కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కనిపించని దేవుణ్ణి ఎలా చూడగలం?

కనిపించని దేవుణ్ణి ఎలా చూడగలం?

“దేవుడు ఆత్మ,” మనుషులు ఆయనను చూడలేరు. (యోహాను 4:24) అయితే, కొందరు ఒక విధంగా దేవుణ్ణి చూశారని బైబిలు చెబుతుంది. (హెబ్రీయులు 11:27) అదెలా సాధ్యం? ‘కనిపించని దేవుణ్ణి’ మనం నిజంగా చూడగలమా?—కొలొస్సయులు 1:15, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

పుట్టుకతోనే చూపులేని వ్యక్తితో మనల్ని పోల్చుకుందాం. అతనికి చూపు లేదు కాబట్టి తన చుట్టూ ఉన్న వాటి గురించి ఏమీ తెలుసుకోలేడా? తెలుసుకోగలడు. చూపులేని వాళ్లు కళ్లతో కాకుండా వేరే విధాల్లో సమాచారం గ్రహించి, దాని ఆధారంగా తమ దగ్గర్లో ఎవరున్నారో, ఏమున్నాయో, ఏమి జరుగుతుందో గుర్తుపడతారు. “చూడడం అనేది కళ్లకు కాదు, మెదడుకు సంబంధించినది” అని చూపులేని ఒక వ్యక్తి అన్నాడు.

అదే విధంగా, మన కళ్లతో దేవుణ్ణి చూడలేకపోయినా, “మనోనేత్రాలతో” చూడవచ్చు. (ఎఫెసీయులు 1:17-19) ఏ మూడు విధాల్లో మనం దేవుణ్ణి చూడవచ్చో పరిశీలిద్దాం.

“సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట”

చాలా సందర్భాల్లో, చూపులేని వాళ్ల వినికిడి శక్తి, స్పర్శజ్ఞానం మెరుగ్గా ఉన్నట్లు మనం గమనిస్తుంటాం. వాటి సహాయంతో వాళ్లు చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతారు. అలాగే, మనం కూడా జ్ఞానేంద్రియాలతో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలించి, దాన్ని సృష్టించిన దేవుని గురించి తెలుసుకోవచ్చు. “లోకసృష్టి ఆరంభంనుంచి కంటికి కనబడని ఆయన లక్షణాలు . . . సృష్టిని చూడడం వల్ల తేటతెల్లంగా తెలిసిపోతూవున్నాయి.”—రోమీయులు 1:20, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

ఒకసారి మన భూగృహం గురించి ఆలోచించండి. కనీస అవసరాలతో జీవితాన్ని నెట్టుకువచ్చేలా కాకుండా, జీవితాన్ని ఆస్వాదించేలా దేవుడు ఈ భూమిని అద్భుతంగా రూపొందించాడు. పిల్లగాలి తగిలినప్పుడు, వెచ్చని సూర్యరశ్మి తాకినప్పుడు, రసం నిండిన పండును రుచి చూసినప్పుడు, పక్షుల కిలకిలరావాలు చెవిన పడినప్పుడు మనసుకు ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. ఇవన్నీ మన సృష్టికర్త మన గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడో, ఆయనకు మనమీద ఎంత ప్రేమ ఉందో, ఆయన మనకు కావాల్సినవి ఎంత మెండుగా ఇస్తున్నాడో చూపిస్తున్నాయి.

మరి విశ్వాన్ని పరిశీలించడం వల్ల దేవుని గురించి మనం ఏమి తెలుసుకోవచ్చు? అంతరిక్షం ఆయనకు ఎంత శక్తి ఉందో వివరిస్తుంది. మన విశ్వం విస్తరించడమే కాదు, అంతకంతకూ వేగంతో విస్తరిస్తుందని ఇటీవలి పరిశోధనలు చూపిస్తున్నాయి! రాత్రివేళ ఆకాశాన్ని చూసినప్పుడు దీని గురించి ఆలోచించండి: ఈ విశ్వాన్ని విస్తరింపజేస్తున్న, ఆ వేగాన్ని అంతకంతకూ పెంచుతున్న శక్తంతా ఎక్కడి నుండి వస్తోంది? సృష్టికర్తకు “అధికశక్తి” ఉందని బైబిలు చెబుతుంది. (యెషయా 40:26) దేవుని సృష్టి, ఆయన “సర్వశక్తుడు” లేదా గొప్పబలం గలవాడని చూపిస్తుంది.యోబు 37:23.

‘కుమారుడు ఆయనను బయలుపరిచాడు’

చూపులేని ఇద్దరు పిల్లలున్న తల్లి ఇలా అంది: “వాళ్లు ఎక్కువగా మాటల ద్వారానే నేర్చుకుంటారు. వాళ్లను బయటకు తీసుకెళ్లినప్పుడు, కనిపించే ప్రతీదాని గురించి వాళ్లకు వివరించడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనమే వాళ్ల కళ్లు.” అదేవిధంగా, “ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు,” అయితే “తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే” అంటే యేసే దేవుని గురించి తెలియజేశాడు. (యోహాను 1:18) యేసును దేవుడు అన్నిటికన్నా ముందు సృష్టించాడు, పైగా ఆయన దేవుని ఏకైక కుమారుడు కాబట్టే మనం పరలోకంలోకి తొంగి చూడడానికి ఆయన మనకు “కళ్లు” అయ్యాడు. కనిపించని దేవుని గురించి తెలుసుకోవడానికి అంతకన్నా చక్కని మార్గం మరొకటి లేదు.

