కంటెంట్‌కు వెళ్లు

బైబిలు జీవితాల్ని మారుస్తుంది

బైబిలు ఇచ్చే స్పష్టమైన, సరైన జవాబులు నాకు నచ్చాయి

బైబిలు ఇచ్చే స్పష్టమైన, సరైన జవాబులు నాకు నచ్చాయి
  • పుట్టిన సంవత్సరం: 1948

  • దేశం: హంగేరి

  • ఒకప్పుడు: జీవితం గురించిన ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలని తపించాడు

నా గతం

నేను హంగేరిలోని జెకెస్‌ఫెహర్వార్‌ అనే నగరంలో పుట్టాను. దానికి 1,000 కంటే ఎక్కువ సంవత్సరాల గొప్ప చరిత్ర ఉంది. కానీ విచారకరంగా, రెండో ప్రపంచ యుద్ధం ఆ నగరంలో చేదు జ్ఞాపకాల్ని మిగల్చడం నాకు ఇంకా గుర్తుంది.

నేను చిన్నప్పుడు అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగాను. అక్కడ నాకు మంచి జ్ఞాపకాలు ఉన్నాయి, ముఖ్యంగా మా అమ్మమ్మ ఎలిసబెత్‌తో నాకు మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. ఆమె వల్లే నాకు దేవుని మీద బలమైన విశ్వాసం కలిగింది. నాకు మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుండి, ప్రతీరోజు సాయంత్రం ప్రభువు ప్రార్థన అని పిలిచే ప్రార్థనను ఆమెతో కలిసి చేసేవాణ్ణి. అయినా, దాదాపు 30 ఏళ్లు వచ్చే వరకు నాకు ఆ ప్రార్థన అర్థమేంటో తెలీదు.

నేను నా చిన్నప్పుడు అమ్మమ్మ, తాతయ్యల దగ్గర ఎందుకు పెరిగానంటే, మా అమ్మానాన్నలకు సొంత ఇల్లు కొనుక్కోవాలనే కల ఉండేది. వాళ్లు దానికోసం రాత్రింబగళ్లు కష్టపడి పనిచేసి డబ్బులు దాచేవాళ్లు, వాళ్లకు అస్సలు తీరిక ఉండేది కాదు. అయినా, మేము నెలలో రెండుసార్లు కుటుంబమంతా కలుసుకుని భోంచేసేవాళ్లం. మేము కలిసి గడిపిన ఆ క్షణాలు నాకు ఎంతో ఇష్టం.

1958 లో, మా అమ్మానాన్నల కల నిజమైంది. వాళ్లు ఒక ఇల్లు కొన్నారు. మొత్తానికి, నేను మా అమ్మానాన్నలతో కలిసివుండే అవకాశం దొరికింది. అది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది! కానీ, ఆ సంతోషం ఎక్కువకాలం లేదు. ఎందుకంటే, ఆరు నెలల తర్వాత మా నాన్న క్యాన్సర్‌తో చనిపోయాడు.

నేను కుప్పకూలిపోయాను. “దేవుడా, మా నాన్నను కాపాడమని నిన్ను అడిగాను కదా. నాకు ఆయన కావాలి. నువ్వు నా ప్రార్థనలకు ఎందుకు జవాబివ్వలేదు?” అని ప్రార్థించడం నాకింకా గుర్తుంది. మా నాన్న ఎక్కడున్నాడో తెలుసుకోవాలని నేను బలంగా కోరుకున్నాను. ‘ఆయన పరలోకానికి వెళ్లాడా? లేదా అసలు ఇక ఎప్పటికీ కనిపించడా?’ అనే ప్రశ్నల గురించి ఆలోచించాను. వేరే పిల్లల్ని వాళ్ల నాన్నలతో చూస్తుంటే నాకు అసూయగా ఉండేది.

