ప్రకటన 12:1-17

  • స్త్రీ, మగబిడ్డ, మహాసర్పం  (1-6)

  • మిఖాయేలు మహాసర్పంతో యుద్ధం చేస్తాడు (7-12)

    • మహాసర్పం భూమ్మీదికి పడవేయబడింది  (9)

    • తనకు కొంచెం సమయమే ఉందని అపవాదికి తెలుసు (12)

  • మహాసర్పం స్త్రీని హింసిస్తుంది  (13-17)

12  ఆ తర్వాత పరలోకంలో ఒక గొప్ప సూచన కనిపించింది. ఒక స్త్రీ సూర్యుణ్ణి ధరించుకొని ఉంది. ఆమె పాదాల కింద చంద్రుడు ఉన్నాడు, ఆమె తల మీద 12 నక్షత్రాల కిరీటం ఉంది.  ఆమె గర్భవతి. బిడ్డను కనే సమయం దగ్గరపడడంతో ఆమె పురిటినొప్పుల వల్ల కేకలు పెడుతోంది.  పరలోకంలో ఇంకొక సూచన కనిపించింది. ఇదిగో! ఏడు తలలు, పది కొమ్ములు ఉన్న ఎర్రని మహాసర్పం కనిపించింది. దాని తలల మీద ఏడు కిరీటాలు ఉన్నాయి.  దాని తోక ఆకాశ నక్షత్రాల్లో మూడో భాగాన్ని ఈడ్చి భూమ్మీద పడేసింది. ఆ స్త్రీ బిడ్డను కనగానే ఆ బిడ్డను మింగేయాలని మహాసర్పం ఆమె ముందు అలాగే నిలబడి ఉంది.  ఆమె ఒక మగబిడ్డను కన్నది. ఆయన ఇనుపదండంతో అన్ని దేశాల్ని పరిపాలిస్తాడు. వెంటనే ఆ బిడ్డను సింహాసనం మీద కూర్చొని ఉన్న దేవుని దగ్గరకు తీసుకువెళ్లారు.  అప్పుడు ఆ స్త్రీ అరణ్యానికి* పారిపోయింది. అక్కడ దేవుడు ఆమె కోసం ఒక స్థలాన్ని సిద్ధం చేశాడు. అక్కడ ఆమె 1,260 రోజులు పోషించబడుతుంది.  అప్పుడు పరలోకంలో యుద్ధం మొదలైంది. మిఖాయేలు,* ఆయన దూతలు మహాసర్పంతో యుద్ధం చేశారు. మహాసర్పం, దాని దూతలు కూడా యుద్ధం చేశారు  కానీ ఓడిపోయారు.* కాబట్టి పరలోకంలో వాళ్లకు ఇక స్థలం లేకుండా పోయింది.  దాంతో ఆ మహాసర్పం కిందికి పడవేయబడింది. అది మొదటి సర్పం. దానికి అపవాది, సాతాను అనే పేర్లు ఉన్నాయి. అతడు లోకమంతటినీ మోసం చేస్తున్నాడు. అతడు భూమ్మీద పడవేయబడ్డాడు, అతడి దూతలు కూడా అతడితోపాటు పడవేయబడ్డారు. 10  అప్పుడు పరలోకంలో ఒక పెద్ద స్వరం ఇలా చెప్పడం నేను విన్నాను: “ఇప్పుడు రక్షణ, శక్తి, రాజ్యం మన దేవునివి అయ్యాయి. అధికారం ఆయన క్రీస్తుకు వచ్చింది. ఎందుకంటే, మన దేవుని ముందు రాత్రింబగళ్లు మన సోదరుల్ని నిందించేవాడు కిందికి పడవేయబడ్డాడు! 11  వాళ్లు గొర్రెపిల్ల రక్తం వల్ల, తాము ప్రకటించిన సందేశం వల్ల అతడిని జయించారు. చనిపోవాల్సి వచ్చినా వాళ్లు తమ ప్రాణాల్ని* లెక్కచేయలేదు. 12  కాబట్టి పరలోకమా, పరలోక నివాసులారా, సంతోషించండి! అయితే భూమికి, సముద్రానికి శ్రమ. ఎందుకంటే అపవాది తనకు కొంచెం సమయమే ఉందని తెలిసి చాలా కోపంతో మీ దగ్గరికి దిగివచ్చాడు.” 13  ఆ మహాసర్పం తాను భూమ్మీదికి పడవేయబడ్డానని తెలుసుకున్నప్పుడు, మగబిడ్డను కన్న స్త్రీని హింసించింది. 14  అయితే ఆ స్త్రీ అరణ్యంలో ఉన్న తన స్థలానికి ఎగిరిపోయేలా, పెద్ద గద్దరెక్కలు రెండు ఆమెకు ఇవ్వబడ్డాయి. అక్కడ సర్పానికి దూరంగా ఆమె ఒక కాలం, రెండు కాలాలు, అర్ధకాలం* పోషించబడాలి. 15  సర్పం ఆ స్త్రీని ముంచేయాలని తన నోటితో ఆమె వెనుక నీళ్లను నదిలా వెళ్లగక్కింది. 16  అయితే భూమి ఆమెకు సహాయం చేసింది. భూమి నోరు తెరిచి, మహాసర్పం తన నోటితో వెళ్లగక్కిన నదిని మింగేసింది. 17  దాంతో మహాసర్పానికి ఆ స్త్రీ మీద చాలా కోపం వచ్చింది. కాబట్టి దేవుని ఆజ్ఞల్ని పాటిస్తూ యేసు గురించి సాక్ష్యమివ్వడానికి నియమించబడిన ఆమె పిల్లల్లోని* మిగిలిన వాళ్లతో యుద్ధం చేయడానికి అది బయల్దేరింది.

అధస్సూచీలు

లేదా “ఎడారికి.” పదకోశం చూడండి.
“దేవుని వంటి వాడు ఎవడు?” అని అర్థం.
లేదా “కానీ అది [అంటే, ఆ మహాసర్పం] ఓడిపోయింది” అయ్యుంటుంది.
పదకోశం చూడండి.
అంటే, మూడున్నర కాలాలు.
అక్ష., “విత్తనంలోని.”