కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు

ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు

మనం ఎందుకు ప్రార్థించాలి?

మనం ఎలాంటి సంకోచం లేకుండా ఎప్పుడంటే అప్పుడు మన సమస్యల గురించి తనతో మాట్లాడాలని యెహోవా దేవుడు కోరుతున్నాడు. (లూకా 18:1-7) దేవునికి మనమీద శ్రద్ధ ఉంది కాబట్టి మనం ప్రార్థించినప్పుడు ఆయన వింటాడు. తనకు ప్రార్థించమని మన పరలోక తండ్రే ఆప్యాయంగా కోరుతున్నప్పుడు, మనం ప్రార్థించకుండా ఎందుకు ఉండాలి?—ఫిలిప్పీయులు 4:6 చదవండి.

ప్రార్థన అంటే కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి సహాయం అడగడం మాత్రమే కాదు. ప్రార్థన మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది. (కీర్తన 8:3, 4) మన మనసులో ఉన్న విషయాల గురించి దేవునికి ఎప్పుడూ చెబుతూ ఉంటే ఆయనకు దగ్గరి స్నేహితులమౌతాం.—యాకోబు 4:8 చదవండి.

మనం ఎలా ప్రార్థించాలి?

మనం గొప్పగొప్ప పదాలతో ప్రార్థించాలని లేదా బట్టీపట్టిన ప్రార్థనలు చేయాలని దేవుడు కోరడం లేదు. ఫలానా విధంగా కూర్చునో, నిల్చునో ప్రార్థించాలని కూడా దేవుడు చెప్పట్లేదు. మన ప్రార్థనలు హృదయంలో నుండి రావాలని యెహోవా కోరుతున్నాడు. (మత్తయి 6:7) పూర్వం ఇశ్రాయేలులో హన్నా అనే స్త్రీ తనకు ఎంతో వేదన కలిగించిన ఒక కుటుంబ సమస్య గురించి ప్రార్థించింది. తర్వాత ఆ సమస్య తీరినప్పుడు సంతోషంగా నిండు హృదయంతో దేవునికి కృతజ్ఞతలు చెప్పింది.—1 సమూయేలు 1:10, 12, 13, 26, 27; 2:1 చదవండి.

ప్రార్థన నిజంగా ఒక గొప్ప వరం! ఎందుకంటే, మనసులో ఉన్నవన్నీ సృష్టికర్తకు చెప్పుకోవచ్చు. ఆయన మనకోసం చేస్తున్న వాటిని గురించి ఆయనను స్తుతించవచ్చు, ఆయనకు కృతజ్ఞతలు చెప్పవచ్చు. ఇంత గొప్ప అవకాశాన్ని మనం ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు.—కీర్తన 145:14-16 చదవండి. (w14-E 07/01)