కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

 3వ పాఠం

బైబిలు నిజంగా దేవుడు ఇచ్చిన పుస్తకమా?

బైబిలు నిజంగా దేవుడు ఇచ్చిన పుస్తకమా?

1. బైబిల్ని ఎవరు రాయించారు?

ప్రజలు భూమ్మీద నిరంతరం జీవిస్తారనే మంచివార్త బైబిల్లో ఉంది. (కీర్తన 37:29) బైబిల్లో మొత్తం 66 చిన్న పుస్తకాలు ఉన్నాయి. దేవుడు దాదాపు 40 మంది నమ్మకమైన సేవకులతో దాన్ని రాయించాడు. దాదాపు 3,500 సంవత్సరాల క్రితం మోషే అందులోని మొదటి ఐదు పుస్తకాల్ని రాశాడు. చివరి పుస్తకాన్ని 1,900 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం అపొస్తలుడైన యోహాను రాశాడు. బైబిలు రచయితలు ఎవరి ఆలోచనల్ని రాశారు? దేవుడు పవిత్రశక్తి ద్వారా తన ఆలోచనల్ని వాళ్లకు తెలియజేశాడు. (2 సమూయేలు 23:2) వాళ్లు దేవుని ఆలోచనలే రాశారు కానీ సొంతవి రాయలేదు. కాబట్టి బైబిలు యెహోవా దేవుడు ఇచ్చిన పుస్తకం.2 తిమోతి 3:16; 2 పేతురు 1:20, 21 చదవండి.

బైబిలుకు మూలం ఎవరు? వీడియో చూడండి.

2. బైబిల్లోని విషయాలు నిజమని ఎందుకు నమ్మవచ్చు?

బైబిలు జరగబోయేవాటి గురించి ఖచ్చితమైన వివరాలు చెప్తుంది, కాబట్టి అది దేవుడు ఇచ్చిన పుస్తకమని అర్థమౌతుంది. ఎందుకంటే, మనుషులెవరూ అలా చెప్పలేరు. (యెహోషువ 23:14) మన భవిష్యత్తు గురించిన ఖచ్చితమైన వివరాలు సర్వశక్తిగల దేవునికి మాత్రమే తెలుసు.యెషయా 42:9; 46:10 చదవండి.

దేవుడు ఇచ్చిన పుస్తకం మిగతా పుస్తకాల కన్నా ప్రత్యేకంగా ఉండాలని మనం ఆశిస్తాం. బైబిలు అలాగే ఉంది. బైబిళ్లు వందల కోట్ల సంఖ్యలో, వందల భాషల్లో పంపిణీ అయ్యాయి. బైబిలు రాసి చాలాకాలమైనా, దానిలోని విషయాలు విజ్ఞానశాస్త్రం రుజువుచేసిన వాటితో సరిపోతున్నాయి. అంతేకాదు బైబిల్ని 40 మంది రాసినా, దానిలోని విషయాలు ఒకదానికొకటి పొందికగా ఉన్నాయి. * ప్రేమ గురించి బైబిల్లో ఉన్న విషయాలు ప్రేమాస్వరూపి అయిన సత్యదేవుడు మాత్రమే చెప్పగలడు. అంతేకాదు ఇప్పటికీ ప్రజల జీవితాల్ని మార్చే శక్తి బైబిలుకు ఉంది. వీటన్నిటిని బట్టి బైబిలు దేవుని వాక్యమని లక్షలమంది నమ్ముతున్నారు.1 థెస్సలొనీకయులు 2:13 చదవండి.

బైబిల్లో ఉన్న విషయాలను నిజమని మీరు ఎందుకు నమ్మవచ్చు? వీడియో చూడండి.

 3. బైబిల్లో ఏముంది?

బైబిల్లో ముఖ్యంగా ఒక మంచివార్త ఉంది. అదేంటంటే, దేవుడు మనుషులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాడు. మొదట్లో మనిషి పరదైసులో, అంటే అందమైన తోటలో జీవించాడు. అతను ఆ మంచి జీవితాన్ని ఎలా చేజార్చుకున్నాడో, మళ్లీ భూమంతా ఎలా పరదైసుగా మారుతుందో బైబిలు చెప్తుంది.ప్రకటన 21:4, 5 చదవండి.

అంతేకాదు బైబిల్లో నియమాలు, సూత్రాలు, సలహాలు ఉన్నాయి. గతంలో దేవుడు మనుషులతో ఎలా నడుచుకున్నాడో కూడా బైబిల్లో ఉంది. ఆ ఉదాహరణలు చదివితే దేవుని లక్షణాలు తెలుస్తాయి. అలా, దేవుని గురించి తెలుసుకోవడానికి బైబిలు మీకు సహాయం చేస్తుంది. అంతేకాదు మీరు దేవునికి ఎలా స్నేహితులు కావచ్చో కూడా బైబిలు చెప్తుంది.కీర్తన 19:7, 11; యాకోబు 2:23; 4:8 చదవండి.

4. మీరు బైబిల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు?

యేసు ఒక్కో లేఖనం చెప్పి, దాని “అర్థం” వివరించేవాడు. అదే పద్ధతిలో తయారుచేసిన ఈ బ్రోషుర్‌ సహాయంతో మీరు బైబిల్ని అర్థం చేసుకోవచ్చు.లూకా 24:27, 45 చదవండి.

దేవుడు చెప్తున్న మంచివార్త చాలా అద్భుతమైనది. అయినా కొంతమంది దాన్ని పట్టించుకోరు, ఇంకొంతమంది చిరాకుపడతారు. మీరు మాత్రం వెనకడుగు వేయకండి. ఎందుకంటే, శాశ్వత జీవితం పొందాలంటే మీరు దేవున్ని తెలుసుకోవడం తప్పనిసరి.యోహాను 17:3 చదవండి.

 

^ పేరా 3 సర్వమానవాళి కొరకైన గ్రంథం బ్రోషుర్‌ చూడండి.