2 యోహాను 1:1-13

  • శుభాకాంక్షలు (1-3)

  • సత్యంలో నడుస్తూ ఉండండి  (4-6)

  • మోసగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి  (7-11)

    • వాళ్లను పలకరించకండి  (10, 11)

  • సందర్శనా ప్రణాళికలు, శుభాకాంక్షలు (12, 13)

 దేవుడు ఎంపిక చేసుకున్న సోదరికి,* ఆమె పిల్లలకు వృద్ధుడు* రాస్తున్న ఉత్తరం. నేను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాను. నేనే కాదు, సత్యం తెలిసిన వాళ్లంతా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.  మనందరిలో ఇప్పుడూ ఎల్లప్పుడూ ఉండే సత్యం వల్లే మేము మిమ్మల్ని ప్రేమించగలుగుతున్నాం.  సత్యాన్ని బోధించే, మనల్ని ప్రేమించే తండ్రైన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మనమీద చూపించే అపారదయ, కరుణ, శాంతి మనకు తోడుగా ఉంటాయి.  తండ్రి మనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగానే, నీ పిల్లల్లో కొందరు సత్యంలో నడుస్తున్నారని తెలుసుకొని చాలా సంతోషిస్తున్నాను.  కాబట్టి సోదరీ, మనం ఒకరితో ఒకరం ప్రేమగా మెలగాలని ఈ సందర్భంగా నిన్ను కోరుతున్నాను. (నేను నీకు రాస్తున్నది కొత్త ఆజ్ఞ ఏమీ కాదు, మొదటి నుండీ ఉన్నదే.)  ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడమే ప్రేమ. ప్రేమ చూపిస్తూ ఉండాలని ఆయన ఆజ్ఞాపించాడు, ఇది మీరు మొదటి నుండీ వింటున్నదే.  చాలామంది మోసగాళ్లు లోకంలో బయల్దేరారు. యేసుక్రీస్తు మనిషిగా వచ్చాడనే విషయాన్ని వాళ్లు ఒప్పుకోరు. అలా ఒప్పుకోని వ్యక్తే మోసగాడు, క్రీస్తువిరోధి.  మేము కష్టపడి సాధించినవాటిని మీరు పోగొట్టుకోకుండా జాగ్రత్తపడండి, అప్పుడు దేవుడు మీకోసం సిద్ధంగా ఉంచిన దీవెనలన్నీ మీరు పొందుతారు.  ఎవరైనా క్రీస్తు బోధ నుండి పక్కకు మళ్లి, ఆ బోధను పాటించకపోతే వాళ్లకు తండ్రి అంగీకారం ఉండదు. ఆ బోధను పాటించేవాళ్లనైతే అటు తండ్రి, ఇటు కుమారుడు ఇద్దరూ అంగీకరిస్తారు. 10  ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఆ బోధను బోధించకపోతే, వాళ్లను మీ ఇళ్లలోకి రానివ్వకండి, వాళ్లను పలకరించకండి. 11  వాళ్లను పలకరించే వ్యక్తి వాళ్ల చెడ్డ పనుల్లో పాలుపంచుకున్నట్టే. 12  నీకు రాయాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇలా కాగితం మీద సిరాతో రాయాలని అనుకోవట్లేదు కానీ, నీ దగ్గరికి వచ్చి నీతో ముఖాముఖిగా మాట్లాడతానని అనుకుంటున్నాను. అప్పుడు నువ్వు చాలా సంతోషిస్తావు. 13  దేవుడు ఎంపిక చేసుకున్న నీ సోదరి పిల్లలు నిన్ను అడిగినట్టు చెప్పమన్నారు.

అధస్సూచీలు

అక్ష., “స్త్రీకి.” ఇది ఓ సంఘాన్ని సూచిస్తుండవచ్చు.
లేదా “పెద్ద.”