కంటెంట్‌కు వెళ్లు

బైబిలు జీవితాలను మారుస్తుంది

బైబిలు జీవితాలను మారుస్తుంది

గతంలో ఎక్కువమంది భార్యలు ఉండి యెహోవాసాక్షుల్ని వ్యతిరేకించిన వ్యక్తి ఎందుకు యెహోవాసాక్షి అవ్వాలనుకున్నాడు? ఒక పెంతెకొస్తు పాస్టరు తన నమ్మకాల్ని మార్చుకునేలా ఏది కదిలించింది? సరిగ్గా చూసుకోని తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన ఒక స్త్రీ, తన మీద తనకున్న ద్వేషాన్ని తీసేసుకొని దేవునికి ఎలా దగ్గరైంది? ఒక హెవీ-మెటల్‌ సంగీతాన్ని ఇష్టపడే వ్యక్తి ఎలా యెహోవాసాక్షి అయ్యాడు? వాళ్ల మాటల్లోనే తెలుసుకోండి.

“నేను మంచి భర్తగా మారాను.”—రీగోబార్‌ ఊయెటొ

 • పుట్టిన సంవత్సరం: 1941

 • దేశం: బెనిన్‌

 • ఒకప్పుడు: ఎక్కువమంది భార్యలు ఉండేవాళ్లు, యెహోవాసాక్షుల్ని వ్యతిరేకించేవాడు

నా గతం:

మాది బెనిన్‌ అనే సువిశాల నగరంలో, కొటానౌ అనే ప్రాంతం. మేము క్యాథలిక్కులం, కానీ నేను క్రమంగా చర్చీకి వెళ్లేవాణ్ణి కాదు. మా ప్రాంతంలో చాలామంది క్యాథలిక్కులకు ఎక్కువమంది భార్యలు ఉండేవాళ్లు, అప్పట్లో అది చట్టపరంగా తప్పుకాదు. నాకు నలుగురు భార్యలు ఉండేవాళ్లు.

1970లలో తిరుగుబాటు చెలరేగినప్పుడు, దానివల్ల మా దేశానికి మంచి జరుగుతుందని అనుకున్నాను. ఆ తిరుగుబాటుకు నేను పూర్తిగా మద్దతు ఇచ్చాను, రాజకీయాల్లోకి కూడా వెళ్లాను. యెహోవాసాక్షులు ఏ పక్షం వహించరు, కాబట్టి వాళ్లంటే తిరుగుబాటుదారులకు నచ్చదు. వాళ్లతో చేరి నేను కూడా యెహోవాసాక్షుల్ని హింసించాను. 1976 లో యెహోవాసాక్షుల మిషనరీలను మా దేశం నుండి బహిష్కరించినప్పుడు, వాళ్లిక తిరిగి రారని అనుకున్నాను.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ...

ఆ తిరుగుబాటు 1990 లో ముగిసింది. ఆ వెంటనే యెహోవాసాక్షుల మిషనరీలు తిరిగొచ్చారు! బహుశా దేవుడు వాళ్లకు తోడుగా ఉండి సహాయం చేస్తున్నాడని నేను అనుకున్నాను. ఆ సమయంలో నేను వేరే చోట పనిచేయడం మొదలుపెట్టాను. అక్కడ పనిచేసేవాళ్లలో ఒకతను యెహోవాసాక్షి, కొన్ని రోజుల్లోనే అతను తన నమ్మకాల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. యెహోవా దేవుడు ప్రేమ, న్యాయం గల దేవుడని అతను బైబిలు నుండి నాకు చూపించాడు. (ద్వితీయోపదేశకాండం 32:4; 1 యోహాను 4:8) ఆ లక్షణాలు నాకు బాగా నచ్చాయి. నేను యెహోవా గురించి ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని అనుకున్నాను, అందుకే బైబిలు స్టడీ గురించి చెప్పినప్పుడు వెంటనే ఒప్పుకున్నాను.

