కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా గొప్ప నామాన్ని ఘనపర్చండి

యెహోవా గొప్ప నామాన్ని ఘనపర్చండి

“నీ నామమును నిత్యము మహిమపరచెదను.”—కీర్త. 86:12.

1, 2. ప్రపంచంలోని చర్చీలకు భిన్నంగా యెహోవాసాక్షులు దేవుని పేరును ఎలా ఎంచుతారు?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చీల్లో చాలామట్టుకు దేవుని పేరును ఉపయోగించడం మానేశారు. ఉదాహరణకు, రివైజ్డ్‌ స్టాండర్డ్‌ వర్షన్‌ దాని ముందుమాటలో ఇలా పేర్కొంది: “ఏకైక దేవుని పేరును తెలిపే పదం ఏదైనా సరే . . . దాన్ని వాడడం క్రైస్తవ చర్చీ విశ్వాసానికి అస్సలు తగదు.”

2 అయితే యెహోవాసాక్షులు మాత్రం సగర్వంగా దేవుని పేరును ధరించి, దాన్ని మహిమపరుస్తున్నారు. (కీర్తన 86:12; యెషయా 43:10 చదవండి.) అంతేకాక, దేవుని పేరుకున్న అర్థాన్ని, దాన్ని పరిశుద్ధపర్చడానికి సంబంధించిన వివాదాంశాన్ని అర్థంచేసుకోవడం మనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తాం. (మత్త. 6:9, 10) ఆ విషయాన్ని మనం ఎన్నడూ తేలిగ్గా తీసుకోకూడదు. కాబట్టి, మనం ఇప్పుడు మూడు ప్రాముఖ్యమైన ప్రశ్నల్ని పరిశీలిద్దాం. దేవుని పేరును తెలుసుకోవడం అంటే ఏమిటి? యెహోవా తన గొప్ప పేరుకు తగినట్లు జీవిస్తూ, దాన్నెలా మరింత మహిమపర్చుకున్నాడు? మనం ఎలా ‘యెహోవా నామాన్ని స్మరిస్తూ’ ఉండవచ్చు?

దేవుని పేరును తెలుసుకోవడం అంటే ఏమిటి?

3. దేవుని పేరు తెలుసుకోవడం అంటే అర్థమేమిటి?

3 దేవుని పేరును తెలుసుకోవడం అంటే “యెహోవా” అనే పదాన్ని తెలుసుకోవడం ఒక్కటే కాదు. యెహోవా ఖ్యాతి, ఆయన సుగుణాలు, సంకల్పం, ఆయన చేసిన గొప్ప కార్యాలు అంటే తన సేవకులతో ఆయన వ్యవహరించిన తీరు వంటివాటి గురించి మనం తెలుసుకోవాలి. యెహోవా తన సంకల్ప నెరవేర్పుకు అనుగుణంగా ఆ విషయాలన్నిటి మీద మరింత అవగాహనను మెల్లమెల్లగా దయచేస్తాడు. (సామె. 4:18) యెహోవా తన పేరును మొట్టమొదటి మానవ దంపతులకు తెలియజేశాడు. అందుకే, కయీనుకు జన్మనిచ్చిన తర్వాత హవ్వ యెహోవా పేరును ఉపయోగించింది. (ఆది. 4:1) నోవహు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు వంటి నమ్మకమైన పూర్వీకులకు దేవుని పేరు తెలుసు. యెహోవా తమను ఆశీర్వదిస్తూ, తమ బాగోగులు చూసుకుంటూ, తన సంకల్పానికి సంబంధించిన వివిధ అంశాలను తెలియజేసినప్పుడు ఆ పేరు పట్ల వాళ్లకున్న  కృతజ్ఞత అధికమైంది. మోషేకైతే దేవుడు తన పేరు గురించి ప్రత్యేకమైన అవగాహనను ఇచ్చాడు.

4. దేవుని పేరు గురించి మోషే ఎందుకు అడిగాడు? ఆయన ఆందోళన ఎందుకు అర్థంచేసుకోదగినది?

