హెబ్రీయులు 1:1-14

  • దేవుడు తన కొడుకు ద్వారా మాట్లాడడం  (1-4)

  • కొడుకు దేవదూతలకన్నా పైస్థానంలో ఉన్నాడు (5-14)

1  పూర్వం దేవుడు ప్రవక్తల ద్వారా ఎన్నో సందర్భాల్లో, ఎన్నో పద్ధతుల్లో మన పూర్వీకులతో మాట్లాడాడు.  అయితే ఈ కాలంలో,* ఆయన తన కుమారుడి ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన తన కుమారుణ్ణి అన్నిటికీ వారసునిగా నియమించాడు, ఆ కుమారుడి ద్వారానే విశ్వంలోని వాటన్నిటినీ* సృష్టించాడు.  ఆ కుమారుడు దేవుని మహిమకు ప్రతిబింబం, దేవుని అచ్చమైన ప్రతిరూపం. ఆయన తన శక్తివంతమైన మాటతో అన్నిటినీ ఉనికిలో ఉంచుతున్నాడు. ఆయన మన పాపాల్ని కడిగేసిన తర్వాత, అత్యున్నత స్థానంలో ఉన్న మహాదేవుని కుడి పక్కన కూర్చున్నాడు.  అందుకే ఆయన దేవదూతల కన్నా ఎంతో గొప్పవాడయ్యాడు. ఎంతగా అంటే, ఆయన వాళ్లందరికన్నా అత్యంత శ్రేష్ఠమైన పేరును పొందాడు.  ఉదాహరణకు, దేవుడు ఏ దేవదూతతోనైనా, “నువ్వు నా కుమారుడివి; ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను” అని ఎప్పుడైనా అన్నాడా? లేదా “నేను అతని తండ్రిని అవుతాను, అతను నా కుమారుడు అవుతాడు” అని అన్నాడా?  కానీ, దేవుడు తన మొదటి కుమారుణ్ణి మళ్లీ భూమ్మీదికి పంపించినప్పుడు ఇలా అంటాడు: “దేవదూతలందరూ ఆయనకు సాష్టాంగ నమస్కారం చేయాలి.”  అంతేకాదు, దేవదూతల గురించి దేవుడు ఇలా అంటున్నాడు: “ఆయన తన దూతల్ని బలమైన శక్తులుగా,* తన సేవకుల్ని అగ్నిజ్వాలల్లా చేస్తాడు.”  కానీ తన కుమారుని గురించైతే ఆయన ఇలా అంటున్నాడు: “యుగయుగాలు దేవుడే నీ సింహాసనం; నీ రాజదండం న్యాయమైనది.  నువ్వు నీతిని ప్రేమించావు, అవినీతిని ద్వేషించావు. అందుకే దేవుడు, నీ దేవుడు నిన్ను తైలంతో అభిషేకించి, నీకు నీ తోటివాళ్ల కన్నా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చాడు.” 10  అంతేకాదు “ప్రభువా, ఆరంభంలో నువ్వు భూమికి పునాదులు వేశావు, నీ చేతులతో ఆకాశాల్ని చేశావు. 11  అవి నశించిపోతాయి కానీ నువ్వు నిరంతరం ఉంటావు; అవన్నీ వస్త్రంలా పాతబడిపోతాయి. 12  పొడవైన వస్త్రాన్ని మడతపెట్టినట్టు నువ్వు వాటిని మడతపెడతావు, బట్టలు మార్చినట్టు వాటిని మారుస్తావు. కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉంటావు, నీ ఆయుష్షుకు అంతు ఉండదు.” 13  దేవుడు ఏ దేవదూతతోనైనా, “నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేసేవరకు నువ్వు నా కుడి పక్కన కూర్చో” అని ఎప్పుడైనా అన్నాడా? 14  ఆ దూతలందరూ* ఉన్నది పవిత్రసేవ చేయడానికి కాదా? రక్షణ పొందబోయేవాళ్లకు సహాయం చేయమని దేవుడు ఆజ్ఞాపించేది వాళ్లకు కాదా?

అధస్సూచీలు

అక్ష., “ఈ కాలం చివర్లో.”
అక్ష., “వ్యవస్థల్ని.” లేదా “యుగాల్ని.” పదకోశంలో “వ్యవస్థ” చూడండి.
గ్రీకులో న్యూమా. పదకోశంలో “న్యూమా” చూడండి.
గ్రీకులో న్యూమా. పదకోశంలో “న్యూమా” చూడండి.