త్వరలోనే యెహోవాసాక్షుల మీటింగ్స్‌కు వెళ్లడం మొదలుపెట్టాను. వాళ్ల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమ నన్ను ఎంతో ఆకట్టుకుంది. అక్కడ అన్ని జాతుల వాళ్లు, సామాజిక తరగతుల వాళ్లు కలిసిమెలిసి ఉన్నారు. నేను యెహోవాసాక్షులకు దగ్గరయ్యే కొద్దీ, వాళ్లే యేసు నిజమైన అనుచరులని నాకు నమ్మకం కుదిరింది.—యోహాను 13:35.

నేను యెహోవా సేవ చేయడానికి, క్యాథలిక్‌ చర్చీ నుండి బయటికి వచ్చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ అదంత తేలిక కాలేదు, ఎందుకంటే ఇతరులు నా గురించి ఏమనుకుంటారో అని నేను భయపడేవాణ్ణి. చాలాకాలం తర్వాత చివరికి యెహోవా సహాయంతో ధైర్యం కూడగట్టుకొని, చర్చీ నుండి బయటికి వచ్చేశాను.

అయితే నేను ఇంకో పెద్ద మార్పు కూడా చేసుకోవాల్సి వచ్చింది. ఎక్కువమంది భార్యలు ఉండడం దేవుని దృష్టిలో తప్పని బైబిలు స్టడీలో నేర్చుకున్నాను. (ఆదికాండం 2:18-24; మత్తయి 19:4-6) ఆయన దృష్టిలో నా మొదటి పెళ్లి మాత్రమే సరైనది. దాంతో నేను ఆ పెళ్లిని చట్టప్రకారం రిజిస్టర్‌ చేసుకున్నాను. మిగతా ముగ్గురికి వాళ్ల భౌతిక అవసరాలు తీరేలా ఏర్పాట్లు చేసి, పంపించేశాను. కొంతకాలానికి వాళ్లలో ఇద్దరు యెహోవాసాక్షులు అయ్యారు.

నేనెలా ప్రయోజనం పొందానంటే ...

నా భార్య ఇప్పటికీ క్యాథలిక్కే అయినా, యెహోవా సేవ చేయాలనే నా నిర్ణయాన్ని ఆమె గౌరవిస్తుంది. ఇప్పుడు నేను మంచి భర్తగా మారానని నాకూ, తనకూ అనిపిస్తుంది.

ఒకప్పుడు నేను రాజకీయాల ద్వారా సమాజాన్ని బాగుచేయొచ్చని అనుకున్నాను, కానీ నా ప్రయత్నాలతో ఏమీ సాధించలేకపోయాను. దేవుని రాజ్యం మాత్రమే మనుషుల సమస్యలన్నిటినీ పూర్తిగా తీసేస్తుందని ఇప్పుడు నాకు తెలుసు. (మత్తయి 6:9, 10) జీవితం నిజంగా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో నేర్పించినందుకు నేను యెహోవాకు రుణపడి ఉన్నాను.

“ఆ మార్పులు చేసుకోవడం నాకు చాలా కష్టం అనిపించింది.”—ఆలిక్స్‌ లేమోస్‌ సిల్వ

 • పుట్టిన సంవత్సరం: 1977

 • దేశం: బ్రెజిల్‌

 • ఒకప్పుడు: పెంతెకొస్తు పాస్టరు

నా గతం:

నేను సావో పౌలో రాష్ట్రంలోని ఈటూ నగర పొలిమేర్లలో పెరిగాను. ఆ ప్రాంతంలో నేరాలు చాలా ఎక్కువగా జరిగేవి.

నేను చాలా కోపిష్ఠిని, అనైతిక జీవితం గడిపేవాణ్ణి. అంతేకాదు, దొంగచాటుగా మాదక ద్రవ్యాలు తరలించేవాణ్ణి. అయితే కాలం గడుస్తుండగా, అలాంటి జీవితం వల్ల చివరికి జైలుకైనా వెళ్తాను లేదా శ్మశానానికైనా వెళ్తానని నాకు అర్థమైంది. దాంతో అన్నీ వదిలేశాను. తర్వాత పెంతెకొస్తు చర్చీలో చేరి, కొంతకాలానికి పాస్టర్‌ అయ్యాను.

