యోహాను 6:1-71

  • యేసు 5,000 మందికి ఆహారం పెట్టడం  (1-15)

  • యేసు నీళ్లమీద నడవడం  (16-21)

  • యేసు, “జీవాన్నిచ్చే ఆహారం” (22-59)

  • యేసు మాటలకు చాలామంది అభ్యంతరపడతారు  (60-71)

6  ఆ తర్వాత యేసు గలిలయ సముద్రం దాటి అవతలి వైపుకు వెళ్లాడు. ఆ సముద్రానికి తిబెరియ సముద్రం అనే పేరు కూడా ఉంది.  ఆయన అద్భుతాలు చేస్తూ, రోగుల్ని బాగుచేయడం చూసి చాలామంది ప్రజలు ఆయన వెనక వెళ్తూ ఉన్నారు.  కాబట్టి యేసు, ఆయన శిష్యులు ఒక కొండ ఎక్కి అక్కడ కూర్చున్నారు.  యూదుల పస్కా పండుగ దగ్గర్లో ఉంది.  యేసు తల ఎత్తి, చాలామంది ప్రజలు తన దగ్గరికి రావడం చూసి ఫిలిప్పును ఇలా అడిగాడు: “వీళ్లు తినడానికి రొట్టెలు ఎక్కడ కొందాం?”  అయితే ఫిలిప్పును పరీక్షించడానికే యేసు అలా అడిగాడు, ఎందుకంటే తాను ఏమి చేయబోతున్నాడో యేసుకు తెలుసు.  దానికి ఫిలిప్పు, “వీళ్లలో ప్రతీ ఒక్కరికి కొంచెం ఇవ్వాలన్నా రెండు వందల దేనారాల* రొట్టెలు కూడా సరిపోవు” అన్నాడు.  యేసు శిష్యుడూ, సీమోను పేతురు సోదరుడూ అయిన అంద్రెయ ఇలా అన్నాడు:  “ఇక్కడ ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఐదు బార్లీ రొట్టెలు, రెండు చిన్న చేపలు ఉన్నాయి. అయితే ఇంతమందికి ఇవి ఎలా సరిపోతాయి?” 10  అప్పుడు యేసు, “ప్రజల్ని కూర్చోమనండి” అని చెప్పాడు. అక్కడ చాలా గడ్డి ఉండడంతో వాళ్లు కూర్చున్నారు; వాళ్లలో దాదాపు 5,000 మంది పురుషులు ఉన్నారు. 11  యేసు ఆ రొట్టెలు తీసుకొని, దేవునికి కృతజ్ఞతలు చెప్పి, వాటిని అక్కడ కూర్చున్న వాళ్లకు పంచిపెట్టాడు; ఆయన ఆ చేపల విషయంలో కూడా అలాగే చేశాడు, ప్రజలు తృప్తిగా తిన్నారు. 12  ప్రజలు కడుపునిండా తిన్నాక యేసు తన శిష్యులతో, “మిగిలిన ముక్కల్ని పోగుచేయండి, ఏదీ వృథా కానివ్వకండి” అన్నాడు. 13  కాబట్టి శిష్యులు, ఐదు బార్లీ రొట్టెల నుండి ప్రజలు తిన్నాక మిగిలిన ముక్కల్ని పోగుచేశారు. వాటితో 12 పెద్ద గంపల్ని నింపారు. 14  యేసు చేసిన ఈ అద్భుతాన్ని చూసిన ప్రజలు, “లోకంలోకి రావాల్సిన ప్రవక్త నిజంగా ఈయనే” అని అనడం మొదలుపెట్టారు. 15  వాళ్లు తన దగ్గరకు వచ్చి, తనను పట్టుకుని రాజుగా చేయబోతున్నారని తెలుసుకొని యేసు ఒక్కడే మళ్లీ కొండకు వెళ్లిపోయాడు. 16  సాయంత్రమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రం దగ్గరికి వెళ్లి, 17  ఒక పడవ ఎక్కి, సముద్రం అవతల ఉన్న కపెర్నహూముకు బయల్దేరారు. అప్పటికల్లా చీకటిపడింది, యేసు ఇంకా వాళ్ల దగ్గరికి రాలేదు. 18  పైగా బలమైన గాలి వీస్తుండడం వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. 19  వాళ్లు దాదాపు మూడునాలుగు మైళ్లు* ప్రయాణించాక, యేసు ఆ సముద్రం మీద నడుస్తూ పడవ దగ్గరికి రావడం చూశారు. దాంతో వాళ్లు భయపడ్డారు. 