కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వృద్ధులు యౌవనులైనప్పుడు

వృద్ధులు యౌవనులైనప్పుడు

దేవునికి దగ్గరవ్వండి

వృద్ధులు యౌవనులైనప్పుడు

వృద్ధాప్యంలో వచ్చే మార్పులను అంటే చర్మం మీద ముడతలు పడడం, చూపు మందగించడం, వినికిడి తగ్గిపోవడం, సరిగ్గా నడవలేకపోవడం వంటివాటిని ఎవరు మాత్రం ఇష్టపడతారు? ‘మానవులు యౌవనంలో బలంగా ఉండి ఆనందించేలా సృష్టించిన దేవుడు, తర్వాత వృద్ధాప్యంలో బాధలను అనుభవించేలా ఎందుకు చేస్తాడు?’ అని మీకు అనిపించవచ్చు. సంతోషకరమైన విషయమేమిటంటే, దేవుని ఉద్దేశం అది కాదు. పైగా మనం వృద్ధులమవకుండా కాపాడాలన్నదే ప్రేమగల దేవుని సంకల్పం. యోబు 33:24, 25లో ఎలీహు, పూర్వీకుడైన యోబుతో అన్న మాటలను గమనించండి.

యెహోవా ప్రేమించిన నమ్మకస్థుడైన యోబు పరిస్థితిని ఒకసారి పరిశీలించండి. యోబు స్వార్థంతోనే దేవుణ్ణి సేవిస్తున్నాడని, అందుకే దేవునికి నమ్మకంగా ఉన్నాడని సాతాను ఆరోపించాడు. అయితే ఈ విషయం యోబుకు తెలియదు. యోబు తనను విడిచిపెట్టడనే నమ్మకం దేవునికి ఉంది. అలాగే, యోబుకు ఎలాంటి హాని జరిగినా తీసివేసే శక్తి తనకుందని దేవునికి తెలుసు కాబట్టి సాతాను యోబును పరీక్షించేందుకు ఆయన అనుమతించాడు. అప్పుడు సాతాను, ‘అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తాడు.’ (యోబు 2:7) యోబు శరీరం పురుగులతో కప్పబడింది, ఆయన చర్మం పగిలిపోయి, నల్లబడి ఆయన మీదనుండి ఊడిపోయింది. (యోబు 7:5; 30:17, 30) ఆయన ఎంత వేదన పడివుంటాడో మీరు ఊహించగలరా? అంత జరిగినా యోబు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ‘మరణం వరకు నేనెంత మాత్రం యథార్థతను విడిచిపెట్టను’ అని ఆయన అన్నాడు.—యోబు 27:5.

కానీ యోబు ఒక పెద్ద తప్పు చేశాడు. ఇక చనిపోతానని ఆయనకు అనిపించినప్పుడు, ‘దేవుని కంటే తనే నీతిమంతుడైనట్లు చెప్పుకుంటూ’ తననుతాను గొప్ప చేసుకోవడం గురించే ఎక్కువ ఆలోచించాడు. (యోబు 32:2) దేవుని తరఫున మాట్లాడుతూ ఎలీహు యోబును సరిదిద్దాడు. అయితే దేవుని నుండి వచ్చిన సానుకూలమైన మాటలను కూడా ఎలీహు యోబుకు చెప్పాడు. ఆయనిలా అన్నాడు: ‘పాతాళంలోకి [సమాధిలోకి] దిగి వెళ్లకుండ వానిని [యోబును] విడిపించు, ప్రాయశ్చిత్తం నాకు దొరికింది. అప్పుడు వాని మాంసం బాలుర [యౌవనుల, NW] మాంసం కన్నా ఆరోగ్యంగా ఉంటుంది. వానికి తన చిన్ననాటి స్థితి [యౌవన బలం, NW] తిరిగి కలుగుతుంది.’ (యోబు 33:24, 25) ఆ మాటలు యోబులో ఆశను నింపివుంటాయి. ఆయన చనిపోయేంతవరకూ బాధపడాల్సిన అవసరంలేదు. యోబు పశ్చాత్తాపపడితే ఆయన తరఫున చెల్లించే ప్రాయశ్చిత్తాన్ని దేవుడు సంతోషంగా అంగీకరించి, ఆయన బాధలను తీసివేస్తాడు. *

దిద్దుబాటుకు యోబు వినయంతో స్పందించి, పశ్చాత్తాపపడ్డాడు. (యోబు 42:6) కాబట్టి, దేవుడు యోబు తరఫున చెల్లించే ప్రాయశ్చిత్తాన్ని అంగీకరించి ఆయన తప్పును కప్పేశాడు, ఆయనను ముందులా మంచి స్థితికి తీసుకొచ్చి ఆశీర్వదించాడు. యెహోవా, ‘యోబును మొదట ఆశీర్వదించినంత కన్నా మరి అధికంగా ఆశీర్వదించాడు.’ (యోబు 42:12-17) ఇతర ఆశీర్వాదాలతోపాటు తనకున్న అసహ్యకరమైన రోగం నయమై, తన మాంసం ‘యౌవనుల మాంసం కన్నా ఆరోగ్యంగా’ అయినప్పుడు యోబు ఎంత ఉపశమనం పొందివుంటాడో కదా!

యోబు తరఫున దేవుడు అంగీకరించిన ప్రాయశ్చిత్తానికి పరిమితమైన విలువే ఉంది. ఎందుకంటే ఆ తర్వాత కూడా యోబు అపరిపూర్ణుడుగానే ఉన్నాడు, చివరకు చనిపోయాడు. కానీ మనకు అంతకన్నా శ్రేష్ఠమైన ప్రాయశ్చిత్తం లేదా విమోచన క్రయధనం అందుబాటులో ఉంది. యెహోవా ప్రేమతో తన కుమారుడైన యేసును మనకోసం విమోచన క్రయధనంగా ఇచ్చాడు. (మత్తయి 20:28; యోహాను 3:16) ఆ విమోచన క్రయధనం మీద విశ్వాసం ఉంచే వాళ్లందరికీ, ఈ భూమి అందమైన తోటగా మారినప్పుడు దానిలో నిరంతరం జీవించే అవకాశముంది. రాబోయే ఆ కొత్త లోకంలో, దేవుడు తనను నమ్మకంగా సేవించే వాళ్లు వృద్ధులవకుండా చేస్తాడు. వృద్ధుల మాంసం ‘యౌవనుల మాంసం కన్నా ఆరోగ్యంగా’ అయ్యే సమయాన్ని చూడాలంటే మీరు ఏమి చేయాలనే దాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోండి. (w11-E 04/01)

[అధస్సూచి]

^ పేరా 5 ఇక్కడ “ప్రాయశ్చిత్తం” అని అనువదించబడిన హెబ్రీ పదానికి “కప్పడం” అని అర్థం. యోబు విషయంలో ఆ ప్రాయశ్చిత్తం ఒక జంతు బలి అయ్యుండవచ్చు. దేవుడు దాన్ని అంగీకరించి, యోబు చేసిన తప్పును కప్పేస్తాడు.—యోబు 1:5.