చర్చీ పరిచర్య ద్వారా నేను ప్రజలకు నిజంగా సహాయం చేయగలనని అనుకున్నాను. కమ్యూనిటీ రేడియో ద్వారా ఒక మత కార్యక్రమాన్ని కూడా ప్రసారం చేశాను, దాంతో ఆ ప్రాంతంలో అందరికీ నా గురించి తెలిసింది. అయితే మొత్తంగా చూస్తే, చర్చీకి తన సభ్యుల బాగోగుల గురించి గానీ, ఆ మాటకొస్తే దేవుణ్ణి ఘనపర్చడం గురించి గానీ ఏమాత్రం పట్టింపు లేదని నాకు అర్థమైంది. డబ్బు సంపాదించడం ఒక్కటే చర్చీ లక్ష్యం అని నాకు అనిపించింది. దాంతో చర్చీ నుండి తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ...

నేను యెహోవాసాక్షులతో బైబిలు స్టడీ మొదలుపెట్టాక, వాళ్లు వేరే మతాల్లా లేరని వెంటనే అర్థమైంది. ముఖ్యంగా రెండు విషయాలు నాకు బాగా నచ్చాయి. మొదటిది, యెహోవాసాక్షులు దేవుని మీద, పొరుగువాళ్లు ప్రేమ ఉందని కేవలం మాటల్లో చెప్పరు, దాన్ని పనుల్లో చూపిస్తారు. రెండోది, వాళ్లు రాజకీయాల్లో గానీ యుద్ధాల్లో గానీ పాల్గొనరు. (యెషయా 2:4) ఆ రెండు వాస్తవాలు, నేను నిజమైన మతాన్ని అంటే శాశ్వత జీవితానికి నడిపించే ఇరుకు మార్గాన్ని కనుగొన్నాననే నమ్మకాన్ని కలిగించాయి.—మత్తయి 7:13, 14.

నేను దేవుణ్ణి సంతోషపెట్టాలంటే, కొన్ని పెద్దపెద్ద మార్పులు చేసుకోవాలని నాకు అర్థమైంది. ఒకటి, నా కుటుంబం మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టాలి. అంతేకాదు, నేను ఇంకా ఎక్కువ వినయం చూపించాలి. ఆ మార్పులు చేసుకోవడం నాకు చాలా కష్టం అనిపించింది, అయితే యెహోవా సహాయంతో వాటిని చేసుకోగలిగాను. ఆ మార్పులు చూసి నా భార్య ఎంతో సంతోషించింది. తను నా కన్నా ముందే బైబిలు స్టడీ మొదలుపెట్టినా, నేను చేసుకున్న మార్పులు చూశాక త్వరగా ప్రగతి సాధించింది. కొంతకాలానికే మేమిద్దరం యెహోవాసాక్షులం అవ్వాలని నిర్ణయించుకున్నాం. ఒకేరోజు ఇద్దరం బాప్తిస్మం తీసుకున్నాం.

నేనెలా ప్రయోజనం పొందానంటే ...

యెహోవాతో దగ్గరి స్నేహం పెంచుకునేలా మా ముగ్గురు పిల్లలకు సహాయం చేయడం నాకూ, నా భార్యకు ఎంతో సంతోషాన్నిస్తుంది. మా కుటుంబం చాలా ఆనందంగా ఉంది. యెహోవా తన వాక్యంలోని సత్యం వైపుకు నన్ను ఆకర్షించినందుకు ఆయనకు కృతజ్ఞతలు. ఆ వాక్యానికి నిజంగా ప్రజల జీవితాలను మార్చే శక్తి ఉంది! దానికి నేనే ఒక సాక్ష్యం.

“నేను సంతోషంగా, పవిత్రంగా ఉన్నాను.”—విక్టోరియా టాంగ్‌

 • పుట్టిన సంవత్సరం: 1957

 • దేశం: ఆస్ట్రేలియా

 • ఒకప్పుడు: ఘోరమైన బాల్యం

నా గతం:

నేను న్యూ సౌత్‌ వేల్స్‌లోని న్యూకాసల్‌లో పెరిగాను. మేము ఏడుగురు పిల్లలం, నేను అందరికన్నా పెద్దదాన్ని. మా నాన్న తాగుబోతు, క్రూరుడు. అమ్మ కూడా అలాగే ఉండేది. అమ్మ నన్ను బాగా కొట్టేది, తిట్టేది. నేను మంచిదాన్ని కాదని, దేవుడు నన్ను నరకంలో కాలుస్తాడని ఎప్పుడూ అంటూ ఉండేది. ఆ మాటలు విన్నప్పుడు చాలా భయమేసేది.

