ప్రకటన 2:1-29

  • ఎఫెసు (1-7), స్ముర్న (8-11), పెర్గము (12-17), తుయతైర  (18-29) సంఘాలకు సందేశాలు

2  “ఎఫెసు సంఘ దూతకు ఇలా రాయి: కుడిచేతిలో ఏడు నక్షత్రాలు పట్టుకొని, ఏడు బంగారు దీపస్తంభాల మధ్య నడిచే వ్యక్తి ఈ మాటలు చెప్తున్నాడు:  ‘నీ పనుల గురించి, నీ కష్టం గురించి, నీ సహనం గురించి నాకు తెలుసు. నీ మధ్య చెడ్డవాళ్లను ఉండనివ్వవని కూడా నాకు తెలుసు. అపొస్తలులు కాకపోయినా అపొస్తలులమని చెప్పుకునేవాళ్లను నువ్వు పరీక్షిస్తావు, వాళ్లు అబద్ధాలకోరులని కనిపెట్టావు.  అంతేకాదు నువ్వు నా పేరు కోసం ఎన్నో సహించావు, అయినా అలసిపోకుండా స్థిరంగా ఉన్నావు.  అయితే నీలో ఒక లోపం ఉందని నేను గమనించాను. అదేమిటంటే, మొదట్లో నీకున్న ప్రేమను నువ్వు వదిలేశావు.  “‘కాబట్టి నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోయావో గుర్తుచేసుకొని, పశ్చాత్తాపపడి, మొదట్లో చేసిన పనులు చేయి. ఒకవేళ నువ్వు పశ్చాత్తాపపడకపోతే, నేను నీ దగ్గరికి వచ్చి నీ దీపస్తంభాన్ని దాని చోటు నుండి తీసేస్తాను.  అయితే ఒక విషయంలో నువ్వు సరిగ్గా ఉన్నావు. నీకొలాయితు తెగవాళ్ల పనులంటే నీకు అసహ్యం, అవంటే నాకూ అసహ్యమే.  సంఘాలకు పవిత్రశక్తి చెప్తున్న ఈ మాటల్ని చెవులు ఉన్నవాడు వినాలి: జయించే వ్యక్తికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షం పండ్లు తినే అవకాశం ఇస్తాను.’  “స్ముర్న సంఘ దూతకు ఇలా రాయి: ‘మొదటివాడు, చివరివాడు,’ చనిపోయి మళ్లీ బ్రతికినవాడు ఈ మాటలు చెప్తున్నాడు:  ‘నీ శ్రమల గురించి, నీ పేదరికం గురించి నాకు తెలుసు; అయినా నువ్వు ధనవంతుడివే. అంతేకాదు, యూదులు కాకపోయినా యూదులమని చెప్పుకుంటూ నిన్ను దూషించేవాళ్ల గురించి నాకు తెలుసు. నిజానికి వాళ్లు సాతాను గుంపుకు చెందినవాళ్లు.* 10  నీకు రాబోతున్న కష్టాల గురించి భయపడకు. ఇదిగో! మీరు పూర్తిగా పరీక్షించబడేలా అపవాది మీలో కొందర్ని చెరసాలలో వేస్తూనే ఉంటాడు. మీరు పది రోజులు శ్రమ అనుభవిస్తారు. చనిపోయేవరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవమనే కిరీటం ఇస్తాను. 11  సంఘాలకు పవిత్రశక్తి చెప్తున్న ఈ మాటల్ని చెవులు ఉన్నవాడు వినాలి: జయించే వ్యక్తికి రెండో మరణం* వల్ల అసలు ఏ హానీ జరగదు.’ 12  “పెర్గము సంఘ దూతకు ఇలా రాయి: రెండువైపులా పదునున్న పొడవాటి ఖడ్గంగల వ్యక్తి ఈ మాటలు చెప్తున్నాడు: 13  ‘సాతాను సింహాసనం ఉన్న చోట నువ్వు నివసిస్తున్నావని నాకు తెలుసు. అయినా నువ్వు నాకు విశ్వసనీయంగా ఉన్నావు.* సాతాను నివాసముంటున్న మీ నగరంలో అంతిప అనే నా నమ్మకమైన సాక్షి చంపబడిన రోజుల్లో కూడా నువ్వు నా మీదున్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. 14  “‘అయితే నీలో కొన్ని లోపాలు ఉన్నాయని నేను గమనించాను. బిలాము బోధను అనుసరించేవాళ్లను నువ్వు నీ మధ్య ఉండనిస్తున్నావు. ఇశ్రాయేలీయులు పాపం చేసేలా, అంటే విగ్రహాలకు బలి ఇచ్చినవాటిని తినేలా, లైంగిక పాపం* చేసేలా ప్రలోభపెట్టమని ఆ బిలాము బాలాకుకు నేర్పించాడు. 