కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నాకైతే దేవుని పొందు ధన్యకరము

నాకైతే దేవుని పొందు ధన్యకరము

నాకు తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు నా ఎదుగుదల ఆగిపోయింది. ఇప్పుడు నా వయసు 43 సంవత్సరాలు, కానీ ఎత్తు మాత్రం మూడు అడుగులే ఉంటాను. నేనిక ఎత్తు పెరగనని మా అమ్మానాన్నలకు అర్థమైనప్పుడు, నేను నా ఎత్తు గురించే ఆలోచిస్తూ కృంగిపోకూడదనే ఉద్దేశంతో ఏదైనా పని చేయమని నన్ను ప్రోత్సహించారు. దాంతో నేను మా ఇంటి ముందే ఓ పండ్ల దుకాణం పెట్టాను. నేనెప్పుడూ పండ్లను అందంగా కనిపించేలా చక్కగా సర్దేదాన్ని కాబట్టి పండ్లు కొనుక్కోవడానికి చాలామంది నా దగ్గరకు వచ్చేవాళ్లు.

అయితే, పనిమీదే మనసుపెట్టినా నా పరిస్థితి పూర్తిగా మారిపోలేదు. నేను మరీ పొట్టిగా ఉండడం వల్ల చిన్నచిన్న పనులు చేసుకోవడానికి కూడా కష్టపడాల్సివచ్చేది. ఉదాహరణకు, ఏదైనా షాపుకు వెళ్తే నాకు అక్కడ కౌంటర్‌ అందేది కాదు. ఏ వస్తువు చూసినా, నాకన్నా రెండింతలు ఎత్తున్న వాళ్ల కోసమే తయారు చేసినట్లు అనిపించేది. నా మీద నాకే జాలి వేసేది. కానీ నాకు 14 ఏళ్లు ఉన్నప్పుడు నా పరిస్థితిలో మార్పు వచ్చింది.

ఒకరోజు ఇద్దరు సాక్షులు నా దగ్గర పండ్లు కొనుక్కోవడానికి వచ్చారు. వాళ్లు నాతో బైబిలు స్టడీ చేయడం మొదలుపెట్టారు. నా ఎత్తు గురించి ఆలోచించడంకన్నా యెహోవా గురించి, ఆయన సంకల్పం గురించి తెలుసుకోవడమే చాలా ముఖ్యమని నాకు కొంతకాలానికి అర్థమైంది. అది నాకెంతో మేలు చేసింది. నాకు బాగా నచ్చిన లేఖనం కీర్తన 73:28. ఆ వచనంలోని మొదటి భాగంలో ఇలా ఉంది, “నాకైతే దేవుని పొందు ధన్యకరము.”

అయితే ఉన్నట్టుండి మా కుటుంబం కోటె డి ఐవరీ నుండి బుర్కీనా ఫాసో అనే దేశానికి తరలివెళ్లాల్సి వచ్చింది. దాంతో నా జీవితం ఒక్కసారిగా మారిపోయింది. అంతకుముందు మా ఊర్లో, నా పండ్ల దుకాణం దగ్గర నన్ను చూడడం అందరికీ అలవాటైపోయింది. కానీ ఈ కొత్త ప్రాంతంలో నేనెవ్వరికీ తెలియదు కాబట్టి చాలామంది నన్ను వింతగా చూసేవాళ్లు. దాంతో నేను చాలా వారాలపాటు ఇంట్లో నుండి బయటికి వచ్చేదాన్ని కాదు. అప్పుడు నేను, యెహోవా గురించి నేర్చుకుంటున్న రోజుల్లో ఎంత సంతోషంగా ఉండేదాన్నో గుర్తు తెచ్చుకున్నాను. వెంటనే యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి ఓ ఉత్తరం రాశాను, దాంతో వాళ్లు నా దగ్గరికి నానీ అనే ఓ మిషనరీ సహోదరిని పంపించారు. ఆమెకు ఒక స్కూటర్‌ ఉండేది.

మా ప్రాంతంలో అన్నీ ఇసుక రోడ్లు ఉండేవి, వర్షాకాలంలో అయితే బురదగా ఉండేవి. నాకు స్టడీ చేయడానికి వచ్చేటప్పుడు నానీ ఎన్నిసార్లు స్కూటర్‌ మీదనుండి జారిపడిందో లెక్కేలేదు. అయినా ఆమె నా దగ్గరికి రావడం మానలేదు. ఓరోజు ఆమె నన్ను మీటింగ్స్‌కు తీసుకెళ్తానని చెప్పింది. బయటికి వెళ్తే అందరూ నన్ను వింతగా చూస్తారని నాకు తెలుసు. పైగా మా రోడ్లమీద స్కూటర్‌ నడపడం నానీకి చాలా కష్టం, ఇక నేను కూడా ఎక్కానంటే ఇంకా కష్టమౌతుంది. అయినా సరే, మీటింగ్స్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అలా వెళ్లడానికి నాకిష్టమైన లేఖనంలోని మరో భాగం నాకు సహాయం చేసింది. అక్కడిలా ఉంది, “నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను.”

