కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుటుంబ సంతోషానికి తోడ్పడే అంశాలు

డబ్బును ఎలా ఉపయోగించుకోవాలి?

డబ్బును ఎలా ఉపయోగించుకోవాలి?

అతడు: “నా భార్య లావణ్య * అనవసరమైన వాటికోసం అంటే మాకు అవసరం లేదని నేననుకునే వాటికోసం ఖర్చు చేస్తున్నట్లు అనిపిస్తోంది. డబ్బు ఆదా చేయడం తనకు బొత్తిగా తెలియదనిపిస్తోంది! అందుకే అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు మేము నానా తంటాలు పడాల్సొస్తోంది. దగ్గర డబ్బుంటే చాలు, ఎడాపెడా ఖర్చు చేసేస్తుంది.”

ఆమె: “డబ్బు ఆదా చేయడం నాకంతగా తెలియకపోవచ్చు. కానీ మావారికి మాత్రం భోజనానికి, ఇంట్లో అవసరమైనవాటికి ఎంత ఖర్చవుతుందో తెలియదు. ఇంట్లో ఉండేది నేనే కాబట్టి, ఏమేమి కావాలో నాకు తెలుసు. డబ్బు గురించి మరోసారి వాదించుకునే పరిస్థితి వచ్చినాసరే, నేను వాటిని కొంటాను.”

భార్యాభర్తలు పేచీపడే అంశాల్లో డబ్బు ఒకటి. వారు చాలా సందర్భాల్లో డబ్బు విషయంలోనే వాదించుకుంటారంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు.

డబ్బు విషయంలో సరైన అవగాహన లేని దంపతులు మానసిక ఒత్తిడికి గురికావచ్చు, ఘర్షణపడవచ్చు, వారి మనసు గాయపడొచ్చు, కొన్నిసార్లు దేవునితో వారికున్న సంబంధానికి హాని కలగవచ్చు. (1 తిమోతి 6:9, 10) ఖర్చుల గురించి చక్కగా చర్చించుకుని ఒక ఖచ్చితమైన నిర్ణయానికిరాని తల్లిదండ్రులు అదనంగా పనిచేయాల్సిరావచ్చు. అలా చేయడం వల్ల పిల్లలకూ వారిద్దరికీ అవసరమైన మానసిక, ఆధ్యాత్మిక మద్దతు కొరవడవచ్చు. అలాగే వారిని చూసి వారి పిల్లలు కూడా డబ్బు విషయంలో బాధ్యతారహితంగా తయారయ్యే ప్రమాదం ఉంది.

డబ్బు లేదా “ద్రవ్యము ఆశ్రయాస్పదము” అని బైబిలు కూడా చెబుతుంది. (ప్రసంగి 7:12) అయితే డబ్బునెలా అదుపులో ఉంచాలో నేర్చుకోవడమే కాక, దాని గురించి మీ జతతో ఎలా మాట్లాడాలో కూడా తెలుసుకున్నప్పుడే అది మీ వైవాహిక జీవితాన్ని, కుటుంబాన్ని కాపాడుతుంది. * డబ్బు గురించి మాట్లాడేటప్పుడు వాదించుకోకుండా చక్కగా చర్చించుకుంటే భార్యాభర్తలు ఒకరికొకరు ఇంకా దగ్గరౌతారు.

అయితే డబ్బు వల్ల భార్యాభర్తల మధ్య ఇన్ని సమస్యలు ఎందుకు వస్తాయి? డబ్బు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వాదించుకోకుండా, సమస్యలు పరిష్కారమయ్యేలా చూడడానికి ఏమి చేయవచ్చు?

సమస్యకు కారణాలేమిటి?

