15వ పాఠం
మీరు దేవుని గురించి ఎందుకు నేర్చుకుంటూ ఉండాలి?
1. బైబిలు విషయాలు నేర్చుకుంటూ ఉంటే మీరెలా ప్రయోజనం పొందుతారు?
ఈ బ్రోషుర్ సహాయంతో బైబిల్లోని ప్రాథమిక బోధలు నేర్చుకున్నాక, యెహోవా మీద మీకున్న ప్రేమ ఎక్కువై ఉంటుంది. ఆ ప్రేమ ఇంకా పెరగాలంటే కృషి చేయాలి. (1 పేతురు 2:2) మీరు శాశ్వత జీవితం పొందాలంటే, బైబిలు విషయాలు తెలుసుకుంటూ దేవునికి దగ్గరౌతూ ఉండాలి.—యోహాను 17:3; యూదా 21 చదవండి.
దేవుని గురించి తెలుసుకునేకొద్దీ మీ విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం ఉంటే మీరు దేవున్ని సంతోషపెట్టగలుగుతారు. (హెబ్రీయులు 11:1, 6) అంతేకాదు, గతంలో చేసిన పాపాల విషయంలో పశ్చాత్తాపపడి, మీ జీవితంలో మంచి మార్పులు చేసుకోగలుగుతారు.—అపొస్తలుల కార్యాలు 3:19 చదవండి.
2. మీరు నేర్చుకున్న విషయాల వల్ల వేరేవాళ్లు ఎలా ప్రయోజనం పొందుతారు?
మీరు యెహోవాతో ఒక ప్రత్యేక అనుబంధం ఏర్పర్చుకోవచ్చు
సాధారణంగా, మనకు ఏదైనా మంచివార్త తెలిస్తే అందరికీ ఆనందంగా చెప్తాం. కాబట్టి మీరు కూడా నేర్చుకున్నవాటిని వేరేవాళ్లకు చెప్పవచ్చు. మీరు బైబిలు విషయాలు తెలుసుకునేకొద్దీ యెహోవామీద మీకున్న విశ్వాసాన్ని, మంచివార్తను బైబిలు ఉపయోగించి ఇతరులకు వివరించగలుగుతారు.—రోమీయులు 10:13-15 చదవండి.
ముందుగా మీ స్నేహితులకు, బంధువులకు మంచివార్త చెప్పడం మొదలుపెట్టవచ్చు, చాలామంది అలాగే చేస్తారు. అయితే, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ల మతాన్ని తప్పుపట్టకుండా దేవుని వాగ్దానాల గురించి చెప్పండి. మీ మాటలకన్నా మీ దయగల ప్రవర్తనే ఎక్కువగా ఆకట్టుకుంటుందని మర్చిపోకండి.—2 తిమోతి 2:24, 25 చదవండి.
3. దేవునితో మీరు ఎలాంటి అనుబంధాన్ని ఏర్పర్చుకోవచ్చు?
బైబిలు విషయాలు నేర్చుకోవడం వల్ల మీరు దేవునికి ఇంకా దగ్గరవ్వవచ్చు. కొంతకాలానికి యెహోవాతో మీకు ఒక ప్రత్యేక అనుబంధం ఏర్పడుతుంది. మీరు ఆయన కుటుంబంలో అడుగుపెట్టి ఆయనకు చెందినవాళ్లు అవుతారు.—2 కొరింథీయులు 6:18 చదవండి.
4. మీరెలా ప్రగతి సాధిస్తూ ఉండవచ్చు?
మీరు బైబిలు విషయాలు నేర్చుకునేకొద్దీ అందులోని సూత్రాలు ఎలా పాటించాలో అర్థం చేసుకుంటారు. (హెబ్రీయులు 5:13, 14) బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు? అనే పుస్తకం ఉపయోగించి మీతో బైబిలు విషయాలు చర్చించమని యెహోవాసాక్షుల్ని అడగండి. మీరు ఎంత ఎక్కువగా నేర్చుకుంటే మీ జీవితం అంత బాగుంటుంది.—కీర్తన 1:1-3; 73:27, 28 చదవండి.
సంతోషంగల దేవుడైన యెహోవాయే మంచివార్త చెప్తున్నాడు. దేవుని ప్రజలకు దగ్గరౌతూ ఉంటే దేవునికి దగ్గరవ్వవచ్చు. (హెబ్రీయులు 10:24, 25) యెహోవాను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండడం ద్వారా మీరు వాస్తవమైన జీవితం మీద, అంటే శాశ్వత జీవితం మీద గట్టి పట్టు సాధించగలుగుతారు. దేవునికి దగ్గరవ్వడం కన్నా మంచి విషయం ఇంకొకటి లేదు.—1 తిమోతి 1:11; 6:19 చదవండి.