ప్రకటన 16:1-21

  • దేవుని కోపంతో నిండిన ఏడు గిన్నెలు (1-21)

    • భూమ్మీద  (2), సముద్రం మీద  (3), నదులు, నీటి ఊటల మీద  (4-7), సూర్యుని మీద  (8, 9), క్రూరమృగం సింహాసనం మీద  (10, 11), యూఫ్రటీసు నది మీద  (12-16), గాలి మీద కుమ్మరించబడ్డాయి (17-21)

    • హార్‌మెగిద్దోన్‌లో దేవుని యుద్ధం  (14, 16)

16  అప్పుడు పవిత్ర స్థలం నుండి ఒక పెద్ద స్వరం ఆ ఏడుగురు దేవదూతలతో ఇలా చెప్పడం విన్నాను: “మీరు వెళ్లి, దేవుని కోపంతో నిండిన ఏడు గిన్నెలను భూమ్మీద కుమ్మరించండి.”  మొదటి దేవదూత వెళ్లి తన గిన్నెను భూమ్మీద కుమ్మరించాడు. అప్పుడు క్రూరమృగం గుర్తు కలిగివున్నవాళ్లను, దాని ప్రతిమను ఆరాధిస్తున్నవాళ్లను హానికరమైన, ఘోరమైన పుండ్లు బాధించాయి.  రెండో దేవదూత తన గిన్నెను సముద్రం మీద కుమ్మరించాడు. అప్పుడు సముద్రం చనిపోయిన వ్యక్తి రక్తంలా మారిపోయింది. దాంతో సముద్రంలోని జీవులన్నీ చనిపోయాయి.  మూడో దేవదూత తన గిన్నెను నదుల మీద, నీటి ఊటల* మీద కుమ్మరించాడు. దాంతో అవి రక్తంగా మారిపోయాయి.  అప్పుడు నీళ్ల మీద అధికారం ఉన్న దేవదూత ఇలా అనడం విన్నాను: “ఇప్పుడూ గతంలోనూ ఉన్నవాడా, విశ్వసనీయుడా, ఈ తీర్పులు జారీ చేశావు కాబట్టి నువ్వు నీతిమంతుడివి.  వాళ్లు పవిత్రుల రక్తాన్ని, ప్రవక్తల రక్తాన్ని చిందించారు. అందుకే నువ్వు వాళ్లకు తాగడానికి రక్తాన్ని ఇచ్చావు. వాళ్లకు అలా జరగాల్సిందే.”  అప్పుడు బలిపీఠం నుండి ఒక స్వరం ఇలా చెప్పడం విన్నాను: “అవును, యెహోవా* దేవా, సర్వశక్తిమంతుడా, నీ తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి.”  నాలుగో దేవదూత తన గిన్నెను సూర్యుడి మీద కుమ్మరించాడు. అప్పుడు తన వేడితో ప్రజల్ని కాల్చేసేందుకు సూర్యుడికి అనుమతి ఇవ్వబడింది.  ఆ తీవ్రమైన వేడికి ప్రజలు మాడిపోయారు. అయితే వాళ్లు, ఈ తెగుళ్ల మీద అధికారం ఉన్న దేవుని పేరును దూషించారే తప్ప పశ్చాత్తాపపడి ఆయన్ని మహిమపర్చలేదు. 10  ఐదో దేవదూత తన గిన్నెను క్రూరమృగం సింహాసనంమీద కుమ్మరించాడు. అప్పుడు దాని రాజ్యం చీకటిమయం అయిపోయింది. ఆ బాధవల్ల ప్రజలు తమ పళ్లు కొరుక్కోవడం* మొదలుపెట్టారు. 11  అయితే వాళ్లు తమ బాధల్ని బట్టి, పుండ్లను బట్టి పరలోకంలో ఉన్న దేవుణ్ణి దూషించారే తప్ప తమ పనుల విషయంలో పశ్చాత్తాపపడలేదు. 