1 థెస్సలొనీకయులు 2:1-20

  • థెస్సలొనీకలో పౌలు పరిచర్య (1-12)

  • థెస్సలొనీకయులు దేవుని వాక్యాన్ని స్వీకరించారు (13-16)

  • థెస్సలొనీకయుల్ని చూడాలని పౌలు ఎంతో కోరుకున్నాడు (17-20)

2  సోదరులారా, మేము మీ దగ్గరికి రావడం వృథా అవ్వలేదని మీకే తెలుసు.  ఫిలిప్పీలో ఉండగా మేము మొదట్లో బాధలు అనుభవించామని, అవమానాల పాలయ్యామని మీకు తెలుసు. ఎంతో వ్యతిరేకత ఉన్నా,* మీకు దేవుని గురించిన మంచివార్తను ప్రకటించడానికి ఆయన సహాయంతో ధైర్యం కూడగట్టుకున్నాం.  మేము తప్పుడు ఆలోచనలతోనో అపవిత్రమైన, మోసపూరితమైన ఉద్దేశాలతోనో ప్రోత్సహించడం లేదు.  కానీ, మంచివార్తను ప్రకటించే బాధ్యతను చేపట్టడానికి మేము అర్హులమని దేవుడు రుజువు చేశాడు కాబట్టి, మేము మనుషుల్ని సంతోషపెట్టాలని కాకుండా, మా హృదయాల్ని పరిశోధించే దేవుణ్ణి సంతోషపెట్టాలని మాట్లాడుతున్నాం.  నిజానికి, మేము ఎప్పుడూ ముఖస్తుతి చేయలేదని లేదా అత్యాశతో లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడలేదని మీకు తెలుసు. దీనికి దేవుడే సాక్షి!  క్రీస్తు అపొస్తలులుగా మేము మీ మీద ఎక్కువ ఖర్చుల భారం మోపగలిగి ఉండేవాళ్లమే, అయినా మేము మనుషుల నుండి అంటే మీ నుండో, ఇతరుల నుండో ఘనతను పొందాలని ప్రయత్నించలేదు.  కానీ, పాలిచ్చే తల్లి తన పిల్లల్ని అపురూపంగా చూసుకున్నట్టు,* మేము మీతో మృదువుగా వ్యవహరించాం.  మీ మీద ఎంతో ఆప్యాయతతో, మీకు దేవుని గురించిన మంచివార్తను చెప్పాలని మాత్రమే కాదు, మీకోసం మా ప్రాణాల్ని కూడా ఇవ్వాలని నిశ్చయించుకున్నాం,* మీరంటే మాకు చాలా ఇష్టం.  సోదరులారా, మేము ఎంత కష్టపడ్డామో, ఎంత ప్రయాసపడ్డామో మీకు తెలుసు. దేవుని గురించిన మంచివార్తను మీకు ప్రకటించినప్పుడు మేము ఎవ్వరికీ భారంగా ఉండకూడదని రాత్రనకా, పగలనకా కష్టపడి పనిచేశాం. 10  విశ్వాసులైన మీతో మేము ఎంతో నమ్మకంగా, నీతిగా, ఏ నిందకూ అవకాశమివ్వకుండా వ్యవహరించామని మీకు తెలుసు, దేవునికి కూడా తెలుసు. 11  తండ్రి తన పిల్లలతో వ్యవహరించినట్టు మేము మీతో వ్యవహరించాం. మీకు ప్రోత్సాహాన్ని, ఊరటను ఇస్తూ వచ్చాం, మీలో ప్రతీ ఒక్కరికి సలహాలిస్తూ వచ్చాం. ఆ విషయం మీకు బాగా తెలుసు. 12  మిమ్మల్ని తన రాజ్యంలోకి పిలిచి మీకు తన మహిమను ఇచ్చే దేవునికి నచ్చేలా మీరు ప్రవర్తిస్తూ ఉండాలని మేము అలా చేశాం. 13  నిజానికి, మేము ఇందుకే మానకుండా దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే, మీరు మా దగ్గర దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, మనుషుల వాక్యంలా కాకుండా, దేవుని వాక్యంలా దాన్ని స్వీకరించారు. నిజంగా అది దేవుని వాక్యమే. విశ్వాసులైన మీ మీద అది గొప్ప ప్రభావం చూపిస్తోంది. 14  సోదరులారా, యూదయలో దేవునికి చెందిన క్రైస్తవ సంఘాల్ని మీరు ఆదర్శంగా తీసుకున్నారు. యూదుల చేతుల్లో వాళ్లు అనుభవిస్తున్న కష్టాల్నే మీరు మీ సొంత ఊరివాళ్ల చేతుల్లో అనుభవించారు. 15  ఆ యూదులు ప్రభువైన యేసును, ప్రవక్తల్ని కూడా చంపారు, మమ్మల్ని హింసించారు. వాళ్లు దేవుణ్ణి సంతోషపెట్టడం లేదు. పైగా, మనుషులందరికీ ప్రయోజనం చేకూర్చే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. 16  ఎలాగంటే, అన్యులు రక్షణ పొందాలని మేము వాళ్లకు మంచివార్తను ప్రకటిస్తుంటే, వాళ్లు అడ్డుకుంటున్నారు. ఆ విధంగా, వాళ్ల పాపాలు ఇంకా ఎక్కువౌతున్నాయి. కానీ, చివరకు ఆయన ఆగ్రహం వాళ్ల మీదికి వచ్చేసింది. 17  సోదరులారా, మేము కొంతకాలంపాటు మీకు దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు,* మేము మిమ్మల్ని చూడలేకపోయాం, కానీ మీరు మా మనసులో ఉన్నారు. అయితే, మిమ్మల్ని* చూడాలని బలంగా అనిపించింది కాబట్టి మేము మీ దగ్గరికి రావడానికి అన్నిరకాలుగా ప్రయత్నించాం. 18  అందుకే మేము మీ దగ్గరికి రావాలనుకున్నాం. ఒక్కసారి కాదు, రెండుసార్లు నేను రావడానికి ప్రయత్నించాను, కానీ సాతాను మా దారికి అడ్డొచ్చాడు. 19  మన ప్రభువైన యేసు ప్రత్యక్షతా కాలంలో ఆయన ఎదుట మా నిరీక్షణ, మా సంతోషం, మా ఆనంద కిరీటం ఎవరు? మీరే కదా? 20  అవును, మీరే మా ఘనత, మా ఆనందం.

అధస్సూచీలు

లేదా “ఎన్నో సంఘర్షణల మధ్య” అయ్యుంటుంది.
లేదా “ప్రియంగా ఎంచినట్టు.”
అక్ష., “సంతోషంగా ఇవ్వాలనుకున్నాం.”
లేదా “మీ దగ్గర నుండి బలవంతంగా పంపించబడినప్పుడు.”
అక్ష., “మీ ముఖాల్ని.”