1 థెస్సలొనీకయులు 3:1-13

  • ఏథెన్సులో పౌలు ఆందోళనగా ఎదురుచూశాడు (1-5)

  • తిమోతి తెచ్చిన ఊరటనిచ్చే కబురు (6-10)

  • థెస్సలొనీకయుల కోసం ప్రార్థన  (11-13)

3  కాబట్టి మేము మీకు దూరంగా ఉన్నామనే విషయాన్ని తట్టుకోలేకపోయినప్పుడు, ఒంటరిగా ఏథెన్సులోనే ఉండిపోవడం మంచిదనుకొని,  మన సోదరుడు, క్రీస్తు గురించిన మంచివార్త విషయంలో దేవుని పరిచారకుడు* అయిన తిమోతిని మీ దగ్గరికి పంపించాం. మీ విశ్వాసం విషయంలో మిమ్మల్ని బలపర్చడానికి,* ప్రోత్సహించడానికి అతన్ని పంపించాం.  ఈ శ్రమల వల్ల ఎవ్వరూ విశ్వాసం నుండి పక్కకు మళ్లకూడదనే ఉద్దేశంతో అలా చేశాం. ఇలాంటి శ్రమలు మనం అనుభవించక తప్పదని* స్వయంగా మీకే తెలుసు.  ఎందుకంటే, మేము మీ దగ్గర ఉన్నప్పుడు, ముందుముందు మనకు శ్రమలు వస్తాయని మీతో అంటుండేవాళ్లం. ఇప్పుడు జరిగింది అదేనని మీకు తెలుసు.  అందుకే, మీకు దూరంగా ఉన్నామనే విషయాన్ని ఇక తట్టుకోలేక, మీ విశ్వసనీయత గురించి తెలుసుకోవడానికి తిమోతిని పంపించాను. అపవాది మిమ్మల్ని ఏ రకంగానైనా ప్రలోభపెట్టాడేమో, మేము పడ్డ కష్టం వృథా అయ్యిందేమో అన్న ఆందోళనతో అతన్ని పంపించాను.  అయితే తిమోతి మీ దగ్గర నుండి ఇప్పుడే వచ్చాడు. అతను మీ విశ్వసనీయత గురించి, మీ ప్రేమ గురించి తీపి కబురు తీసుకొచ్చాడు. మేము మీతో కలిసి గడిపిన సంతోషకరమైన సందర్భాల్ని మీరు ఎప్పుడూ గుర్తుచేసుకుంటున్నారని, మేము మిమ్మల్ని చూడాలని తపిస్తున్నట్టే మీరూ మమ్మల్ని చూడాలని తపిస్తున్నారని అతను చెప్పాడు.  సోదరులారా, అందుకే మాకు ఎన్ని కష్టాలు వచ్చినా,* ఎన్ని శ్రమలు ఎదురైనా మీ వల్ల, మీరు చూపించే విశ్వసనీయత వల్ల మాకు ఊరట కలిగింది.  ప్రభువు శిష్యులుగా మీరు స్థిరంగా నిలబడితే మాకు కొత్త బలం వస్తుంది.*  మీ విషయంలో దేవుని ముందు మాకు కలుగుతున్న గొప్ప సంతోషాన్ని బట్టి మీ గురించి ఆయనకు మా కృతజ్ఞతను ఎలా వ్యక్తం చేయగలం? 10  మిమ్మల్ని* చూడాలని, మీ విశ్వాసం బలపడడానికి కావాల్సిన సహాయం చేయాలని కోరుకుంటున్న మేము దాని గురించి రాత్రనకా పగలనకా పట్టుదలతో దేవుణ్ణి వేడుకుంటున్నాం. 11  మేము మీ దగ్గరికి రావడానికి స్వయంగా మన తండ్రైన దేవుడు, మన ప్రభువైన యేసు మాకు మార్గం తెరవాలని కోరుకుంటున్నాం. 12  అంతేకాదు, మీ మీద మాకున్న ప్రేమ ఎక్కువౌతున్నట్టే, మీకు మీ తోటి విశ్వాసుల మీద, అలాగే అందరి మీద ఉన్న ప్రేమ ఇంకా ఎక్కువయ్యేలా ప్రభువు మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. 13  అలా, ప్రభువైన యేసు తన పవిత్రులందరితో కలిసి ప్రత్యక్షమైనప్పుడు ఆయన మీ హృదయాల్ని స్థిరపర్చాలని, మన తండ్రైన దేవుని ఎదుట మిమ్మల్ని నిందలేనివాళ్లుగా, పవిత్రులుగా నిలబెట్టాలని కోరుకుంటున్నాం.

అధస్సూచీలు

లేదా “దేవుని తోటిపనివాడు” అయ్యుంటుంది.
లేదా “స్థిరపర్చడానికి.”
లేదా “ఇలాంటివి అనుభవించడానికే మనం నియమితులమయ్యామని.”
అక్ష., “ఎంత అవసరత ఉన్నా.”
అక్ష., “మేము బ్రతుకుతాం.”
అక్ష., “మీ ముఖాల్ని.”