ముఖపత్ర అంశం | ఎందుకు మంచివాళ్లకు ఈ కష్టాలు?
మంచివాళ్లకు చెడు జరుగుతోంది—ఎందుకు?
అన్నిటిని సృష్టించింది యెహోవా దేవుడే, a పైగా ఆయన సర్వశక్తిగలవాడు; అందుకే లోకంలో జరిగే వాటన్నిటికీ చివరకు చెడుకు కూడా ఆయనే కారణమని చాలామంది అనుకుంటారు. అయితే, నిజమైన దేవుని గురించి బైబిలు ఇలా చెబుతుంది:
-
“యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు.”—కీర్తన 145:17.
-
‘దేవుని చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషియై నమ్ముకోదగిన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.’—ద్వితీయోపదేశకాండము 32:4.
-
“ఆయన [“యెహోవా,” NW] ఎంతో జాలియు కనికరమును గలవాడు.”—యాకోబు 5:11.
దేవుడు చెడు పనులు చేయడు. అయితే, చెడు పనులు చేసేలా ఆయన ఇతరులను ప్రేరేపిస్తాడా? ఎప్పటికీ అలా చేయడు. బైబిలు ఇలా చెబుతుంది: “ఎవడైనను శోధింపబడినప్పుడు—నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు.” ఎందుకంటే, “దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు.” (యాకోబు 1:13) చెడు పనులు చేసేలా ప్రేరేపిస్తూ దేవుడు ఎవర్నీ శోధించడు లేదా పరీక్షించడు. దేవుడు చెడు పనులు చేయడు, చెడు పనులు చేసేలా ఇతరులను ప్రేరేపించడు. మరైతే, చెడుకు కారణం ఎవరు?
ప్రమాదం జరిగే సమయంలో మనం అక్కడ ఉండడం
బాధలకు ఒక కారణం, ‘కాలవశము చేత, అనూహ్యంగా’ జరిగే సంఘటనలు. వాటివల్ల మనమందరం బాధలు అనుభవించాల్సి వస్తుందని బైబిలు చెబుతుంది. (ప్రసంగి 9:11, NW) అనుకోకుండా ఏదైనా ప్రమాదంగానీ దుర్ఘటనగానీ జరిగినప్పుడు మనం దానికి గురౌతామా లేదా అనేది, ఆ సమయంలో మనం ఎక్కడున్నాం అనేదాని మీద ఆధారపడివుంటుంది. దాదాపు 2,000 సంవత్సరాల క్రితం, గోపురం కూలి 18 మంది చనిపోయిన సంఘటన గురించి యేసుక్రీస్తు మాట్లాడాడు. (లూకా 13:1-5) ఏదో తప్పు చేసినందువల్ల కాదుగానీ గోపురం కూలిపోయినప్పుడు దానికింద ఉన్నందువల్లే వాళ్లు చనిపోయారు. ఈమధ్యే, 2010 జనవరి నెలలో హయిటీలో భారీ భూకంపం వచ్చింది; దానివల్ల 3 లక్షల కన్నా ఎక్కువమంది చనిపోయారని అక్కడి ప్రభుత్వం తెలిపింది. అందులో చెడ్డవాళ్లు ఉన్నారు, మంచివాళ్లూ ఉన్నారు. అలాగే జబ్బులు కూడా ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు.
విపత్తుల నుండి దేవుడు మంచివాళ్లను ఎందుకు కాపాడడం లేదు?
‘అలాంటి విపత్తులను దేవుడు ఆపలేడా? వాటి నుండి మంచివాళ్లను కాపాడలేడా?’ అని కొంతమందికి అనిపిస్తుంది. అలా చేయాలంటే, అవి జరగబోతున్నట్లు దేవునికి ముందే తెలియాలి. మరి వాటి గురించి తెలుసుకునే శక్తి ఆయనకు లేదా? ఖచ్చితంగా ఉంది. అయితే మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, భవిష్యత్తును తెలుసుకునే సామర్థ్యాన్ని దేవుడు అన్నిసార్లూ ఉపయోగిస్తాడా?—యెషయా 42:9.
