లూకా 10:1-42

  • యేసు 70 మందిని పంపిస్తాడు (1-12)

  • పశ్చాత్తాపపడని నగరాలకు శ్రమ (13-16)

  • ఆ 70 మంది తిరిగొస్తారు (17-20)

  • వినయస్థుల మీద అనుగ్రహం చూపిస్తున్నందుకు యేసు తన తండ్రిని స్తుతిస్తాడు (21-24)

  • సాటిమనిషియైన సమరయుడి ఉదాహరణ  (25-37)

  • యేసు మార్త, మరియల దగ్గరికి వెళ్తాడు (38-42)

10  ఆ తర్వాత ప్రభువు తన శిష్యుల్లో నుండి ఇంకో 70 మందిని ఎంచుకొని, తాను వెళ్లబోతున్న ప్రతీ నగరానికి, ప్రాంతానికి తనకన్నా ముందు వాళ్లను ఇద్దరిద్దరిగా పంపించాడు.  అప్పుడు ఆయన వాళ్లకు ఇలా చెప్పాడు: “అవును, కోయాల్సిన పంట చాలా ఉంది, కానీ పనివాళ్లు కొంతమందే ఉన్నారు. కాబట్టి తన పంట కోయడానికి పనివాళ్లను పంపించమని పంట యజమానిని వేడుకోండి.  మీరు వెళ్లండి! ఇదిగో! తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్లల్ని పంపించినట్టు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను.  డబ్బు సంచిని గానీ, ఆహారం మూటను గానీ, చెప్పుల్ని గానీ తీసుకెళ్లొద్దు. దారిలో ఎవర్నీ పలకరించొద్దు.*  ఎక్కడైనా ఒక ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ముందు ఇలా అనండి: ‘ఈ ఇంట్లో శాంతి ఉండాలి.’  శాంతిని ప్రేమించేవాళ్లు ఎవరైనా ఆ ఇంట్లో ఉంటే, మీ శాంతి అతని మీద నిలిచివుంటుంది. లేకపోతే, మీ శాంతి మీ మీదే నిలిచివుంటుంది.  వాళ్లు ఇచ్చేవి తింటూ, తాగుతూ మీరు ఆ ఇంట్లోనే ఉండండి. ఎందుకంటే, పనివాడు తన జీతానికి అర్హుడు. ఇళ్లు మారుతూ ఉండకండి.  “అంతేకాదు, మీరు ఏదైనా నగరంలోకి వెళ్లినప్పుడు అక్కడివాళ్లు మిమ్మల్ని చేర్చుకుంటే, వాళ్లు మీకు ఏది వడ్డిస్తే అది తినండి.  అక్కడున్న రోగుల్ని బాగుచేసి, ‘దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చేసింది’ అని వాళ్లతో చెప్పండి. 10  కానీ ఏదైనా నగరంలోకి వెళ్లినప్పుడు అక్కడివాళ్లు మిమ్మల్ని చేర్చుకోకపోతే, ఆ నగర ముఖ్య వీధుల్లోకి వెళ్లి ఇలా అనండి: 11  ‘మీకు హెచ్చరికగా ఉండడం కోసం, మీ నగరంలో మా పాదాలకు అంటుకున్న దుమ్మును కూడా మేము దులిపేస్తున్నాం. అయితే దేవుని రాజ్యం దగ్గరికి వచ్చేసిందని తెలుసుకోండి.’ 12  తీర్పు రోజున ఆ నగరం పరిస్థితి సొదొమ పరిస్థితి కన్నా ఘోరంగా ఉంటుందని మీతో చెప్తున్నాను. 13  “కొరాజీను, నీకు శ్రమ! బేత్సయిదా, నీకు శ్రమ! ఎందుకంటే, మీ మధ్య జరిగిన శక్తివంతమైన పనులు తూరులో, సీదోనులో జరిగివుంటే వాటిలో ఉన్న ప్రజలు ఎప్పుడో పశ్చాత్తాపపడి, గోనెపట్ట* వేసుకొని, బూడిదలో కూర్చొని ఉండేవాళ్లు. 14  కాబట్టి తీర్పు రోజున మీ పరిస్థితి తూరు, సీదోనుల పరిస్థితి కన్నా ఘోరంగా ఉంటుంది. 