యోహాను 16:1-33

  • యేసు శిష్యులు చనిపోవాల్సి రావచ్చు  (1-4ఎ)

  • పవిత్రశక్తి పనులు  (4బి -16)

  • శిష్యుల దుఃఖం సంతోషంగా మారుతుంది  (17-24)

  • లోకాన్ని యేసు జయించడం  (25-33)

16  “మీరు తడబడకూడదని మీకు ఈ విషయాలు చెప్పాను.  ప్రజలు మిమ్మల్ని సభామందిరం నుండి వెలివేస్తారు. నిజానికి, మిమ్మల్ని చంపే ప్రతీ ఒక్కరు తాను దేవునికి పవిత్రసేవ చేస్తున్నానని అనుకునే సమయం రాబోతుంది.  అయితే, వాళ్లు తండ్రిని గానీ నన్ను గానీ తెలుసుకోలేదు కాబట్టి అలా చేస్తారు.  ఇవి జరిగే సమయం వచ్చినప్పుడు, వీటి గురించి నేను మీకు చెప్పిన సంగతి మీరు గుర్తుచేసుకుంటారని ఈ విషయాలు మీకు చెప్పాను. “మొదట్లో నేను ఈ విషయాలు మీకు చెప్పలేదు, ఎందుకంటే అప్పుడు నేను మీతో ఉన్నాను.  కానీ ఇప్పుడు, నన్ను పంపించిన ఆయన దగ్గరికి వెళ్తున్నాను; అయినా, ‘నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?’ అని మీలో ఎవ్వరూ నన్ను అడగట్లేదు.  అయితే నేను ఈ విషయాలు చెప్పినందువల్ల మీ హృదయాలు దుఃఖంతో నిండిపోయాయి.  అయినా నేను మీకు చెప్తున్నది నిజం, నేను వెళ్లేది మీ మేలు కోసమే. ఎందుకంటే నేను వెళ్లకపోతే ఆ సహాయకుడు మీ దగ్గరికి రాడు; కానీ నేను వెళ్తే, ఆయన్ని మీ దగ్గరికి పంపిస్తాను.  ఆయన వచ్చినప్పుడు పాపం గురించి, నీతి గురించి, తీర్పు గురించి లోకానికి ఒప్పింపజేసే రుజువుల్ని ఇస్తాడు:  వాళ్లు నా మీద విశ్వాసం చూపించట్లేదు కాబట్టి ముందుగా పాపం గురించి రుజువుల్ని ఇస్తాడు. 10  నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, తర్వాత మీరు నన్ను చూడరు కాబట్టి నీతి గురించి రుజువుల్ని ఇస్తాడు. 11  ఈ లోక పరిపాలకునికి తీర్పు తీర్చబడింది కాబట్టి తీర్పు గురించి ఒప్పింపజేసే రుజువుల్ని ఇస్తాడు. 12  “నేను మీకు చెప్పాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు వాటిని అర్థం చేసుకోలేరు. 13  అయితే ఆ సహాయకుడు* వచ్చినప్పుడు అంటే సత్యాన్ని వెల్లడిజేసే పవిత్రశక్తి వచ్చినప్పుడు, మీరు సత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకునేలా సహాయం చేస్తూ మిమ్మల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన తనంతట తాను ఏదీ మాట్లాడడు కానీ తాను విన్నవాటినే మాట్లాడతాడు; జరగబోయే విషయాల్ని ఆయన మీకు ప్రకటిస్తాడు. 14  ఆయన నన్ను మహిమపరుస్తాడు, ఎందుకంటే నా దగ్గర విన్న విషయాల్నే ఆయన మీకు ప్రకటిస్తాడు. 15  నా తండ్రి దగ్గర ఉన్నవన్నీ నావే. అందుకే, నా దగ్గర విన్న విషయాల్నే ఆయన మీకు ప్రకటిస్తాడని చెప్పాను. 16  కొంతకాలం తర్వాత మీరు ఇక నన్ను చూడరు, అయితే ఇంకొంతకాలం తర్వాత మీరు నన్ను చూస్తారు.” 17  అప్పుడు ఆయన శిష్యుల్లో కొంతమంది ఇలా చెప్పుకున్నారు: “‘కొంతకాలం తర్వాత మీరు ఇక నన్ను చూడరు, అయితే ఇంకొంతకాలం తర్వాత మీరు నన్ను చూస్తారు’ అని, ‘ఎందుకంటే నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను’ అని ఈయన ఎందుకు అంటున్నాడు?” 18  కాబట్టి వాళ్లు, “‘కొంతకాలం’ అని చెప్పడంలో ఈయన ఉద్దేశం ఏమిటి? ఈయన దేని గురించి మాట్లాడుతున్నాడో మనకు తెలియడం లేదే” అని అనుకున్నారు. 