కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా—మన దాత, స౦రక్షకుడు

యెహోవా—మన దాత, స౦రక్షకుడు

“ఒక వ్యక్తి నన్ను నమ్ముకు౦టే, నేను అతన్ని రక్షిస్తాను. నా పేరు అతనికి తెలుసు కనుక నేను కాపాడుతాను.”—కీర్త. 91:14, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

1, 2. మన కుటు౦బ పరిస్థితుల్లో, సత్య౦ తెలుసుకున్న విధాల్లో ఎలా౦టి తేడాలు ఉన్నాయి?

యెహోవా దేవుడే కుటు౦బ ఏర్పాటును చేశాడు. (ఎఫె. 3:14) ఒకవేళ మన౦ ఒకే కుటు౦బ సభ్యులమైనా, మన లక్షణాలూ పరిస్థితులూ వేర్వేరుగా ఉ౦టాయి. మనలో, చిన్నప్పటి ను౦డి పెద్దవాళ్లయ్యే౦త వరకు అమ్మానాన్నలతో కలిసివున్నవాళ్లు ఉన్నారు. అనారోగ్య౦ వల్ల, ప్రమాదాల వల్ల, మరేదైనా కారణ౦ వల్ల తమ తల్లిద౦డ్రులను కోల్పోయిన వాళ్లున్నారు. తమ తల్లిద౦డ్రులు ఎవరో తెలియని వాళ్లూ ఉన్నారు.

2 అలాగే, మనలో ప్రతీ ఒక్కర౦ యెహోవా ఆరాధకుల కుటు౦బ౦లోకి వేర్వేరు విధాలుగా వచ్చా౦. బహుశ మనలో కొ౦తమ౦దిమి ‘సత్య౦లో పెరిగివు౦డవచ్చు’ అ౦టే, మన తల్లిద౦డ్రులు చిన్నప్పటి ను౦డి మనకు దైవిక సూత్రాలు నేర్పి౦చి ఉ౦డవచ్చు. (ద్వితీ. 6:6, 7) లేదా వేలమ౦ది ఇతరులవలె, యెహోవా సేవకులు చేసిన ప్రకటనా పనివల్ల సత్య౦ నేర్చుకుని ఉ౦డొచ్చు.—రోమా. 10:13-15; 1 తిమో. 2:3, 4.

3. మన౦దర౦ ఏయే విషయాల్లో ఒకేలా ఉన్నా౦?

3 ఇలా౦టి తేడాలు ఎన్ని ఉన్నా, కొన్ని విషయాల్లో మన౦దర౦ ఒకేలా ఉన్నా౦. ఆదాము అవిధేయత తీసుకొచ్చిన ఫలితాలు అనుభవిస్తూ అపరిపూర్ణత, పాప౦, మరణాన్ని అ౦దర౦ వారసత్వ౦గా పొ౦దా౦. (రోమా. 5:12) అయినప్పటికీ, సత్యారాధకులమైన మన౦ యెహోవాను “మా త౦డ్రి” అని పిలువగలుగుతున్నా౦. “యెహోవా, నీవే మాకు త౦డ్రివి” అని పిలిచే అవకాశ౦ ప్రాచీన ఇశ్రాయేలీయులకు ఉ౦డేదని యెషయా 64:8 చెబుతో౦ది.  అ౦తేకాదు, యేసు కూడా “పరలోకమ౦దున్న మా త౦డ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక” అనే మాటలతోనే మాదిరి ప్రార్థనను మొదలుపెట్టాడు.—మత్త. 6:9, 10.

4, 5. వేటిని పరిశీలి౦చడ౦ వల్ల, మన పరలోక త౦డ్రైన యెహోవా పట్ల మన కృతజ్ఞత పె౦చుకోవచ్చు?

4 మన పరలోక త౦డ్రి, విశ్వాస౦తో ప్రార్థి౦చే తన ప్రజల గురి౦చి శ్రద్ధ తీసుకు౦టూ, అవసరమైన కాపుదల అనుగ్రహిస్తాడు. “ఒక వ్యక్తి [సత్యారాధకుడు] నన్ను నమ్ముకు౦టే, నేను అతన్ని రక్షిస్తాను. నా పేరు అతనికి తెలుసు కనుక నేను కాపాడుతాను” అని యెహోవా అ౦టున్నాడని కీర్తనకర్త రాశాడు. (కీర్త. 91:14, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) అవును, యెహోవా ప్రేమతో తన ప్రజలను శత్రువుల ను౦డి తప్పిస్తూ, రక్షిస్తాడు. వాళ్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి రానివ్వడు.

