కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని సేవే ఆయనకు మందు!

దేవుని సేవే ఆయనకు మందు!

కెన్యా దేశంలో పరిచర్య చేస్తూ ఓ ఇంటికి వెళ్లిన ఇద్దరు పయినీర్లు, ఆ ఇంట్లో మంచం మీద పడుకొనివున్న చాలా చిన్న మనిషిని చూసి ఆశ్చర్యపోయారు. ఆయన మొండెం, చేతులు చాలా చిన్నగా ఉన్నాయి. వాళ్లు, “కుంటివాడు దుప్పివలె గంతులువేయును” అని దేవుడు చేసిన వాగ్దానం గురించి చెప్పినప్పుడు ఆయన ముఖం చిరునవ్వుతో నిండిపోయింది.—యెష. 35:6.

ప్రస్తుతం 30వ పడిలో ఉన్న ఓనెస్మస్‌కు, పుట్టుకతోనే ఎముకలకు సంబంధించిన వ్యాధి ఉందని ఆ పయినీర్లు తెలుసుకున్నారు. ఆయన ఎముకలు చాలా బలహీనంగా ఉంటాయి, వాటిపై ఏ కాస్త ఒత్తిడి పడినా విరిగిపోతాయి. ఆయన వ్యాధిని నయం చేయగల మందులుకానీ సరైన చికిత్సకానీ లేవు. ఓనెస్మస్‌ జీవితాంతం నొప్పిని భరిస్తూ చక్రాల కుర్చీపై గడపాల్సిందే.

ఓనెస్మస్‌ బైబిలు అధ్యయనాన్ని అంగీకరించాడు. కానీ, ఆయన సంఘ కూటాలకు వెళ్లడానికి వాళ్ల అమ్మ ఒప్పుకోలేదు, ఎందుకంటే దానివల్ల తన కొడుకుకి ఏమైనా దెబ్బలు తగిలి మరింత నొప్పితో బాధపడతాడేమోనని ఆమె భయపడింది. దాంతో మన సహోదరులు కూటాలను రికార్డ్‌ చేసి ఓనెస్మస్‌కు తన ఇంట్లోనే వినిపించేవాళ్లు. అయితే ఓనెస్మస్‌ ఐదు నెలలు అధ్యయనం చేశాక, ఎన్ని ఇబ్బందులున్నాసరే కూటాలకు హాజరవ్వాలని నిర్ణయించుకున్నాడు.

మరి, కూటాలకు హాజరవ్వడం వల్ల ఓనెస్మస్‌ నొప్పి ఎక్కువైందా? లేదు పైగా తగ్గింది కూడా. “నన్ను ఎప్పుడూ వేధించే నొప్పి కూటాల్లో ఉన్నంతసేపు తగ్గినట్లుగా అనిపించేది” అని ఓనెస్మస్‌ గుర్తుచేసుకున్నాడు. తాను కొత్తగా తెలుసుకున్న నిరీక్షణే దానికి కారణమని ఆయన భావించాడు. ఓనెస్మస్‌లో ఆనందాన్ని గమనించిన ఆయన తల్లి కూడా సంతోషంగా బైబిలు అధ్యయనానికి అంగీకరించింది. “దేవుని సేవే నా కొడుకుకి మందు” అని ఆమె చెప్పేది.

అనతికాలంలోనే ఓనెస్మస్‌ బాప్తిస్మం తీసుకొనని ప్రచారకుడు అయ్యాడు. తర్వాత బాప్తిస్మం తీసుకున్నాడు, ఆయన ప్రస్తుతం ఓ పరిచర్య సేవకునిగా సేవచేస్తున్నాడు. ఆయనకు రెండు కాళ్లు, ఒక చెయ్యి పనిచేయకపోయినా యెహోవా సేవలో తాను చేయగలిగినదంతా చేయాలని ఎంతగానో కోరుకున్నాడు. ఆయనకు సహాయ పయినీరు సేవ చేయాలని ఉండేది కానీ అప్లికేషన్‌ ఇవ్వడానికి వెనకాడాడు. ఎందుకు? ఎందుకంటే, తాను చక్రాల కుర్చీలో వెళ్లాలంటే వేరేవాళ్ల మీద పూర్తిగా ఆధారపడాలని ఆయనకు తెలుసు. అయితే, తన మనసులోని మాటను తోటి సహోదరులకు చెప్పినప్పుడు వాళ్లు తప్పకుండా సహాయం చేస్తామని మాటిచ్చారు. సహాయం చేశారు కూడా, దాంతో ఓనెస్మస్‌ సహాయ పయినీరు సేవ చేయగలిగాడు.

ఓనెస్మస్‌ క్రమ పయినీరు సేవ చేయాలని కోరుకున్నప్పుడు కూడా అలాంటి ఇబ్బందే ఎదురైంది. అయితే, ఒక సమయంలో దినవచనంలోని మాటలు ఆయనకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. ఆ వచనం కీర్తన 34:8పై ఆధారపడింది. “యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి” అనే మాటలున్న ఆ లేఖనాన్ని ధ్యానించిన తర్వాత క్రమ పయినీరు అవ్వాలని ఓనెస్మస్‌ నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం ఆయన వారంలో నాలుగు రోజులు సువార్త ప్రకటిస్తూ, ఎన్నో బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తున్నాడు, వాళ్లలో చాలామంది మంచి ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తున్నారు. ఆయన 2010లో పయినీరు సేవా పాఠశాలకు కూడా హాజరయ్యాడు. తనను మొదటిసారి కలిసిన ఇద్దరు సహోదరుల్లో ఒకరు ఆ పాఠశాల ఉపదేశకునిగా ఉండడం చూసి ఓనెస్మస్‌ ఎంతో సంతోషించాడు.

ఓనెస్మస్‌ తల్లిదండ్రులు ఇప్పుడు లేరు. కానీ, సంఘంలోని సహోదరసహోదరీలే ఆయన రోజువారీ అవసరాలపట్ల శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రస్తుతం తాను అనుభవించే ఆశీర్వాదాలన్నింటిని బట్టి ఆయన ఎంతో కృతజ్ఞత కలిగివున్నాడు. “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును” అనని కాలం కోసం ఆయన ఎంతో ఎదురుచూస్తున్నాడు.—యెష. 33:24.