15  అంతేకాదు, నీకొలాయితు తెగవాళ్ల బోధను అనుసరించేవాళ్లు కూడా నీ మధ్య ఉన్నారు. 16  కాబట్టి పశ్చాత్తాపపడు. లేకపోతే నేను త్వరగా నీ దగ్గరకు వస్తాను; నా నోటి నుండి వస్తున్న పొడవాటి ఖడ్గంతో వాళ్ల మీద యుద్ధం చేస్తాను. 17  “‘సంఘాలకు పవిత్రశక్తి చెప్తున్న ఈ మాటల్ని చెవులు ఉన్నవాడు వినాలి: జయించే వ్యక్తికి దాచివున్న మన్నాలో కొంతభాగాన్ని, తెల్లని గులకరాయిని ఇస్తాను. దానిమీద ఒక కొత్త పేరు రాసివుంటుంది, ఆ పేరు దాన్ని పొందిన వ్యక్తికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు.’ 18  “తుయతైర సంఘ దూతకు ఇలా రాయి: అగ్నిజ్వాలలాంటి కళ్లు, మెరిసే రాగిలాంటి పాదాలు ఉన్న దేవుని కుమారుడు ఈ మాటలు చెప్తున్నాడు: 19  ‘నీ పనుల గురించి, నీ ప్రేమ గురించి, నీ విశ్వాసం గురించి, నీ పరిచర్య గురించి, నీ సహనం గురించి నాకు తెలుసు. అలాగే, మొదట్లో నువ్వు చేసిన పనులకన్నా ఈమధ్య చేసిన పనులు మెరుగ్గా ఉన్నాయని కూడా నాకు తెలుసు. 20  “‘అయితే నీలో ఒక లోపం ఉందని నేను గమనించాను. యెజెబెలు అనే స్త్రీని నీ మధ్య ఉండనిస్తున్నావు. ఆమె ప్రవక్త్రిని అని చెప్పుకుంటూ నా దాసులు లైంగిక పాపం* చేసేలా, విగ్రహాలకు బలి ఇచ్చినవాటిని తినేలా తన బోధలతో వాళ్లను తప్పుదారి పట్టిస్తోంది. 21  పశ్చాత్తాపపడేందుకు నేను ఆమెకు సమయమిచ్చాను. కానీ తన లైంగిక పాపాల* విషయంలో పశ్చాత్తాపపడడం ఆమెకు ఇష్టంలేదు. 22  ఇదిగో, నేను ఆమెను మంచాన పడేలా చేయబోతున్నాను. ఆమెతో వ్యభిచారం చేస్తున్నవాళ్లు ఆమె పనుల విషయంలో పశ్చాత్తాపపడకపోతే వాళ్లను తీవ్రమైన శ్రమలపాలు చేయబోతున్నాను. 23  ఆమె పిల్లల్ని నేను ప్రాణాంతకమైన జబ్బుతో చంపుతాను. అప్పుడు, నేను అంతరంగంలోని ఆలోచనల్ని, హృదయాల్ని పరిశోధించేవాడినని సంఘాలన్నీ తెలుసుకుంటాయి. అలాగే మీ పనుల్ని బట్టి మీలో ప్రతీ ఒక్కరికి ప్రతిఫలం ఇస్తాను. 24  “‘అయితే, తుయతైరలో ఉన్న మిగతావాళ్లతో అంటే, యెజెబెలు బోధను అనుసరించనివాళ్లతో, సాతాను నుండి వచ్చే అబద్ధ బోధలు* తెలియనివాళ్లతో నేను చెప్పేది ఏమిటంటే: మీ మీద నేను వేరే ఏ భారం పెట్టట్లేదు. 25  నేను వచ్చేవరకు మీ దగ్గర ఉన్నవాటిని గట్టిగా పట్టుకొని ఉండండి. 26  నేను ఆజ్ఞాపించినవాటిని చివరివరకు పాటించి జయించే వ్యక్తికి లోకంలోని ప్రజల మీద అధికారం ఇస్తాను. 27  అలాంటి అధికారాన్నే నేను నా తండ్రి నుండి పొందాను. జయించే వ్యక్తి ఇనుప దండంతో ప్రజల్ని శిక్షిస్తాడు.* వాళ్లు మట్టిపాత్రల్లా పగలగొట్టబడతారు. 28  నేను అతనికి వేకువ చుక్కను ఇస్తాను. 29  సంఘాలకు పవిత్రశక్తి చెప్తున్న మాటల్ని చెవులు ఉన్నవాడు వినాలి.’

అధస్సూచీలు

అక్ష., “వాళ్లు సాతాను సభామందిరం.”
అంటే, శాశ్వత మరణం.
అక్ష., “నా పేరును గట్టిగా పట్టుకునే ఉన్నావు.”
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.
అక్ష., “సాతానుకు సంబంధించిన లోతైన విషయాలు.”
లేదా “ఇనుప దండంతో ప్రజల్ని పరిపాలిస్తాడు.”