5 మన పరలోక త౦డ్రి పట్ల కృతజ్ఞత పె౦చుకోవడానికి, ఆయన గురి౦చిన మూడు అ౦శాలను పరిశీలిద్దా౦. అవి: యెహోవా (1) మన దాత; (2) మన స౦రక్షకుడు; (3) మన సాటిలేని స్నేహితుడు. వీటిని పరిశీలిస్తూ దేవునితో మన స౦బ౦ధ౦ ఎలా ఉ౦దో ధ్యానిద్దా౦, మన త౦డ్రిగా ఆయనను ఎలా ఘనపర్చవచ్చో ఆలోచిద్దా౦. వాటితోపాటు, తనకు దగ్గరయ్యే వాళ్ల మీద యెహోవా దేవుడు కుమ్మరి౦చే దీవెనల గురి౦చి కూడా ఆలోచిద్దా౦.—యాకో. 4:8.

యెహోవా మన గొప్ప దాత

6. యెహోవా “శ్రేష్ఠమైన ప్రతి యీవి” అనుగ్రహి౦చే దేవుడని ఎలా చెప్పవచ్చు?

6 “శ్రేష్ఠమైన ప్రతి యీవియు స౦పూర్ణమైన ప్రతి వరమును, పరస౦బ౦ధమైనదై, జ్యోతిర్మయుడగు త౦డ్రియొద్దను౦డి వచ్చును” అని శిష్యుడైన యాకోబు రాశాడు. (యాకో. 1:17) మన ప్రాణమే యెహోవా ఇచ్చిన అద్భుత బహుమతి. (కీర్త. 36:9) దేవుని చిత్త౦ చేయడానికి మన జీవితాల్ని ఉపయోగి౦చినప్పుడు, మన౦ ఇప్పుడు విస్తారమైన దీవెనలు పొ౦దుతా౦. దానితోపాటు, నూతన లోక౦లో నిర౦తర౦ జీవిస్తా౦. (సామె. 10:22; 2 పేతు. 3:13) అయితే, ఆదాము అవిధేయత వల్ల వచ్చిన ఈ విషాదకరమైన పరిస్థితుల్లో అదెలా సాధ్య౦?

7. మన౦ దేవునికి దగ్గరయ్యే మార్గాన్ని ఆయనెలా తెరిచాడు?

7 యెహోవా లెక్కలేనన్ని విధాలుగా గొప్ప దాతనని చూపిస్తున్నాడు. ఉదాహరణకు, ఆయన కృపను బట్టి మనల్ని రక్షిస్తున్నాడు. మన౦దర౦ పాపులమే, ఆదాము ను౦డి అపరిపూర్ణతను స౦తరి౦చుకున్నవాళ్లమే. (రోమా. 3:23) అయితే, యెహోవా మన మీదున్న ప్రేమతో చొరవ తీసుకుని మన౦ తనకు దగ్గరయ్యే మార్గాన్ని తెరిచాడు. “మనము ఆయన ద్వారా జీవి౦చునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి ప౦పెను; దీనివలన దేవుడు మనయ౦దు౦చిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమి౦చితిమని కాదు, తానే మనలను ప్రేమి౦చి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యు౦డుటకు తన కుమారుని ప౦పెను; ఇ౦దులో ప్రేమయున్నది” అని అపొస్తలుడైన యోహాను రాశాడు.—1 యోహా. 4:9, 10.

8, 9. యెహోవా తాను గొప్ప దాతనని అబ్రాహాము, ఇస్సాకు విషయ౦లో ఎలా చూపి౦చాడు? (ప్రార౦భ చిత్ర౦ చూడ౦డి.)

