కంటెంట్‌కు వెళ్లు

మీతో మాట్లాడవచ్చా?

దేవుడు బాధల్ని ఎందుకు తీసేయట్లేదు?

దేవుడు బాధల్ని ఎందుకు తీసేయట్లేదు?

యెహోవాసాక్షులకు, పొరుగువాళ్లకు సాధారణంగా జరిగే చర్చను ఈ ఆర్టికల్‌లో చూస్తాం. మేఘన అనే యెహోవాసాక్షి సోఫియా అనే స్త్రీ ఇంటికి వెళ్లిందని అనుకుందాం.

మనం బాధపడుతున్నప్పుడు దేవునికి ఎలా అనిపిస్తుంది?

మేఘన: హాయ్‌ సోఫియా. మిమ్మల్ని మళ్లీ కలవడం సంతోషంగా ఉంది.

సోఫియా: నాకు కూడా.

మేఘన: పోయినసారి, మనం బాధపడడం చూసినప్పుడు దేవునికి ఎలా అనిపిస్తుందో మాట్లాడుకున్నాం కదా. * ఆ ప్రశ్న గురించి మీరు చాలాకాలం ఆలోచించారని, ముఖ్యంగా మీ అమ్మకు ఆక్సిడెంట్‌ అయిన తర్వాత చాలా ఆలోచించారని చెప్పారు. తనకు ఇప్పుడెలా ఉంది?

సోఫియా: ఒక్కోరోజు బావుంటుంది, ఒక్కోరోజు బాగోదు. ఈ రోజు కాస్త ఫర్లేదు.

మేఘన: చాలా సంతోషం. ఇలాంటి పరిస్థితిలో ఆశ వదులుకోకుండా ధైర్యంగా ఉండడం చాలా కష్టం.

సోఫియా: నిజమే. ఒక్కోసారి, ఇలా తను ఇంకా ఎంతకాలం కష్టపడాలా అని బాధేస్తుంది.

మేఘన: అలా అనిపించడం మామూలే. అంతకుముందు కలిసినప్పుడు చివర్లో, ‘మన బాధల్ని తీసేసే శక్తి ఉన్నా దేవుడు వాటిని ఎందుకు తీసేయట్లేదు?’ అనే ప్రశ్న వేశాను కదా.

సోఫియా: అవును, గుర్తుంది.

మేఘన: దానికి బైబిలిచ్చే జవాబు తెలుసుకునే ముందు, పోయినసారి మాట్లాడుకున్న విషయాలు ఒకసారి గుర్తుచేసుకుందాం.

సోఫియా: సరే.

మేఘన: ముందుగా మనం, బైబిలు కాలాల్లో ఒక నమ్మకమైన సేవకుడు కూడా దేవుడు బాధలు ఎందుకు తీసేయట్లేదని అడిగాడని చూశాం. అయితే అలా అడిగినందుకు దేవుడు తిట్టలేదు, లేదా అతనికి ఇంకా బలమైన విశ్వాసం అవసరం అని కూడా చెప్పలేదు.

సోఫియా: అది నాకు చాలా కొత్తగా అనిపించింది.

మేఘన: మనం బాధపడుతుంటే చూడడం యెహోవా దేవునికి అస్సలు ఇష్టంలేదని కూడా నేర్చుకున్నాం. దేవుని ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు “ఆయన బాధ అనుభవించాడు” అని బైబిల్లో చూశాం. * మనం బాధపడుతున్నప్పుడు దేవుడు కూడా బాధపడతాడని తెలుసుకోవడం ఊరటగా లేదా?

సోఫియా: చాలా ఊరటగా ఉంది.

మేఘన: అలాగే, మన సృష్టికర్తకు అపారమైన శక్తి ఉంది కాబట్టి ఆయన కావాలనుకుంటే ఏ క్షణమైనా మన బాధలన్నీ పూర్తిగా తీసేయగలడని అనుకున్నాం.