20  అయితే ఆయన వాళ్లతో, “నేనే, భయపడకండి!” అని అన్నాడు. 21  వాళ్లు సంతోషంగా యేసును పడవలోకి ఎక్కించుకున్నారు. వెంటనే ఆ పడవ వాళ్లు వెళ్లాలనుకున్న ప్రాంతానికి చేరుకుంది. 22  తర్వాతి రోజు, సముద్రం అవతలివైపున ఉండిపోయిన ప్రజలు, అక్కడ ఒకేఒక్క చిన్న పడవ ఉండేదని, శిష్యులతోపాటు యేసు ఆ పడవ ఎక్కలేదని, శిష్యులు మాత్రమే అందులో వెళ్లిపోయారని గమనించారు. 23  అయితే, ప్రభువు కృతజ్ఞతలు చెప్పిన తర్వాత తాము రొట్టెలు తిన్న ప్రాంతానికి తిబెరియ నుండి పడవలు వచ్చాయి. 24  యేసుగానీ ఆయన శిష్యులుగానీ అక్కడ లేకపోవడం చూసి, వాళ్లు ఆ పడవలు ఎక్కి యేసును వెతకడానికి కపెర్నహూముకు వచ్చారు. 25  వాళ్లకు సముద్రం అవతల యేసు కనిపించినప్పుడు, “రబ్బీ, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు?” అని అడిగారు. 26  యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను నిజంగా మీతో చెప్తు న్నాను. మీరు అద్భుతాలు చూసినందుకు కాదుగానీ రొట్టెల్ని తిని తృప్తిపొందారు కాబట్టే నా కోసం వెదుకుతున్నారు. 27  పాడైపోయే ఆహారం కోసం కాకుండా, శాశ్వత జీవితాన్ని ఇచ్చే పాడవ్వని ఆహారం కోసం కష్టపడండి. మానవ కుమారుడు దాన్ని మీకు ఇస్తాడు; ఎందుకంటే తండ్రైన దేవుడే స్వయంగా ఆయనపై తన అంగీకార ముద్ర వేశాడు.” 28  అప్పుడు వాళ్లు, “దేవుని అంగీకారం పొందాలంటే మేము ఏమి చేయాలి?” అని ఆయన్ని అడిగారు. 29  అందుకు యేసు వాళ్లతో, “మీరు దేవుని అంగీకారం పొందాలంటే, ఆయన పంపించిన వ్యక్తి మీద విశ్వాసం చూపించాలి” అన్నాడు. 30  అప్పుడు వాళ్లు ఆయనతో ఇలా అన్నారు: “మేము చూసి, నిన్ను నమ్మేలా నువ్వు ఏ అద్భుతం చేస్తావు? ఏ శక్తివంతమైన పని చేస్తావు? 31  మన పూర్వీకులు అరణ్యంలో మన్నా తిన్నారు. ఎందుకంటే, ‘ఆయన పరలోకం* నుండి వాళ్లకు ఆహారం ఇచ్చాడు’ అని లేఖనాల్లో రాయబడివుంది.” 32  యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను మీతో నిజంగా చెప్తున్నాను. మోషే మీకు పరలోకం నుండి ఆహారం ఇవ్వలేదు, అయితే నా తండ్రి మీకు పరలోకం నుండి నిజమైన ఆహారం ఇస్తున్నాడు. 33  దేవుడిచ్చే ఆహారం పరలోకం నుండి వస్తుంది, లోకానికి జీవాన్ని ఇస్తుంది.” 34  అప్పుడు వాళ్లు, “అయ్యా, మాకు ఎప్పుడూ ఆ ఆహారం ఇస్తూ ఉండు” అని అన్నారు. 35  యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “జీవాన్నిచ్చే ఆహారాన్ని నేనే. నా దగ్గరికి వచ్చే వాళ్లెవ్వరికీ అస్సలు ఆకలి వేయదు, నా మీద విశ్వాసం ఉంచే వాళ్లెవ్వరికీ అస్సలు దాహం వేయదు. 36  కానీ నేను మీతో చెప్పినట్లు, మీరు నన్ను చూసినా నా మీద విశ్వాసం ఉంచట్లేదు. 