4 నిర్గమకాండము 3:10-15 చదవండి. మోషేకు 80 ఏళ్లున్నప్పుడు దేవుడు ఆయనకు ఈ బరువైన బాధ్యతను అప్పగించాడు: “ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెను.” అప్పుడు, మోషే గౌరవపూర్వకంగా దేవుణ్ణి ఓ ప్రాముఖ్యమైన ప్రశ్న అడిగాడు. మోషే ఒకవిధంగా దేవుణ్ణి, ‘నీ పేరేంటి?’ అని అడిగాడు. అప్పటికే ఎంతోకాలం నుండి ప్రజలకు దేవుని పేరు తెలుసు. అయినప్పటికీ మోషే ఆ ప్రశ్న ఎందుకు అడిగినట్లు? ఆ పేరును ధరించిన వ్యక్తి గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవడానికి అంటే, యెహోవా విడుదలను దయచేస్తాడని ఇశ్రాయేలీయుల్ని ఒప్పించే వాస్తవాలను తెలుసుకోవడానికి మోషే అలా అడిగాడని అర్థమౌతోంది. మోషే ఆందోళన అర్థంచేసుకోదగినదే, ఎందుకంటే అప్పటికి కొంతకాలంగా ఇశ్రాయేలీయులు బానిసత్వంలో మగ్గిపోతున్నారు. తమ పితరుల దేవుడు తమను విడుదల చేయగలడా అని వాళ్లు సందేహించే అవకాశం ఉంది. అంతెందుకు ఆ సమయానికి, కొందరు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేవుళ్లను ఆరాధించడం కూడా మొదలుపెట్టారు!—యెహె. 20:7, 8.

5. యెహోవా మోషేకు జవాబిస్తూ తన పేరుకున్న అర్థం విషయంలో ఎలా మరింత అవగాహనను దయచేశాడు?

5 మోషే అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ యెహోవా ఇలా అన్నాడు: “ఉండునను వాడు మీయొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను.” * ఆ తర్వాత ఇంకా ఇలా అన్నాడు: “మీ పితరుల దేవుడైన యెహోవా . . . మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను.” తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి తాను ఎలా కావాలనుకుంటే అలా అవుతానని, ఎల్లప్పుడూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని దేవుడు ఆ సమయంలో మోషేకు చెప్పాడు. 15వ వచనంలో యెహోవాయే స్వయంగా ఇలా చెప్పాడు: “నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము.” ఆ కొత్త అవగాహన మోషే విశ్వాసాన్ని బలపర్చి, ఆయనను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసి ఉంటుంది!

యిహోవా తన పేరుకు తగ్గట్లు జీవించాడు

6, 7. యెహోవా పూర్తిగా ఎలా తన పేరుకు తగ్గట్లు జీవించాడు?

6 మోషేకు బాధ్యత అప్పగించిన కొద్దికాలానికే యెహోవా తన పేరుకు తగ్గట్లు ఇశ్రాయేలీయుల విమోచకుడు ‘అయ్యాడు.’ యెహోవా ఐగుప్తు మీదికి పది తెగుళ్లు తీసుకొచ్చి, ఫరోతో సహా ఐగుప్తీయుల దేవుళ్లు అందరూ చేతకానివాళ్లని నిరూపించాడు. (నిర్గ. 12:12) ఆ తర్వాత, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, ఇశ్రాయేలీయుల్ని దాని గుండా నడిపించాక ఫరోను, అతని సైన్యాన్ని ఆ సముద్ర గర్భంలో కలిపేశాడు. (కీర్త. 136:13-15) “ఘోరమైన మహారణ్యములో” ఇరవై నుండి ముప్పై లక్షలమంది లేదా అంతకన్నా ఎక్కువమంది ఉన్న తన ప్రజలకు కావాల్సిన ఆహారాన్ని, నీటిని అనుగ్రహించి  యెహోవా వాళ్ల ప్రాణాలు కాపాడాడు. అంతేకాదు, వాళ్ల బట్టలు, చెప్పులు ‘పాతగిలిపోకుండా’ యెహోవా చూశాడు. (ద్వితీ. 1:19; 29:5) నిశ్చయంగా, సాటిలేని తన పేరుకు తగ్గట్లు అవ్వకుండా యెహోవాను ఏదీ ఆపలేదు. ఎన్నో ఏళ్ల తర్వాత యెషయాతో యెహోవా ఇలా అన్నాడు: “నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు.”—యెష. 43:11.