15  కపెర్నహూమూ, నువ్వు ఆకాశమంత ఎత్తుగా హెచ్చించబడతానని అనుకుంటున్నావా? నువ్వు సమాధిలోకి* దిగిపోతావు! 16  “మీ మాట వినేవాళ్లు నా మాట వింటారు. మిమ్మల్ని పట్టించుకోనివాళ్లు నన్ను కూడా పట్టించుకోరు. అంతేకాదు, నన్ను పట్టించుకోనివాళ్లు నన్ను పంపిన దేవుణ్ణి కూడా పట్టించుకోరు.” 17  తర్వాత ఆ 70 మంది ఆనందంగా తిరిగొచ్చి, “ప్రభువా, నీ పేరున ఆజ్ఞాపిస్తే చెడ్డదూతలు కూడా మాకు లోబడుతున్నారు” అని చెప్పారు. 18  అప్పుడాయన వాళ్లతో ఇలా అన్నాడు: “సాతాను ఇప్పటికే మెరుపులా ఆకాశం నుండి కిందపడడం చూస్తున్నాను. 19  ఇదిగో! పాముల్ని, తేళ్లను కాళ్ల కింద తొక్కే అధికారాన్ని, అలాగే శత్రువు బలం అంతటి మీద అధికారాన్ని నేను మీకు ఇచ్చాను. అసలు ఏదీ మీకు హానిచేయదు. 20  అయితే చెడ్డదూతలు మీకు లోబడుతున్నారని సంతోషించకండి. బదులుగా, మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయని సంతోషించండి.” 21  ఆ క్షణంలోనే యేసు పవిత్రశక్తితో నిండిపోయి ఎంతో సంతోషించి, ఇలా అన్నాడు: “తండ్రీ, ఆకాశానికీ భూమికీ ప్రభువా, అందరిముందు నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఎందుకంటే, నువ్వు తెలివైనవాళ్లకు, మేధావులకు ఈ విషయాల్ని తెలియజేయకుండా జాగ్రత్తగా దాచిపెట్టి చిన్నపిల్లలకు వాటిని వెల్లడిచేశావు. అవును తండ్రీ, అలా చేయడం నీకు నచ్చింది. 22  నా తండ్రి అన్నిటినీ నాకు అప్పగించాడు. కుమారుడు ఎవరో తండ్రికి తప్ప ఎవరికీ తెలీదు. అలాగే తండ్రి ఎవరో కుమారుడికీ, ఆ కుమారుడు తండ్రిని ఎవరికి వెల్లడిచేయడానికి ఇష్టపడతాడో వాళ్లకూ తప్ప ఇంకెవరికీ తెలీదు.” 23  తర్వాత, శిష్యులు మాత్రమే ఉన్నప్పుడు ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు చూస్తున్న వాటిని చూసేవాళ్లు సంతోషంగా ఉంటారు. 24  ఎందుకంటే నేను మీతో చెప్తున్నాను, చాలామంది ప్రవక్తలు, రాజులు ఇప్పుడు మీరు చూస్తున్న వాటిని చూడాలని కోరుకున్నారు కానీ చూడలేకపోయారు; మీరు వింటున్నవాటిని వినాలని కోరుకున్నారు కానీ వినలేకపోయారు.” 25  అప్పుడు ఇదిగో! ధర్మశాస్త్రంలో ఆరితేరిన ఒక వ్యక్తి లేచి, యేసును పరీక్షించడానికి ఇలా అడిగాడు: “బోధకుడా, శాశ్వత జీవితం పొందడానికి నేను ఏంచేయాలి?” 26  అప్పుడు యేసు, “ధర్మశాస్త్రంలో ఏం రాసివుంది? నీకేం అర్థమైంది?” అని అడిగాడు. 27  దానికి అతను ఇలా జవాబిచ్చాడు: “‘నువ్వు నీ దేవుడైన యెహోవాను* నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో, నీ పూర్తి బలంతో, నీ నిండు మనసుతో ప్రేమించాలి.’ అలాగే ‘నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి.’” 