అమ్మ కొట్టిన దెబ్బల వల్ల చాలాసార్లు స్కూలు మానేయాల్సి వచ్చేది. నాకు 11 ఏళ్లు ఉన్నప్పుడు, అధికారులు నన్ను తల్లిదండ్రులకు దూరంగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు, ఆ తర్వాత కాన్వెంట్‌లో చేర్పించారు. నాకు 14 ఏళ్లు వచ్చినప్పుడు, కాన్వెంట్‌ నుండి పారిపోయాను. ఇంటికి వెళ్లాలని అనిపించలేదు, అందుకే సిడ్నీ నగర శివారుల్లోని కింగ్స్‌ క్రాస్‌ వీధుల్లో బ్రతికాను.

అలా వీధుల్లో బ్రతుకుతున్నప్పుడు నాకు మత్తుపదార్థాలు, మద్యం, అశ్లీల చిత్రాలు, వ్యభిచారం అలవాటయ్యాయి. నాకు ఎదురైన ఒక అనుభవం నన్ను చాలా భయపెట్టింది. నేను ఒక నైట్‌క్లబ్‌ యజమాని అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నప్పుడు, ఒకరోజు సాయంత్రం ఇద్దరు మగవాళ్లు అతన్ని కలవడానికి వచ్చారు. అతను నన్ను బెడ్‌రూంలోకి వెళ్లమన్నాడు, కానీ వాళ్ల మాటలు నాకు వినిపించాయి. క్లబ్‌ యజమాని నన్ను వాళ్లకు అమ్మడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. వాళ్లు నన్ను సరుకులు రవాణా చేసే ఓడలో ఎక్కించి రహస్యంగా జపాన్‌కి తీసుకెళ్లి అక్కడ ఒక బార్‌లో పనిచేయించాలని మాట్లాడుకుంటున్నారు. నాకు చాలా భయమేసింది, దాంతో బాల్కనీ నుండి దూకి పారిపోయాను.

ఏదో పనిమీద సిడ్నీకి వచ్చిన ఒకతను కనిపించడంతో, కొన్ని డబ్బులు ఇస్తాడేమో అని నా పరిస్థితి గురించి అతనికి చెప్పాను. అప్పుడతను తాను ఉంటున్న చోటికి వచ్చి, స్నానం చేసి, కాస్త భోంచేయమని చెప్పాడు. పరిస్థితులు ఎలా మలుపు తిరిగాయంటే, నేను అక్కడే ఉండిపోయాను. చివరికి ఒక సంవత్సరం తర్వాత మేము పెళ్లిచేసుకున్నాం.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ...

నేను యెహోవాసాక్షుల దగ్గర స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాక నాలో రకరకాల భావోద్వేగాలు కలిగాయి. చెడుకి కారణం సాతాను అని తెలుసుకున్నప్పుడు నాకు కోపం వచ్చింది; ఎందుకంటే అప్పటివరకు అందరూ దేవుడే మనకు కష్టాలు పెడుతున్నాడని చెప్పేవాళ్లు. దేవుడు మనుషుల్ని నరకంలో వేసి శిక్షించడని తెలుసుకున్నప్పుడు చాలా ఉపశమనంగా అనిపించింది. ఎందుకంటే ఆ బోధ వల్ల నేను జీవితమంతా భయంతో బ్రతికాను.

యెహోవాసాక్షులు ప్రతీ నిర్ణయాన్ని బైబిలు ప్రకారం తీసుకుంటారు, ఆ విషయం నన్ను బాగా ఆకట్టుకుంది. వాళ్లు తమ విశ్వాసాన్ని మాటల్లోనే కాదు చేతల్లో చూపిస్తారు. నేను ఏ విషయమైనా వెంటనే ఒప్పుకునే మనిషిని కాదు. కానీ యెహోవాసాక్షులు నేను ఏమన్నా, ఏంచేసినా నాతో ప్రేమగా, గౌరవంగా నడుచుకునేవాళ్లు.