లేఖనాలు ఇలా చెబుతున్నాయి: ‘దేవుడు ఆకాశమందు ఉన్నాడు, ఆయన తనకు ఇచ్ఛ [ఇష్టం] వచ్చినట్లుగా సమస్తమును చేయుచున్నాడు.’ (కీర్తన 115:3) ఏది చేయడం అవసరమని తనకు అనిపిస్తుందో అదే యెహోవా చేస్తాడు కానీ తాను చేయగలిగిన ప్రతీది చేయడు. భవిష్యత్తును చూసే విషయంలో కూడా అంతే. ఒకప్పుడు, సొదొమ గొమొఱ్ఱా పట్టణాల్లో చెడుతనం వ్యాపించినప్పుడు దేవుడు అబ్రాహాముతో ఇలా అన్నాడు: “నేను దిగిపోయి నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను; చేయనియెడల నేను తెలిసికొందును.” (ఆదికాండము 18:20, 21) ఆ పట్టణాల్లో ఎంతగా చెడు జరుగుతోందో కొంతకాలం వరకు తెలుసుకోకూడదని దేవుడు అనుకున్నాడు. అలాగే, జరగబోయే ప్రతీదీ తెలుసుకోవాలని యెహోవా అనుకోకపోవచ్చు. (ఆదికాండము 22:12) అంటే, ఆయనలో ఏదో లోపం ఉందనో బలహీనత ఉందనో దానర్థం కాదు. “ఆయన కార్యము సంపూర్ణము” కాబట్టి భవిష్యత్తును చూసే తన సామర్థ్యాన్ని దేవుడు తన సంకల్పానికి తగినట్టు ఉపయోగిస్తాడు; ఇలాగే జీవించాలని ఆయన ఎన్నడూ మనుషులను బలవంతం చేయడు. b (ద్వితీయోపదేశకాండము 32:4) ఇదంతా ఏమి చెబుతుంది? భవిష్యత్తు చూసే తన సామర్థ్యాన్ని దేవుడు ఆచితూచి, అవసరం అనిపించినప్పుడే ఉపయోగిస్తాడు.
మంచివాళ్లను నేరాల బారి నుండి దేవుడు ఎందుకు కాపాడడం లేదు?
మనుషులు కూడా కారణమా?
చెడుకు కొంతవరకు మనుషులు కూడా కారణమే. చెడు పనులకు దారితీసే ప్రక్రియ గురించి బైబిలు ఇలా చెబుతుంది: “ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.” (యాకోబు 1:14, 15) తప్పుడు కోరికల ప్రకారం నడుచుకుంటే లేదా వాటికి చోటిస్తే, చేదు పర్యవసానాలు ఎదుర్కోక తప్పదు. (రోమీయులు 7:21-23) చరిత్ర చూపిస్తున్నట్లు, మనుషులు ఘోరమైన పనులు చేసి చెప్పలేనంత బాధ తీసుకొచ్చారు. అంతేకాదు, చెడ్డవాళ్లు ఇతరులను కూడా అవినీతిపరులుగా మార్చగలరు, దానివల్ల చెడుతనం అంతకంతకూ లోతుగా పాతుకుపోతుంది.—సామెతలు 1:10-16.
మనుషులు ఘోరమైన పనులు చేసి చెప్పలేనంత బాధ తీసుకొచ్చారు
మరి దేవుడు జోక్యం చేసుకొని, చెడు చేయకుండా ప్రజలను ఆపవచ్చు కదా? ఆయన ఎందుకు ఆపడం లేదు? ముందుగా, దేవుడు మనిషిని చేసిన తీరు గురించి ఆలోచించండి. దేవుడు తన స్వరూపంలో, అంటే తనలాగే మనిషిని చేశాడని లేఖనాలు చెబుతున్నాయి. దానర్థం, దేవుని లక్షణాలను చూపించే సామర్థ్యం మనుషులకు ఉంది. (ఆదికాండము 1:26) ఎలా జీవించాలి? ఏం చేయాలి? వంటివి సొంతగా నిర్ణయించుకునే స్వేచ్ఛను దేవుడు మనుషులకు ఇచ్చాడు. మనం కావాలనుకుంటే, దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన దృష్టిలో సరైనది చేస్తూ ఆయనకు విశ్వసనీయంగా ఉండవచ్చు. (ద్వితీయోపదేశకాండము 30:19, 20) ‘ఇలాగే జీవించాలి’ అని దేవుడు ప్రజల్ని బలవంతపెడితే, తానిచ్చిన స్వేచ్ఛను తానే తిరిగి తీసేసుకున్నట్లు అవ్వదా? అప్పుడిక, ప్రోగ్రామ్ చేసినట్లు పనిచేసే రోబోలకూ మనుషులకూ తేడానే ఉండదు! ఒకవేళ తలరాత (కిస్మత్) మన జీవితంలో జరిగే ప్రతీ విషయాన్ని శాసించినా, పరిస్థితి అలాగే ఉంటుంది. కానీ దేవుడు, ఎలా జీవించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను మనకే ఇచ్చి మనల్ని గౌరవిస్తున్నాడు. అందుకు మనం ఎంత సంతోషించవచ్చు! అంటే ఇతరులు చేసే చెడు వల్ల, మన తప్పుడు ఎంపికల వల్ల ఎప్పటికీ బాధపడాల్సిందేనా? లేదు.
మన “కర్మ” వల్లే బాధపడుతున్నామా?