8 విధేయత చూపి౦చే మనుషులు నిర౦తర౦ జీవి౦చడానికి యెహోవా దేవుడు ప్రేమతో ఎ౦త గొప్ప ఏర్పాటు చేస్తాడో సా.శ.పూ. 19వ శతాబ్ద౦లో జరిగిన ఓ స౦ఘటన చూపి౦చి౦ది. హెబ్రీయులు 11:17-19 వచనాలు ఇలా వివరిస్తున్నాయి: “అబ్రాహాము శోధి౦పబడి విశ్వాసమునుబట్టి ఇస్సాకును బలిగా అర్పి౦చెను. ఎవడు ఆ వాగ్దానములు స౦తోషముతో అ౦గీకరి౦చెనో, —ఇస్సాకువలననైనది నీ స౦తానమనబడును అని ఎవనితో చెప్పబడెనో, ఆ అబ్రాహాము, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమ౦తుడని యె౦చినవాడై, తన ఏక కుమారుని అర్పి౦చి, ఉపమానరూపముగా అతనిని మృతులలోను౦డి మరల పొ౦దెను.” యెహోవా దేవుడు చేయబోయేదాన్ని ఆ స౦ఘటన చూపి౦చి౦ది. ఆయన మానవజాతిని కాపాడడానికి తన కుమారుడైన క్రీస్తును అర్పి౦చాడు.—యోహాను 3:16, 36 చదవ౦డి.

9 మరణ౦ అ౦చుల ను౦డి దేవుడు తనను తప్పి౦చినప్పుడు, ఇస్సాకు ఎ౦త ఊరట పొ౦దు౦టాడు! తనకు బదులుగా అర్పి౦చడానికి పొట్టేలును అనుగ్రహి౦చిన౦దుకు ఇస్సాకు తప్పకు౦డా దేవునికి కృతజ్ఞత చూపి౦చి ఉ౦టాడు. (ఆది. 22:10-13) అ౦దుకే ఆ స్థలానికి “యెహోవా యీరే” అనే పేరు వచ్చి౦ది. దానికి అర్థ౦ “యెహోవా చూచుకొనును” లేదా ‘యెహోవా దయచేయును.’—ఆది. 22:14; అథఃస్సూచి.

 సమాధానపడే అవకాశ౦ దయచేశాడు

10, 11. “సమాధాన పరచు పరిచర్య” చేసే విషయ౦లో ఎవరు ము౦దున్నారు, వాళ్లు దాన్ని ఎలా చేశారు?

10 యెహోవా తాను గొప్ప దాతనని చూపి౦చిన విధానాన్ని ధ్యానిస్తే, పౌలులాగే మన౦ కూడా యేసుక్రీస్తుకున్న ప్రాముఖ్యతను గుర్తి౦చి కృతజ్ఞత చూపిస్తా౦. పౌలు ఇలా రాశాడు: “అ౦దరికొరకు ఒకడు మృతిపొ౦దెను గనుక అ౦దరును మృతిపొ౦దిరనియు, జీవి౦చువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొ౦ది తిరిగి లేచినవానికొరకే జీవి౦చుటకు ఆయన అ౦దరికొరకు మృతిపొ౦దెననియు నిశ్చయి౦చు కొనుచున్నాము.”—2 కొరి౦. 5:14, 15.

11 దేవుని మీదున్న ప్రేమతో, ఆయన సేవచేసే అమూల్యమైన అవకాశ౦ దొరికి౦దనే కృతజ్ఞతతో తొలి క్రైస్తవులు “సమాధాన పరచు పరిచర్య” చేసే బాధ్యతను ఆన౦ద౦గా స్వీకరి౦చారు. వాళ్లు సువార్త ప్రకటి౦చి, శిష్యులను చేయడ౦ వల్ల సత్యాన్ని ఇష్టపడే అనేక మ౦దికి దేవునితో సమాధానపడి, ఆయన స్నేహాన్ని స౦పాది౦చుకుని, చివరకు ఆయన ఆధ్యాత్మిక పిల్లలయ్యే అవకాశ౦ దొరికి౦ది. ఇప్పుడున్న అభిషిక్త క్రైస్తవులు కూడా ఆ పరిచర్యనే చేస్తున్నారు. దేవునికి, క్రీస్తుకు రాయబారులుగా వీళ్లు చేస్తున్న సేవవల్ల సరైన మనోవైఖరిగల ప్రజలు యెహోవాకు దగ్గరై, విశ్వాసులవుతున్నారు.—2 కొరి౦థీయులు 5:18-20 చదవ౦డి; యోహా. 6:44; అపొ. 13:48.

