మత్తయి 11:1-30

  • బాప్తిస్మమిచ్చే యోహానును మెచ్చుకోవడం  (1-15)

  • సరిగ్గా స్పందించని తరంవాళ్లకు తీర్పు తీర్చడం  (16-24)

  • వినయస్థుల మీద అనుగ్రహం చూపిస్తున్నందుకు యేసు తన తండ్రిని స్తుతించడం  (25-27)

  • యేసు కాడి సేదదీర్పు ఇస్తుంది  (28-30)

11  యేసు తన 12 మంది శిష్యులకు నిర్దేశాలు ఇచ్చాక, చుట్టుపక్కల నగరాల్లో బోధించడానికి, ప్రకటించడానికి వెళ్లాడు.  యోహాను చెరసాలలో ఉన్నప్పుడు క్రీస్తు చేస్తున్న పనుల గురించి విన్నాడు. అతను తన శిష్యుల్ని పంపించి,  “రాబోతున్న వాడివి నువ్వేనా? లేక ఇంకో వ్యక్తి కోసం మేము ఎదురుచూడాలా?” అని ఆయన్ని అడగమన్నాడు.  అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు వింటున్నవాటి గురించి, చూస్తున్నవాటి గురించి వెళ్లి యోహానుకు చెప్పండి:  గుడ్డివాళ్లు ఇప్పుడు చూస్తున్నారు, కుంటివాళ్లు నడుస్తున్నారు, కుష్ఠురోగులు శుద్ధులౌతున్నారు, చెవిటివాళ్లు వింటున్నారు, చనిపోయినవాళ్లు బ్రతికించబడుతున్నారు, పేదవాళ్లకు మంచివార్త చెప్పబడుతోంది.  ఏ సందేహం లేకుండా నా మీద నమ్మకం ఉంచే వ్యక్తి సంతోషంగా ఉంటాడు.”  యోహాను శిష్యులు వెళ్లిపోతున్నప్పుడు, యేసు అక్కడున్న ప్రజలతో యోహాను గురించి ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు: “మీరు ఏం చూడడానికి అరణ్యంలోకి వెళ్లారు? గాలికి ఊగుతున్న రెల్లునా?* కాదు.  మరైతే మీరు ఏం చూడడానికి వెళ్లారు? ఖరీదైన వస్త్రాలు వేసుకున్న వ్యక్తినా? కాదు. ఖరీదైన వస్త్రాలు వేసుకునేవాళ్లు రాజభవనాల్లో ఉంటారు.  మరి అలాంటప్పుడు మీరు ఏం చూడడానికి వెళ్లారు? ఒక ప్రవక్తనా? అవును, నేను మీకు చెప్తున్నాను, అతను ప్రవక్త కన్నా చాలాచాలా గొప్పవాడు. 10  ‘ఇదిగో! నా సందేశకుణ్ణి నీకు* ముందుగా పంపిస్తున్నాను, అతను నీ ముందు నీ మార్గాన్ని సిద్ధం చేస్తాడు’ అని రాయబడింది అతని గురించే. 11  నేను మీతో నిజంగా చెప్తున్నాను, స్త్రీలకు పుట్టినవాళ్లలో బాప్తిస్మమిచ్చే యోహాను కన్నా గొప్పవాడు లేడు. అయితే పరలోక రాజ్యంలో తక్కువవాడు అతని కన్నా గొప్పవాడు. 12  బాప్తిస్మమిచ్చే యోహాను రోజుల నుండి ఇప్పటివరకు ప్రజలు పరలోక రాజ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని, దాన్ని చేరుకోవడానికి పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు. అలా పట్టుదలగా ప్రయత్నించేవాళ్లు దాన్ని చేరుకుంటున్నారు. 13  ఎందుకంటే, యోహాను కాలం వరకు ధర్మశాస్త్రం, ప్రవక్తలు అందరూ ప్రవచించారు; 14  మీకు ఒప్పుకునే మనసు ఉంటే, ‘రావాల్సిన ఏలీయా’ ఇతనే. 15  చెవులు ఉన్నవాడు వినాలి. 