12  ఆరో దేవదూత తన గిన్నెను యూఫ్రటీసు మహానది మీద కుమ్మరించాడు. అప్పుడు, తూర్పు* నుండి వచ్చే రాజుల కోసం దారి ఏర్పడేలా ఆ నది నీళ్లు ఎండిపోయాయి. 13  తర్వాత మహాసర్పం నోటి నుండి, క్రూరమృగం నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల లాంటి మూడు అపవిత్రమైన ప్రేరేపిత సందేశాలు రావడం నేను చూశాను. 14  నిజానికి అవి చెడ్డదూతలు ప్రేరేపించిన సందేశాలు. అవి* ఆశ్చర్యకార్యాలు చేస్తాయి. అవి సర్వశక్తిమంతుడైన దేవుని మహారోజున జరిగే యుద్ధం కోసం భూమంతటా ఉన్న రాజుల్ని పోగు చేయడానికి వాళ్ల దగ్గరికి వెళ్తాయి. 15  తర్వాత ఒక స్వరం ఇలా చెప్పడం నేను విన్నాను: “ఇదిగో! నేను దొంగలా వస్తున్నాను. మెలకువగా ఉంటూ తన పైవస్త్రాలు కాపాడుకునే వ్యక్తి సంతోషంగా ఉంటాడు. లేకపోతే అతను పైవస్త్రం లేకుండా* నడవడం ప్రజలు చూస్తారు, దానివల్ల అతను సిగ్గుపడాల్సి వస్తుంది.” 16  అవి ఆ రాజుల్ని ఒక చోటికి పోగుచేశాయి. హీబ్రూ భాషలో దాని పేరు హార్‌మెగిద్దోన్‌.* 17  ఏడో దేవదూత తన గిన్నెను గాలి మీద కుమ్మరించాడు. అప్పుడు పవిత్ర స్థలంలో ఉన్న సింహాసనం నుండి ఒక పెద్ద స్వరం వినిపించింది. ఆ స్వరం ఇలా అంది: “సమాప్తమైంది!” 18  అప్పుడు మెరుపులు, ఉరుములు వచ్చాయి; స్వరాలు వినిపించాయి; పెద్ద భూకంపం వచ్చింది. భూమ్మీద మనిషి సృష్టించబడినప్పటి నుండి అలాంటి భూకంపం ఎప్పుడూ రాలేదు. అది చాలా శక్తివంతమైన, పెద్ద భూకంపం. 19  అప్పుడు మహానగరం మూడు భాగాలుగా చీలిపోయింది. దేశాల నగరాలు కూలిపోయాయి. దేవుడు తన మహా కోపమనే మద్యాన్ని మహాబబులోనుతో తాగించడానికి ఆమెను గుర్తుచేసుకున్నాడు. 20  అంతేకాదు ప్రతీ ద్వీపం పారిపోయింది, పర్వతాలు కనిపించకుండా పోయాయి. 21  తర్వాత ఆకాశం నుండి పెద్దపెద్ద వడగండ్లు ప్రజల మీద పడ్డాయి. వాటిలో ఒక్కో దాని బరువు దాదాపు 20 కిలోలు.* ఈ తెగులు చాలా తీవ్రంగా ఉండడంతో ప్రజలు దాన్నిబట్టి దేవుణ్ణి దూషించారు.

అధస్సూచీలు

లేదా “బుగ్గల.”
పదకోశం చూడండి.
లేదా “నాలుకలు కొరుక్కోవడం.”
లేదా “సూర్యుడు ఉదయించే వైపు.”
లేదా “ఆ సందేశాలు.”
అక్ష., “దిగంబరంగా.”
అంటే, “మెగిద్దో పర్వతం” అని అర్థం.
అక్ష., “ఒక తలాంతు బరువు.” పదకోశంలో “తలాంతు” చూడండి.