కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

2వ పాఠం

దేవుడు ఎవరు?

దేవుడు ఎవరు?

1. మనం దేవున్ని ఎందుకు ఆరాధించాలి?

 

నిజమైన దేవుడు అన్నిటినీ సృష్టించాడు. ఆయనకు ఆరంభం లేదు, అంతం లేదు. (కీర్తన 90:2) బైబిల్లో ఉన్న మంచివార్తను చెప్పింది ఆయనే. (1 తిమోతి 1:​11) మనకు ప్రాణం ఇచ్చింది దేవుడే కాబట్టి మనం ఆయన్ని మాత్రమే ఆరాధించాలి.ప్రకటన 4:11 చదవండి.

2. దేవుడు ఎలాంటివాడు?

దేవునికి మనలా రక్తమాంసాలున్న శరీరం లేదు కాబట్టి ఇంతవరకు ఏ మనిషీ ఆయన్ని చూడలేదు. ఆయన భూమ్మీదున్న ప్రాణుల కన్నా చాలా ఉన్నతమైనవాడు. (యోహాను 1:18; 4:24) మనం దేవున్ని చూడలేకపోయినా ఆయన సృష్టిని గమనించడం ద్వారా ఆయన లక్షణాలు తెలుసుకోవచ్చు. ఉదాహరణకు రకరకాల పండ్లను, పూలను చూసినప్పుడు దేవునికున్న ప్రేమ, తెలివి అర్థమౌతాయి. విశ్వాన్ని చూసినప్పుడు ఆయనకున్న శక్తి తెలుస్తుంది.రోమీయులు 1:20 చదవండి.

దేవుని లక్షణాల్ని ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే మనం బైబిలు చదవాలి. ఉదాహరణకు దేవునికి ఏవి ఇష్టమో, ఏవి ఇష్టంలేదో, ఆయన మనుషులతో ఎలా నడుచుకుంటాడో, వేర్వేరు పరిస్థితుల్లో ఎలా స్పందిస్తాడో బైబిలు చెప్తుంది.కీర్తన 103:7-10 చదవండి.

3. దేవునికి ఒక పేరు ఉందా?

యేసు ఇలా అన్నాడు: “పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు పవిత్రపర్చబడాలి.” (మత్తయి 6:9) దేవునికి ఎన్నో బిరుదులు ఉన్నా, ఆయనకు ఒకేఒక్క పేరు ఉంది. ఆ పేరును ఒక్కో భాషలో ఒక్కో విధంగా పలుకుతారు. తెలుగులో ఎక్కువగా “యెహోవా” అని పిలుస్తారు, కొంతమంది “యావే” అని కూడా అంటారు.కీర్తన 83:18 చదవండి.

చాలా బైబిళ్లలో “యెహోవా” అనే పేరు తీసేసి, “ప్రభువు” లేదా “దేవుడు” అనే బిరుదులు పెట్టారు. కానీ బైబిల్ని రాసినప్పుడు అందులో దేవుని పేరు దాదాపు 7,000 సార్లు ఉంది. యేసు కూడా దేవుని పేరును, ఆయన గురించిన సత్యాన్ని ప్రజలకు బోధించాడు.యోహాను 17:26 చదవండి.

దేవునికి పేరు ఉందా? వీడియో చూడండి.

4. యెహోవాకు మన మీద శ్రద్ధ ఉందా?

ప్రేమగల ఈ తండ్రిలా దేవుడు మన భవిష్యత్తు బాగుండడం కోసం కృషి చేస్తున్నాడు

ఎక్కడ చూసినా కష్టాలే ఉన్నాయి కాబట్టి దేవునికి మనుషుల మీద శ్రద్ధ లేదని చాలామంది అనుకుంటారు. మనల్ని పరీక్షించడానికి దేవుడే బాధలు పెడుతున్నాడని కొంతమంది అంటారు, కానీ అది నిజంకాదు.యాకోబు 1:13 చదవండి.

దేవుడు మనకు సొంతగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను ఇచ్చి మనల్ని గౌరవించాడు. కాబట్టి దేవున్ని ఆరాధించాలో లేదో మనం నిర్ణయించుకోవచ్చు. (యెహోషువ 24:15) అయితే, చాలామంది తమ స్వేచ్ఛను తప్పుగా ఉపయోగిస్తూ ఎదుటివాళ్లకు హాని చేస్తున్నారు. దానివల్ల కష్టాలు పెరిగిపోతున్నాయి. అలాంటి అన్యాయాలు చూసినప్పుడు యెహోవా ఎంతో బాధపడతాడు.ఆదికాండం 6:5, 6 చదవండి.

యెహోవా దేవునికి మన మీద శ్రద్ధ ఉంది. మనం సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. త్వరలోనే ఆయన బాధల్ని, బాధలు పెట్టేవాళ్లను పూర్తిగా తీసేస్తాడు. అప్పటివరకు దేవుడు బాధల్ని తీసేయకపోవడానికి సరైన కారణమే ఉంది. దాని గురించి 8వ పాఠంలో తెలుసుకుంటాం.2 పేతురు 2:9; 3:7, 13 చదవండి.

5. దేవునికి ఎలా దగ్గరవ్వవచ్చు?

యెహోవాకు దగ్గరవ్వాలంటే ప్రార్థనలో ఆయనతో మాట్లాడాలి, అలా ప్రార్థించమని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మనలో ప్రతీ ఒక్కరి మీద ఆయనకు శ్రద్ధ ఉంది. (కీర్తన 65:2; 145:18) ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. కొన్నిసార్లు మనం సరైనది చేయలేకపోయినా, తనను సంతోషపెట్టడానికి మనం చేసే ప్రయత్నాల్ని ఆయన గమనిస్తాడు. కాబట్టి, లోపాలున్నా సరే మనం దేవునికి దగ్గరవ్వవచ్చు.కీర్తన 103:12-14; యాకోబు 4:8 చదవండి.

మనకు ప్రాణం ఇచ్చింది యెహోవాయే కాబట్టి మనం అందరికన్నా ఎక్కువగా ఆయన్నే ప్రేమించాలి. (మార్కు 12:30) మీరు దేవుని గురించి ఎక్కువగా తెలుసుకుంటూ ఆయన చెప్పింది చేస్తూ ఆయన మీద ప్రేమ చూపిస్తే, ఆయనకు ఇంకా దగ్గరౌతారు.1 తిమోతి 2:4; 1 యోహాను 5:3 చదవండి.