37  తండ్రి నాకు ఇచ్చే వాళ్లందరూ నా దగ్గరికి వస్తారు, నా దగ్గరికి వచ్చేవాళ్లను నేను ఎప్పటికీ పంపించేయను. 38  ఎందుకంటే నేను నా సొంత ఇష్టాన్ని చేయడానికి కాదుగానీ నన్ను పంపించిన వ్యక్తి ఇష్టాన్ని చేయడానికే పరలోకం నుండి దిగివచ్చాను. 39  ఆయన నాకు ఇచ్చిన వాళ్లలో ఏ ఒక్కర్నీ పోగొట్టుకోవడం నా తండ్రికి ఇష్టంలేదు. చివరి రోజున నేను వాళ్లందర్నీ పునరుత్థానం చేయాలన్నదే ఆయన ఇష్టం. 40  కుమారుణ్ణి అంగీకరించి, ఆయనమీద విశ్వాసం చూపించే ప్రతీ ఒక్కరు శాశ్వత జీవితం పొందాలన్నదే నా తండ్రి ఇష్టం. చివరి రోజున నేను అతన్ని పునరుత్థానం చేస్తాను.” 41  “పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం నేనే” అని యేసు చెప్పినందుకు యూదులు ఆయనమీద సణుగుతూ 42  ఇలా అన్నారు: “ఈయన యోసేపు కొడుకు యేసు కాదా? ఈయన తల్లిదండ్రులు మనకు తెలిసినవాళ్లే కదా? మరి, ‘నేను పరలోకం నుండి దిగివచ్చాను’ అని ఈయన ఎలా అంటున్నాడు?” 43  దానికి యేసు ఇలా అన్నాడు: “మీలో మీరు సణుక్కోకండి. 44  నన్ను పంపించిన తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఏ ఒక్కరూ నా దగ్గరికి రాలేరు. చివరి రోజున నేను అతన్ని పునరుత్థానం చేస్తాను. 45  ‘వాళ్లందరూ యెహోవా* చేత బోధించబడతారు’ అని ప్రవక్తలు రాశారు. తండ్రి చెప్పేది విని, ఆయన బోధను అంగీకరించిన ప్రతీ ఒక్కరు నా దగ్గరికి వస్తారు. 46  దేవుని దగ్గర నుండి వచ్చిన నేను తప్ప ఏ మనిషీ తండ్రిని చూడలేదు. నేను మాత్రమే ఆయన్ని చూశాను. 47  నేను మీతో నిజంగా చెప్తున్నాను, నన్ను నమ్మేవాళ్లే శాశ్వత జీవితం పొందుతారు. 48  “జీవాన్ని ఇచ్చే ఆహారాన్ని నేనే. 49  మీ పూర్వీకులు అరణ్యంలో మన్నాను తిన్నా చనిపోయారు. 50  అయితే పరలోకం నుండి వచ్చే ఆహారం తినేవాళ్లెవ్వరూ చనిపోరు. 51  పరలోకం నుండి దిగివచ్చిన సజీవమైన ఆహారం నేనే. ఈ ఆహారాన్ని తినేవాళ్లు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు; నిజానికి లోకం జీవించేలా నేనిచ్చే ఆహారం నా శరీరమే.” 52  అప్పుడు ఆ యూదులు, “ఈ మనిషి మనం తినడానికి తన శరీరాన్ని ఎలా ఇవ్వగలడు?” అని ఒకరితో ఒకరు వాదించుకున్నారు. 53  యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను మీతో నిజంగా చెప్తున్నాను. మీరు మానవ కుమారుని శరీరాన్ని తిని, ఆయన రక్తాన్ని తాగితే తప్ప మీరు జీవం పొందరు.* 54  నా శరీరాన్ని తిని, నా రక్తాన్ని తాగే ప్రతీ ఒక్కరు శాశ్వత జీవితం పొందుతారు, చివరి రోజున నేను వాళ్లను పునరుత్థానం చేస్తాను. 55  ఎందుకంటే నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానీయం. 56  నా శరీరాన్ని తిని, నా రక్తాన్ని తాగే వ్యక్తి నాతో ఐక్యంగా ఉంటాడు, నేను అతనితో ఐక్యంగా ఉంటాను. 