నాకున్న అతిపెద్ద సమస్య ఏంటంటే, నేను ఎందుకూ పనికిరానిదాన్నని నాకెప్పుడూ అనిపించేది. నన్ను నేను అసహ్యించుకునేదాన్ని. యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా చాలాకాలం అలాగే అనిపించింది. నాకు యెహోవా మీద ప్రేమ ఉందని తెలుసు, కానీ నాలాంటి దాన్ని ఆయన ఎప్పటికీ ప్రేమించలేడని బలంగా నమ్మేదాన్ని.

నేను బాప్తిస్మం తీసుకున్న 15 సంవత్సరాల తర్వాత, ఒక సంఘటన వల్ల నా ఆలోచన పూర్తిగా మారిపోయింది. యెహోవాసాక్షుల రాజ్యమందిరంలో ఒక సహోదరుడు ప్రసంగం ఇస్తున్నప్పుడు యాకోబు 1:23, 24 గురించి చెప్పాడు. ఆ వచనాలు దేవుని వాక్యాన్ని అద్దంతో పోలుస్తున్నాయి; ఆ అద్దంతో, యెహోవా మనల్ని ఎలా చూస్తున్నాడో మనల్ని మనం అలాగే చూసుకోవచ్చు. నన్ను నేను యెహోవా చూసినట్టే చూసుకుంటున్నానా అని నాకనిపించింది. మొదట్లో ఆ ఆలోచనకు నా మనసులో చోటివ్వలేదు. ఎందుకంటే, నాలాంటి దాన్ని యెహోవా ప్రేమించాలని కోరుకోవడం అత్యాశ అనిపించింది.

కొన్నిరోజుల తర్వాత, నేను చదివిన ఒక లేఖనం నా జీవితాన్ని మార్చేసింది. అది యెషయా 1:18. అక్కడ యెహోవా ఇలా అంటున్నాడు: “రండి, మన మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించుకుందాం ... మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా మంచు అంత తెల్లగా అవుతాయి.” అది చదివినప్పుడు యెహోవా నాతో, “విక్కీ, రా, మన మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించుకుందాం. నాకు నువ్వు తెలుసు, నీ పాపాలు తెలుసు, నీ హృదయం తెలుసు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని అంటున్నట్టు అనిపించింది.

ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. ఇంకా, యెహోవా నన్ను ప్రేమించలేడు అనే అనిపించింది. కానీ నేను యేసు విమోచన క్రయధనం గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఉన్నట్టుండి నాకు ఇలా అనిపించింది: యెహోవా ఎంతోకాలంగా నా పట్ల ఓర్పు చూపిస్తూ, నన్ను ప్రేమిస్తున్నానని ఎన్నో విధాల్లో చూపించాడు. నేను మాత్రం ఆయనతో, “నీ ప్రేమ నన్ను చేరుకునేంత గొప్పది కాదు. నా పాపాలు కప్పడానికి నీ కుమారుని బలి సరిపోదు” అంటూ ఉన్నాను. ఒకరకంగా నేను విమోచనా క్రయధనాన్ని తిరిగి యెహోవాకే ఇచ్చేస్తూ ఉన్నాను. చివరికి అప్పుడు, విమోచన క్రయధనం అనే బహుమతి గురించి ఆలోచించడం వల్ల యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకోగలిగాను.

నేనెలా ప్రయోజనం పొందానంటే ...

నేను సంతోషంగా, పవిత్రంగా ఉన్నాను. నా వివాహ జీవితం మెరుగైంది, నా అనుభవాలు చెప్పి ఇతరులకు సహాయం చేయగలుగుతున్నాను. అది నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. నేను అంతకంతకూ యెహోవాకు దగ్గరౌతున్నానని నాకనిపిస్తుంది.

“అది నా ప్రార్థనకు జవాబు.”—సెర్గె బొటాన్కిన్‌

 • పుట్టిన సంవత్సరం: 1974

 • దేశం: రష్యా

 • ఒకప్పుడు: హెవీ-మెటల్‌ సంగీతాన్ని ఇష్టపడేవాణ్ణి

నా గతం:

నేను పయోటర్‌ ఇలిచ్‌ చైకావ్‌స్కె అనే ప్రఖ్యాత సంగీతకారుడు పుట్టిన వోట్కిన్‌స్క్‌లో పుట్టాను. మాది చాలా పేద కుటుంబం. నాన్న మంచివాడే కానీ తాగుబోతు, దానివల్ల ఇంట్లో ఎప్పుడూ భయంభయంగా ఉండేది.

