కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం వేటి గురించి ప్రార్థించాలి?

మనం వేటి గురించి ప్రార్థించాలి?

యేసు నేర్పించిన మాదిరి ప్రార్థనను, క్రైస్తవులు చాలా ఎక్కువగా చేసే ప్రార్థన అంటారు. దాన్ని “ప్రభువు ప్రార్థన” లేదా “పరలోక ప్రార్థన” అని కూడా పిలుస్తారు. అది ఎక్కువమంది చేసే ప్రార్థన అయినా కాకపోయినా, అది ఎక్కువమంది తప్పుగా అర్థం చేసుకున్న ప్రార్థన అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. కోట్లమంది కనీసం దాని అర్థం కూడా తెలియకుండా ప్రతీరోజు లేదా రోజుకు చాలాసార్లు దాన్ని వల్లెవేస్తుంటారు. కానీ ప్రజలు ఆ ప్రార్థనను అలా ఉపయోగించాలని యేసు ఎప్పుడూ అనుకోలేదు. ఆ విషయం మనకెలా తెలుసు?

ఆ ప్రార్థన చెప్పడానికి కాస్త ముందు యేసు, “నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ... చెప్పిన మాటలే మళ్లీమళ్లీ చెప్పకు” అన్నాడు. (మత్తయి 6:7) అలాంటప్పుడు, ప్రజలు కంఠస్తం చేసి మళ్లీమళ్లీ చెప్పాలనే ఉద్దేశంతో ఆయన ఒక ప్రార్థన ఇస్తాడా? ఖచ్చితంగా అలా చేయడు! బదులుగా యేసు మనం వేటి గురించి ప్రార్థించాలో నేర్పిస్తున్నాడు, ప్రార్థిస్తున్నప్పుడు ఏ విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వాలో స్పష్టంగా చెప్తున్నాడు. ఇంతకీ యేసు ఏమి చెప్పాడో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఆ ప్రార్థన మత్తయి 6:9-13 లో ఉంది.

“ పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు పవిత్రపర్చబడాలి.”

ఆ మాటల ద్వారా యేసు, తన అనుచరులు ఎల్లప్పుడూ తన తండ్రైన యెహోవాకే ప్రార్థించాలని గుర్తుచేస్తున్నాడు. మరి దేవుని పేరు ఎందుకు అంత ముఖ్యమైనదో, అది ఎందుకు పవిత్రపర్చబడాలో మీకు తెలుసా?

భూమ్మీద మనుషులు జీవించడం మొదలైన కాలం నుండి దేవుని పవిత్రమైన పేరు మీద ఎన్నో నిందలు పడుతున్నాయి. యెహోవా అబద్ధాలు చెప్తాడని, స్వార్థపరుడైన పరిపాలకుడని, తన సృష్టి ప్రాణుల్ని పరిపాలించే హక్కు ఆయనకు లేదని దేవుని శత్రువైన సాతాను నిందించాడు. (ఆదికాండం 3:1-6) చాలామంది సాతాను మాటలకు ఒప్పుకుంటూ, దేవునికి హృదయమే లేదని, ఆయన క్రూరుడని, పగతీర్చుకునే స్వభావం గలవాడని, లేదా అసలు సృష్టికర్తే లేడని బోధిస్తున్నారు. కొంతమంది నేరుగా ఆయన పేరు మీద దాడిచేశారు, బైబిలు అనువాదాల్లో నుండి యెహోవా అనే పేరును తీసేసి, దాన్ని ఉపయోగించకూడదని అంటున్నారు.

ఇలాంటి అన్యాయాలన్నిటినీ దేవుడు సరిచేస్తాడని బైబిలు చెప్తుంది. (యెహెజ్కేలు 39:7) అలా చేసినప్పుడు ఆయన మీ అవసరాలన్నిటినీ, సమస్యలన్నిటినీ కూడా తీరుస్తాడు. అదెలా? యేసు చేసిన ప్రార్థనలోని తర్వాతి మాటల్లో దానికి జవాబు ఉంది.

“నీ రాజ్యం రావాలి.”

ఈ రోజుల్లో, దేవుని రాజ్యం గురించి మత బోధకుల్లో చాలా అయోమయం ఉంది. అయితే, దేవుడు ఎంపిక చేసిన రక్షకుడు లేదా మెస్సీయ ప్రపంచాన్ని మార్చేసే ఒక రాజ్యాన్ని పరిపాలిస్తాడని యేసు శ్రోతలకు తెలుసు, దేవుని ప్రవక్తలు చాలాకాలం క్రితమే దాని గురించి చెప్పారు. (యెషయా 9:6, 7; దానియేలు 2:44) ఆ రాజ్యం సాతాను అబద్ధాల్ని బయటపెట్టడం ద్వారా, సాతానునూ అతడి క్రియల్ని నాశనం చేయడం ద్వారా దేవుని పేరును పవిత్రపరుస్తుంది. దేవుని రాజ్యం యుద్ధాల్ని, రోగాల్ని, కరువుల్ని, చివరికి మరణాన్ని కూడా పూర్తిగా తీసేస్తుంది. (కీర్తన 46:9; 72:12-16; యెషయా 25:8; 33:24) దేవుని రాజ్యం రావాలని మీరు ప్రార్థిస్తున్నప్పుడు ఆ వాగ్దానాలన్నీ నిజమవ్వాలని మీరు ప్రార్థిస్తున్నారు.

“నీ ఇష్టం పరలోకంలోలాగే భూమ్మీద కూడా నెరవేరాలి.”

