అపొస్తలుల కార్యాలు 11:1-30

  • పేతురు అపొస్తలుల దగ్గరికి వచ్చి చెప్పడం  (1-18)

  • సిరియాలోని అంతియొకయలో బర్నబా, సౌలు (19-26)

    • శిష్యులు మొదటిసారి క్రైస్తవులని పిలవబడ్డారు (26)

  • కరువు రాబోతుందని అగబు ముందే చెప్పడం  (27-30)

11  అన్యులు కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించారని యూదయలో ఉన్న అపొస్తలులు, సోదరులు విన్నారు.  కాబట్టి పేతురు యెరూషలేముకు వచ్చినప్పుడు, సున్నతిని సమర్థించేవాళ్లు అతన్ని విమర్శించడం మొదలుపెట్టి,  “నువ్వు సున్నతి పొందనివాళ్ల ఇంటికి వెళ్లి, వాళ్లతో కలిసి భోంచేశావు” అన్నారు.  అప్పుడు పేతురు ఆ విషయం గురించి వాళ్లకిలా వివరించడం మొదలుపెట్టాడు:  “నేను యొప్పే నగరంలో ప్రార్థిస్తున్నప్పుడు ఒక దర్శనం చూశాను. పెద్ద దుప్పటి లాంటిదాన్ని నాలుగు మూలల్లో పట్టుకొని ఆకాశం నుండి కిందికి దించడం నాకు కనిపించింది. అది నా వరకూ వచ్చింది.  దానిలోకి జాగ్రత్తగా చూసినప్పుడు, అందులో భూమ్మీద ఉండే నాలుగు కాళ్ల జంతువులు, క్రూరమృగాలు, పాకే జీవులు, ఆకాశ పక్షులు నాకు కనిపించాయి.  అంతేకాదు, ‘పేతురూ, లేచి వీటిని చంపుకొని తిను!’ అని ఒక స్వరం నాతో చెప్పడం విన్నాను.  అప్పుడు నేను, ‘లేదు ప్రభువా, నేను అలా చేయలేను. ధర్మశాస్త్రం ప్రకారం నిషిద్ధమైనదేదీ, అపవిత్రమైనదేదీ నేను ఎప్పుడూ తినలేదు’ అన్నాను.  రెండోసారి, ఆకాశం నుండి వచ్చిన స్వరం ఇలా అంది: ‘దేవుడు పవిత్రపర్చిన వాటిని నిషిద్ధమైనవని అనొద్దు.’ 10  మూడోసారి కూడా అలాగే జరిగింది. తర్వాత అదంతా తిరిగి ఆకాశానికి ఎత్తబడింది. 11  సరిగ్గా అదే సమయానికి, ముగ్గురు మనుషులు మేము బస చేస్తున్న ఇంటి దగ్గర నిలబడ్డారు. నన్ను కలుసుకోమని ఒక వ్యక్తి కైసరయ నుండి వాళ్లను పంపించాడు. 12  ఏమాత్రం సందేహించకుండా వాళ్లతోపాటు వెళ్లమని దేవుడు తన పవిత్రశక్తి ద్వారా నాకు చెప్పాడు. అయితే ఈ ఆరుగురు సోదరులు కూడా నాతోపాటు వచ్చారు. తర్వాత మేము ఆ వ్యక్తి ఇంట్లోకి వెళ్లాం. 13  “ఒక దేవదూత తమ ఇంట్లో నిలబడి ఇలా అన్నాడని అతను చెప్పాడు: ‘యొప్పేకు మనుషుల్ని పంపి, పేతురు అని పిలువబడే సీమోనును పిలిపించు. 14  నువ్వూ, నీ ఇంటివాళ్లందరూ ఎలా రక్షణ పొందవచ్చో అతను నీకు చెప్తాడు.’ 15  అయితే నేను ఇంకా మాట్లాడుతుండగానే, మొదట్లో మన మీదికి వచ్చినట్టే పవిత్రశక్తి వాళ్ల మీదికి కూడా వచ్చింది. 16  అప్పుడు ప్రభువు చాలాసార్లు అన్న ఈ మాటలు నాకు గుర్తుకొచ్చాయి: ‘యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాడు. అయితే మీరు పవిత్రశక్తితో బాప్తిస్మం తీసుకుంటారు.’ 