నేను బాగా చదివేవాణ్ణి కాదు. ఏళ్లు గడుస్తుండగా, నేను ఎందుకూ పనికిరానివాణ్ణి అని, మిగతావాళ్లలా మంచిగా ఉండలేనని అనిపించేది. దానివల్ల ఇతరులకు దూరంగా ఉండేవాణ్ణి, ఎవ్వర్నీ నమ్మేవాణ్ణి కాదు. స్కూల్‌కి వెళ్లాలంటే ప్రాణం మీదికి వచ్చినట్టు అనిపించేది. ఉదాహరణకు, స్కూల్‌లో ఏదైనా రిపోర్టు చెప్పాల్సి వస్తే, వేరే సమయాల్లో చెప్పగలిగే ప్రాథమిక విషయాల్ని కూడా వివరించలేకపోయేవాణ్ణి. ఎనిమిదో తరగతి పాస్‌ అయినప్పుడు, నా రిపోర్టు కార్డు మీద ఇలా రాశారు: “కొన్ని పదాలే తెలుసు, ఆలోచనల్ని బయటికి చెప్పడం రాదు.” ఆ మాటలు నన్ను చాలా కృంగదీశాయి, నేను పనికిరానివాణ్ణి అని ఇంకా ఎక్కువగా అనిపించేది. అసలు నా జీవితానికి అర్థం ఏంటి అని ఆలోచించడం మొదలుపెట్టాను.

నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు తాగడం అలవాటు చేసుకున్నాను. మొదట్లో, తాగుతుంటే సరదాగా ఉండేది. కానీ ఎక్కువ తాగినప్పుడు, తప్పు చేస్తున్నానని అనిపించేది. నా జీవితానికి అర్థమే లేదనిపించింది. విపరీతంగా కృంగిపోవడం వల్ల ఒక్కోసారి రోజుల తరబడి బయటికి రాకుండా ఇంట్లోనే ఉండిపోయేవాణ్ణి. చనిపోవాలని కూడా అనుకున్నాను.

నాకు 20 ఏళ్లు వచ్చినప్పుడు ఒక విషయం నాకు కాస్త ఊరటనిచ్చింది, అదే హెవీ-మెటల్‌ సంగీతం. అది విన్నప్పుడు ఉత్సాహంగా అనిపించేది, దాంతో అలాంటి సంగీతం వినే ఇతరులతో సమయం గడిపేవాణ్ణి. జుట్టు పొడుగ్గా పెంచుకొని, చెవి పోగులు పెట్టుకొని, నేను అభిమానించే సంగీతకారుల్లా తయారయ్యే వాణ్ణి. ఎవ్వర్నీ లెక్కచేయకపోవడం, దూకుడుగా ప్రవర్తించడం, తరచూ కుటుంబ సభ్యులతో గొడవపడడం అలవాటైంది.

హెవీ-మెటల్‌ సంగీతం నాకు సంతోషాన్నిస్తుందని అనుకున్నాను, కానీ జరుగుతున్నది అది కాదు. నేను పూర్తిగా మారిపోతున్నాను! పైగా నా అభిమాన సంగీతకారుల గురించి చెడ్డ విషయాలు కూడా తెలిసే సరికి, నాకు ద్రోహం జరిగినట్టు అనిపించింది.

దాంతో, చనిపోవడం గురించి మళ్లీ ఆలోచించడం మొదలుపెట్టాను. ఈసారి ఇంకాస్త తీవ్రంగా దాని గురించి ఆలోచించాను. కానీ నేను చనిపోతే మా అమ్మ పరిస్థితి ఏంటి అనే ఒకేఒక్క ఆలోచన నన్ను ఆపింది. ఆమెకు నా మీద చాలా ప్రేమ, నా కోసం ఎంతో చేసింది. నాకేమో బ్రతకాలని లేదు, అలాగని చనిపోనూ లేను. నా పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది.