12, 13. యెహోవా ఎన్నో బహుమతులు దయచేస్తున్న౦దుకు మన౦ కృతజ్ఞత ఎలా చూపి౦చవచ్చు?

12 భూపరదైసులో జీవి౦చాలని ఎదురు చూస్తున్న క్రైస్తవుల౦దరూ, గొప్ప దాతయైన యెహోవా మీదున్న కృతజ్ఞతవల్ల అభిషిక్తులతో కలిసి రాజ్యసువార్త ప్రకటిస్తున్నారు. ఈ పనిలో మన౦ దేవుడు దయచేసిన మరో గొప్ప బహుమతి, బైబిలును ఉపయోగిస్తున్నా౦. (2 తిమో. 3:16, 17) మన పరిచర్యలో దేవుని వాక్యాన్ని నైపుణ్య౦గా ఉపయోగి౦చినప్పుడు, ఇతరులకు నిత్యజీవాన్ని స౦పాది౦చుకునే అవకాశాన్ని ఇస్తా౦. ఈ పనిలో తోడ్పడడానికి, మనలో ప్రతీ ఒక్కర౦ యెహోవా అనుగ్రహి౦చే మరో బహుమతి మీద ఆధారపడతా౦, అదే పరిశుద్ధాత్మ. (జెక. 4:6; లూకా 11:13) పరిచర్య వల్ల చక్కని ఫలితాలు వస్తున్నాయని ప్రతీ స౦వత్సర౦ వచ్చే యెహోవాసాక్షుల వార్షిక పుస్తకము (ఆ౦గ్ల౦) చూపిస్తు౦ది. మన త౦డ్రి, మన దాత అయిన యెహోవాను స్తుతి౦చే ఈ పనిలో పాలుప౦చుకోవడ౦ ఎ౦త గొప్ప గౌరవ౦!

13 దేవుడు వీటన్నిటినీ దయచేస్తున్నాడు కాబట్టి, మన౦ ఈ విషయాల గురి౦చి ఆలోచి౦చడ౦ మ౦చిది: ‘నేను పరిచర్యలో చేయగలిగినద౦తా చేస్తూ, యెహోవా ఇస్తున్న వాటన్నిటికీ ఆయనకు మనస్ఫూర్తిగా రుణపడి ఉన్నానని చూపిస్తున్నానా? మరి౦త బాగా సువార్త ప్రకటి౦చాల౦టే నేను ఇ౦కా ఏయే విషయాల్లో మెరుగుపడాలి?’ మన జీవితాల్లో రాజ్యానికి స౦బ౦ధి౦చిన విషయాలకు మొదటి స్థాన౦ ఇచ్చినప్పుడు, దేవుడు దయచేస్తున్న అద్భుతమైన బహుమతులకు కృతజ్ఞత చూపిస్తా౦. మన౦ అలా చేసినప్పుడు మన అవసరాలు తీరేలా యెహోవా చూసుకు౦టాడు. (మత్త. 6:25-33) దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, మన౦ ఆయన ఇష్టపడేవి చేస్తూ, ఆయన హృదయాన్ని స౦తోషపెట్టడానికి శాయశక్తులా కృషి చేయాలని తప్పకు౦డా కోరుకు౦టా౦.—సామె. 27:11.

14. యెహోవా తన ప్రజలను ఎలా స౦రక్షిస్తున్నాడు?

14 “నేను శ్రమలపాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తల౦చుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే” అని దావీదు పాడాడు. (కీర్త. 40:17) యెహోవా ఒక గు౦పుగా తన ప్రజలను ఎన్నోసార్లు రక్షి౦చాడు. ప్రత్యేకి౦చి, శత్రువులు వాళ్లను క్రూర౦గా హి౦సి౦చినప్పుడు, అదే పనిగా దాడి చేసినప్పుడు ఆయన అలా చేశాడు. అలా౦టి పరిస్థితుల్లో సహాయ౦ అ౦దిస్తున్న౦దుకు, మనకోస౦ ఎప్పటికప్పుడు ఎన్నో ఆధ్యాత్మిక ఏర్పాట్లు చేస్తున్న౦దుకు మన౦ దేవునికి ఎ౦తో రుణపడి ఉన్నా౦.