దాదాపు ప్రతీరోజు, నేను మా నాన్న సమాధి దగ్గరికి వెళ్లేవాణ్ణి. అలా చాలా సంవత్సరాలపాటు వెళ్తూనే ఉన్నాను. ఆ సమాధి దగ్గర మోకాళ్లమీద కూర్చుని ఇలా ప్రార్థించేవాణ్ణి: “దేవుడా, నాకు మా నాన్న ఎక్కడున్నాడో తెలుసుకోవాలని ఉంది. దయచేసి నాకు సహాయం చేయి.” ఇంకా, జీవితానికి అర్థమేంటో తెలుసుకోవడానికి సహాయం చేయమని కూడా నేను ప్రార్థించాను.

నేను 13 ఏళ్ల వయసులో, జర్మన్‌ భాష నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. జర్మన్‌ భాషలో చాలా పుస్తకాలు ఉన్నాయి కాబట్టి, బహుశా వాటిలో నా ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయని అనుకున్నాను. 1967 లో, అప్పటి తూర్పు జర్మనీలో ఉన్న జీనా అనే నగరంలో నేను అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. నేను జర్మన్‌ తత్వవేత్తలు రాసిన పుస్తకాల్ని, మరిముఖ్యంగా మనిషి జీవితం గురించి రాసిన పుస్తకాల్ని ఆసక్తితో చదివేవాణ్ణి. వాటిలో నేను కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నప్పటికీ, అవి నా ప్రశ్నలకు మాత్రం పూర్తిగా జవాబివ్వలేదు. నేను జవాబుల కోసం ప్రార్థిస్తూనే ఉన్నాను.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ...

1970 లో నేను తిరిగి హంగేరికి వచ్చేశాను. అక్కడ నేను రోస్‌ని కలిశాను. అప్పట్లో హంగేరి, కమ్యూనిస్టు పాలన కింద ఉండేది. నేను రోస్‌ని పెళ్లి చేసుకున్న కొంతకాలానికే మేమిద్దరం ఆస్ట్రియాకు వెళ్లిపోయాం. ఎలాగైనా ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చేరుకోవాలన్నది మా ఉద్దేశం. అక్కడ మా మామయ్య ఉండేవాడు.

నాకు ఆస్ట్రియాలో త్వరగానే ఉద్యోగం దొరికింది. ఒకరోజు నా తోటి ఉద్యోగి, నాకున్న ప్రశ్నలన్నిటికీ బైబిల్లో జవాబు తెలుసుకోవచ్చని చెప్పాడు. బైబిలు గురించి చర్చించే రెండు పుస్తకాల్ని ఆయన నాకు ఇచ్చాడు. నేను ఆ పుస్తకాల్ని త్వరత్వరగా చదివేశాను. అంతేకాదు, ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని కోరుకున్నాను. కాబట్టి ఆ పుస్తకాల్ని ప్రచురించిన యెహోవాసాక్షులకు ఉత్తరం రాసి, ఇంకొన్ని పుస్తకాల్ని పంపించమని అడిగాను.

సరిగ్గా మాకు పెళ్లయిన సంవత్సరానికి, అంటే మా మొదటి పెళ్లిరోజున ఆస్ట్రియాకు చెందిన ఒక యువ సహోదరుడు నన్నూ, రోస్‌ని కలవడానికి వచ్చాడు. నేను అడిగిన పుస్తకాల్ని సంస్థ ఆయనతో పంపించింది. ఆయన నాకు ఆ పుస్తకాల్ని ఇచ్చి, బైబిలు స్టడీ తీసుకుంటారా అని అడిగాడు. నేను దానికి ఒప్పుకున్నాను. నాకు చాలా ఆసక్తి ఉండేది కాబట్టి నేనూ, రోస్‌ వారానికి రెండుసార్లు స్టడీ తీసుకునేవాళ్లం. దాదాపు నాలుగు గంటలపాటు మా స్టడీ సాగేది!