7 మోషే తర్వాత ఇశ్రాయేలీయులకు నాయకునిగా ఉన్న యెహోషువ కూడా ఐగుప్తులో, అరణ్యంలో యెహోవా చేసిన గొప్ప కార్యాలను కళ్లారా చూశాడు. అందుకే, తన జీవిత చరమాంకంలో యెహోషువ గట్టి నమ్మకంతో తన తోటి ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడు: “మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు; అవి అన్నియు మీకు కలిగెను, వాటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు.” (యెహో. 23:14) నిస్సందేహంగా, యెహోవా తన మాట నిలబెట్టుకున్నాడు. దానికోసం ఆయన ఎలా కావాలనుకుంటే అలా ‘అయ్యాడు.’

8. నేడు యెహోవా ఎలా తన పేరుకు తగ్గట్లు జీవిస్తున్నాడు?

8 నేడు కూడా యెహోవా ఎలా కావాలంటే అలా ‘అవుతున్నాడు.’ ఈ అంత్యదినాల్లో “లోకమందంతట” రాజ్య ప్రకటనా పని జరుగుతుందని యెహోవా తన కుమారుని ద్వారా ప్రవచించాడు. (మత్త. 24:14) సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రమే అలాంటి పని జరుగుతుందని ప్రవచించగలడు, అది జరిగేలా చూడగలడు, దాన్ని చేయడానికి ఎంతోమంది “విద్యలేని పామరులను” ఉపయోగించుకోగలడు. (అపొ. 4:13) కాబట్టి, ఈ పనిలో పాల్గొంటున్నప్పుడు నిజానికి మనం బైబిలు ప్రవచన నెరవేర్పుకు దోహదపడతాం. మనం మన తండ్రిని ఘనపరుస్తాం. అంతేకాక, “నీ నామము పరిశుద్ధపరచబడు గాక; నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని ప్రార్థించినప్పుడు అదంతా నిజంగానే అవ్వాలని కోరుకుంటున్నట్లు చూపిస్తాం.—మత్త. 6:9, 10.

ఆయన పేరు గొప్పది

9, 10. ఇశ్రాయేలీయులతో జరిపిన వ్యవహారాల్లో యెహోవా తన పేరును ఎలా మరింత సార్థకం చేసుకున్నాడు? కానీ ఇశ్రాయేలీయులు ఎలా ప్రవర్తించారు?

9 ఇశ్రాయేలీయుల్ని విడుదల చేసిన కొంతకాలానికే, యెహోవా తన ప్రజల విషయంలో ఓ కొత్త పాత్ర పోషించాడు. ఆయన వాళ్లతో ధర్మశాస్త్ర నిబంధన చేసి వాళ్లకు “యజమాని” అయ్యాడు. అలా ఆయన ఆ నిబంధనతో వచ్చే బాధ్యతలన్నిటినీ ఇష్టపూర్వకంగా స్వీకరించాడు. (యిర్మీ. 3:14) అప్పుడు ఇశ్రాయేలు జనాంగం యెహోవాకు భార్య అయ్యింది. అంటే, ఆయన పేరు ధరించిన జనాంగం అయ్యింది. (యెష. 54:5, 6) వాళ్లు ఇష్టపూర్వకంగా ఆయనకు లోబడి ఆయన ఆజ్ఞలను పాటించినంత కాలం యెహోవా వాళ్లకు తిరుగులేని ‘యజమానిగా’ లేదా ‘భర్తగా’ ఉన్నాడు. ఆయన వాళ్లను ఆశీర్వదించాడు, సంరక్షించాడు, సమాధానాన్ని దయచేశాడు. (సంఖ్యా. 6:22-26) అలా ఇతర జనాంగాలు కూడా యెహోవా గొప్ప నామానికున్న మహిమను తెలుసుకున్నారు. (ద్వితీయోపదేశకాండము 4:5-8; కీర్తన 86:7-10 చదవండి.) నిజానికి, ఇశ్రాయేలు చరిత్రంతటిలో ఎంతోమంది విదేశీయులు సత్యారాధనకు ఆకర్షితులయ్యారు. ఒక విధంగా వాళ్లు మోయాబీయురాలైన  రూతు నయోమితో అన్న మాటలే అన్నారు: “నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు.”—రూతు 1:16.