16  “కాబట్టి, ఈ తరంవాళ్లను నేను ఎవరితో పోల్చాలి? వాళ్లు సంతల్లో కూర్చొని తోటిపిల్లలతో ఇలా అనే చిన్నపిల్లల్లా ఉన్నారు: 17  ‘మేము మీ కోసం పిల్లనగ్రోవి* ఊదాం, కానీ మీరు నాట్యం చేయలేదు; మేము ఏడ్పుపాట పాడాం, కానీ మీరు దుఃఖంతో గుండెలు బాదుకోలేదు.’ 18  అదేవిధంగా, బాప్తిస్మమిచ్చే యోహాను అందరిలా తింటూ, తాగుతూ జీవించలేదు; కానీ ప్రజలు, ‘అతనికి చెడ్డదూత పట్టాడు’ అని అంటున్నారు. 19  మానవ కుమారుడు అందరిలాగే తింటూ, తాగుతూ ఉన్నాడు; అయినా ప్రజలు ఆయన్ని, ‘ఇదిగో! ఈయన తిండిబోతు, తాగుబోతు, పన్ను వసూలు చేసేవాళ్లకూ పాపులకూ స్నేహితుడు!’ అని అంటున్నారు. అయితే ఒక వ్యక్తి చేసే నీతి పనులే అతను తెలివైనవాడని చూపిస్తాయి.” 20  ఆయన ఏయే నగరాల్లో ఎక్కువ అద్భుతాలు చేశాడో, ఆ నగరాల్లో ప్రజలు పశ్చాత్తాపపడలేదు. కాబట్టి ఆయన వాటిని ఇలా నిందించడం మొదలుపెట్టాడు: 21  “కొరాజీను, నీకు శ్రమ! బేత్సయిదా, నీకు శ్రమ! ఎందుకంటే, మీ మధ్య జరిగిన శక్తివంతమైన పనులు తూరులో, సీదోనులో జరిగివుంటే వాటిలో ఉన్న ప్రజలు ఎప్పుడో పశ్చాత్తాపపడి, గోనెపట్ట* వేసుకొని, బూడిదలో కూర్చొని ఉండేవాళ్లు. 22  కాబట్టి నేను మీతో చెప్తున్నాను, తీర్పు రోజున మీ పరిస్థితి తూరు, సీదోనుల పరిస్థితి కన్నా ఘోరంగా ఉంటుంది. 23  కపెర్నహూమూ, నువ్వు ఆకాశమంత ఎత్తుగా హెచ్చించబడతానని అనుకుంటున్నావా? నువ్వు సమాధిలోకి* దిగిపోతావు. ఎందుకంటే నీ మధ్య జరిగిన శక్తివంతమైన పనులు సొదొమలో జరిగివుంటే అది ఈ రోజు వరకు నిలిచివుండేదే. 24  తీర్పు రోజున నీ పరిస్థితి సొదొమ పరిస్థితి కన్నా ఘోరంగా ఉంటుందని నీతో చెప్తున్నాను.” 25  ఆ సమయంలో యేసు ఇలా అన్నాడు: “తండ్రీ, ఆకాశానికీ భూమికీ ప్రభువా, అందరిముందు నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఎందుకంటే, నువ్వు తెలివైనవాళ్లకు, మేధావులకు ఈ విషయాల్ని తెలియజేయకుండా దాచిపెట్టి చిన్నపిల్లలకు వాటిని వెల్లడిచేశావు. 26  అవును తండ్రీ, అలా చేయడం నీకు నచ్చింది. 27  నా తండ్రి అన్నిటినీ నాకు అప్పగించాడు. కుమారుడు ఎవరో తండ్రికి తప్ప ఎవరికీ పూర్తిగా తెలీదు. అలాగే, తండ్రి ఎవరో కుమారుడికీ, ఆ కుమారుడు తండ్రిని ఎవరికి వెల్లడిచేయడానికి ఇష్టపడతాడో వాళ్లకూ తప్ప ఇంకెవరికీ పూర్తిగా తెలీదు. 28  భారం మోస్తూ అలసిపోయిన మీరందరూ నా దగ్గరికి రండి, నేను మీకు సేదదీర్పును ఇస్తాను. 29  నేను సౌమ్యుడిని, వినయస్థుడిని* కాబట్టి నా కాడిని మీమీద ఎత్తుకుని, నా దగ్గర నేర్చుకోండి; అప్పుడు మీరు సేదదీర్పు పొందుతారు. 30  ఎందుకంటే నా కాడి మోయడానికి సులభంగా ఉంటుంది, నేను ఇచ్చే బరువు తేలిగ్గా ఉంటుంది.”

అధస్సూచీలు

లేదా “గడ్డినా?”
అక్ష., “నీ ముఖానికి.”
అంటే, ఫ్లూటు.
పదకోశం చూడండి.
లేదా “హేడిస్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.
అక్ష., “దీనమనస్సు గలవాడిని.”