కంటెంట్‌కు వెళ్లు

నా భార్య తబితాతో కలిసి పరిచర్య చేస్తూ

బైబిలు జీవితాల్ని మారుస్తుంది

అసలు దేవుడే లేడని అనుకునేవాణ్ణి

అసలు దేవుడే లేడని అనుకునేవాణ్ణి
  • పుట్టిన సంవత్సరం: 1974

  • దేశం: జర్మన్‌ డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌

  • ఒకప్పుడు: దేవుణ్ణి నమ్మేవాడు కాదు

నా గతం

అప్పట్లో జర్మన్‌ డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ (GDR) అని పిలిచే దేశంలో, శాక్సనీ అనే గ్రామంలో నేను పుట్టాను. మా అమ్మానాన్నలు ప్రేమగా, ఆప్యాయంగా చూసుకునేవాళ్లు, అలాగే నాకు మంచి నైతిక విలువలు నేర్పించారు. జర్మన్‌ డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఒక కమ్యూనిస్టు దేశం కాబట్టి, శాక్సనీలో ఎక్కువమంది ప్రజలు మతాన్ని పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. నా విషయానికొస్తే, అసలు దేవుడే లేడని అనుకునేవాణ్ణి. చిన్నప్పటి నుండి 18 ఏళ్లు వచ్చేదాకా రెండు సిద్ధాంతాలు నా జీవితాన్ని మలిచాయి. ఒకటి, దేవుడు లేడనే సిద్ధాంతం; రెండు, కమ్యూనిజం.

కమ్యూనిజం నాకు ఎందుకు నచ్చిందంటే, ప్రజలందరూ సమానమని ఆ సిద్ధాంతం చెప్పేది. అయితే ప్రపంచంలో బాగా డబ్బున్నవాళ్లు ఉన్నారు, బాగా పేదవాళ్లు ఉన్నారు. ఆస్తుల్ని అందరికీ న్యాయంగా పంచిపెడితే ఆ అసమానత పోతుందని నేను నమ్మేవాణ్ణి. అందుకే కమ్యూనిస్టు యూత్‌ సంస్థలో బిజీగా ఉండేవాణ్ణి. 14 ఏళ్లు వచ్చినప్పుడు, వాడిన కాగితాల్ని మళ్లీ ఉపయోగపడేలా చేసే ఒక పర్యావరణ ప్రాజెక్టులో కష్టపడి పనిచేశాను. ఆవ్‌ అనే ఊర్లోని అధికారులు నా కృషిని మెచ్చి, నాకు అవార్డు ఇచ్చారు. యువకుడిగా ఉన్నప్పుడే, జర్మన్‌ డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌లోని కొంతమంది పెద్దపెద్ద రాజకీయ నేతలతో నాకు పరిచయాలు ఉండేవి. నేను సరైన లక్ష్యాలే పెట్టుకున్నానని, నా భవిష్యత్తు చాలా బాగుంటుందని అనుకునేవాణ్ణి.

కానీ ఉన్నట్టుండి అంతా తారుమారైంది. 1989⁠లో బెర్లిన్‌ గోడ కూలిపోయింది, దానితోపాటు తూర్పు ఐరోపాలోని కమ్యూనిజం అంతమైంది. అది చూసి నేను ఖంగుతిన్నాను. ఇంకొన్ని విషయాలు చూసి కూడా నేను ఆశ్చర్యపోయాను. ఉదాహరణకు, జర్మన్‌ డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌లో అన్యాయం జరుగుతోంది. అక్కడ, కమ్యూనిజంకు మద్దతివ్వని ప్రజల్ని చిన్నచూపు చూస్తున్నారు. ఇదెలా సాధ్యం? ప్రజలందర్నీ సమానంగా చూడాలనే కదా మా కమ్యూనిస్టులు చెప్పేది? అంటే కమ్యూనిజం అంతా భ్రమేనా? ఇలా చాలా విషయాలు నాకు ఆందోళన కలిగించాయి.