10 దాదాపు 1,500 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీయులతో యెహోవా వ్యవహారాలను పరిశీలిస్తే ఆయన వ్యక్తిత్వం గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. ఆ జనాంగం పదేపదే పక్కదారి పట్టినా యెహోవా వాళ్ల పట్ల “కనికరము,” “దీర్ఘశాంతము” చూపిస్తూ వచ్చాడు. ఆయన అసాధారణమైన ఓర్పు, దీర్ఘశాంతం చూపించిన దేవుడు. (నిర్గ. 34:5-7) అయితే యెహోవా చూపించే ఓర్పుకు కూడా ఓ హద్దు ఉంది. అందుకే, యూదా జనాంగం తన కుమారుణ్ణి తిరస్కరించి చంపేయడంతో యెహోవా వాళ్ల విషయంలో ఓర్పు చూపించడం ఆపేశాడు. (మత్త. 23:37, 38) ఇశ్రాయేలు జనాంగంలో పుట్టిన వాళ్లు దేవుని పేరుగల ప్రజలుగా ఉండే అవకాశాన్ని కోల్పోయారు. ఓ జనాంగంగా వాళ్లు ఎండిపోయిన చెట్టులా ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు. (లూకా 23:31) దానివల్ల, దేవుని పేరు విషయంలో వాళ్ల వైఖరి ఎలా తయారైంది?

11. యూదా జనాంగం మధ్య యెహోవా పేరు ఎలా కనుమరుగైపోయింది?

11 కాలక్రమేణా యూదుల్లో, దేవుని పేరును ఉచ్చరించకూడదనే ఓ మూఢనమ్మకం పుట్టిందని చరిత్ర చూపిస్తోంది. (నిర్గ. 20:7) మెల్లమెల్లగా యూదా మతంలో యెహోవా పేరు వాడకమే కనుమరుగైపోయింది. తన నామానికి జరిగిన అవమానం చూసి యెహోవా ఖచ్చితంగా నొచ్చుకొనివుంటాడు. (కీర్త. 78:40, 41) అయితే, పేరులోనే “రోషము” ఉన్న దేవుడు, తనను వద్దనుకున్న జనాంగానికి, తాను వద్దనుకున్న జనాంగానికి ఆ పేరు అలాగే ఉండనివ్వలేదు. (నిర్గ. 34:14) సృష్టికర్త పేరుకు ఎనలేని గౌరవం ఇవ్వడం ఎంత ప్రాముఖ్యమో అది చూపిస్తోంది.

దేవుని పేరు కలిగిన కొత్త జనాంగం

12. తన నామం కలిగిన జనం గురించిన ప్రవచనాన్ని యెహోవా ఎలా నెరవేర్చాడు?

12 ఒక కొత్త జనాంగంతో అంటే ఆధ్యాత్మిక ఇశ్రాయేలుతో “క్రొత్త నిబంధన” చేస్తానని యెహోవా యిర్మీయా ద్వారా తెలియజేశాడు. “అల్పులేమి, ఘనులేమి” ఆ నిబంధనలో భాగమయ్యే ప్రజలందరూ యెహోవాను “ఎరుగుదురు” అని యిర్మీయా ప్రవచించాడు. (యిర్మీ. 31:31, 33, 34) ఆ ప్రవచన నెరవేర్పు సా.శ. 33 పెంతెకొస్తు రోజున ఆరంభమైంది. అప్పుడు దేవుడు కొత్త నిబంధన చేశాడు. దాంతో ఆ కొత్త జనాంగం అంటే, యూదులూ అన్యులతో కూడిన “దేవుని ఇశ్రాయేలు” దేవుని ‘నామముకొరకు ఏర్పరచుకున్న ఒక జనం’ లేదా దేవుని ‘నామము పెట్టబడిన’ జనం అయ్యారు.—గల. 6:16; అపొస్తలుల కార్యములు 15:14-18 చదవండి; మత్త. 21:43.