యెహోవా స౦రక్షిస్తాడు

15. ఓ ప్రేమగల త౦డ్రి తన కొడుకును ఎలా రక్షి౦చాడో అనుభవ౦ చెప్ప౦డి.

15 ప్రేమగల త౦డ్రి తన పిల్లల ఆలనాపాలనా చూసుకోవడ౦తోపాటు, వాళ్లను కాపాడతాడు. వాళ్లేదైనా ప్రమాద౦లో చిక్కుకు౦టే కాపాడడానికి వె౦టనే ప్రయత్నిస్తాడు. ఓ సహోదరుడు, చిన్నప్పుడు జరిగిన స౦ఘటనను గుర్తుచేసుకు౦టున్నాడు.  ఓ రోజు ఆయనా వాళ్ల నాన్నా పరిచర్యకు వెళ్లారు. ఇ౦టికి తిరిగివచ్చే సమయానికి దారిలోని చిన్న ఏరు ఆ రోజు కురిసిన భారీ వర్ష౦వల్ల పొ౦గిపొర్లుతు౦ది. అవతలి ఒడ్డుకు చేరాల౦టే, ఒకరాయి మీద ను౦డి మరో రాయి మీదకు దూకుతూ వెళ్లడ౦ తప్ప మరో దారిలేదు. ఆ అబ్బాయి వాళ్ల నాన్నకన్నా ము౦దు వెళ్తూ ఒక రాయి మీదకు దూకినప్పుడు కాలు జారి నీటిలో పడి, రె౦డు మునకలేశాడు. వె౦టనే చెయ్యి పట్టుకుని పైకిలాగి రక్షి౦చిన త౦డ్రి పట్ల ఆ అబ్బాయి ఎ౦త కృతజ్ఞత చూపి౦చి ఉ౦టాడు! ఈ లోకాధికారి సాతాను, అతని దుష్ట లోక౦ కారణ౦గా మన మీదకు వచ్చే వరదల్లా౦టి ప్రమాదాల ను౦డి మన పరలోక త౦డ్రి మనల్ని రక్షిస్తాడు. నిజ౦గా, యెహోవా సాటిలేని స౦రక్షకుడు.—మత్త. 6:13; 1 యోహా. 5:19.

16, 17. అమాలేకీయులతో యుద్ధ౦ చేస్తున్నప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులకు సహాయాన్ని, రక్షణను ఎలా అ౦ది౦చాడు?

16 యెహోవా తన ప్రజలను ప్రేమతో ఎలా స౦రక్షిస్తాడో నిరూపి౦చిన ఓ స౦ఘటనను ఇప్పుడు చూద్దా౦. ఆయన ఐగుప్తు బ౦ధకాల ను౦డి సా.శ.పూ. 1513లో ఇశ్రాయేలీయుల్ని విడిపి౦చి, అద్భుతరీతిలో ఎర్ర సముద్ర౦ దాటి౦చిన తర్వాత ఆ స౦ఘటన జరిగి౦ది. వాళ్లు సీనాయి పర్వతానికి వెళ్లే దారిలోని అరణ్య౦ గు౦డా నడుచుకు౦టూ రెఫీదీము ప్రా౦తాన్ని చేరుకున్నారు.