దాంతో నేను సంగీతం మీద, చిత్రాలు గీయడం మీద మనసుపెట్టాను. నేను ఒక మ్యూజిక్‌ స్కూల్లో చేరాను. తర్వాత యూనివర్సిటీకి వెళ్లి మంచి సంగీతకారుణ్ణి, ఆర్టిస్ట్‌ని అవ్వాలని కలలు కన్నాను. చిన్నప్పుడు మా అమ్మానాన్నలు నేర్పించిన నైతిక విలువల్ని వదిలేశాను. సరదాగా ఉండడం, ఒకేసారి ఎక్కువమంది అమ్మాయిలతో డేటింగ్‌ చేయడం, ఇవే నాకు ముఖ్యం అయిపోయాయి. కానీ సంగీతం నేర్చుకోవడం, చిత్రాలు గీయడం, స్వేచ్ఛగా జీవించడం ఇవేవీ నా ఆందోళనను తగ్గించలేకపోయాయి. ఆఖరికి నేను గీసే చిత్రాల్లో కూడా నాకున్న భయం కనిపించేది. భవిష్యత్తు ఎలా ఉంటుంది? జీవితానికి అర్థం ఏంటి? లాంటి ప్రశ్నలు నన్ను వేధించేవి.

నేను ఎప్పటినుండో ఆలోచిస్తున్న ప్రశ్నలకు జవాబులు దొరికినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. మ్యూజిక్‌ స్కూల్లో ఒకరోజు సాయంత్రం, కొంతమంది విద్యార్థులు భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటుంటే నేనూ కూర్చున్నాను. వాళ్లలో మాండీ * అనే అమ్మాయి కూడా ఉంది, ఆమె ఒక యెహోవాసాక్షి. తను నాకు మంచి సలహా ఇచ్చింది. “ఆండ్రియాస్‌, జీవితం గురించి అలాగే భవిష్యత్తు గురించి నీకున్న ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలనుకుంటే, బైబిల్ని జాగ్రత్తగా చదువు” అని చెప్పింది.

బైబిలు మీద పూర్తిగా నమ్మకం కలగకపోయినా, జవాబుల కోసం అందులో చూడాలని నిర్ణయించుకున్నాను. మాండీ నాకు దానియేలు 2వ అధ్యాయం చూపించింది, అందులో నేను చదివిన విషయాలు చాలా ఆశ్చర్యం కలిగించాయి. దానియేలు కాలం నుండి మనకాలం వరకు ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపించే వరుస ప్రపంచాధిపత్యాల గురించి, ప్రభుత్వాల గురించి ఆ ప్రవచనం వివరిస్తుంది. భవిష్యత్తుకు సంబంధించిన వేరే ప్రవచనాల్ని కూడా మాండీ నాకు చూపించింది. మొత్తానికి, నా ప్రశ్నలకు జవాబులు దొరికాయి! ‘కానీ ఈ ప్రవచనాల్ని ఎవరు రాశారు? భవిష్యత్తు గురించి ఇంత ఖచ్చితంగా ఎవరు చెప్పగలరు? అంటే దేవుడు ఉండివుంటాడా?’ అని నేను అనుకున్నాను.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ...

మాండీ నాకు హార్స్‌ట్‌, ఏంజలికా అనే యెహోవాసాక్షుల జంటను పరిచయం చేసింది. బైబిల్ని అర్థం చేసుకోవడానికి వాళ్లు నాకు సహాయం చేశారు. యెహోవా అనే దేవుని వ్యక్తిగత పేరును ఎక్కువగా ఉపయోగించేది, దాన్ని చాటిచెప్పేది యెహోవాసాక్షులు మాత్రమేనని నేను వెంటనే గుర్తించాను. (కీర్తన 83:18; మత్తయి 6:​9) పరదైసు భూమ్మీద శాశ్వతకాలం జీవించే అవకాశాన్ని యెహోవా దేవుడు మనుషులకు ఇచ్చాడని నేను తెలుసుకున్నాను. కీర్తన 37:9 ఇలా చెప్తుంది: “యెహోవా కోసం కనిపెట్టుకునేవాళ్లు భూమిని స్వాధీనం చేసుకుంటారు.” దేవుని ప్రమాణాల ప్రకారం జీవించడానికి కృషిచేసే వాళ్లందరికీ ఆ అవకాశం ఉందని తెలుసుకోవడం నాకు సంతోషాన్ని ఇచ్చింది.

