2 కొరింథీయులు 4:1-18

  • మంచివార్త వెలుగు (1-6)

    • అవిశ్వాసుల మనసులకు గుడ్డితనం  (4)

  • మట్టి పాత్రల్లో సంపద  (7-18)

4  దేవుడు మమ్మల్ని కరుణించి మాకు ఈ పరిచర్య ఇచ్చాడు కాబట్టి మేము అధైర్యపడం.  అయితే, సిగ్గుపడాల్సి వచ్చే మోసకరమైనవాటిని వదిలేశాం; మేము కుయుక్తితో నడుచుకోవట్లేదు, దేవుని వాక్యాన్ని కలుషితం చేయట్లేదు. ప్రజలకు సత్యాన్ని ప్రకటిస్తూ దేవుని ముందు ప్రతీ వ్యక్తికి* మమ్మల్ని మేము సిఫారసు చేసుకుంటున్నాం.  ఒకవేళ, మేము ప్రకటించే మంచివార్తకు ముసుగు వేయబడి ఉందంటే, అది నాశనం కాబోయేవాళ్లకే.  ఈ లోక* దేవుడు ఆ అవిశ్వాసుల మనసులకు గుడ్డితనం కలుగజేశాడు. దేవుని ప్రతిబింబమైన క్రీస్తు గురించిన మహిమగల మంచివార్త వెలుగు వాళ్లమీద ప్రకాశించకూడదని అతను అలా చేశాడు.  మేము మా గురించి ప్రకటించుకోవట్లేదు గానీ యేసుక్రీస్తు ప్రభువని, యేసు కోసం మేము మీ దాసులమని ప్రకటిస్తున్నాం.  “చీకట్లో నుండి వెలుగు ప్రకాశించాలి” అని చెప్పిన దేవుడే క్రీస్తు ముఖం ద్వారా మా హృదయాల మీద వెలుగు ప్రసరింపజేశాడు. దేవుని మహిమగల జ్ఞానాన్ని ఇచ్చేది ఆ వెలుగే.  అయితే, మాకున్న అసాధారణ శక్తి దేవుడు ఇచ్చిందే కానీ మా సొంతది కాదనే విషయం స్పష్టమవ్వడానికి మట్టి పాత్రల్లో మాకు ఈ సంపద ఉంది.  కష్టాలు మమ్మల్ని అన్నివైపుల నుండి చుట్టుముట్టాయి, అలాగని మేము పూర్తిగా కదల్లేని స్థితిలో లేము; అయోమయ పరిస్థితిలో ఉన్నాం, అలాగని దారులన్నీ మూసుకుపోలేదు;*  మేము హింసలు పడుతున్నాం కానీ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు; బాధలవల్ల కృంగిపోయాం కానీ మేము నాశనం కాలేదు. 10  మేము ఎక్కడికి వెళ్లినా యేసులాగే మాకు ప్రాణాపాయ పరిస్థితి ఎదురౌతోంది. మేము యేసులాంటి జీవితాన్ని గడుపుతున్నామని ప్రజలు తెలుసుకునేందుకు అలా జరుగుతోంది. 11  బ్రతికివున్న మేము యేసు కోసం ఎప్పుడూ మరణాన్ని ముఖాముఖిగా చూస్తున్నాం. యేసులా మేము కష్టాలు పడుతున్నామని ప్రజలు తెలుసుకోవడానికి అలా జరుగుతోంది. 12  మేము మరణాన్ని ముఖాముఖిగా చూస్తున్నా, అది మీకు జీవాన్ని ఇస్తుంది. 13  “నేను నమ్మాను కాబట్టే మాట్లాడాను” అని లేఖనాల్లో ఉంది. మాకూ అలాంటి నమ్మకమే ఉంది కాబట్టి, మేము మాట్లాడుతున్నాం. 14  ఎందుకంటే, యేసును బ్రతికించిన దేవుడు మమ్మల్ని కూడా యేసులాగే బ్రతికించి మీతోపాటు యేసు ముందుకు తీసుకువస్తాడని మాకు తెలుసు. 15  ఇదంతా మీ కోసమే. దీనివల్ల చాలామంది దేవుని అపారదయను పొందగలుగుతున్నారు. ఎందుకంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన్ని స్తుతించేవాళ్లు అంతకంతకూ ఎక్కువౌతున్నారు. 16  అందుకే, మనం అధైర్యపడం. మన శరీరాలు కృశించిపోతున్నా మన హృదయాలు, మన మనస్సులు రోజురోజుకీ నూతనమౌతున్నాయి. 17  మనకు వచ్చే శ్రమలు* కొంతకాలమే ఉంటాయి, అవి చాలా చిన్నవి. కానీ వాటివల్ల మనం పొందే బహుమానం ఎంతో గొప్పది, శాశ్వతమైనది. 18  మనం కనిపించేవాటి గురించే ఆలోచిస్తూ ఉండం కానీ కనిపించనివాటి గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే కనిపించేవి తాత్కాలికం, కనిపించనివి శాశ్వతం.

అధస్సూచీలు

అక్ష., “మనిషి మనస్సాక్షికి.”
లేదా “ఈ యుగానికి.” పదకోశంలో “వ్యవస్థ” చూడండి.
లేదా “నిరాశా నిస్పృహల్లో విడిచిపెట్టబడలేదు” అయ్యుంటుంది.
లేదా “పరీక్షలు.”