2 తిమోతి 3:1-17

  • చివరి రోజుల్లో కష్టమైన కాలాలు (1-7)

  • పౌలు ఉదాహరణను జాగ్రత్తగా అనుసరించడం  (8-13)

  • ‘నువ్వు నేర్చుకున్నవాటిని పాటిస్తూ ఉండు’  (14-17)

    • లేఖనాలన్నిటినీ దేవుడు ప్రేరేపించాడు (16)

3  అయితే ఈ విషయం తెలుసుకో. చివరి రోజుల్లో ప్రమాదకరమైన, కష్టమైన కాలాలు వస్తాయి.  ఎందుకంటే ఇలాంటి మనుషులు ఉంటారు: స్వార్థపరులు, డబ్బును ప్రేమించేవాళ్లు, గొప్పలు చెప్పుకునేవాళ్లు, గర్విష్ఠులు, దైవదూషణ చేసేవాళ్లు, అమ్మానాన్నలకు లోబడనివాళ్లు, కృతజ్ఞత లేనివాళ్లు, నమ్మకంగా ఉండనివాళ్లు,  మమకారం లేనివాళ్లు, మొండివాళ్లు,* లేనిపోనివి కల్పించి చెప్పేవాళ్లు, ఆత్మనిగ్రహం లేనివాళ్లు, క్రూరులు, మంచిని ప్రేమించనివాళ్లు,  నమ్మకద్రోహులు, మూర్ఖులు, గర్వంతో ఉబ్బిపోయేవాళ్లు, దేవుణ్ణి కాకుండా సుఖాల్ని ప్రేమించేవాళ్లు,  పైకి దైవభక్తి ఉన్నట్టు కనిపించినా, దానికి తగ్గట్టు జీవించనివాళ్లు. నువ్వు అలాంటివాళ్లకు దూరంగా ఉండు.  అలాంటివాళ్లలో కొందరు కుయుక్తిగా ఇళ్లలో చొరబడతారు. పాపాల అదుపులో ఉండి వివిధ రకాల కోరికల వెంట పరుగులు తీసే బలహీనమైన స్త్రీలను వాళ్లు చెరపట్టుకుపోతారు.  అలాంటి స్త్రీలు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటారు, అయినా ఎప్పటికీ సత్యం గురించిన సరైన జ్ఞానం సంపాదించుకోలేరు.  యన్నే, యంబ్రే అనేవాళ్లు మోషేను వ్యతిరేకించినట్టే, ఆ మనుషులు కూడా సత్యాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. అలాంటివాళ్ల మనసు పూర్తిగా భ్రష్టుపట్టింది; వాళ్లు విశ్వాసానికి తగ్గట్టు నడుచుకోవట్లేదు కాబట్టి దేవుడు వాళ్లను ఆమోదించడు.  అయితే వాళ్లు అంతకన్నా ముందుకు వెళ్లలేరు. ఎందుకంటే ఆ ఇద్దరు మనుషుల్లాగే వీళ్ల మూర్ఖత్వం కూడా అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. 10  నువ్వైతే నా బోధను, నా జీవన విధానాన్ని, నా లక్ష్యాన్ని, నా విశ్వాసాన్ని, నా ఓర్పును, నా ప్రేమను, నా సహనాన్ని జాగ్రత్తగా అనుసరించావు. 11  అంతేకాదు అంతియొకయలో, ఈకొనియలో, లుస్త్రలో నాకు ఎదురైన హింసల గురించి, నేను పడిన బాధల గురించి నీకు తెలుసు. వాటన్నిటి నుండి ప్రభువు నన్ను కాపాడాడు. 12  నిజానికి, క్రీస్తుయేసు శిష్యులుగా దైవభక్తితో జీవించాలని కోరుకునే వాళ్లందరికీ హింసలు వస్తాయి. 13  అయితే దుష్టులు, మోసగాళ్లు ఇతరుల్ని తప్పుదోవ పట్టిస్తూ, వాళ్లూ తప్పుదోవ పడుతూ అంతకంతకూ చెడిపోతారు. 14  నీ విషయానికొస్తే, నువ్వు నేర్చుకున్నవాటిని, నీకు నమ్మకం కుదిరినవాటిని పాటిస్తూ ఉండు. ఎందుకంటే నీకు ఆ విషయాలు నేర్పించినవాళ్లను నువ్వు నమ్మవచ్చు. 15  అంతేకాదు పసికందుగా ఉన్నప్పటి నుండే నీకు పవిత్ర లేఖనాలు తెలుసు. క్రీస్తుయేసు మీద విశ్వాసం ఉంచడం వల్ల కలిగే రక్షణను పొందడానికి కావాల్సిన తెలివిని అవి నీకు ఇవ్వగలవు. 16  లేఖనాలన్నిటినీ దేవుడు ప్రేరేపించాడు. అవి బోధించడానికి, గద్దించడానికి, సరిదిద్దడానికి, దేవుని నీతి ప్రమాణాల ప్రకారం క్రమశిక్షణ ఇవ్వడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. 17  దానివల్ల దేవుని సేవకుడు ప్రతీ మంచి పని చేయడానికి పూర్తిగా సమర్థుడు అవ్వగలుగుతాడు, పూర్తిగా సిద్ధంగా ఉండగలుగుతాడు.

అధస్సూచీలు

లేదా “శాంతి కుదుర్చుకోవడానికి ఇష్టపడనివాళ్లు.”