సోఫియా: అదే నాకు అర్థం కావట్లేదు. దేవునికి అంత శక్తి ఉన్నప్పుడు, చెడ్డ విషయాలు జరగకుండా ఆయన ఎందుకు ఆపట్లేదు?

ఎవరు చెప్పింది నిజం?

మేఘన: ఆ ప్రశ్నకు జవాబు, బైబిల్లోని మొదటి పుస్తకమైన ఆదికాండంలో ఉంది. మీకు ఆదాము, హవ్వ గురించి, దేవుడు తినొద్దన్న పండు గురించి తెలుసు కదా?

సోఫియా: ఆ తెలుసు. మాకు సండే స్కూల్‌లో నేర్పించారు. దేవుడు ఒక చెట్టు పండు తినొద్దని చెప్పాడు, కానీ వాళ్లు తిన్నారు.

మేఘన: కరెక్ట్‌. ఇప్పుడు మనం ఆదాముహవ్వలు ఎందుకు ఆ పండు తిన్నారో చూద్దాం. అది తెలుసుకుంటే, మనం ఎందుకు బాధలు పడుతున్నామో కూడా తెలుస్తుంది. దయచేసి ఆదికాండం 3వ అధ్యాయం 1-5 వచనాలు చదువుతారా?

సోఫియా: చదువుతాను. “యెహోవా దేవుడు చేసిన అడవి జంతువులన్నిట్లో సర్పం అత్యంత యుక్తిగలది. కాబట్టి అది స్త్రీని, ‘ఈ తోటలో ఉన్న అన్ని చెట్ల పండ్లనూ మీరు తినకూడదని దేవుడు నిజంగా చెప్పాడా?’ అని అడిగింది. దానికి స్త్రీ ఆ సర్పంతో ఇలా అంది: ‘మేము ఈ తోటలోని చెట్ల పండ్లను తినొచ్చు. కానీ ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు పండ్ల గురించి దేవుడు, “మీరు దాని పండ్లను తినకూడదు, అసలు దాన్ని ముట్టకూడదు; లేకపోతే మీరు చనిపోతారు” అని చెప్పాడు.’ అందుకు సర్పం ఆ స్త్రీతో ఇలా అంది: ‘మీరు చావనే చావరు. మీరు దాని పండ్లను తిన్న రోజునే మీ కళ్లు తెరుచుకుంటాయని, మీకు మంచిచెడులు తెలిసి మీరు దేవునిలా అవుతారని దేవునికి తెలుసు.’ ”

మేఘన: థాంక్యూ. కాసేపు మనం ఈ వచనాల్ని అర్థం చేసుకుందాం. ముందుగా, హవ్వతో ఒక సర్పం మాట్లాడిందని గమనించండి. అలా సర్పం ద్వారా హవ్వతో మాట్లాడింది అపవాదియైన సాతాను అని బైబిల్లోని ఇంకో వచనం చూపిస్తుంది. * సాతాను హవ్వను, ఏదైనా చెట్టు పండు గురించి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడా అని అడిగాడు. ఆదాముహవ్వలు ఆ చెట్టు పండ్లు తింటే ఏమౌతుందని దేవుడు చెప్పాడు?

సోఫియా: వాళ్లు చనిపోతారు.

మేఘన: అవును. కానీ వెంటనే సాతాను అన్న మాటలు గమనించండి, “మీరు చావనే చావరు.” ఆ మాటలతో అతను దేవుని మీద పెద్ద నింద వేశాడు. అతను దేవుడు అబద్ధం చెప్పాడని అంటున్నాడు!

సోఫియా: నిజమే. కథలో ఈ విషయం గురించి నాకెవ్వరూ చెప్పలేదు.

మేఘన: దేవుడు అబద్ధం చెప్పాడని అనడం ద్వారా సాతాను ఒక ప్రశ్నను లేవదీశాడు. దానికి జవాబివ్వడానికి సమయం పడుతుంది. ఎందుకో అర్థమైందా?

సోఫియా: లేదు. అర్థం కాలేదు.