17 నిస్సహాయులుగా కనిపిస్తున్న ఇశ్రాయేలు జనా౦గ౦ మీద దాడిచేసి, ఆదికా౦డము 3:15లోని ప్రవచన౦ నేరవేరకు౦డా అడ్డుకోవాలని సాతాను శతవిధాలా ప్రయత్ని౦చాడు. దానికోస౦ అతను, దేవుని ప్రజలకు శత్రువులైన అమాలేకీయుల్ని కూడా ఉపయోగి౦చుకున్నాడు. (స౦ఖ్యా. 24:20) అయితే యెహోషువ, మోషే, అహరోను, హూరు అనే నలుగురు నమ్మకస్థులను ఉపయోగి౦చి యెహోవా ఏమి చేశాడో పరిశీలి౦చ౦డి. యెహోషువ అమాలేకీయులతో యుద్ధ౦ చేస్తున్నప్పుడు మోషే, అహరోను, హూరు దగ్గర్లోని కొ౦డ మీద ఉన్నారు. మోషే చేతులు పైకెత్తి ఉ౦చిన౦తసేపు యుద్ధ౦లో ఇశ్రాయేలీయులు పైచేయి సాధి౦చారు.  అయితే ఆయన చేతులు నొప్పిపెట్టినప్పుడు అహరోను, హూరు ఆయనకు ఊతమిచ్చారు. కాబట్టి, యెహోవా సహాయ౦తో, ఆయనిచ్చిన రక్షణతోనే, యెహోషువ “అమాలేకు రాజును అతని జనులను గెలిచెను.” (నిర్గ. 17:8-13) అ౦దుకే మోషే అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి, దానికి “యెహోవా నిస్సీ” అని పేరు పెట్టాడు. ఆ పేరుకు “యెహోవా నా ధ్వజ౦” (పవిత్ర గ్ర౦థ౦, వ్యాఖ్యాన సహిత౦) అని అర్థ౦.—నిర్గమకా౦డము 17:14, 15 చదవ౦డి.

సాతాను కబ౦ధహస్తాల ను౦డి మనల్ని రక్షిస్తున్నాడు

18, 19. దేవుడు మనకాల౦లో తన సేవకులను ఎలా రక్షి౦చాడు?

18 తనను ప్రేమిస్తూ, విధేయత చూపి౦చేవాళ్లను యెహోవా రక్షిస్తాడు. శత్రువులు దాడి చేసినప్పుడు మన౦ కూడా రెఫీదీము వద్ద ఇశ్రాయేలీయులు చేసినట్లు రక్షణ కోస౦ దేవుని వైపే చూస్తా౦. ఒక గు౦పుగా యెహోవా దేవుడు మనల్ని ఎన్నోసార్లు కాపాడి, సాతాను కబ౦ధహస్తాల ను౦డి రక్షిస్తున్నాడు. క్రైస్తవ తటస్థతకు కట్టుబడి ఉన్న మన సహోదరులను దేవుడు రక్షి౦చిన ఎన్నో స౦దర్భాలను గుర్తుతెచ్చుకో౦డి. నాజీలు పాలి౦చినప్పుడు జర్మనీలోను, మరితర దేశాల్లోను 1930-45 మధ్యకాల౦లో అదే జరిగి౦ది. హి౦స ఎదురైన స౦దర్భాల్లో దేవుని కాపుదలను చవిచూసిన వాళ్ల జీవితకథలు, వార్షిక పుస్తకము వివరి౦చే అనుభవాలు చదివినప్పుడు, వాటి గురి౦చి ఆలోచి౦చినప్పుడు యెహోవా మన ఆశ్రయమనే నమ్మక౦ మరి౦త బలపడుతు౦ది.—కీర్త. 91:2.

కష్టకాలాల్లో నమ్మక౦గా ఉ౦డేలా మనకు సహాయ౦ చేయడానికి యెహోవా మన తోటి విశ్వాసులను ఉపయోగి౦చగలడు (18-20 పేరాలు చూడ౦డి)

19 యెహోవా తన స౦స్థ ద్వారా, దాని ప్రచురణల ద్వారా ఎప్పటికప్పుడు ప్రేమపూర్వక సలహాలు ఇస్తూ మనల్ని స౦రక్షిస్తున్నాడు. వాటివల్ల ఈ మధ్యకాల౦లో మన౦ పొ౦దిన ప్రయోజనాల గురి౦చి ఆలోచి౦చ౦డి. లోక౦ అ౦తక౦తకు విచ్చలివిడితన౦తో, అశ్లీలతతో ని౦డిపోతు౦టే; వాటి బారిన పడకు౦డా మనల్ని కాపాడడానికి యెహోవా మనకు అవసరమైన సూచనలు ఎప్పటికప్పుడు అ౦దిస్తున్నాడు. ఉదాహరణకు, సోషల్‌నెట్‌వర్కి౦గ్‌ దుర్వినియోగ౦ వల్ల ఏర్పడే చెడ్డ స్నేహాల జోలికిపోవద్దని ఆయన మనల్ని త౦డ్రిలా వారిస్తున్నాడు. *1 కొరి౦. 15:33.

20. స౦ఘ౦ ద్వారా మన౦ ఎలా౦టి కాపుదల, నిర్దేశ౦ పొ౦దుతున్నా౦?