ఖర్చుల వల్ల, అప్పుల వల్ల కాదుగానీ సాధారణంగా అపనమ్మకం, భయం వల్లే డబ్బు విషయంలో భేదాభిప్రాయాలు వస్తుంటాయి. ఉదాహరణకు భర్త, తన భార్య ఖర్చుపెట్టిన ప్రతీ పైసాకు లెక్క అడుగుతుంటే కుటుంబ ఖర్చులు చూసుకునే సామర్థ్యం ఆమెకు లేదని ఆయన అనుకుంటున్నాడని అర్థం. భార్య ఒకవేళ తన భర్త సరిపడినంత డబ్బు ఆదా చేయడం లేదంటుందంటే, భవిష్యత్తులో అనుకోని ఖర్చులు వస్తే తమ కుటుంబం కష్టాలపాలౌతుందేమోనని ఆమె భయపడుతుండవచ్చు.

భార్యాభర్తలు తాము పుట్టిపెరిగిన పరిస్థితులను బట్టి కూడా డబ్బుకు సంబంధించిన విషయాల్లో వేరువేరుగా ఆలోచిస్తారు. ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయిన మనోహర్‌ ఇలా అంటున్నాడు, “నా భార్య డబ్బును జాగ్రత్తగా ఖర్చుపెట్టే కుటుంబం నుండి వచ్చింది. అందుకే ఆమె నాలా భయపడదు. మా నాన్న విపరీతంగా తాగేవాడు, ఆపకుండా సిగరెట్లు కాల్చేవాడు, చాలారోజులు పనికి వెళ్లకుండా ఉండిపోయేవాడు. చాలాసార్లు మా ఇంట్లో నిత్యావసర వస్తువులు కూడా ఉండేవి కావు. అందుకే నాకు అప్పు చేయడమంటేనే భయం. ఆ భయంవల్లే కొన్నిసార్లు నా భార్యతో డబ్బుకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమెతో అనవసరంగా వాదిస్తాను.” మీరు భయపడడానికి కారణం ఏదైనప్పటికీ డబ్బు విషయంలో మీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రాకుండా మీరు మరింత దగ్గర కావాలంటే ఏం చేయాలి?

విజయానికి నాలుగు మెట్లు

బైబిలు డబ్బును ఎలా ఖర్చుచేయాలో వివరించే పుస్తకం కాదు. అయితే అందులో భార్యాభర్తలు డబ్బు విషయంలో తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడే చక్కని సలహాలు ఉన్నాయి. దానిలోని సలహాలను పరిశీలించి ఇక్కడున్న సూచనలను ఎందుకు పాటించకూడదు?

1. డబ్బు గురించి సావధానంగా మాట్లాడుకోవడం నేర్చుకోండి.

“ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును.” (సామెతలు 13:10) మీరు పుట్టిపెరిగిన పరిస్థితులను బట్టి డబ్బు గురించి వేరే వాళ్లతో, ముఖ్యంగా మీ భార్యతో లేదా భర్తతో మాట్లాడడం లేదా వారు చెప్పేది వినడం మీరు అంతగా ఇష్టపడకపోవచ్చు. అయినప్పటికీ ఈ ముఖ్యమైన విషయం గురించి ఇతరులతో చర్చించడం జ్ఞానవంతమైన పని. ఉదాహరణకు, డబ్బు గురించి మీరు అలా ఆలోచించడానికి మీ తల్లిదండ్రుల ఆలోచనా తీరే కారణం అయ్యుండవచ్చని మీరనుకుంటున్నట్లు మీ భార్యతో లేదా భర్తతో ఎందుకు చెప్పకూడదు? అలాగే మీ భర్త లేదా భార్య పుట్టిపెరిగిన పరిస్థితుల వల్ల డబ్బు గురించి వాళ్లలా ఆలోచిస్తున్నారేమో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

డబ్బు గురించి మాట్లాడుకోవడానికి మీరు సమస్య వచ్చేంతవరకు ఆగనవసరం లేదు. “అంగీకారం లేకుండా ఇద్దరు వ్యక్తులు కలిసి నడవలేరు” అని ఒక బైబిలు రచయిత అన్నాడు. (ఆమోసు 3:3, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) మీరు ఈ సూత్రాన్ని ఎలా పాటించగలరు? డబ్బుకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకోవడానికి ఒక ఖచ్చితమైన సమయాన్ని నిర్ణయంచుకోవడం వల్ల అపార్థాలు, వాదోపవాదాలు ఉండవు.