మేఘన: అయితే ఒక ఉదాహరణ చూద్దాం. ఒకరోజు నేను మీ దగ్గరికి వచ్చి, మీ కన్నా నాకు ఎక్కువ బలం ఉంది అన్నాను అనుకోండి. నేను చెప్పేది తప్పు అని మీరెలా రుజువు చేస్తారు?

సోఫియా: ఒక పరీక్ష పెడితే సరిపోతుంది.

మేఘన: కరెక్ట్‌. కాస్త బరువైన వస్తువును తీసుకుని, ఇద్దరిలో ఎవరు దాన్ని ఎత్తగలుగుతున్నారో చూడాలి. అలా, ఎవరికి ఎక్కువ బలం ఉందో వెంటనే తెలిసిపోతుంది.

సోఫియా: నాకు అర్థమైంది.

మేఘన: కానీ ఒకవేళ నేను, మీ కన్నా నేను ఎక్కువ నిజాయితీగా ఉంటాను అని అన్నాను అనుకోండి. దాన్ని వెంటనే రుజువు చేయలేం కదా, ఏమంటారు?

సోఫియా: మీరు అనేది నిజమే.

మేఘన: బలాన్ని రుజువు చేసినట్టు చిన్న పరీక్షతో నిజాయితీని వెంటనే రుజువు చేయలేం.

సోఫియా: అవును.

మేఘన: ఎవరు ఎక్కువ నిజాయితీగా ఉంటారో తేలాలంటే, కొంతకాలం పాటు మన ఇద్దర్నీ ఎవరైనా గమనించాలి.

సోఫియా: కరెక్టే.

మేఘన: ఇప్పుడు మనం ఆదికాండంలో చదివినదాని గురించి ఆలోచిద్దాం. సాతాను తనకు దేవునికన్నా ఎక్కువ శక్తి ఉందన్నాడా?

సోఫియా: లేదు.

మేఘన: అలా అనివుంటే దేవుడు వెంటనే అది తప్పని రుజువు చేసేవాడు. కానీ సాతాను తాను దేవుని కన్నా నిజాయితీపరుణ్ణి అన్నాడు. ఒకరకంగా అతను హవ్వతో ఇలా అన్నాడు, ‘దేవుడు మీకు అబద్ధం చెప్తున్నాడు, కానీ నేను మీకు నిజం చెప్తున్నాను.’

సోఫియా: నేను ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు.

మేఘన: దేవుడు తెలివిగలవాడు కాబట్టి, కొంతకాలం గడవనివ్వడమే సరైనదని అనుకున్నాడు. అలా చివరికి ఎవరు చెప్పింది నిజమో, ఎవరు అబద్ధం చెప్పారో తేలిపోతుంది.

ఒక ముఖ్యమైన సవాలు

సోఫియా: మరి హవ్వ చనిపోగానే, దేవుడు చెప్పిందే నిజమని తేలిపోయింది కదా?

మేఘన: ఒకరకంగా తేలిపోయింది. కానీ సాతాను ఇంకో మాట కూడా అన్నాడు. మనం 5వ వచనం ఇంకోసారి చూద్దామా, సాతాను హవ్వతో ఇంకా ఏమన్నాడో గమనించారా?

సోఫియా: ఆమె ఆ చెట్టు పండు తింటే, ఆమె కళ్లు తెరుచుకుంటాయి అని చెప్పాడు.

మేఘన: అవును, ఇంకా ఆమెకు ‘మంచిచెడులు తెలిసి దేవునిలా అవుతుందని’ కూడా అన్నాడు. అంటే, మనుషులకు మంచి చేసే దాన్ని దేవుడు వాళ్లకు దక్కకుండా చేస్తున్నాడని సాతాను అన్నాడు.

సోఫియా: అలాగా.

మేఘన: ఆ మాటల్లో ఒక పెద్ద సవాలు ఉంది.

సోఫియా: ఏంటది?

