ఎఫెసీయులు 4:1-32

  • క్రీస్తు శరీరంలో ఐక్యత  (1-16)

    • మనుషుల్లో వరాలు (8)

  • పాత వ్యక్తిత్వం, కొత్త వ్యక్తిత్వం  (17-32)

4  కాబట్టి, మీరు అందుకున్న పిలుపుకు తగ్గట్టు నడుచుకోమని ప్రభువు కోసం ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను.  అంటే ఎప్పుడూ వినయంగా* సౌమ్యంగా ఉంటూ, ఓర్పు చూపిస్తూ, ప్రేమతో ఒకరినొకరు భరించుకుంటూ,  ఒకరితో ఒకరు శాంతియుతంగా మెలుగుతూ, పవిత్రశక్తి వల్ల కలిగే ఐక్యతను కాపాడుకోవడానికి పట్టుదలగా ప్రయత్నిస్తూ ఉండమని బ్రతిమాలుతున్నాను.  మీరు ఏ నిరీక్షణ కోసం పిలుపు అందుకున్నారో ఆ నిరీక్షణ ఒక్కటే, అలాగే శరీరం ఒక్కటే, పవిత్రశక్తి ఒక్కటే;  ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే;  అందరికీ దేవుడు, తండ్రి ఒక్కడే. ఆయనకు అందరి మీద అధికారం ఉంది, ఆయన అందరి ద్వారా పనిచేస్తున్నాడు, ఆయన శక్తి అందరిలో పనిచేస్తోంది.  దేవుడు మనలో ప్రతీ ఒక్కరి మీద అపారదయను చూపించాడు. క్రీస్తు మనందరికీ బహుమతిని పంచి ఇచ్చిన తీరులో అది కనిపిస్తోంది.  ఎందుకంటే లేఖనం ఇలా చెప్తోంది: “ఆయన పైకి వెళ్తున్నప్పుడు బందీలను తీసుకెళ్లాడు; మనుషుల్లో వరాలను ఇచ్చాడు.”  ఈ లేఖనంలో, “ఆయన పైకి వెళ్తున్నప్పుడు” అని ఉందికదా, దాని అర్థం ఏమిటి? ఆయన కిందికి, అంటే ఈ భూమ్మీదికి వచ్చాడనే కదా. 10  కిందికి వచ్చిన ఆయనే అన్నిటినీ నెరవేర్చగలిగేలా ఆకాశాలన్నీ దాటి ఎంతో పైకి వెళ్లాడు. 11  ఆయన కొందరిని అపొస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని ప్రకటించేవాళ్లుగా,* కొందరిని కాపరులుగా, బోధకులుగా సంఘానికి అనుగ్రహించాడు. 12  పవిత్రులను సరైన దారిలో పెట్టడానికి,* పరిచర్య పని చేయడానికి, క్రీస్తు శరీరాన్ని* బలపర్చడానికి* వాళ్లను ఏర్పాటుచేశాడు. 13  మనందరి విశ్వాసం ఒకటయ్యేవరకు,* మనం దేవుని కుమారుని గురించిన సరైన జ్ఞానాన్ని పొందేవరకు, సంపూర్ణ పరిణతిగల క్రీస్తులా మనం పూర్తిస్థాయిలో పరిణతి సాధించేవరకు ఆ ఏర్పాటు ఉంటుంది. 14  కాబట్టి మనం ఇకనుంచి చిన్నపిల్లల్లా ఉండకూడదు. ఎందుకంటే కుయుక్తితో ఇతరుల్ని మోసం చేసేవాళ్ల తప్పుడు బోధల్ని నమ్మేవాళ్లు సముద్రపు కెరటాలకు, గాలికి అటుఇటు కొట్టుకుపోయే పడవలాంటివాళ్లు. 15  అయితే, మనం నిజం మాట్లాడాలి, ప్రేమ చూపించాలి. అప్పుడు మనం అన్ని విషయాల్లో ఎదిగి మన శిరస్సయిన క్రీస్తులా అవ్వగలుగుతాం. 16  ఆయన వల్ల శరీరమంతా చక్కగా అమరుతోంది, అవయవాలన్నీ ఒకదానికొకటి సహకరించుకుంటూ శరీరానికి అవసరమైనదాన్ని అందిస్తాయి. ప్రతీ అవయవం తన పని తాను సరిగ్గా చేస్తే శరీరం బాగా ఎదుగుతుంది. అలా శరీరమంతా ప్రేమలో బలపడుతుంది. 