ఇలా చేసి చూడండి: కుటుంబ జమాఖర్చుల గురించి మాట్లాడుకోవడానికి ఒక ఖచ్చితమైన సమయాన్ని పెట్టుకోండి. నెలలో మొదటి రోజు లేదా వారంలో ఒక రోజు అలా మాట్లాడుకోవాలని మీరనుకోవచ్చు. ఆ చర్చను ఎక్కువ పొడిగించకండి, సాధ్యమైతే 15 నిమిషాలు లేదా అంతకన్నా తక్కువ సమయంలో ముగించండి. మీరిద్దరు సాధారణంగా ఖాళీగా ఉండే సమయాన్ని చూసుకోండి. కొన్ని సందర్భాల్లో, అంటే భోజనం చేస్తున్నప్పుడు పిల్లలతో సరదాగా గడుపుతున్నప్పుడు డబ్బుకు సంబంధించిన విషయాలు మాట్లాడుకోకూడదని ముందుగా నిర్ణయించుకోండి.

2. రాబడి గురించి ఎలాంటి అభిప్రాయం ఉండాలో ముందుగా నిర్ణయించుకోండి.

‘ఘనతవిషయములో ఒకరినొకరు గొప్పగా ఎంచండి.’ (రోమీయులు 12:10) మీ ఇంట్లో సంపాదించేది మీరొక్కరే అయితే వచ్చిన జీతం మీ ఒక్కరి సొంతం అన్నట్లు కాకుండా అది కుటుంబ ఆదాయం అన్నట్లు ప్రవర్తించడం ద్వారా మీ భాగస్వామిని గౌరవించవచ్చు.—1 తిమోతి 5:8.

మీరిద్దరూ సంపాదిస్తుంటే మీ సంపాదన గురించి, పెద్దపెద్ద ఖర్చుల గురించి ఒకరికొకరు చెప్పుకోవడం ద్వారా కూడా గౌరవం చూపించవచ్చు. వీటిలో దేని గురించి మీ భాగస్వామికి చెప్పకపోయినా వారికి మీ మీదున్న నమ్మకం తగ్గిపోవచ్చు, మీ ఇద్దరి మధ్యనున్న సంబంధం కూడా దెబ్బతినవచ్చు. మీరు ప్రతీ పైసా ఖర్చు పెట్టేముందు మీ భాగస్వామితో మాట్లాడవలసిన అవసరం లేదు. అయితే పెద్దపెద్ద ఖర్చులు చేసే ముందు మాత్రం మీ భాగస్వామితో మాట్లాడితే వారి అభిప్రాయానికి విలువిస్తున్నట్లు చూపిస్తారు.

ఇలా చేసి చూడండి: ఇన్ని రూపాయల వరకు ఒకరితో ఒకరు చెప్పుకోకుండా ఖర్చు పెట్టొచ్చు అని కొంత మొత్తాన్ని నిర్ణయించుకోండి. అది వంద రూపాయలే కావచ్చు రెండొందలే కావచ్చు. అంతకన్నా ఎక్కువ ఖర్చు చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా వారిని ఓ మాట అడగడం మంచిది.

3. రాసి పెట్టుకోండి.

‘జాగ్రత్తగా ఆలోచించి పని చేస్తే చాలా లాభం కలుగుతుంది.’ (సామెతలు 21:5, పవిత్ర గ్రంథం క్యాతలిక్‌ అనువాదం) మీ కష్టం వృథా పోకుండా చూసుకోవాలన్నా, భవిష్యత్తు గురించి చక్కగా ఆలోచించి పెట్టుకోవాలన్నా మీ కుటుంబానికి ఎంత ఆదాయం వస్తుందో ఎంత ఖర్చుపెడతారో రాసి పెట్టుకోవాలి. ఐదేళ్ల క్రితం పెళ్లయిన నీనా ఇలా అంటోంది: “మీ ఆదాయాన్ని, ఖర్చులను ఒక పేపరు మీద రాసి చూసుకుంటే మీకు ఎంతవస్తుంది, ఎంతపోతుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. పేపరు మీద వాస్తవాలను చూసినప్పుడు ఇక వాదించలేం.”

