కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

 11వ పాఠం

బైబిలు సూత్రాలు మనకు ఎలా మేలు చేస్తాయి?

బైబిలు సూత్రాలు మనకు ఎలా మేలు చేస్తాయి?

1. మనకు నిర్దేశం ఎందుకు అవసరం?

సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడానికి బైబిలు సూత్రాలు ఎలా సహాయం చేస్తాయి?—కీర్తన 36:9.

మన సృష్టికర్తకు మనకన్నా ఎక్కువ తెలివి ఉంది. ప్రేమగల తండ్రిలా ఆయన మన మీద శ్రద్ధ చూపిస్తాడు. ఆయన నిర్దేశం లేకుండా మనంతట మనమే జీవించేలా దేవుడు మనల్ని తయారుచేయలేదు. (యిర్మీయా 10:23) చిన్నపిల్లలకు అమ్మానాన్నల నిర్దేశం అవసరమైనట్టే మనకు కూడా దేవుని నిర్దేశం అవసరం. (యెషయా 48:17, 18) బైబిలు దేవుడిచ్చిన బహుమానం, అందులోని సూత్రాలు మనకు నిర్దేశాన్నిస్తాయి.2 తిమోతి 3:16 చదవండి.

యెహోవా ఇచ్చిన నియమాలు, సూత్రాలు ఇప్పుడు సంతోషంగా ఎలా జీవించవచ్చో, భవిష్యత్తులో శాశ్వత ప్రయోజనాలు ఎలా పొందవచ్చో నేర్పిస్తాయి. మనల్ని సృష్టించింది దేవుడే కాబట్టి మనం ఆయన నిర్దేశం పట్ల కృతజ్ఞత కలిగివుంటూ, సంతోషంగా లోబడాలి.కీర్తన 19:7, 11; ప్రకటన 4:11 చదవండి.

2. బైబిలు సూత్రాలు అంటే ఏంటి?

సూత్రాలు అనేవి ప్రాథమిక సత్యాలు, నియమాలు మాత్రం కొన్ని ప్రత్యేక పరిస్థితులకే సరిపోతాయి. (ద్వితీయోపదేశకాండం 22:​8) ఒకానొక పరిస్థితికి ఏ సూత్రం సరిపోతుందో తెలుసుకోవాలంటే మనం ఆలోచనా సామర్థ్యాన్ని ఉపయోగించాలి. (సామెతలు 2:10-12) ఉదాహరణకు, జీవం దేవుడు ఇచ్చిన బహుమతి అని బైబిలు చెప్తుంది. ఆ ప్రాథమిక సూత్రాన్ని గుర్తుంచుకుంటే మనం పనిస్థలంలో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, ప్రయాణిస్తున్నా సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం.అపొస్తలుల కార్యాలు 17:28 చదవండి.

3. అన్నిటికన్నా ముఖ్యమైన రెండు సూత్రాలు ఏంటి?

అన్నిటికన్నా ముఖ్యమైన రెండు సూత్రాల గురించి యేసు చెప్పాడు. దేవుని గురించి తెలుసుకుని, ఆయన్ని ప్రేమించి, నమ్మకంగా సేవించడమే మన జీవిత ఉద్దేశమని మొదటి సూత్రం చెప్తుంది. ఈ సూత్రాన్ని మనసులో ఉంచుకునే మనం ఏ నిర్ణయమైనా తీసుకోవాలి.  (సామెతలు 3:6) ఆ సూత్రం ప్రకారం జీవించేవాళ్లు దేవుని స్నేహాన్ని, నిజమైన సంతోషాన్ని, శాశ్వత జీవితాన్ని పొందుతారు.మత్తయి 22:36-38 చదవండి.

ఇతరులతో శాంతిగా ఉండమని రెండో సూత్రం చెప్తుంది. (1 కొరింథీయులు 13:4-7) ఈ సూత్రాన్ని పాటించాలంటే, ప్రజలతో దేవుడు ఎలా వ్యవహరిస్తాడో మనమూ అలాగే వ్యవహరించాలి.మత్తయి 7:12; 22:39, 40 చదవండి.

4. బైబిలు సూత్రాలు మనకు ఎలా మేలు చేస్తాయి?

కుటుంబంలో ప్రేమ చూపిస్తూ ఐక్యంగా ఉండడం ఎలాగో బైబిలు సూత్రాలు నేర్పిస్తాయి. (కొలొస్సయులు 3:12-14) వివాహం శాశ్వత బంధంగా ఉండాలనేది దేవుని వాక్యంలో ఉన్న మరో సూత్రం. అది కుటుంబాలకు భద్రత ఇస్తుంది.ఆదికాండం 2:24 చదవండి.

బైబిలు సూత్రాలు పాటిస్తే మనం ఆర్థిక సమస్యల్ని, ఆందోళనల్ని తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు నిజాయితీగా ఉండమని, కష్టపడి పనిచేయమని బైబిలు చెప్తుంది. ఎవరైనా అలాంటివాళ్లకే ఉద్యోగం ఇవ్వాలనుకుంటారు కదా! (సామెతలు 10:4, 26; హెబ్రీయులు 13:18) అంతేకాదు, కనీస అవసరాలతో తృప్తిగా జీవించమని, వస్తుసంపదల కన్నా దేవునితో ఉన్న స్నేహానికే ఎక్కువ విలువ ఇవ్వమని బైబిలు చెప్తుంది.మత్తయి 6:24, 25, 33; 1 తిమోతి 6:8-10 చదవండి.

బైబిలు సూత్రాలు మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. (సామెతలు 14:30; 22:24, 25) ఉదాహరణకు, అతిగా తాగకూడదు అని బైబిలు చెప్తుంది. దాన్ని పాటిస్తే ప్రాణాంతకమైన జబ్బులకు, ప్రమాదాలకు దూరంగా ఉంటాం. (సామెతలు 23:20) అయితే, మద్యం మితంగా తీసుకోవడాన్ని యెహోవా ఖండించట్లేదు. (కీర్తన 104:15; 1 కొరింథీయులు 6:10) మన పనులతో పాటు ఆలోచనల్ని కూడా అదుపులో పెట్టుకోవాలని దేవుని సూత్రాలు చెప్తున్నాయి, అలా చేయడం మనకే మంచిది. (కీర్తన 119:97-100) అయితే, నిజ క్రైస్తవులు కేవలం తమ మేలు కోసం కాదుగానీ యెహోవాను ఘనపర్చడం కోసం ఆయన ప్రమాణాల్ని పాటిస్తారు.మత్తయి 5:14-16 చదవండి.