1 యోహాను 4:1-21

  • సందేశాలు దేవుని నుండి వచ్చినవో కాదో నిర్ధారించుకోవడం  (1-6)

  • దేవుణ్ణి తెలుసుకోవడం, ఆయన్ని ప్రేమించడం  (7-21)

    • “దేవుడు ప్రేమ” (8, 16)

    • ప్రేమించే వ్యక్తి భయపడడు (18)

4  ప్రియ సోదరులారా, దేవుని నుండి వచ్చిందని అనిపించే ప్రతీ సందేశాన్ని నమ్మకండి. అది నిజంగా దేవుని నుండి వచ్చిందో లేదో నిర్ధారించుకోండి. ఎందుకంటే లోకంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు బయల్దేరారు.  ఒక సందేశం దేవుని నుండి వచ్చిందో లేదో ఇలా నిర్ధారించుకోవచ్చు: యేసుక్రీస్తు మనిషిగా వచ్చాడని చెప్పే ప్రతీ సందేశం దేవుని నుండి వచ్చింది.  కానీ యేసు మనిషిగా రాలేదని చెప్పే ఏ సందేశమైనా దేవుని నుండి వచ్చింది కాదు, అది క్రీస్తువిరోధి నుండి వచ్చింది. అతను అలాంటి విషయాలు చెప్తాడని మీరు విన్నారు, ఇప్పటికే అతని సందేశం లోకంలో వినిపిస్తోంది.  చిన్నపిల్లలారా, మీరు దేవునివైపు ఉన్నారు, మీరు అబద్ధ ప్రవక్తల్ని జయించారు. ఎందుకంటే మీకు దేవుని మద్దతు ఉంది. లోకానికి మద్దతిస్తున్న అపవాది కన్నా దేవుడు బలవంతుడు.  అబద్ధ ప్రవక్తలు లోకంవైపు ఉన్నారు; అందుకే వాళ్లు లోక సంబంధమైన విషయాలు మాట్లాడతారు, లోకం వాళ్ల మాట వింటుంది.  మనం దేవునివైపు ఉన్నాం. దేవుణ్ణి తెలుసుకున్న ప్రతీ ఒక్కరు మన మాట వింటారు; దేవునివైపు లేనివాళ్లు మన మాట వినరు. ఈ విధంగా మనం తప్పుడు సందేశానికి, సత్య సందేశానికి మధ్య తేడాను గుర్తించగలుగుతాం.  ప్రియ సోదరులారా, మనం ఎప్పుడూ ఒకరి మీద ఒకరం ప్రేమ చూపించుకుందాం. ఎందుకంటే ప్రేమ దేవుని నుండి వచ్చింది. ప్రేమ చూపించే వాళ్లంతా దేవుని పిల్లలు, వాళ్లకు దేవుడు తెలుసు.  ప్రేమ చూపించని వాళ్లకు దేవుడు తెలియదు, ఎందుకంటే దేవుడు ప్రేమ.*  దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించి మనమీద తనకున్న ప్రేమను వెల్లడిచేశాడు. మనం ఆ కుమారుని ద్వారా జీవం సంపాదించుకునేలా దేవుడు ఆయన్ని పంపించాడు. 10  మన పాపాల కోసం బలిగా* అర్పించడానికి దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. ఆ బలి మనకూ, దేవునికీ మధ్య శాంతిని తిరిగి నెలకొల్పుతుంది. మనం దేవుణ్ణి ప్రేమించినందుకు కాదు, ఆయనే మనల్ని ప్రేమించాడు కాబట్టి అలా చేశాడు. 11  ప్రియ సోదరులారా, దేవుడు మనల్ని అలా ప్రేమించాడు కాబట్టి, మనం కూడా ఒకరి మీద ఒకరం ప్రేమ చూపించుకోవాలి. 12  దేవుణ్ణి ఎవ్వరూ ఎప్పుడూ చూడలేదు. మనం ఒకరి మీద ఒకరం ప్రేమ చూపించుకుంటూ ఉంటే దేవుడు మనతోనే ఉంటాడు, మన మీద పూర్తిస్థాయిలో ప్రేమ చూపిస్తాడు. 13  దేవుడు మనకు తన పవిత్రశక్తిని ఇచ్చాడు కాబట్టి, మనం దేవునితో ఐక్యంగా ఉన్నామని, దేవుడు మనతో ఐక్యంగా ఉన్నాడని మనకు తెలుసు. 14  అంతేకాదు, తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకునిగా పంపించాడు. అది మేము స్వయంగా చూశాం, దాని గురించి సాక్ష్యం కూడా ఇస్తున్నాం. 15  యేసును దేవుని కుమారుడని ఒప్పుకునే వాళ్లతో దేవుడు ఐక్యంగా ఉంటాడు, వాళ్లు దేవునితో ఐక్యంగా ఉంటారు. 16  దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మనం తెలుసుకున్నాం, దాన్ని బలంగా నమ్ముతున్నాం. దేవుడు ప్రేమ. ఎప్పుడూ ప్రేమ చూపించే వ్యక్తి దేవునితో ఐక్యంగా ఉంటాడు, దేవుడు అతనితో ఐక్యంగా ఉంటాడు. 17  అలా దేవుడు మనపట్ల పూర్తిస్థాయిలో ప్రేమ చూపించాడు. దానివల్లే మనం తీర్పు రోజున ఆత్మవిశ్వాసంతో* మాట్లాడగలుగుతాం. ఎందుకంటే ఈ లోకంలో మనం యేసులాగే ఉన్నాం. 18  భయం మనల్ని వెనక్కి లాగుతుంది. అయితే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి భయపడడు. ఎందుకంటే పరిపూర్ణ ప్రేమ భయాన్ని తరిమేస్తుంది.* ఎవరైనా భయపడితే, వాళ్ల ప్రేమ పరిపూర్ణమైనది కాదు. 19  దేవుడే ముందు మనల్ని ప్రేమించాడు, అందుకే మనం ప్రేమిస్తున్నాం. 20  ఎవరైనా “నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను” అని చెప్పుకుంటూ తన సోదరుణ్ణి ద్వేషిస్తే అతను అబద్ధాలకోరు అవుతాడు. కళ్ల ముందు ఉన్న సోదరుణ్ణి ప్రేమించని వ్యక్తి, కంటికి కనిపించని దేవుణ్ణి ప్రేమించలేడు. 21  దేవుణ్ణి ప్రేమించే ఏ వ్యక్తయినా తన సోదరుణ్ణి కూడా ప్రేమించాలి, ఇది దేవుని ఆజ్ఞ.

అధస్సూచీలు

అంటే, దేవుడే ప్రేమకు మూలం.
లేదా “ప్రాయశ్చిత్త బలిగా; శాంతింపజేసే బలిగా.”
లేదా “ధైర్యంగా.”
లేదా “పోగొడుతుంది.”