13. (ఎ) తొలి క్రైస్తవులు దేవుని పేరును ఉపయోగించారా? వివరించండి. (బి) మీ పరిచర్యలో యెహోవా పేరును ఉపయోగించే గొప్ప అవకాశం గురించి మీకేమనిపిస్తుంది?

13 దేవుని ‘నామము పెట్టబడిన’ వారిగా ఆ ఆధ్యాత్మిక జనాంగంలోని సభ్యులందరూ హెబ్రీ లేఖనాల నుండి ఉల్లేఖిస్తున్నప్పుడు దేవుని నామాన్ని ఉపయోగించారు. * సా.శ. 33 పెంతెకొస్తు రోజున ఆయా దేశాల నుండి వచ్చిన యూదులను, యూదామత ప్రవిష్టులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు అపొస్తలుడైన పేతురు దేవుని పేరును పలుమార్లు ఉపయోగించాడు. (అపొ. 2:14, 20, 21, 25, 34, 35, NW) తొలి క్రైస్తవులు యెహోవాను ఘనపరిచారు. అందుకు యెహోవా ప్రకటనాపని కోసం వాళ్లు చేసిన ప్రయత్నాల్ని దీవించాడు. నేడు కూడా, మనం సగర్వంగా యెహోవా నామం గురించి ప్రకటించినప్పుడు, వీలైతే ప్రజల సొంత బైబిళ్లలో యెహోవా పేరును చూపించినప్పుడు ఆయన తప్పక మన పరిచర్యను ఆశీర్వదిస్తాడు. మనమలా చేసినప్పుడు ప్రజల్ని సత్యదేవునికి పరిచయం చేస్తాం. అది వాళ్లకు, మనకు ఎంత గొప్ప గౌరవమో కదా! కొందరి విషయంలో ఆ పరిచయం యెహోవాతో ఓ అద్భుతమైన స్నేహానికి నాంది పలికి, రోజురోజుకీ బలపడి శాశ్వత బంధంగా మారవచ్చు.

14, 15. మతభ్రష్టత్వం ప్రబలినా, యెహోవా తన జ్ఞాపకార్థ నామం విషయంలో ఏమి చేశాడు?

14 కొంతకాలానికి, ముఖ్యంగా అపొస్తలులు మరణించిన తర్వాత మతభ్రష్టత్వం పుట్టుకొచ్చి తొలి క్రైస్తవ సంఘం కలుషితమైంది. (2 థెస్స. 2:3-7) అబద్ధ బోధకులు దేవుని నామాన్ని ఉపయోగించకూడదనే యూదుల సాంప్రదాయాన్ని కూడా బోధించారు. కానీ, యెహోవా తన జ్ఞాపకార్థ నామాన్ని కనుమరుగవ్వనిస్తాడా? ఎట్టి పరిస్థితుల్లో అలా జరగనివ్వడు!  యెహోవా పేరును తెలిపే నాలుగు హెబ్రీ హల్లుల పదాన్ని ఖచ్చితంగా ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు మనకు తెలియకపోయినా, ఆ పేరు అన్ని కాలాల్లో ఉండనే ఉంది. కాలగమనంలో ఆ పేరు వివిధ బైబిలు అనువాదాల్లో, అలాగే బైబిలు విద్వాంసుల రాతల్లో కనిపించింది. ఉదాహరణకు, దేవుని పేరు కోసం ఉపయోగించిన అనేక బిరుదుల్లా కాకుండా, “యెహోవా” అనే పదం “ఆయన గుర్తింపును సరిగ్గా తెలుపుతుందనిపిస్తోంది” అని 1757లో ఛార్ల్స్‌ పీటర్స్‌ రాశాడు. 1797లో దేవుని ఆరాధనకు సంబంధించి ప్రచురితమైన ఓ పుస్తకంలో ఏడవ అధ్యాయాన్ని హాప్టన్‌ హేయిన్స్‌ ఇలా ఆరంభించాడు: “యూదులు యెహోవా అనే దేవుని పేరును ఉపయోగించారు; ఆయనను మాత్రమే ఆరాధించారు; క్రీస్తు, ఆయన అపొస్తలులు కూడా అలాగే చేశారు.” హెన్రీ గ్ర్యూ (1781-1862) దేవుని పేరును ఉపయోగించడమే కాదు, ఆ నామం మీద నింద పడిందని, దాన్ని పరిశుద్ధపర్చాలని అర్థంచేసుకున్నాడు. అలాగే ఛార్లెస్‌ టి. రస్సెల్‌ సన్నిహిత సహచరుల్లో ఒకడైన జార్జ్‌ స్టార్జ్‌ (1796-1879) రస్సెల్‌లాగే దేవుని పేరును ఉపయోగించాడు.