అలాంటి ఆలోచనల నుండి మనసును పక్కకు మళ్లించడానికి, క్లాసిక్‌ రష్యన్‌ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. నేను చదివిన ఒక కథలో హీరో చర్చిలో సేవ చేస్తుంటాడు. అప్పుడు నేను కూడా దేవుని కోసం, సాటి మనుషుల కోసం ఏమైనా చేయాలని బలంగా అనిపించింది. దాంతో, ప్రార్థన చేసి నా మనసులో ఉన్నదంతా దేవునికి చెప్పాను. అప్పటివరకు నేను ఎప్పుడూ అలా చేయలేదు. నా జీవితానికి ఒక అర్థం ఉండాలంటే ఏం చేయాలో చూపించమని దేవుణ్ణి అడిగాను. అలా ప్రార్థిస్తున్నప్పుడు నా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ తర్వాత జరిగిన విషయం ఇంకా ఆశ్చర్యంగా అనిపించింది. కేవలం రెండు గంటల తర్వాత, ఒక యెహోవాసాక్షి మా ఇంటి తలుపు తట్టి, బైబిల్‌ స్టడీ తీసుకుంటారా అని అడిగింది. అది నా ప్రార్థనకు జవాబు అని నేను నమ్ముతున్నాను. సంతోషంతో నిండిన నా కొత్త జీవితానికి అది తొలి రోజు.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ...

చాలా కష్టమనిపించినా, హెవీ-మెటల్‌ సంగీతంతో సంబంధం ఉన్న ప్రతీదాన్ని పారేశాను. కానీ ఆ సంగీతం నా మనసులో నుండి మాత్రం అంత త్వరగా వెళ్లిపోలేదు. ఆ సంగీతం వాయించే చోటు పక్కగా వెళ్లిన ప్రతీసారి, వెంటనే పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చేవి. అప్పుడప్పుడే నా మనసులో, హృదయంలో నాటుకుంటున్న మంచివాటితో ఆ చేదు జ్ఞాపకాల్ని కలపడం నాకు ఇష్టంలేదు. అందుకే అలాంటి చోట్లకు దూరంగా ఉండేవాణ్ణి. పాత జీవితం గురించి ఆలోచించాలని అనిపించిన ప్రతీసారి, పట్టుదలగా దేవునికి ప్రార్థించేవాణ్ణి. అప్పుడు “మానవ అవగాహనకు మించిన దేవుని శాంతి” నాకు తోడుగా ఉండేది.—ఫిలిప్పీయులు 4:7.

బైబిలు స్టడీ తీసుకుంటున్నప్పుడు, క్రైస్తవులు తమ విశ్వాసం గురించి తప్పకుండా ఇతరులతో మాట్లాడాలని నేర్చుకున్నాను. (మత్తయి 28:19, 20) నేను ఎప్పటికీ అలా చేయలేనని నా నమ్మకం. అయితే కొత్తగా నేర్చుకుంటున్న విషయాలు నాకు ఎంతో సంతోషాన్ని, మనశ్శాంతిని ఇచ్చేవి. అంత మంచి సత్యాలను ఇతరులు కూడా నేర్చుకోవాలని నాకు అనిపించేది. కాబట్టి లోపల భయంగానే ఉన్నా, నేర్చుకుంటున్న వాటి గురించి ఇతరులతో చెప్పడం మొదలుపెట్టాను. ఆశ్చర్యం ఏంటంటే, అలా బైబిలు గురించి వేరేవాళ్లకు చెప్పడం వల్ల నా ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ కొత్త నమ్మకాల పట్ల నాకున్న విశ్వాసం కూడా బలపడింది.

నేనెలా ప్రయోజనం పొందానంటే ...

ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్నాను. అంతేకాదు, బైబిల్లోని విషయాలు నేర్చుకోవడానికి కొంతమందికి సహాయం చేశాను. అందులో మా చెల్లి, అమ్మ కూడా ఉన్నారు. దేవుని సేవ చేయడం, ఆయన గురించి తెలుసుకునేలా ఇతరులకు సహాయం చేయడం వల్ల ఇప్పుడు నా జీవితానికి ఒక నిజమైన అర్థం ఏర్పడింది.