యెహోవాసాక్షులు బైబిల్లో నుండి నాకు నేర్పించిన విషయాల్ని బట్టి చాలా ఆశ్చర్యమేసింది. వాళ్లు స్వయంగా నా హంగేరియన్‌ బైబిల్లోనే దేవుని పేరు యెహోవా అని చూపించినప్పుడు నమ్మలేకపోయాను. నేను 27 సంవత్సరాల నుండి చర్చీకి వెళ్తున్నా, దేవుని పేరు యెహోవా అని ఒక్కసారి కూడా వినలేదు. నా ప్రశ్నలకు బైబిలు ఇచ్చే స్పష్టమైన, సరైన జవాబులు నాకు నచ్చాయి. ఉదాహరణకు, చనిపోయినవాళ్లకు ఏమీ తెలీదని, వాళ్లు గాఢనిద్రలో ఉంటారని నేను తెలుసుకున్నాను. (ప్రసంగి 9:5, 10; యోహాను 11:11-15) ‘మరణం ఇక ఉండని’ కొత్తలోకం గురించి బైబిలు మాటిస్తున్న విషయాన్ని కూడా తెలుసుకున్నాను. (ప్రకటన 21:3, 4) ఆ కొత్తలోకంలో, చనిపోయినవాళ్లు ‘తిరిగి బ్రతికినప్పుడు,’ నేను మా నాన్నను కలుసుకోవచ్చనే ఆశతో ఉన్నాను.​—అపొస్తలుల కార్యాలు 24:15.

బైబిలు స్టడీ తీసుకునేటప్పుడు, రోస్‌ కూడా చాలా ఆసక్తిగా కూర్చునేది. మేము చాలా త్వరగా ప్రగతి సాధించాం, కేవలం రెండు నెలల్లోనే బైబిలు స్టడీ పుస్తకాన్ని పూర్తిచేసేశాం! యెహోవాసాక్షుల రాజ్యమందిరంలో జరిగే ప్రతీ కూటానికి మేము హాజరయ్యాం. యెహోవాసాక్షుల మధ్యవున్న ప్రేమ, సహాయం చేసుకునే గుణం, ఐక్యత మా మనసును తాకాయి.​—యోహాను 13:34, 35.

1976 లో నేనూ, రోస్‌ ఆస్ట్రేలియాకి వెళ్లాం. అక్కడికి వెళ్లగానే, యెహోవాసాక్షులు ఎక్కడున్నారో తెలుసుకున్నాం. వాళ్లు మమ్మల్ని ప్రేమగా ఆహ్వానించారు. 1978 లో బాప్తిస్మం తీసుకుని మేము యెహోవాసాక్షులమయ్యాం.

నేనెలా ప్రయోజనం పొందానంటే ...

నన్ను ఎంతోకాలంగా వేధిస్తున్న ప్రశ్నలకు చివరికి జవాబులు తెలుసుకోగలిగాను. నేను ఒక గొప్ప తండ్రికి, అంటే యెహోవా దేవునికి దగ్గరయ్యాను. (యాకోబు 4:8) అంతేకాదు, రాబోయే కొత్తలోకంలో మా నాన్నను తిరిగి కలుసుకుంటాను అనే ఆశతో జీవిస్తున్నాను. అది నాకెంతో ఊరటనిస్తుంది.​—యోహాను 5:28, 29.

1989 లో మా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, అలాగే ఇతరులతో మా నమ్మకాల్ని పంచుకోవాలనే ఉద్దేశంతో నేనూ, రోస్‌ హంగేరికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. వందలమంది ప్రజలకు బైబిలు గురించి బోధించే గొప్ప అవకాశం మాకు దొరికింది. వాళ్లలో 70 కంటే ఎక్కువమంది యెహోవాసాక్షులయ్యారు, వాళ్లలో నా ప్రియాతిప్రియమైన అమ్మ కూడా ఉంది.

17 ఏళ్లపాటు, నా ప్రశ్నలకు జవాబు తెలుసుకునేలా సహాయం చేయమని నేను ప్రార్థించాను. మరో 39 ఏళ్లు గడిచాయి. నేను ఇప్పటికీ ప్రార్థిస్తున్నాను, కాకపోతే ఇలా ప్రార్థిస్తున్నాను: “నా ప్రియ పరలోక తండ్రీ, నా చిన్నప్పటి ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు థ్యాంక్యూ.”