దేవుడు నివసించే పరలోకంలో దేవుని ఇష్టం ఎలాగైతే నెరవేరుతుందో భూమ్మీద కూడా అది అంతే ఖచ్చితంగా నెరవేరుతుందని యేసు మాటలు చూపిస్తున్నాయి. పరలోకంలో దేవుని ఇష్టం జరగకుండా ఎవ్వరూ ఆపలేకపోయారు; దేవుని కుమారుడు సాతానుతో, అతడి దయ్యాలతో యుద్ధం చేసి వాళ్లను భూమ్మీదికి పడేశాడు. (ప్రకటన 12:9-12) మాదిరి ప్రార్థనలోని మొదటి రెండు విన్నపాల లాగే మూడో విన్నపం కూడా అన్నిటికన్నా ప్రాముఖ్యమైన దానిమీద, అంటే దేవుని ఇష్టం మీద దృష్టిపెట్టడానికి మనకు సహాయం చేస్తుంది. అది మన సొంత ఇష్టం కన్నా ఎంతో ముఖ్యం. ఎందుకంటే, దేవుని ఇష్టం మాత్రమే సృష్టి అంతటికీ ఎల్లప్పుడూ సాటిలేని మంచిని చేస్తుంది. అందుకే పరిపూర్ణ మనిషి యేసు తన తండ్రితో ఇలా అన్నాడు: “నా ఇష్టప్రకారం కాదు, నీ ఇష్టప్రకారమే జరగాలి.”—లూకా 22:42.

“మాకు ఈ రోజుకు అవసరమైన ఆహారం ఇవ్వు.”

ఆ తర్వాత యేసు, మనం మన సొంత అవసరాల గురించి కూడా ప్రార్థించవచ్చని చెప్పాడు. మనకు ప్రతీరోజు కావల్సినవాటి గురించి దేవునికి ప్రార్థించడంలో తప్పేం లేదు. అలా అడగడం నిజానికి యెహోవాయే “అందరికీ ప్రాణాన్ని, ఊపిరిని, అన్నిటినీ ఇస్తున్నాడు” అనే విషయాన్ని మనకు గుర్తుచేస్తుంది. (అపొస్తలుల కార్యాలు 17:25) ఆయన తన పిల్లలకు అవసరమైనవి ఇవ్వడంలో సంతోషించే ప్రేమగల తండ్రి అని బైబిలు చెప్తుంది. అయితే, ఒక మంచి తండ్రిలా ఆయన తన పిల్లలకు ఉపయోగపడని వాటిని ఇవ్వడు.

“మా అప్పులు ... క్షమించు.”

మీరు నిజంగా దేవునికి అప్పు ఉన్నారా? ఆయన క్షమాపణ మీకు అవసరమేనా? ఈ రోజుల్లో చాలామందికి పాపం అంటే ఏమిటో, అది ఎంత గంభీరమైనదో అర్థం కావట్లేదు. మనం అనుభవించే అత్యంత ఘోరమైన సమస్యలకు, చివరికి మనుషులు చనిపోవడానికి కూడా అసలు కారణం పాపమే అని బైబిలు బోధిస్తుంది. మనం పాపులుగా పుట్టాం కాబట్టి తరచూ పాపాలు చేస్తుంటాం; దేవుని క్షమాపణ ఉంటేనే మనం శాశ్వతమైన భవిష్యత్తు పొందగలం. (రోమీయులు 3:23; 5:12; 6:23) కాబట్టి బైబిలు చెప్తున్న ఈ మాటలు మనకు ఉపశమనం ఇస్తాయి: “యెహోవా, నువ్వు మంచివాడివి, క్షమించడానికి సిద్ధంగా ఉంటావు.”—కీర్తన 86:5.

“దుష్టుని నుండి మమ్మల్ని కాపాడు.”

దేవుని కాపుదల మీకు ఎంత త్వరగా కావాలో, దానిమీద మీరు ఎంతగా ఆధారపడి ఉన్నారో గుర్తిస్తున్నారా? చాలామంది అసలు ‘దుష్టుడు’ లేదా సాతాను ఉన్నాడని కూడా నమ్మరు. కానీ యేసు సాతాను నిజంగా ఉన్నాడని బోధించాడు, అతడిని “ఈ లోక పరిపాలకుడు” అని కూడా పిలిచాడు. (యోహాను 12:31; 16:11) తన గుప్పిట్లో ఉన్న ఈ లోకాన్ని సాతాను పాడుచేశాడు, మిమ్మల్ని కూడా పాడుచేయాలని, మీ తండ్రైన యెహోవాతో దగ్గరి బంధం ఏర్పర్చుకోకుండా అడ్డుకోవాలని ఎంతో ప్రయత్నిస్తాడు. (1 పేతురు 5:8) అయితే యెహోవా సాతాను కన్నా ఎంతో శక్తిమంతుడు, తనను ప్రేమించేవాళ్లను కాపాడడం అంటే ఆయనకు ఎంతో ఇష్టం.

మనం మాదిరి ప్రార్థనలో చూసినవాటి గురించే కాకుండా ఇంకా చాలా విషయాల గురించి ప్రార్థించవచ్చు. 1 యోహాను 5:14 దేవుని గురించి ఇలా చెప్తుందని గుర్తుంచుకోండి, “మనం ఆయన ఇష్టానికి తగ్గట్టు ఏది అడిగినా ఆయన మన మనవి వింటాడు.” కాబట్టి, మీ సమస్యలు దేవునికి ప్రార్థనలో చెప్పుకునేంత ముఖ్యమైనవి కావని అనుకోకండి.—1 పేతురు 5:7.

మరి ప్రార్థించడానికి తగిన సమయం, స్థలం ఏవో ఎలా తెలుస్తుంది? మనం ఎప్పుడు, ఎక్కడ ప్రార్థిస్తాం అనేది అంత ముఖ్యమేనా?