57  సజీవుడైన దేవుడు నన్ను పంపించాడు, ఆయనవల్ల నేను జీవిస్తున్నాను; అదేవిధంగా నా శరీరాన్ని తినే వ్యక్తి నావల్ల జీవిస్తాడు. 58  పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. ఇది మీ పూర్వీకులు తిన్న ఆహారం లాంటిది కాదు, వాళ్లు దాన్ని తిన్నా చనిపోయారు. అయితే ఈ ఆహారాన్ని తినేవాళ్లు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు.” 59  యేసు కపెర్నహూములోని సభామందిరంలో* బోధిస్తున్నప్పుడు ఈ విషయాలు చెప్పాడు. 60  ఆ మాటలు విన్నప్పుడు ఆయన శిష్యుల్లో చాలామంది, “ఈయన ఏం మాట్లాడుతున్నాడు? ఈ మాటలు ఎవరైనా వినగలరా?” అని చెప్పుకున్నారు. 61  తన శిష్యులు దీనిగురించి సణుక్కుంటున్నారని గ్రహించి యేసు వాళ్లను ఇలా అడిగాడు: “ఈ మాటలు మీకు కష్టంగా ఉన్నాయా? 62  మరి, మానవ కుమారుడు అంతకుముందున్న చోటికి ఎక్కివెళ్లడం చూస్తే మీరు ఏమంటారు? 63  జీవాన్ని ఇచ్చేది పవిత్రశక్తే; శరీరం వల్ల ఏ ఉపయోగమూ లేదు. నేను మీకు చెప్పిన మాటలు పవిత్రశక్తి వల్ల చెప్పాను, అవి జీవాన్ని ఇస్తాయి. 64  అయితే నమ్మనివాళ్లు కొంతమంది మీలో ఉన్నారు.” ఎందుకంటే, ఎవరు తనను నమ్మలేదో, తనకు నమ్మకద్రోహం చేసే వ్యక్తి ఎవరో యేసుకు ముందునుంచే తెలుసు. 65  ఆయన ఇంకా ఇలా అన్నాడు: “నా తండ్రి అనుమతిస్తే తప్ప ఎవ్వరూ నా దగ్గరికి రాలేరని అందుకే నేను మీతో చెప్పాను.” 66  దానివల్ల ఆయన శిష్యుల్లో చాలామంది ఆయన్ని అనుసరించడం మానేసి, తాము గతంలో చేసిన పనుల్ని చేసుకోవడానికి వెళ్లిపోయారు. 67  దాంతో యేసు పన్నెండుమంది అపొస్తలుల్ని ఇలా అడిగాడు: “మీరు కూడా వెళ్లిపోవాలని అనుకుంటున్నారా?” 68  అప్పుడు సీమోను పేతురు ఇలా అన్నాడు: “ప్రభువా, మేము ఎవరి దగ్గరికి వెళ్లాలి? శాశ్వత జీవితానికి నడిపించే మాటలు నీ దగ్గరే ఉన్నాయి. 69  నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చిన పవిత్రుడివి అని మేము నమ్మాం, తెలుసుకున్నాం.” 70  యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మీ పన్నెండుమందిని ఎంచుకున్నది నేనే కదా, అయితే మీలో ఒకడు అపవాది* లాంటివాడు.” 71  నిజానికి సీమోను ఇస్కరియోతు కొడుకైన యూదా గురించి ఆయన ఆ మాట అన్నాడు. అతను ఆ పన్నెండుమందిలో ఒకడైనప్పటికీ, ఆ తర్వాత యేసును అప్పగించాడు.

అధస్సూచీలు

పదకోశం చూడండి.
దాదాపు ఐదారు కిలోమీటర్లు. అక్ష., “సుమారు 25 నుండి 30 స్టేడియా.” పదకోశంలో “మైలు” చూడండి.
లేదా “ఆకాశం.”
పదకోశం చూడండి.
అక్ష., “మీలో మీకు జీవం ఉండదు.”
లేదా “జన సభలో.”
అపవాది కోసం ఉపయోగించబడిన గ్రీకు పదం, ఇతరుల మంచి పేరును పాడుచేసే వ్యక్తిని సూచిస్తుంది.