కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

యెరికో పట్టణాన్ని కొన్నిరోజుల్లోనే స్వాధీనం చేసుకున్నారని చెప్పడానికి ఏవైనా పురావస్తు ఆధారాలు ఉన్నాయా?

ఇశ్రాయేలు సైన్యాలు రోజుకోసారి చొప్పున ఆరు రోజులపాటు యెరికో పట్టణం చుట్టూ తిరిగాయని యెహోషువ 6:10-15, 20 వచనాలు చెప్తున్నాయి. అయితే ఏడవ రోజున వాళ్లు ఆ పట్టణం చుట్టూ ఏడుసార్లు తిరిగారు. అప్పుడు యెహోవా ఆ పట్టణపు బలమైన గోడల్ని కూలిపోయేలా చేయడంతో వాళ్లు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే బైబిలు చెప్తున్నట్లు, యెరికో పట్టణాన్ని కొన్నిరోజుల్లోనే స్వాధీనం చేసుకున్నారని చెప్పడానికి ఏవైనా పురావస్తు ఆధారాలు ఉన్నాయా?

ప్రాచీన కాలాల్లో ఏదైనా పట్టణంపై దాడి చేసే ముందు, సైన్యాలు ఆ పట్టణాన్ని చుట్టుముట్టేవి. ఒకవేళ ఆ ముట్టడి ఎక్కువ కాలం కొనసాగితే, ఆ పట్టణంలోని ప్రజలు తాము నిల్వ చేసుకున్న ఆహారాన్ని చాలావరకు తినేసేవాళ్లు. సైన్యాలు చివరికి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు, మిగిలిన ధాన్యంతోపాటు దొరికినదంతా దోచుకునేవాళ్లు. పాలస్తీనాలోని కొన్ని పట్టణాలపై ఇలాంటి దాడే జరిగింది. అందుకే వాటి శిథిలాల్లో పురావస్తు శాస్త్రజ్ఞులకు కొంచెం ధాన్యమే దొరికింది, కొన్ని చోట్లయితే అస్సలు దొరకలేదు. కానీ యెరికో శిథిలాల్లో మాత్రం చాలా ఎక్కువ మొత్తంలో ధాన్యం కనుగొన్నారు. బిబ్లికల్‌ ఆర్కియాలజీ రివ్యూ ఇలా చెప్పింది, ‘ఆ శిథిలాల్లో ఎన్నో మట్టి పాత్రలతోపాటు ధాన్యం విస్తారంగా దొరికింది. అంత పెద్ద మొత్తంలో ధాన్యం దొరకడం చాలా అరుదు.’

ఇశ్రాయేలీయులు యెహోవా ఆజ్ఞకు లోబడి, యెరికో పట్టణంలో ఉన్న ధాన్యాన్ని తీసుకెళ్లలేదని బైబిలు చెప్తుంది. (యెహో. 6:17, 18) పైగా వాళ్లు వసంతకాలంలో, అంటే కోతకాలం ముగిసిన వెంటనే యెరికో పట్టణంపై దాడి చేశారు కాబట్టి, ఆ సమయంలో అక్కడ ఎక్కువ ధాన్యం ఉండివుంటుంది. (యెహో. 3:15-17; 5:10) ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా అక్కడ ఎక్కువ ధాన్యం ఉంది. కాబట్టి, బైబిలు చెప్తున్నట్లు ఇశ్రాయేలీయులు యెరికో పట్టణాన్ని కొన్నిరోజుల్లోనే స్వాధీనం చేసుకున్నారని చెప్పవచ్చు.