ప్రకటన 17:1-18

  • “మహాబబులోను” మీద తీర్పు (1-18)

    • గొప్ప వేశ్య ఎర్రని మృగం మీద కూర్చొని ఉంది  (1-3)

    • మృగం ‘అంతకుముందు ఉంది, ఇప్పుడు లేదు, అయితే అగాధం నుండి పైకి రాబోతుంది’ (8)

    • పది కొమ్ములు గొర్రెపిల్లతో యుద్ధం చేస్తాయి (12-14)

    • పది కొమ్ములు వేశ్యను ద్వేషిస్తాయి (16, 17)

17  ఏడు గిన్నెలు పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతల్లో ఒక దేవదూత వచ్చి నాతో ఇలా అన్నాడు: “రా, అనేక జలాల మీద కూర్చున్న గొప్ప వేశ్య పొందే తీర్పును నీకు చూపిస్తాను.  భూమ్మీది రాజులు ఆమెతో లైంగిక పాపాలు* చేశారు. భూమ్మీది ప్రజలు ఆమె మద్యం మత్తులో ఉన్నారు. ఆ మద్యం ఆమె లైంగిక పాపాలను* సూచిస్తుంది.”  ఆ దేవదూత పవిత్రశక్తి ద్వారా నన్ను అరణ్యంలోకి తీసుకెళ్లాడు. అప్పుడు నేను ఒక స్త్రీని చూశాను. ఆమె ఒక ఎర్రని క్రూరమృగం మీద కూర్చొని ఉంది. ఆ మృగం ఒంటి నిండా దేవుణ్ణి దూషించే పేర్లు ఉన్నాయి; దానికి ఏడు తలలు, పది కొమ్ములు ఉన్నాయి.  ఆ స్త్రీ ఊదారంగు వస్త్రం, ఎర్రని వస్త్రం వేసుకొని ఉంది; బంగారంతో, విలువైన రాళ్లతో, ముత్యాలతో చేసిన నగలు వేసుకొని ఉంది. ఆమె చేతిలో ఒక బంగారు గిన్నె ఉంది. ఆ గిన్నె అసహ్యమైన వాటితో, ఆమె లైంగిక పాపాలకు* సంబంధించిన అపవిత్రమైన వాటితో నిండి ఉంది.  ఆమె నొసటి మీద ఒక పేరు ఉంది. ఆ పేరు ఒక రహస్యం. ఆ పేరు: “వేశ్యలకు, భూమ్మీదున్న అసహ్యమైన వాటికి తల్లియైన మహాబబులోను.”  ఆ స్త్రీ పవిత్రుల రక్తాన్ని, యేసు సాక్షుల రక్తాన్ని తాగడంవల్ల మత్తుగా ఉండడం నేను చూశాను. ఆమెను చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను.  కాబట్టి ఆ దేవదూత నాతో ఇలా అన్నాడు: “నువ్వెందుకు ఆశ్చర్యపోయావు? ఆ స్త్రీ గురించిన రహస్యాన్ని, ఆ స్త్రీ కూర్చొని ఉన్న ఏడు తలలు, పది కొమ్ములు గల క్రూరమృగం గురించిన రహస్యాన్ని నీకు చెప్తాను. అదేమిటంటే:  నువ్వు చూసిన ఆ క్రూరమృగం అంతకుముందు ఉంది, ఇప్పుడు లేదు, కానీ త్వరలో అది అగాధం నుండి పైకి వస్తుంది. అది నాశనం చేయబడుతుంది. భూమ్మీది ప్రజలు, అంటే ప్రపంచం పుట్టిన* దగ్గర నుండి ఎవరి పేర్లయితే జీవగ్రంథంలో రాయబడలేదో వాళ్లు ఆ క్రూరమృగం అంతకుముందు ఉండడం, ఆ తర్వాత లేకపోవడం, అది మళ్లీ రావడం చూసి ఆశ్చర్యపోతారు.  “దీన్ని అర్థం చేసుకోవడానికి తెలివిగల మనసు అవసరం: ఆ ఏడు తలలు, ఆ స్త్రీ కూర్చొని ఉన్న ఏడు పర్వతాలను సూచిస్తున్నాయి. 10  ఏడుగురు రాజులు ఉన్నారు. వాళ్లలో ఐదుగురు పడిపోయారు, ఒక రాజు ఇప్పుడు ఉన్నాడు, ఇంకొక రాజు ఇంకా రాలేదు. అయితే అతను వచ్చినప్పుడు కొంతకాలంపాటు ఉండాలి. 11  అంతకుముందు ఉన్నది, ఇప్పుడు లేనిది అయిన ఆ క్రూరమృగమే ఎనిమిదో రాజు. అయితే అది ఆ ఏడుగురు రాజుల్లో నుండి వస్తుంది. చివరికి అది నాశనం చేయబడుతుంది. 12  “నువ్వు చూసిన ఆ పది కొమ్ములు ఇంకా పరిపాలన మొదలుపెట్టని పదిమంది రాజుల్ని సూచిస్తున్నాయి. అయితే వాళ్లు ఆ క్రూరమృగంతో కలిసి ఒక గంటపాటు రాజులుగా పరిపాలించడానికి అధికారం పొందుతారు. 13  వాళ్లకు ఒకే ఆలోచన ఉంటుంది. అందుకే వాళ్లు తమ శక్తిని, అధికారాన్ని ఆ క్రూరమృగానికి ఇస్తారు. 14  వాళ్లు గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు. కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు కాబట్టి ఆయన వాళ్లను జయిస్తాడు. అంతేకాదు దేవుడు పిలిచినవాళ్లు, దేవుడు ఎంచుకున్నవాళ్లు, దేవునికి నమ్మకంగా ఉన్నవాళ్లు ఆయనతోపాటు జయిస్తారు.” 15  ఆ దేవదూత నాతో ఇలా అన్నాడు: “ఆ వేశ్య ఏ నీళ్ల మీద కూర్చొని ఉండడం నువ్వు చూశావో ఆ నీళ్లు జాతుల్ని, ప్రజల గుంపుల్ని, దేశాల్ని, భాషల్ని సూచిస్తున్నాయి. 16  నువ్వు చూసిన ఆ పది కొమ్ములు, అలాగే ఆ క్రూరమృగం ఈ వేశ్యను ద్వేషించి, ఆమెను కొల్లగొట్టి, ఆమె బట్టలు తీసేసి, ఆమె మాంసాన్ని తిని, అగ్నితో ఆమెను పూర్తిగా కాల్చివేస్తాయి. 17  ఎందుకంటే తాను అనుకున్నట్లు జరగాలని దేవుడే వాళ్లలో తన ఆలోచన పెట్టాడు. వాళ్లందరికీ ఒకే ఆలోచన ఉంది. దేవుని మాటలు నెరవేరేవరకు తమ రాజ్యాన్ని క్రూరమృగానికి ఇవ్వాలన్నదే ఆ ఆలోచన. 18  నువ్వు చూసిన ఆ స్త్రీ మహానగరాన్ని సూచిస్తోంది. ఆ మహానగరం భూమ్మీది రాజుల్ని పరిపాలిస్తుంది.”

అధస్సూచీలు

పదకోశం చూడండి.
గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.
గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.
అక్ష., “(విత్తనం) పడిన,” అంటే ఆదాముహవ్వలకు పిల్లలు పుట్టిన.