17  ప్రభువైన యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచిన మనకు దేవుడు పవిత్రశక్తి అనే ఉచిత బహుమతిని ఇచ్చాడు. అదే ఉచిత బహుమతిని దేవుడు వాళ్లకు కూడా ఇచ్చాడు. అలాంటప్పుడు, దేవుణ్ణి అడ్డుకోవడానికి* నేను ఎవర్ని?” 18  వాళ్లు ఈ విషయాలు విన్నప్పుడు, పేతురుకు అడ్డు చెప్పడం మానేశారు.* వాళ్లు దేవుణ్ణి మహిమపరుస్తూ ఇలా అన్నారు: “అంటే, అన్యులు కూడా జీవాన్ని పొందేలా పశ్చాత్తాపపడాలని దేవుడు కోరుకుంటున్నాడన్న మాట.” 19  స్తెఫను చనిపోయిన తర్వాత వచ్చిన శ్రమ వల్ల చెల్లాచెదురైపోయిన వాళ్లు ఫేనీకే, కుప్ర, అంతియొకయ వరకూ వెళ్లారు. కానీ వాళ్లు యూదులకు మాత్రమే వాక్యాన్ని ప్రకటించారు. 20  అయితే కుప్ర నుండి, కురేనే నుండి వచ్చిన కొంతమంది అంతియొకయలో ఉన్నారు. వాళ్లు గ్రీకు భాష మాట్లాడే ప్రజలతో మాట్లాడుతూ ప్రభువైన యేసు గురించిన మంచివార్త ప్రకటించడం మొదలుపెట్టారు. 21  పైగా యెహోవా* చేయి వాళ్లకు తోడుగా ఉంది కాబట్టి చాలామంది విశ్వాసులై ప్రభువు వైపుకు తిరిగారు. 22  వాళ్ల గురించిన వార్త యిరూషలేములో ఉన్న సంఘానికి తెలిసింది. దాంతో వాళ్లు బర్నబాను అంతియొకయ వరకు పంపించారు. 23  అతను అక్కడికి వచ్చి, శిష్యులకు దేవుడు అనుగ్రహించిన అపారదయను చూసి సంతోషించాడు. ఇప్పటిలాగే, స్థిరమైన హృదయంతో ప్రభువుకు విశ్వసనీయంగా ఉండమని అతను వాళ్లందర్నీ ప్రోత్సహిస్తూ ఉన్నాడు; 24  ఎందుకంటే అతను మంచివాడు, పవిత్రశక్తితో విశ్వాసంతో నిండిన వ్యక్తి; దాంతో చాలామంది ప్రభువు మీద విశ్వాసముంచారు. 25  కాబట్టి అతను ఎలాగైనా సౌలును వెతికి కనుక్కోవాలని తార్సుకు వెళ్లాడు. 26  సౌలు కనిపించాక బర్నబా అతన్ని అంతియొకయకు తీసుకొచ్చాడు. వాళ్లు ఒక సంవత్సరమంతా అక్కడున్న సంఘంతో సహవసిస్తూ చాలామందికి బోధించారు. దేవుని నిర్దేశం ప్రకారం శిష్యులు క్రైస్తవులని మొట్టమొదట పిలువబడింది అంతియొకయలోనే. 27  ఆ రోజుల్లో కొందరు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయకు వచ్చారు. 28  వాళ్లలో ఒకతను అగబు. భూమంతటి మీదికి పెద్ద కరువు రాబోతుందని అతను పవిత్రశక్తి ద్వారా ముందే చెప్పాడు. ఆ కరువు క్లౌదియ కాలంలో నిజంగానే వచ్చింది. 29  కాబట్టి శిష్యులు ఒక్కొక్కరు తాము ఇవ్వగలిగిన దాన్నిబట్టి, యూదయలో ఉన్న సోదరులకు సహాయం పంపించాలని నిశ్చయించుకున్నారు. 30  ఆ సహాయాన్ని వాళ్లు బర్నబా ద్వారా, సౌలు ద్వారా అక్కడి పెద్దలకు పంపించారు.

అధస్సూచీలు

లేదా “దేవుని మార్గంలో అడ్డుగా నిలబడడానికి.”
అక్ష., “మౌనంగా ఉండిపోయారు.”
పదకోశం చూడండి.