28  అప్పుడు యేసు అతనితో ఇలా అన్నాడు: “సరిగ్గా జవాబిచ్చావు; అలా చేస్తూ ఉండు, అప్పుడు నువ్వు శాశ్వత జీవితం పొందుతావు.” 29  అయితే తాను నీతిమంతుణ్ణి అని చూపించుకోవడానికి అతను యేసును ఇలా అడిగాడు: “ఇంతకీ నా సాటిమనిషి ఎవరు?” 30  దానికి యేసు ఇలా జవాబిచ్చాడు: “ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు వెళ్తుండగా దొంగల చేతికి చిక్కాడు. వాళ్లు అతన్ని నిలువునా దోచుకొని, కొట్టి, కొనప్రాణంతో వదిలేసి వెళ్లిపోయారు. 31  అప్పుడు, అనుకోకుండా ఒక యాజకుడు ఆ దారిలో వెళ్తూ ఉన్నాడు. అతను ఆ వ్యక్తిని చూసి, వేరే పక్క నుండి వెళ్లిపోయాడు. 32  అలాగే, ఒక లేవీయుడు ఆ చోటికి వచ్చినప్పుడు అతన్ని చూసి, మరో వైపు నుండి వెళ్లిపోయాడు. 33  అయితే ఒక సమరయుడు ఆ దారిలో వెళ్తూ అక్కడికి వచ్చాడు. ఆ వ్యక్తిని చూసినప్పుడు అతనికి జాలేసింది. 34  కాబట్టి ఆ సమరయుడు అతని దగ్గరికి వచ్చి, అతని గాయాల మీద నూనె, ద్రాక్షారసం పోసి కట్టు కట్టాడు. తర్వాత అతన్ని తన గాడిద మీదికి ఎక్కించి, ఒక సత్రానికి తీసుకొచ్చి, అతని బాగోగులు చూసుకున్నాడు. 35  తర్వాతి రోజు ఆ సమరయుడు రెండు దేనారాలు* తీసి, వాటిని ఆ సత్రం యజమానికి ఇచ్చి, ఇలా చెప్పాడు: ‘అతని బాగోగులు చూసుకో. ఇంతకన్నా ఎక్కువ ఖర్చయితే నేను తిరిగి వచ్చినప్పుడు ఇస్తాను.’ 36  ఈ ముగ్గురిలో ఎవరు దొంగల చేతుల్లో పడిన ఆ వ్యక్తిని సాటిమనిషిలా చూసుకున్నారని నీకు అనిపిస్తుంది?” 37  దానికి ధర్మశాస్త్రంలో ఆరితేరిన వ్యక్తి, “అతని మీద కరుణ చూపించిన వ్యక్తే” అని జవాబిచ్చాడు. అప్పుడు యేసు అతనితో, “నువ్వు కూడా వెళ్లి అలా చేయి” అన్నాడు. 38  తర్వాత వాళ్లు ప్రయాణిస్తూ ఒక గ్రామంలోకి వెళ్లారు. అక్కడ, మార్త అనే ఒక స్త్రీ ఆయనకు తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చింది. 39  మార్తకు ఒక సోదరి కూడా ఉంది, ఆమె పేరు మరియ. ఆమె ప్రభువు పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పేవి వింటూ ఉంది. 40  అయితే మార్త మాత్రం చాలా పనులు చేస్తూ, వాటిలో మునిగిపోయింది. ఆమె యేసు దగ్గరికి వచ్చి, “ప్రభువా, నా సోదరి పనంతా నా మీదే వదిలేసింది, దీని గురించి నువ్వు పట్టించుకోవా? వచ్చి నాకు సాయం చేయమని ఆమెకు చెప్పు” అని అంది. 41  అప్పుడు ప్రభువు ఆమెతో ఇలా అన్నాడు: “మార్తా, మార్తా, నువ్వు చాలా విషయాల గురించి ఆందోళన పడుతున్నావు. 42  అయితే అవసరమైనవి కొన్నే, బహుశా ఒక్కటైనా సరిపోవచ్చు. మరియ సరైనదాన్ని* ఎంచుకుంది, అది ఆమె నుండి తీసివేయబడదు.”

అధస్సూచీలు

లేదా “పలకరిస్తూ కౌగలించుకోవద్దు.”
పదకోశం చూడండి.
లేదా “హేడిస్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
లేదా “శ్రేష్ఠమైనదాన్ని.”