1 కొరింథీయులు 16:1-24

  • యెరూషలేములోని క్రైస్తవుల కోసం చందాలు సేకరించడం  (1-4)

  • పౌలు ప్రయాణ ప్రణాళికలు (5-9)

  • తిమోతి, అపొల్లో సందర్శనా ప్రణాళికలు (10-12)

  • ప్రోత్సాహం, శుభాకాంక్షలు (13-24)

16  పవిత్రుల కోసం చందాలు సేకరించడం మాటకొస్తే, నేను గలతీయలోని సంఘాలకు ఇచ్చిన నిర్దేశాల్ని మీరు పాటించవచ్చు.  ప్రతీవారం మొదటి రోజున,* మీలో ప్రతీ ఒక్కరు మీ సంపాదనకు తగ్గట్టు కొంత తీసి పక్కకు పెట్టండి. అలా చేస్తే, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు చందాలు సేకరించాల్సిన అవసరం ఉండదు.  కానీ, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీరు ఇష్టపూర్వకంగా ఇచ్చిన బహుమానాన్ని యెరూషలేముకు తీసుకువెళ్లడానికి మీ ఉత్తరాల్లో మీరు సిఫారసు చేసిన సోదరుల్ని పంపిస్తాను.  అయితే, నేను కూడా అక్కడికి వెళ్లడం మంచిదనిపిస్తే, వాళ్లు నాతోపాటు వస్తారు.  అయితే నేను మాసిదోనియ గుండా వెళ్లినప్పుడు అక్కడికి వస్తాను. ఎందుకంటే నేను మాసిదోనియ గుండా వెళ్లాలనుకుంటున్నాను;  నేను అక్కడికి వచ్చినప్పుడు బహుశా మీతో కొన్నిరోజులు ఉంటాను, ఒకవేళ ఉంటే చలికాలమంతా మీ దగ్గరే ఉంటానేమో. అప్పుడు నేను వెళ్లబోయే చోటికి మీరు నన్ను సాగనంపవచ్చు.  యెహోవా* అనుమతిస్తే నేను మీ దగ్గర కొన్నిరోజులు ఉండాలనుకుంటున్నాను, కాబట్టి దారిలో ఇప్పుడు మిమ్మల్ని ఊరికే కలిసి వెళ్లడం నాకు ఇష్టంలేదు.  అయితే పెంతెకొస్తు పండుగ అయిపోయేదాకా నేను ఇక్కడ ఎఫెసులోనే ఉంటాను.  ఎందుకంటే సేవచేసే గొప్ప అవకాశాన్ని దేవుడు నా ముందు ఉంచాడు,* అయితే చాలామంది వ్యతిరేకులు ఉన్నారు. 10  తిమోతి అక్కడికి వస్తే, అతను మీ మధ్య ఉన్నంతకాలం నిర్భయంగా ఉండేలా అతనికి సహకరించండి. ఎందుకంటే, అతను నాలాగే యెహోవా* పని చేస్తున్నాడు. 11  కాబట్టి, ఎవ్వరూ అతన్ని చిన్నచూపు చూడకూడదు. అతన్ని క్షేమంగా నా దగ్గరికి సాగనంపండి. అతని కోసం నేను, సోదరులు ఎదురుచూస్తున్నాం. 12  ఇక మన సోదరుడు అపొల్లో విషయానికొస్తే, సోదరులతో కలిసి మీ దగ్గరికి వెళ్లమని అతన్ని చాలా బ్రతిమాలాను. కానీ ఇప్పుడు రావడం అతనికి ఇష్టం లేదు. అయితే అవకాశం దొరికినప్పుడు వస్తాడు. 13  మెలకువగా ఉండండి, విశ్వాసంలో స్థిరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, బలవంతులు అవ్వండి. 14  మీరు చేసే ప్రతీది ప్రేమతో చేయండి. 15  అకయలో మొట్టమొదట శిష్యులైంది స్తెఫను ఇంటివాళ్లేననీ, వాళ్లు పవిత్రులకు సేవలు చేయడానికి తమను తాము అంకితం చేసుకున్నారనీ మీకు తెలుసు. అందుకే సోదరులారా మిమ్మల్ని ఏమని ప్రోత్సహిస్తున్నానంటే, 16  మీరు కూడా అలాంటివాళ్లకు, అలాగే మాతో సహకరిస్తూ కష్టపడుతున్న వాళ్లందరికీ లోబడుతూ ఉండండి. 17  స్తెఫను, ఫోర్తునాతు, అకాయికు నా దగ్గర ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను, మీరు లేని లోటును వాళ్లు తీర్చారు. 18  వాళ్లు నా మనసుకు, మీ మనసులకు ఉత్తేజాన్నిచ్చారు. కాబట్టి, అలాంటివాళ్ల విలువను గుర్తించండి. 19  ఆసియాలోని సంఘాలవాళ్లు మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అకుల, ప్రిస్కిల్ల, అలాగే వాళ్లింట్లో ఉన్న సంఘంలోని వాళ్లు మనస్ఫూర్తిగా తమ క్రైస్తవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 20  సోదరులందరూ తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు పలకరించుకోండి. 21  నా శుభాకాంక్షల్ని స్వహస్తాలతో రాస్తున్నాను. 22  ఎవరికైనా ప్రభువు మీద ప్రేమ లేకపోతే, అతను శిక్షకు అర్హుడు. ఓ మా ప్రభువా, దయచేసి రా! 23  యేసు ప్రభువు అపారదయ మీకు తోడుండాలి. 24  క్రీస్తుయేసు శిష్యులైన మీకందరికీ నా ప్రేమలు.

అధస్సూచీలు

మత్తయి 28:1కి ఉన్న పాదసూచిక చూడండి.
పదకోశం చూడండి.
అక్ష., “పెద్ద తలుపు తెరవబడింది.”
పదకోశం చూడండి.