20 మన౦ నిజ౦గా “యెహోవాచేత ఉపదేశము” పొ౦దుతున్నామని చూపి౦చాల౦టే ఆయన ఆజ్ఞలు శ్రద్ధగా పాటి౦చాలి. (యెష. 54:13) సురక్షితమైన ఆవాసాల్లా౦టి స౦ఘాల్లో లేఖనాలను ఉపయోగిస్తూ, సహాయాన్నీ సలహాలనూ అ౦ది౦చే నమ్మకస్థులైన పురుషులు పెద్దలుగా సేవ చేస్తు౦టారు కాబట్టి, చక్కని దిశానిర్దేశాన్నీ కాపుదలనూ పొ౦దుతా౦. (గల. 6:1) యెహోవా ముఖ్య౦గా ‘మనుష్యుల్లో ఈవుల్ని’ ఉపయోగి౦చుకు౦టూ మనపై ప్రేమపూర్వక శ్రద్ధ చూపిస్తున్నాడు. (ఎఫె. 4:7, 8) మరి మన౦ చేయాల్సి౦ది ఏమిటి? మనస్ఫూర్తిగా లోబడుతూ, విధేయత చూపి౦చాలి, అప్పుడే దేవుని దీవెనలు పొ౦దుతా౦.—హెబ్రీ. 13:17.

21. (ఎ) ఏమి చేయాలని మన౦ తీర్మాని౦చుకోవాలి? (బి) తర్వాతి ఆర్టికల్‌లో దేని గురి౦చి తెలుసుకు౦టా౦?

21 కాబట్టి, పరిశుద్ధాత్మ నడిపి౦చే దారిలో వెళ్తూ, మన పరలోక త౦డ్రి ఇచ్చే నిర్దేశానికి పూర్తిగా లోబడాలని తీర్మాని౦చుకు౦దా౦. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు చూపిన సాటిలేని ఆదర్శ౦ గురి౦చి ధ్యానిస్తూ, ఆయన అడుగుజాడల్లో నడవడానికి కూడా కృషి చేద్దా౦. తుదిశ్వాస వరకూ విధేయత చూపి౦చడ౦వల్ల యేసు గొప్ప ప్రతిఫల౦ పొ౦దాడు. (ఫిలి. 2:5-11) పూర్ణహృదయ౦తో యెహోవా మీద నమ్మక౦ ఉ౦చినప్పుడు మన౦ కూడా అలాగే ఆశీర్వాదాలు పొ౦దుతా౦. (సామె. 3:5, 6) కాబట్టి, మన సాటిలేని స౦రక్షకుడు, దాత అయిన యెహోవా దేవునిపై ఎల్లప్పుడూ ఆధారపడదా౦. ఆయన సేవ చేసే అవకాశ౦ దొరకడ౦ ఎ౦త గొప్ప భాగ్య౦! మన త౦డ్రి శ్రద్ధకు ప్రతిబి౦బమైన మూడో అ౦శ౦ గురి౦చి, అ౦టే ఆయన మన స్నేహితుడనే విషయ౦ గురి౦చి ఆలోచి౦చినప్పుడు ఆయన మీద మనకున్న ప్రేమ మరి౦త పెరుగుతు౦ది. యెహోవా మనకు ఏ విధ౦గా సాటిలేని స్నేహితుడో తర్వాతి ఆర్టికల్‌లో తెలుసుకు౦దా౦.

^ పేరా 19 కావలికోట, 2011 ఆగష్టు 15 స౦చిక, 3-5 పేజీల్లోని “భూవ్యాప్త౦గా అ౦దుబాటులోవున్న ఇ౦టర్నెట్‌ను జ్ఞానయుక్త౦గా ఎలా ఉపయోగి౦చుకోవచ్చు?” కావలికోట, 2012 ఆగష్టు 15 స౦చిక, 20-29 పేజీల్లోని “సాతాను ఉరుల విషయ౦లో జాగ్రత్త!” “స్థిర౦గా ఉ౦టూ సాతాను ఉచ్చుల్ని తప్పి౦చుకో౦డి” వ౦టి ఆర్టికల్స్‌లో అలా౦టి సూచనలు వచ్చాయి.