తండ్రితో కోటానుకోట్ల సంవత్సరాలు గడిపిన యేసు, ఆయన గురించి ఏమేమి చెప్పాడో గమనించండి:

  • దేవుడు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాడు. “నా తండ్రి అన్నివేళలా పనిచేస్తాడు.”—యోహాను 5:17, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

  • దేవునికి మన అవసరాలు తెలుసు. “మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును.”—మత్తయి 6:8.

  • దేవుడు ఎంతో ప్రేమగా మనకు కావాల్సినవి ఇస్తున్నాడు. “పరలోకమందున్న మీ తండ్రి . . . చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.”—మత్తయి 5:44, 45.

  • దేవుడు మనలో ప్రతీ ఒక్కర్ని విలువైన వాళ్లుగా ఎంచుతున్నాడు. “రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలనుపడదు. మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడి యున్నవి గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.”—మత్తయి 10:29-31.

కనిపించని దేవుణ్ణి ప్రతిబింబించిన మనిషి

చూపులేని వాళ్లు ఆయా విషయాలను అర్థంచేసుకునే తీరుకూడా వేరుగా ఉంటుంది. నీడ అంటే మనకు సూర్యుని వెలుతురు పడని స్థలం. కానీ చూపులేని వాళ్లకైతే అది సూర్యుని వేడి తగలని చల్లని చోటు. చూపులేని వాళ్లు నీడను గానీ, వెలుతురును గానీ సొంతగా చూడలేరు; అలాగే మనంతట మనం యెహోవా గురించి తెలుసుకోలేం. అందుకే, తన లక్షణాలను, వ్యక్తిత్వాన్ని పూర్తిగా అలవర్చుకున్న మనిషిని యెహోవా మనకోసం పంపాడు.

ఆ మనిషే యేసు. (ఫిలిప్పీయులు 2:7) యేసు తన తండ్రి గురించి కేవలం మాట్లాడడమే కాదు ఆయన ఎలా ఉంటాడో చూపించాడు కూడా. “ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము” అని యేసు శిష్యుడైన ఫిలిప్పు అడిగినప్పుడు యేసు, “నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు” అని బదులిచ్చాడు. (యోహాను 14:8, 9) యేసు చేసిన పనుల గురించి తెలుసుకోవడం వల్ల, తండ్రి గురించిన కొన్ని విషయాలు “చూడవచ్చు.” ఎలా?

యేసు ప్రేమగలవాడు, వినయస్థుడు, ఆయన దగ్గరకు వెళ్లడానికి ఎవ్వరూ ఇబ్బందిపడే వాళ్లు కాదు. (మత్తయి 11:28-30) సేదదీర్పునిచ్చే ఆయన వ్యక్తిత్వం ప్రజల్ని ఆకట్టుకునేది. యేసు ఇతరుల కష్టసుఖాల్ని పంచుకునేవాడు. (లూకా 10:17, 21; యోహాను 11:32-35) యేసు గురించి బైబిల్లో ఉన్న విషయాలను చదువుతున్నప్పుడు లేదా వింటున్నప్పుడు, ఆ సంఘటనలు మీ కళ్లముందు జరుగుతున్నట్లు ఊహించుకోండి. యేసు అందరితో ఎలా ఉండేవాడో ధ్యానించినప్పుడు, దేవుని చక్కని వ్యక్తిత్వాన్ని స్పష్టంగా చూడగలుగుతారు, ఆయనకు దగ్గరవ్వాలనే కోరిక మీలో కలుగుతుంది.

వివరాలన్నీ ఒకచోట చేర్చడం

చూపులేని వాళ్లు ప్రపంచాన్ని ఎలా తెలుసుకుంటారో వివరిస్తూ ఒక రచయిత్రి ఇలా అంది: “వాళ్లు వేర్వేరు రూపాల్లో (స్పర్శ, వాసన, వినికిడి . . . ) ముక్కలుముక్కలుగా సమాచారాన్ని గ్రహిస్తారు. ఏదోక విధంగా ఆ వివరాలన్నిటినీ ఒకచోట చేర్చి వాళ్లు విషయాన్ని అర్థం చేసుకోవాలి.” అదేవిధంగా మీరు, దేవుని సృష్టిని గమనించండి, తండ్రి గురించి యేసు చెప్పిన వివరాల్ని చదవండి, దేవుని లక్షణాలను యేసు ఎలా చూపించాడో ధ్యానించండి. అలా నేర్చుకున్న విషయాలన్నిటినీ ఒక చోట చేరిస్తే, యెహోవా గురించి ఒక చక్కని అవగాహన ఏర్పడుతుంది. ఒక విధంగా ఆయనను మీరు చూడగలుగుతారు.

చాలాకాలం క్రితం జీవించిన యోబు కూడా అలాగే చూడగలిగాడు. మొదట్లో, ఆయన “వివేచన” లేకుండా మాట్లాడాడు. (యోబు 42:3) అయితే, దేవుని సృష్టిని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఆయన ఇలా అన్నాడు: “వినికిడిచేత నిన్నుగూర్చి . . . వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచుచున్నాను.”—యోబు 42:5.

‘యెహోవాను వెదికితే ఆయన మీకు ప్రత్యక్షమౌతాడు’

మీరూ అలాగే చేయవచ్చు. ‘యెహోవాను వెదికితే ఆయన మీకు ప్రత్యక్షమౌతాడు.’ (1 దినవృత్తాంతములు 28:9) ఈ విషయంలో యెహోవాసాక్షులు మీకు సంతోషంగా సహాయం చేస్తారు. ▪ (w14-E 07/01)