ఈ పత్రిక మీదున్న ప్రశ్నను మీరు ఒక హిందువును గానీ బౌద్ధ మతస్థుణ్ణి గానీ అడిగితే, ఎక్కువగా ఈ సమాధానం వస్తుంది: “మంచివాళ్లకు చెడు జరగడానికి కారణం వాళ్ల కర్మ. గత జన్మలో చేసిన పాపాలే వాళ్లకు అలా చుట్టుకుంటున్నాయి.” c
ఈ సందర్భంలో, మరణం గురించి బైబిలు ఏమి చెబుతుందో గమనిద్దాం. ఏదెను తోటలో మొట్టమొదటి మానవుడైన ఆదామును సృష్టించాక, దేవుడు ఆయనతో ఇలా అన్నాడు: “ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు.” (ఆదికాండము 2:16, 17) ఆదాము దేవునికి లోబడి పాపం చేయకుండా ఉంటే, ఎప్పటికీ బ్రతికే ఉండేవాడు. దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించినందుకు శిక్షగా ఆయన చనిపోయాడు. ఆదాముకు పిల్లలు పుట్టినప్పుడు, “మరణము అందరికిని సంప్రాప్తమాయెను.” (రోమీయులు 5:12) కాబట్టి, “పాపమువలన వచ్చు జీతము మరణము” అని మనకు అర్థమౌతుంది. (రోమీయులు 6:23) “చనిపోయినవాడు పాపవిముక్తుడని తీర్పు పొంది యున్నాడు” అని కూడా బైబిలు చెబుతుంది. (రోమీయులు 6:7) అంటే, మనం చనిపోయిన తర్వాత పాపాలకు శిక్ష అనుభవించం.
కర్మ వల్లే మనుషులు బాధలు పడుతున్నారని నేడు కోట్లమంది నమ్ముతున్నారు. అందుకే తమకు, ఇతరులకు వచ్చే కష్టాలను చూసి వాళ్లు పెద్దగా ఆందోళనపడరు. కాకపోతే, చెడు సంఘటనలను ఆపడం గురించి ఆ సిద్ధాంతం ఏమీ చెప్పదు. దాని ప్రకారం, ఒక వ్యక్తికి లభించే ఒకే ఒక్క విడుదల పునర్జన్మ చక్రం నుండి బయటపడడం; అందరూ మెచ్చేలా జీవిస్తూ ఒక ప్రత్యేక విధమైన జ్ఞానం పొందేవాళ్లకు అది లభిస్తుంది. అయితే, ఈ నమ్మకాలకూ బైబిలు బోధించేదానికీ చాలా తేడా ఉంది. d
బాధలకు అసలు కారణం
బాధలకు అసలు కారణం “ఈ లోకాధికారి” సాతానని మీకు తెలుసా?—యోహాను 14:30
చెడుకు కొంతమేర మనుషులు కారణమైనా, అసలు కారణం మాత్రం అపవాదియైన సాతాను. అతడు మొదట్లో నమ్మకమైన ఒక దేవదూత. కానీ అతడు ‘సత్యమందు నిలవలేదు.’ పాపాన్ని లోకానికి పరిచయం చేసింది కూడా అతడే. (యోహాను 8:44) తనలాగే తిరుగుబాటు చేసేలా అతడు ఆదాముహవ్వలను కూడా పురికొల్పాడు. (ఆదికాండము 3:1-5) యేసుక్రీస్తు అతడిని ‘దుష్టుడు,’ “ఈ లోకాధికారి” అని అన్నాడు. (మత్తయి 6:13; యోహాను 14:30) యెహోవా మార్గాలను పట్టించుకోవద్దని సాతాను చెప్పే మాటలనే నేడు ఎక్కువమంది వింటున్నారు. (1 యోహాను 2:15, 16) “లోకమంతయు దుష్టుని యందున్నది” అని 1 యోహాను 5:19లో ఉంది. కొంతమంది దేవదూతలు కూడా చెడుగా మారి సాతానుతో చేరారు. ఆ దయ్యాలు, సాతాను కలిసి ‘సర్వలోకమును మోసపుచ్చుతూ’ ‘భూమికి శ్రమ’ కలిగిస్తున్నారని బైబిలు చెబుతుంది. (ప్రకటన 12:9, 12) కాబట్టి చెడుకు అసలు కారణం సాతానే.
మనకొచ్చే కష్టాలకు దేవుడు కారణం కాదని, ఆయన మనల్ని బాధపెట్టడని స్పష్టంగా తెలుస్తుంది. పైగా, ఇప్పుడున్న చెడంతటినీ తీసివేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దాని గురించి మనం తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం. (w14-E 07/01)
a దేవుని పేరు యెహోవా అని బైబిలు చెబుతుంది.
b దేవుడు ఇంకా చెడును ఎందుకు తీసివేయడం లేదో తెలుసుకోవడానికి, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకంలోని 11వ అధ్యాయం చూడండి. దీన్ని యెహోవాసాక్షులు ప్రచురించారు.
c కర్మ సిద్ధాంతం పుట్టుక గురించి తెలుసుకోవడానికి, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఇంగ్లీషు) బ్రోషుర్‌లోని 8-12 పేజీలు చూడండి. దీన్ని యెహోవాసాక్షులు ప్రచురించారు.
d చనిపోయినవాళ్ల స్థితి గురించీ, వాళ్లు మళ్లీ బ్రతుకుతారా అనేదాని గురించీ బైబిలు ఏమి చెబుతుందో తెలుసుకోవడానికి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 6, 7 అధ్యాయాలు చూడండి.