మేఘన: ఒకరకంగా సాతాను ఇలా అంటున్నాడు, ‘హవ్వ గానీ మిగతా మనుషులు గానీ బాగుండాలంటే వాళ్లకు దేవుని పరిపాలన అవసరం లేదు.’ నిజమేంటో తేలాలంటే, ఆ మాటల్ని రుజువు చేసుకునే అవకాశం సాతానుకు ఇవ్వాలని, అదే సరైన పరిష్కారమని యెహోవాకు తెలుసు. అందుకే దేవుడు కొంతకాలం సాతాను ఈ ప్రపంచాన్ని ఏలడానికి అనుమతించాడు. ఇప్పుడు మనం ఇన్ని బాధలు అనుభవించడానికి కారణం అదే, ఇప్పుడు లోకాన్ని ఏలుతున్నది దేవుడు కాదు సాతాను. * అయితే ఒక మంచి విషయం కూడా ఉంది.

సోఫియా: ఏంటది?

మేఘన: దేవుని గురించి బైబిలు రెండు విషయాలు చెప్తుంది, అవి మనకు చాలా సంతోషాన్నిస్తాయి. ఒకటి, మనం బాధల్లో ఉన్నప్పుడు దేవుడు మన గురించి పట్టించుకుంటాడు. ఉదాహరణకు, కీర్తన 31:7 లో దావీదు రాజు రాసిన మాటలు గమనించండి. దావీదు తన జీవితంలో చాలా కష్టాలు పడ్డాడు. కానీ అతను దేవునికి ప్రార్థిస్తూ ఏమంటున్నాడో చూడండి. కాస్త ఆ వచనం చదువుతారా?

సోఫియా: చదువుతాను. “నీ విశ్వసనీయ ప్రేమను బట్టి నేను ఎంతో ఉల్లసిస్తాను, ఎందుకంటే నువ్వు నా బాధల్ని చూశావు; నా తీవ్రమైన వేదన నీకు తెలుసు.”

మేఘన: దావీదుకు ఎన్నో కష్టాలు వచ్చినా, తాను పడే వేదనంతా యెహోవాకు తెలుసని గుర్తుంచుకోవడం వల్ల ఊరట పొందాడు. యెహోవాకు మన గురించి కూడా అన్నీ తెలుసు, చివరికి సాటి మనుషులు పూర్తిగా అర్థంచేసుకోలేని తీవ్రమైన వేదన కూడా తెలుసు. ఆ మాట మీకు ఓదార్పును ఇవ్వట్లేదా?

సోఫియా: ఖచ్చితంగా ఇస్తుంది.

మేఘన: రెండో విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ఎల్లకాలం కష్టాలు పడనివ్వడు. ఆయన త్వరలోనే సాతాను చెడ్డ పరిపాలనను తీసేస్తాడని బైబిలు చెప్తుంది. అంతేకాదు, చెడ్డ సంఘటనల వల్ల కలిగిన నష్టమంతటినీ, మీరూ మీ అమ్మ పడుతున్న కష్టాన్ని కూడా పూర్తిగా తీసేస్తాడు. దేవుడు త్వరలోనే బాధలన్నిటినీ ఖచ్చితంగా తీసేస్తాడని మనం ఎందుకు నమ్మవచ్చో వచ్చేవారం కలిసి మాట్లాడుకుందామా? *

సోఫియా: తప్పకుండా.

మీకు అర్థం కాని బైబిలు విషయాలు ఏమైనా ఉన్నాయా? యెహోవాసాక్షుల నమ్మకాల గురించి గానీ పద్ధతుల గురించి గానీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే యెహోవాసాక్షులతో మాట్లాడండి. వాళ్లు మీకు సంతోషంగా వివరిస్తారు.

^ కావలికోట జూలై 1, 2013 (ఇంగ్లీష్‌) సంచికలోని “A Conversation With a Neighbor​—Does God Care About Our Suffering?” ఆర్టికల్‌ చూడండి.

^ యెషయా 63:9 చూడండి.

^ ప్రకటన 12:9 చూడండి.

^ ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలో 9వ అధ్యాయం చూడండి.