19  వాళ్లు తనను ఏదో అడగాలనుకుంటున్నారని తెలిసి, యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “‘కొంతకాలం తర్వాత మీరు ఇక నన్ను చూడరు, అయితే ఇంకొంతకాలం తర్వాత మీరు నన్ను చూస్తారు’ అని నేను చెప్పినందుకు మీరు ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారా? 20  నేను మీతో నిజంగా చెప్తున్నాను. మీరు ఏడుస్తారు, దుఃఖపడతారు కానీ లోకం మాత్రం సంతోషిస్తుంది; మీరు దుఃఖపడతారు కానీ మీ దుఃఖం సంతోషంగా మారుతుంది. 21  బిడ్డను కనే సమయం వచ్చినప్పుడు స్త్రీ వేదన అనుభవిస్తుంది. అయితే బిడ్డను కన్న తర్వాత, పుట్టిన తన బిడ్డను చూసుకున్న ఆనందంలో ఆమె ఆ బాధను ఇక ఎంతమాత్రం గుర్తుతెచ్చుకోదు. 22  అలాగే మీరు కూడా ఇప్పుడు దుఃఖపడుతున్నారు; కానీ నేను మిమ్మల్ని మళ్లీ చూస్తాను. అప్పుడు మీ హృదయాలు ఆనందంతో నిండిపోతాయి, మీ ఆనందాన్ని ఎవ్వరూ తీసివేయలేరు. 23  ఆ రోజు మీరు నన్ను అసలు ఏ ప్రశ్నా అడగరు. నేను మీతో నిజంగా చెప్తున్నాను, మీరు నా పేరు మీద తండ్రిని ఏది అడిగినా ఆయన దాన్ని మీకు ఇస్తాడు. 24  ఇప్పటివరకు మీరు నా పేరుమీద ఒక్కటి కూడా అడగలేదు. అడగండి, మీరు దాన్ని పొందుతారు; అప్పుడు మీ సంతోషం సంపూర్ణం అవుతుంది. 25  “నేను ఉదాహరణల రూపంలో మీకు ఈ విషయాలు చెప్పాను. అయితే ఒక సమయం రాబోతుంది, అప్పుడు నేను ఇక ఉదాహరణల రూపంలో కాకుండా స్పష్టంగా తండ్రి గురించి మీకు చెప్తాను. 26  ఆ రోజు మీరు తండ్రిని నా పేరున వేడుకుంటారు; అయితే దానర్థం, నేను మీకోసం తండ్రిని వేడుకుంటానని కాదు. 27  స్వయంగా తండ్రే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు; ఎందుకంటే మీరు నన్ను ప్రేమించారు, నేను దేవుని ప్రతినిధిగా వచ్చానని నమ్మారు. 28  నేను దేవుని ప్రతినిధిగా లోకంలోకి వచ్చాను. ఇప్పుడు లోకాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వెళ్తున్నాను.” 29  ఆయన శిష్యులు ఇలా అన్నారు: “ఇదిగో! నువ్వు ఇప్పుడు ఉదాహరణలు ఉపయోగించకుండా స్పష్టంగా మాట్లాడుతున్నావు. 30  నీకు అన్ని విషయాలు తెలుసని, మాలో ఎవ్వరూ ఏ ప్రశ్నా నిన్ను అడగాల్సిన అవసరం లేదని మాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు దేవుని దగ్గరి నుండి వచ్చావని దీన్నిబట్టి మేము నమ్ముతున్నాం.” 31  అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు ఇప్పుడు నమ్ముతున్నారా? 32  ఇదిగో! మీలో ప్రతీ ఒక్కరు తమతమ ఇళ్లకు పారిపోయి, నన్ను ఒంటరిగా విడిచిపెట్టే సమయం రాబోతుంది. నిజానికి అది ఇప్పటికే వచ్చేసింది. అయితే నా తండ్రి నాతోపాటు ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిగా లేను. 33  నా వల్ల మీరు శాంతి పొందాలని మీకు ఈ విషయాలు చెప్పాను. లోకంలో మీకు శ్రమలు వస్తాయి, అయితే ధైర్యం తెచ్చుకోండి! నేను లోకాన్ని జయించాను.”

అధస్సూచీలు

పవిత్రశక్తిని ఒక వ్యక్తిలా వర్ణిస్తూ యేసు “సహాయకుడు” (గ్రీకులో పుంలింగ పదం) అనే పదం ఉపయోగించాడు. పవిత్రశక్తి అనేది వ్యక్తి కాదు శక్తి మాత్రమే. దీనికి గ్రీకు భాషలో నపుంసక లింగాన్ని ఉపయోగిస్తారు.