అలా పేపరు మీద రాసిపెట్టుకోవడానికి మీరు పెద్ద హైరానా పడనవసరం లేదు. 26 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని, ఇద్దరు అబ్బాయిలున్న దీపక్‌ ఇలా అంటున్నాడు, “మొదట్లో ఒక వారంలో వేర్వేరు ఖర్చులకు అవసరమయ్యే డబ్బును వేర్వేరు కవర్లలో పెట్టేవాళ్లం. ఉదాహరణకు సరుకులకు, సరదాలకు, చివరికి హెయిర్‌ కట్టింగ్‌కు కూడా ఒక్కో కవరు పెట్టుకునేవాళ్లం. ఒక కవర్లో పెట్టిన డబ్బులు అయిపోతే వేరే కవర్లో నుండి తీసుకునేవాళ్లం. అయితే తీసిన డబ్బును ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ కవర్లో మళ్లీ పెట్టేసేవాళ్లం.” మీకు సాధారణంగా క్రెడిట్‌ కార్డు వాడే అలవాటుంటే, లేక ఖాతా మీద సరుకులు తెచ్చుకుంటుంటే, ఎలా తిరిగి కట్టాలో ముందే నిర్ణయించుకుని, ఎలా ఖర్చౌతుందో ఎప్పటికప్పుడు చూసుకోవడం ముఖ్యం.

ఇలా చేసి చూడండి: ఎప్పుడూ ఒకేలా ఉండే ఇంటి అద్దె వంటి ఖర్చులను ముందుగా రాసుకోండి. మీ ఆదాయంలో ఎంత మొత్తాన్ని ఆదా చేయాలనుకుంటున్నారో ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోండి. తర్వాత ప్రతీ నెలా మారుతూవుండే సరుకుల ఖర్చు, కరెంటు బిల్లు, ఫోన్‌ బిల్లు వంటి వాటిని రాసిపెట్టుకోండి. అలా చాలా నెలలపాటు మీరు ఎంత ఖర్చుపెడుతున్నారో లెక్క చూసుకోండి. అవసరమనుకుంటే అప్పుల్లో కూరుకుపోకుండా జాగ్రత్తపడడానికి ఖర్చుల్లో మార్పులు చేసుకోండి.

4. ఎవరు ఏం చేయాలో ముందుగా మాట్లాడుకోండి.

“ఒకరికంటె ఇద్దరు మెరుగు. ఇద్దరు కలిసి పని చేస్తే, తాము చేసే పనికి ఎక్కువ ప్రతిఫలం పొందుతారు.” (ప్రసంగి 4:9, 10, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) కొన్ని కుటుంబాల్లో డబ్బుకు సంబంధించిన విషయాలను భర్త చూసుకుంటాడు. మరి కొన్ని కుటుంబాల్లో భార్య ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తుంది. (సామెతలు 31:10-28) చాలామంది ఆ బాధ్యతను ఇద్దరూ పంచుకోవాలని నిర్ణయించుకుంటారు. “నా భార్య బిల్లులు కట్టడం, చిన్నచిన్న ఖర్చులు చూసుకుంటుంది. పన్నులు, బండి కోసం తీసుకున్న లోనుకు వాయిదాలు, ఇంటి అద్దె కట్టడం నేను చూసుకుంటాను. మేము ఎప్పటికప్పుడు ఎవరు ఎంత ఖర్చుపెట్టింది మాట్లాడుకుంటూ, ఒకరికొకరం సహకరించుకుంటాం” అని 21 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న మనోజ్‌ అంటున్నాడు. ఏ పద్ధతి పాటించినప్పటికి, ఇద్దరూ ఒక జట్టుగా కలిసి పనిచేసుకోవడం ముఖ్యం.

