కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

5వ పాఠం

మా క్రైస్తవ కూటాల్లో మీరేం చూస్తారు?

మా క్రైస్తవ కూటాల్లో మీరేం చూస్తారు?

అర్జెంటీనా

సియర్రా లియోన్‌

బెల్జియం

మలేసియా

సరైన నిర్దేశం, ఓదార్పు దొరకక చాలామంది ఆరాధనా స్థలాలకు వెళ్లడం మానేశారు. మరి యెహోవాసాక్షుల కూటాలకు లేదా మీటింగ్స్‌కి మీరెందుకు హాజరవ్వాలి? అక్కడ మీరేం చూస్తారు?

ప్రేమ, శ్రద్ధ గల ప్రజల మధ్య ఉండే ఆనందాన్ని చవిచూస్తారు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు సంఘాలుగా ఏర్పడి, దేవున్ని ఆరాధించడానికి, లేఖనాల్ని అధ్యయనం చేయడానికి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి కూటాలు జరుపుకునేవాళ్లు. (హెబ్రీయులు 10:24, 25) ప్రేమ చూపించే క్రైస్తవ సహోదరసహోదరీలతో ఉన్నప్పుడు వాళ్లకు నిజమైన స్నేహితుల మధ్య ఉన్నట్టు అనిపించేది. (2 థెస్సలొనీకయులు 1:3; 3 యోహాను 14) మేము కూడా అదే పద్ధతి పాటిస్తున్నాం, అదే ఆనందం పొందుతున్నాం.

బైబిలు సూత్రాల్ని ఎలా పాటించాలో నేర్చుకుంటారు. పూర్వకాలంలోని దేవుని ప్రజల్లాగే ఈ రోజుల్లో కూడా స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ కూటాలకు వస్తారు. అక్కడ, బైబిలు సూత్రాల్ని రోజువారీ జీవితంలో ఎలా పాటించాలో అర్హులైన సహోదరులు బైబిలు నుండి నేర్పిస్తారు. (ద్వితీయోపదేశకాండం 31:12; నెహెమ్యా 8:8) కూటాల్లో జవాబులు చెప్పడం ద్వారా, పాటలు పాడడం ద్వారా అందరూ దేవున్ని స్తుతించవచ్చు, ఘనపర్చవచ్చు.—కీర్తన 35:18.

దేవుని మీద విశ్వాసం పెంచుకుంటారు. అపొస్తలుడైన పౌలు తన కాలంలోని ఒక సంఘంతో ఇలా అన్నాడు: “మిమ్మల్ని చూడాలని . . . నేను ఎంతో తపించిపోతున్నాను; మనం ఒకరి విశ్వాసం వల్ల ఒకరం ప్రోత్సాహం పొందాలన్నదే నా ఉద్దేశం.” (రోమీయులు 1:11, 12) కూటాల్లో తోటి విశ్వాసులతో క్రమంగా సహవసించడం వల్ల మా విశ్వాసం, బైబిలు సూత్రాల ప్రకారం జీవించాలనే మా నిశ్చయం బలపడతాయి.

వీలైతే మా తర్వాతి కూటానికి వచ్చి, పైన చెప్పిన ప్రయోజనాలు స్వయంగా రుచి చూడండి. అక్కడ మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తారు. ప్రవేశం ఉచితం, చందాలు సేకరించం.

  • మా కూటాల్లో ఏ పద్ధతిని పాటిస్తాం?

  • కూటాలకు వెళ్లడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు?