని+ అందరికీ తెలుస్తుంది. 25  అన్యజనుల్లో నుండి వచ్చిన విశ్వాసుల విషయానికొస్తే, విగ్రహాలకు బలి ఇచ్చినవాటికి,+ రక్తానికి,+ గొంతు పిసికి* చంపినవాటికి,+ లైంగిక పాపానికి*+ వాళ్లు దూరంగా ఉండాలనే మా నిర్ణయాన్ని వాళ్లకు ఉత్తరంలో రాసి పంపించాం.” 26  కాబట్టి పౌలు ఆ తర్వాతి రోజు వాళ్లను తీసుకెళ్లి, వాళ్లతోపాటు తాను కూడా ఆచారబద్ధంగా శుద్ధి చేసుకున్నాడు.+ తర్వాత పౌలు, ఆ శుద్ధీకరణ రోజులు ఎప్పుడు పూర్తౌతాయో, వాళ్లలో ఒక్కొక్కరి కోసం ఎప్పుడు అర్పణను ఇవ్వాలో చెప్పడం కోసం ఆలయంలోకి వెళ్లాడు. 27  ఆ ఏడురోజులు పూర్తి కావస్తుండగా, ఆసియా నుండి వచ్చిన యూదులు ఆలయంలో అతన్ని చూసి ప్రజలందర్నీ ఉసిగొల్పారు. తర్వాత అతన్ని పట్టుకొని, 28  “ఇశ్రాయేలు ప్రజలారా, మాకు సాయం చేయండి! మన ప్రజలకు, మన ధర్మశాస్త్రానికి, ఈ ఆలయానికి వ్యతిరేకంగా ప్రతీచోట ప్రతీ ఒక్కరికి బోధిస్తున్న వ్యక్తి ఇతనే. అది చాలదన్నట్టు, చివరికి గ్రీకువాళ్లను ఆలయంలోకి తీసుకొచ్చి ఈ పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేశాడు”+ అని అరిచారు. 29  అంతకుముందు వాళ్లు నగరంలో, పౌలుతో పాటు ఎఫెసీయుడైన త్రోఫిము+ ఉండడం చూసి, పౌలు అతన్ని ఆలయంలోకి తీసుకొచ్చాడని అనుకున్నారు. 30  నగరమంతా అల్లకల్లోలంగా తయారైంది. ప్రజలు గుంపులుగుంపులుగా పరుగెత్తుకుంటూ వచ్చి పౌలును పట్టుకొని, ఆలయంలో నుండి బయటికి ఈడ్చుకొచ్చారు. వెంటనే ఆలయం తలుపులు మూయబడ్డాయి. 31  వాళ్లు పౌలును చంపడానికి ప్రయత్నిస్తుండగా, యెరూషలేము అంతా గందరగోళంగా ఉందని సహస్రాధిపతికి* వార్త అందింది. 32  అతను వెంటనే సైనికుల్ని, సైనికాధికారుల్ని తీసుకొని వేగంగా వాళ్ల దగ్గరికి వెళ్లాడు. ప్రజలు సహస్రాధిపతిని, సైనికుల్ని చూసినప్పుడు పౌలును కొట్టడం ఆపేశారు. 33  తర్వాత, ఆ సహస్రాధిపతి వాళ్ల దగ్గరికి వచ్చి పౌలును అదుపులోకి తీసుకున్నాడు, అతన్ని రెండు సంకెళ్లతో బంధించమని ఆజ్ఞాపించాడు;+ అతను ఎవరో, ఏమి చేశాడో చెప్పమని ప్రజల్ని అడిగాడు. 34  అయితే ప్రజల్లో కొంతమంది ఒకలా, ఇంకొంతమంది ఇంకోలా అరవడం మొదలుపెట్టారు. అంతా గందరగోళంగా ఉండేసరికి అక్కడ నిజంగా ఏమి జరుగుతోందో అతనికి అర్థంకాలేదు. దాంతో పౌలును సైనికుల కోటలోకి తీసుకెళ్లమని అతను ఆజ్ఞాపించాడు. 35  అయితే పౌలు మెట్ల దగ్గరికి వచ్చినప్పుడు, ప్రజలు అతనికి హానిచేయాలని చూస్తుండడంతో సైనికులు అతన్ని మోసుకొని వెళ్లాల్సి వచ్చింది. 36  ఎందుకంటే చాలామంది ప్రజలు, “అతన్ని చంపేయండి!” అని అరుస్తూ అతని వెనక వస్తూ ఉన్నారు. 37  పౌలును సైనికుల కోటలోకి తీసుకెళ్లబోతుండగా అతను సహస్రాధిపతిని, “నేను ఒక మాట చెప్పవచ్చా?” అని అడిగాడు. దానికి అతను ఇలా అన్నాడు: “నీకు గ్రీకు భాష వచ్చా? 38  అయితే కొంతకాలం క్రితం తిరుగుబాటు లేవదీసి 4,000 మంది హంతకుల్ని ఎడారిలోకి తీసుకెళ్లిన ఐగుప్తీయుడివి నువ్వే కదా?” 39  అప్పుడు పౌలు, “నిజానికి నేనొక యూదుణ్ణి.+ కిలికియలోని తార్సు+ అనే ముఖ్యమైన నగర పౌరుడిని. కాబట్టి, ప్రజలతో మాట్లాడడానికి నాకు అనుమతి ఇవ్వమని నిన్ను వేడుకుంటున్నాను” అన్నాడు. 40  అతను అనుమతి ఇచ్చినప్పుడు పౌలు మెట్ల మీద నిలబడి తన చేతులతో ప్రజలకు సైగ చేశాడు, అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ప్రజలతో హీబ్రూ భాషలో+ ఇలా అన్నాడు:

అధస్సూచీలు

లేదా “సువార్తికుడైన.”
అక్ష., “కన్యలైన.”
లేదా “నిశ్చయాన్ని.”
అక్ష., “మౌనంగా ఉండిపోయి.”
అనుబంధం A5 చూడండి.
అక్ష., “మతభ్రష్టత్వాన్ని.”
లేదా “రక్తం ఒలికించకుండా.”
గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.
ఇతని కింద 1,000 మంది సైనికులు ఉండేవాళ్లు.