ఇలా చేసి చూడండి: మీలో ఎవరు ఏపని బాగా చేయగలరో, ఏపని బాగా చేయలేరో అర్థం చేసుకుని ఎవరు ఏ బాధ్యతను తీసుకోవాలనేది మాట్లాడుకోండి. రెండు నెలల తర్వాత ఆ పద్ధతి ఎంత వరకు పని చేస్తుందో చూసుకోండి. అవసరమైతే మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. బిల్లులు కట్టడం, సరుకులు తీసుకురావడం వంటి బాధ్యతలను నిర్వర్తించడానికి మీ భర్త లేదా భార్య ఎంత కష్టపడుతున్నారో అర్థం చేసుకోవడానికి అప్పుడప్పుడు వాళ్ల పనులు మీరూ, మీ పనులు వాళ్లూ చేయవచ్చు.

ఏ ఉద్దేశంతో డబ్బు గురించి మాట్లాడుకోవాలి?

డబ్బు గురించి మాట్లాడుకోవడం వల్ల మీ మధ్య ఉన్న ప్రేమ తగ్గిపోనవసరం లేదు. అలా ప్రేమ తగ్గిపోదని ఐదేళ్ల క్రితం పెళ్లయిన లత తెలుసుకుంది. ఆమె ఏమంటుందంటే, “నేను, నా భర్త డబ్బు గురించి చర్చించుకునేటప్పుడు ఏదీ దాచుకోకుండా, ఉన్నదున్నట్టు మాట్లాడుకుంటాం. దానివల్ల మేమిద్దరం ఒక జట్టుగా పనిచేసుకోగలుగుతున్నాం, ఒకరి మీద ఒకరికున్న ప్రేమ కూడా పెరిగింది.”

డబ్బులు ఎలా ఖర్చుపెట్టాలో భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నప్పుడు వారు తమ ఆశల గురించి, కలల గురించి ఒకరితో ఒకరు చెప్పుకుంటే, తాము ఒకరికొకరు కట్టుబడి ఉన్నామని చూపిస్తారు. పెద్దపెద్ద ఖర్చులు పెట్టే ముందు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ద్వారా ఒకరి అభిప్రాయాలను, ఇష్టాయిష్టాలను మరొకరు గౌరవిస్తున్నట్లు చూపిస్తారు. ఇంత మొత్తం వరకు రెండో వ్యక్తిని అడగకుండా ఖర్చుపెట్టవచ్చు అనే స్వేచ్ఛ ఇద్దరికీ ఉన్నప్పుడు అది ఒకరి మీద మరొకరికి నమ్మకముందని చూపిస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ కలకాలం ఉండాలంటే ఒకరికొకరు కట్టుబడి ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరి మీద ఒకరు నమ్మకముంచాలి. అలాంటి ప్రేమానుబంధం డబ్బుకన్నా ఎంతో విలువైనది, అలాంటప్పుడు డబ్బు కోసం ఎందుకు వాదించుకోవడం? (w09 08/01)

^ పేరా 3 పేర్లు మార్చబడ్డాయి.

^ పేరా 7 “పురుషుడు భార్యకు శిరస్సు” అని బైబిలు చెబుతోంది. కాబట్టి కుటుంబం డబ్బును సరిగా వాడేలా చూసే బాధ్యతా, భార్యను నిస్వార్థంగా, ప్రేమగా చూసుకునే బాధ్యతా భర్త మీదే ఉన్నాయి.—ఎఫెసీయులు 5:23, 25.

ఇలా ప్రశ్నించుకోండి . . .

  • డబ్బుకు సంబంధించిన విషయాల గురించి మేమిద్దరం సావధానంగా మాట్లాడుకుని ఎంతకాలమైంది?

  • డబ్బుకు సంబంధించిన విషయాల్లో సహాయం చేస్తున్నందుకు నేను మెచ్చుకుంటున్నానని ఎలా చూపించవచ్చు?