మీటింగ్స్‌కి వెళ్లేటప్పుడు నేనూ, నానీ కొన్నిసార్లు బురదలో జారిపడ్డాం. కానీ మాకు మీటింగ్స్‌ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ ఇబ్బందుల్ని పట్టించుకోలేదు. బయట ప్రజలు నన్ను చూసే చూపులకు, రాజ్యమందిరంలో సహోదరసహోదరీలు ప్రేమతో చిందించే చిరునవ్వులకు ఎంత తేడా ఉందో! తొమ్మిది నెలల తర్వాత నేను బాప్తిస్మం తీసుకున్నాను.

నాకిష్టమైన లేఖనంలోని రెండవ భాగం, దేవుని ‘సర్వకార్యములను తెలియజేయడం.’ అయితే పరిచర్య నాకు పెద్ద సవాలు అని నాకు తెలుసు. నేను పరిచర్యకు వెళ్లిన మొదటి రోజు నాకిప్పటికీ బాగా గుర్తు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అందరూ నన్ను వింతగా చూశారు, నేను ఎటువెళ్తే అటువస్తూ నాలాగే నడుస్తూ వెక్కిరించారు. నాకు చాలా బాధ అనిపించింది. కానీ పరదైసు నాకెంత అవసరమో వాళ్లకు కూడా అంతే అవసరమని గుర్తు చేసుకోవడం వల్ల అవన్నీ తట్టుకోగలిగాను.

చేత్తో నడపగలిగే మూడు చక్రాల సైకిల్‌ను కొనుక్కున్నాక నా పని కొంచెం తేలికైంది. పరిచర్యకు వెళ్లేటప్పుడు ఏదైనా ఎత్తయిన ప్రాంతం ఎక్కాల్సివస్తే, నాతో పాటు వచ్చే సహోదరి సైకిల్‌ను నెట్టేది. ఆ ఎత్తు ఎక్కగానే ఆమె కూడా సైకిల్‌ మీద కూర్చునేది. పరిచర్యకు వెళ్లడం మొదట్లో కష్టంగా అనిపించినా, ఆ తర్వాత నాకు అది చాలా ఆనందాన్నిచ్చింది. దాంతో 1998⁠లో నేను క్రమ పయినీరు సేవ చేయడం మొదలుపెట్టాను.

నేను ఎన్నో బైబిలు స్టడీలు చేశాను, వాళ్లలో నలుగురు బాప్తిస్మం తీసుకున్నారు. అంతేకాదు మా చెల్లి కూడా సత్యాన్ని అంగీకరించింది. నాకెప్పుడైనా నిరుత్సాహంగా అనిపిస్తే, నేను సత్యం పరిచయం చేసిన ఇతరులు సాధించిన ప్రగతి గురించి వినడం ప్రోత్సాహాన్నిచ్చేది. ఓసారి నేను మలేరియాతో బాధపడుతున్నప్పుడు కోటె డి ఐవరీ నుండి నాకు ఓ ఉత్తరం వచ్చింది. నేను బుర్కీనా ఫాసోలో ఓ యూనివర్సిటీ స్టూడెంట్‌తో గుమ్మం దగ్గర బైబిలు స్టడీ మొదలుపెట్టి, దాన్ని ఓ సహోదరునికి అప్పగించాను. కొంతకాలానికి ఆ స్టూటెండ్‌ కోటె డి ఐవరీకి వెళ్లిపోయాడు. ఆ అబ్బాయి బాప్తిస్మం పొందని ప్రచారకుడు అయ్యాడని ఉత్తరం ద్వారా తెలుసుకుని నేను చాలా సంతోషించాను.

నా ఖర్చుల కోసం డబ్బు ఎలా సంపాదించేదాన్ని అంటే, వికలాంగులకు సహాయం చేసే ఓ సంస్థ నాకు కుట్టుపని నేర్పించడానికి ముందుకొచ్చింది. నా పనితనాన్ని గమనించిన మా మేడమ్‌, “మేము నీకు సబ్బులు ఎలా తయారు చేయాలో నేర్పిస్తాం” అని చెప్పింది. వాళ్లు నేర్పించడంతో నేను ఇంట్లోనే సబ్బులు తయారు చేయడం మొదలుపెట్టాను. ప్రజలకు నా సబ్బులు నచ్చి, వాటిగురించి వేరేవాళ్లకు కూడా చెప్పేవాళ్లు. తయారుచేసిన సబ్బుల్ని నేనే స్వయంగా నా మూడు చక్రాల స్కూటర్‌ మీద వెళ్లి ఇచ్చేదాన్ని.

అయితే 2004⁠లో, విపరీతమైన నడుంనొప్పి వల్ల నా పయినీరు సేవ ఆపేయాల్సి వచ్చింది. కానీ నేను ఇప్పటికీ క్రమంగా పరిచర్యకు వెళ్తాను.

నేనెప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటానని ప్రజలు అంటారు. “నాకైతే దేవుని పొందు ధన్యకరము” కాబట్టి సంతోషంగా ఉండడానికి నాకెన్నో కారణాలు ఉన్నాయి.—శార మైగ చెప్పినది.