అయితే, బైబిలుకు తగ్గట్టు నా జీవితంలో మార్పులు చేసుకోవడానికి నేను కష్టపడాల్సి వచ్చింది. సంగీతకారుడిగా, ఆర్టిస్ట్‌గా విజయం సాధించినందుకు నాలో గర్వం ఉండేది. కాబట్టి నేను ముందుగా వినయం నేర్చుకోవాల్సి వచ్చింది. అనైతిక జీవితాన్ని విడిచిపెట్టడం కూడా నాకు కష్టం అనిపించింది. బైబిలు చెప్పేవాటిని పాటించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నవాళ్ల పట్ల యెహోవా ఓర్పు, కరుణ చూపిస్తున్నందుకు, వాళ్లను అర్థం చేసుకుంటున్నందుకు నేను ఎంతో కృతజ్ఞుణ్ణి!

మొదటి 18 సంవత్సరాలు నా జీవితాన్ని కమ్యూనిజం, దేవుడు లేడనే సిద్ధాంతం మలిస్తే, ఆ తర్వాతి జీవితాన్ని బైబిలు మలిచింది. బైబిల్లో నేను నేర్చుకున్న విషయాలు భవిష్యత్తు గురించి నాకున్న ఆందోళనను తగ్గించాయి, నా జీవితానికి ఒక అర్థాన్నిచ్చాయి. 1993⁠లో నేను బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షిని అయ్యాను, 2000⁠లో తబితా అనే ఉత్సాహవంతురాలైన సహోదరిని పెళ్లి చేసుకున్నాను. మేము వీలైనంత ఎక్కువ సమయం ఇతరులకు బైబిలు విషయాలు నేర్పించడంలోనే గడుపుతాం. మేము కలిసేవాళ్లలో ఎక్కువమంది నాలాగే కమ్యూనిజంని, దేవుడు లేడనే సిద్ధాంతాన్ని నమ్మినవాళ్లే. యెహోవాను తెలుసుకునేలా వాళ్లకు సహాయం చేసినప్పుడు నాకు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది.

నేనెలా ప్రయోజనం పొందానంటే ...

నేను యెహోవాసాక్షులతో సహవసించడం మొదలుపెట్టినప్పుడు, మా అమ్మానాన్నలు చాలా భయపడ్డారు. కానీ, అలా సహవసించడం వల్ల నేను ఎలా మంచిగా మారానో వాళ్లు గమనించారు. సంతోషకరమైన విషయం ఏంటంటే, వాళ్లు ఇప్పుడు బైబిలు చదువుతున్నారు, యెహోవాసాక్షుల కూటాలకు వస్తున్నారు.

నేను, తబితా అన్యోన్యంగా ఉంటాం. ఎందుకంటే, దంపతుల కోసం బైబిలు ఇస్తున్న సలహాల్ని పాటించడానికి మేము శాయశక్తులా కృషిచేస్తాం. ఉదాహరణకు, వివాహ జతకు నమ్మకంగా ఉండమనే బైబిలు సలహాను పాటించడం వల్ల మా వివాహ బంధం అంతకంతకూ బలపడుతోంది.​—హెబ్రీయులు 13:4.

ఇక నాకు జీవితం గురించి ఏ దిగులూ లేదు, భవిష్యత్తు గురించి ఆందోళనా లేదు. నిజమైన శాంతిని, ఐక్యతను అనుభవించే ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల కుటుంబంలో ఒకరిగా ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఈ కుటుంబంలో అందర్నీ సమానంగా చూస్తారు. నేను నమ్మింది, జీవితంలో సాధించాలనుకున్నది అదే.

^ పేరా 12 అసలు పేరు కాదు.