17  కాబట్టి ప్రభువు పేరిట నేను మీకు చెప్పేది, మిమ్మల్ని వేడుకునేది ఏమిటంటే, మీరిక అన్యుల్లా అర్థంపర్థంలేని* ఆలోచనల ప్రకారం జీవించకండి. 18  వాళ్లు తమ నిర్లక్ష్యం వల్ల, మొద్దుబారిపోయిన* హృదయాల వల్ల చీకట్లో ఉన్నారు,* దేవుడు ఇస్తానన్న శాశ్వత జీవితానికి దూరమైపోయారు. 19  వాళ్లు నైతిక విచక్షణ కోల్పోయి, అత్యాశతో అన్నిరకాల అపవిత్రమైన పనులు చేస్తూ లెక్కలేనట్టు* ప్రవర్తిస్తున్నారు. 20  అయితే క్రీస్తు అలాంటివాడు కాదని మీరు తెలుసుకున్నారు. 21  ఎందుకంటే మీరు ఆయన మాటలు విన్నారు, ఆయన నుండి నేర్చుకున్నారు; ఆయనలో సత్యం ఉంది. 22  మీ పాత వ్యక్తిత్వాన్ని వదిలేయాలని మీరు నేర్చుకున్నారు. ఆ వ్యక్తిత్వం మీ పాత ప్రవర్తనకు అనుగుణంగా ఉంది, అది మీ మోసపూరిత కోరికల వల్ల దిగజారుతోంది. 23  మీరు కొత్త ఆలోచనా విధానాన్ని* అలవర్చుకుంటూ ఉండాలి. 24  నిజమైన నీతికి, విశ్వసనీయతకు అనుగుణంగా దేవుని ఇష్టప్రకారం సృష్టించబడిన కొత్త వ్యక్తిత్వాన్ని మీరు అలవర్చుకోవాలి. 25  కాబట్టి, మోసం చేయడం మానేసిన మీరు సాటిమనిషితో నిజమే మాట్లాడండి. ఎందుకంటే మనమందరం ఒకే శరీరంలోని అవయవాలం. 26  మీకు కోపం వచ్చినా పాపం మాత్రం చేయకండి, సూర్యుడు అస్తమించే వరకు కోపంగా ఉండకండి; 27  అపవాదికి అవకాశం* ఇవ్వకండి. 28  దొంగతనం చేసేవాళ్లు ఇకనుంచి దొంగతనం చేయకూడదు; వాళ్లు కష్టపడి పనిచేయాలి. అవసరంలో ఉన్నవాళ్లకు ఎంతోకొంత ఇవ్వగలిగేలా తమ సొంత చేతులతో నిజాయితీగల పని చేయాలి. 29  మీరు చెడ్డ మాటలు మాట్లాడకండి. వినేవాళ్లకు ప్రయోజనం కలిగేలా అవసరాన్ని బట్టి, బలపర్చే మంచి మాటలే మాట్లాడండి. 30  దేవుని పవిత్రశక్తిని బాధపెట్టకండి,* విమోచన క్రయధనం ద్వారా మీరు విడుదల పొందే రోజు కోసం ఆ పవిత్రశక్తితోనే దేవుడు మీకు ముద్ర వేశాడు. 31  మీరు అన్నిరకాల ద్వేషాన్ని, కోపాన్ని, ఆగ్రహాన్ని వదిలేయండి. ఎదుటివాళ్లమీద అరవడం, వాళ్లను తిట్టడం మానేయండి, అలాగే గాయపర్చే పనులన్నీ ఆపేయండి. 32  ఒకరితో ఒకరు దయగా మెలగండి, కనికరం చూపించండి, క్రీస్తు ద్వారా దేవుడు మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించినట్టే మీరూ ఒకరినొకరు మనస్ఫూర్తిగా క్షమించుకోండి.

అధస్సూచీలు

లేదా “దీనమనస్సుతో.”
లేదా “మంచివార్తను చాటేవాళ్లుగా.”
లేదా “పవిత్రులకు శిక్షణ ఇవ్వడానికి.”
“సంఘాన్ని” అని అర్థం.
అక్ష., “కట్టడానికి.”
లేదా “మనమందరం విశ్వాసం విషయంలో ఐక్యమయ్యేవరకు.”
లేదా “మూర్ఖమైన; వ్యర్థమైన.”
అక్ష., “మందగించిన.”
అక్ష., “వాళ్ల మనసులు చీకట్లో ఉన్నాయి.”
లేదా “సిగ్గులేనట్టు.” గ్రీకులో అసెల్జీయ. పదకోశంలో “లెక్కలేనితనం” చూడండి.
లేదా “మనసును నిర్దేశించే శక్తిని.” అక్ష., “మానసిక స్ఫూర్తిని.”
లేదా “చోటు.”
లేదా “దుఃఖపెట్టకండి.”