గలతీయులు 6:1-18

  • ఒకరి భారాలు ఒకరు మోయండి (1-10)

    • విత్తిన పంటనే కోస్తాం  (7, 8)

  • సున్నతికి విలువలేదు (11-16)

    • కొత్త సృష్టి  (15)

  • చివరి మాటలు (17, 18)

6  సోదరులారా, ఒక వ్యక్తి తెలియక తప్పుదారిలో వెళ్లివుండవచ్చు. అయినాసరే, పరిణతిగల మీరు సౌమ్యంగా అతన్ని సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నించండి. అయితే, మీరు కూడా ప్రలోభానికి గురయ్యే ప్రమాదముందని గుర్తుంచుకొని మీ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి.  ఒకరి భారం ఒకరు మోసుకుంటూ ఉండండి. అప్పుడు మీరు క్రీస్తు శాసనాన్ని పాటించినవాళ్లౌతారు.  ఒక వ్యక్తి గొప్పవాడు కాకపోయినా గొప్పవాణ్ణని అనుకుంటే, తనను తాను మోసం చేసుకుంటున్నట్టే.  అయితే, ప్రతీ వ్యక్తి తాను చేసిన పనుల్ని పరిశీలించుకోవాలి, అంతేగానీ వేరేవాళ్లతో పోల్చుకోకూడదు. అప్పుడు, అతను చేసిన పనుల వల్లే అతనికి సంతోషం కలుగుతుంది.  ఎందుకంటే, ప్రతీ వ్యక్తి తన బరువు* తానే మోసుకోవాలి.  అంతేకాదు, దేవుని వాక్యాన్ని నేర్చుకునేవాళ్లు, తమ దగ్గరున్న మంచి వాటన్నిటినీ తమకు నేర్పేవాళ్లతో పంచుకోవాలి.  మోసపోకండి, దేవుణ్ణి వెక్కిరించలేం. ఎందుకంటే మనిషి తాను విత్తిన పంటనే కోస్తాడు;  శారీరక కోరికల ప్రకారం విత్తే వ్యక్తి తన శరీరం నుండి నాశనం అనే పంట కోస్తాడు. పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం విత్తే వ్యక్తి పవిత్రశక్తి వల్ల శాశ్వత జీవితం అనే పంట కోస్తాడు.  కాబట్టి మనం మానకుండా మంచి పనులు చేద్దాం, మనం అలసిపోకుండా ఉంటే* సరైన సమయంలో పంట కోస్తాం. 10  అందుకే మనకు అవకాశం* ఉన్నంతవరకు అందరికీ మంచి చేస్తూ ఉందాం. ప్రత్యేకించి తోటి విశ్వాసులకు* అలా చేద్దాం. 11  స్వయంగా నా చేత్తో ఎంత పెద్దపెద్ద అక్షరాలతో ఈ ఉత్తరం రాశానో చూడండి. 12  మనుషుల్ని మెప్పించాలని* అనుకునేవాళ్లే సున్నతి చేయించుకోమని మిమ్మల్ని బలవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. క్రీస్తు* విషయంలో ఎదురయ్యే హింసల్ని తప్పించుకోవడానికే వాళ్లు అలా చేస్తున్నారు. 13  నిజానికి సున్నతి చేయించుకునేవాళ్లు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించరు, కానీ సున్నతి విషయంలో మిమ్మల్ని ఒప్పించామని గొప్పలు చెప్పుకోవడానికే మిమ్మల్ని సున్నతి చేయించుకోమంటారు. 14  అయితే నేను, మన ప్రభువైన యేసుక్రీస్తు హింసాకొయ్య* విషయంలో తప్ప ఇంకే విషయంలోనూ గొప్పలు చెప్పుకోకూడదని కోరుకుంటున్నాను. ఆయన వల్ల నా దృష్టిలో ఈ లోకం చచ్చిపోయింది,* దాని దృష్టిలో నేను చచ్చిపోయాను. 15  ఎందుకంటే సున్నతి చేయించుకున్నామా లేదా అన్నది ముఖ్యం కాదుగానీ, కొత్త సృష్టిగా అయ్యామా లేదా అన్నదే ముఖ్యం. 16  ఈ నియమం* ప్రకారం జీవించే వాళ్లందరికీ, అంటే దేవుని ఇశ్రాయేలుకు శాంతి, కరుణ ప్రాప్తించాలి. 17  ఇకమీదట నన్నెవరూ ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే నేను యేసు దాసుణ్ణని చూపించే ముద్రలు నా ఒంటి మీద ఉన్నాయి. 18  సోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు అపారదయ మీరు చూపించే స్ఫూర్తికి తోడుండాలి. ఆమేన్‌.

అధస్సూచీలు

లేదా “బాధ్యత అనే బరువు.”
లేదా “మానకుండా చేస్తే.”
లేదా “నియమిత సమయం.”
లేదా “విశ్వాసం విషయంలో మనకు బంధువులైన వాళ్లకు.
లేదా “పైకి మంచివాళ్లలా కనిపించాలని.”
అక్ష., “క్రీస్తు హింసాకొయ్య.” పదకోశం “హింసాకొయ్య” చూడండి.
పదకోశం చూడండి.
లేదా “కొయ్యశిక్షకు గురైంది.”
లేదా “ప్రవర్తనా నియమం.”