15 అయితే 1931వ సంవత్సరానికి ఓ ప్రత్యేకత ఉంది. అప్పటివరకు అంతర్జాతీయ బైబిలు విద్యార్థులు అని పిలువబడిన దేవుని ప్రజలు ఆ సంవత్సరంలో యెహోవాసాక్షులు అనే లేఖనాధారిత పేరును స్వీకరించారు. (యెష. 43:10-12) అప్పటి నుండి వాళ్లు ఆ నామాన్ని స్తుతిస్తూ తాము అద్వితీయ సత్యదేవుని సేవకులుగా, తన ‘నామముకొరకు దేవుడు ఏర్పరచుకున్న ఓ జనాంగంగా’ ఉన్నామని సగర్వంగా ప్రపంచానికి చాటిచెప్పారు. (అపొ. 15:14) అదంతా చూస్తుంటే, మలాకీ 1:11లో యెహోవా చెప్పిన ఈ మాటలు గుర్తుకొస్తాయి: “తూర్పుదిశ మొదలుకొని పడమటి దిశవరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును.”

‘యెహోవా నామాన్ని స్మరిస్తూ’ ఉండండి

16. ‘యెహోవా నామాన్ని స్మరిస్తూ’ ఉండడాన్ని మనం ఎందుకు ఓ గొప్ప గౌరవంగా ఎంచాలి?

16 మీకా ప్రవక్త ఇలా రాశాడు: “సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము.” (మీకా 4:5) యెహోవా తన పేరును ధరించేందుకు బైబిలు విద్యార్థులను అనుమతించడం వాళ్లకు దొరికిన ఓ గొప్ప గౌరవం మాత్రమే కాదు. ఆయన ఆమోదం వాళ్లకు ఉందనేందుకు కూడా అది రుజువు. (మలాకీ 3:16-18 చదవండి.) మరి మీ విషయమేమిటి? ‘యెహోవా నామాన్ని స్మరిస్తూ’ ఉండేందుకు మీరు శతవిధాలా ప్రయత్నిస్తున్నారా? ‘యెహోవా నామాన్ని స్మరిస్తూ’ ఉండాలంటే ఏమి చేయాలో మీరు అర్థంచేసుకున్నారా?

17. దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలంటే మనం ఏమి చేయాలి?

17 దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలంటే కనీసం మూడు పనులు చేయాలి. మొదటిగా, ‘యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేసేవాళ్లు’ మాత్రమే ‘రక్షించబడతారని’ గుర్తించి ఆయన నామాన్ని ఇతరులకు ప్రకటించాలి. (రోమా. 10:13, NW) రెండవదిగా, యెహోవా లక్షణాల గురించి, ముఖ్యంగా ఆయన ప్రేమ గురించి ధ్యానించాలి. (1 యోహా. 4:8) మూడవదిగా, సంతోషంగా దేవుని నీతి ప్రమాణాలకు లోబడుతూ, మన తండ్రి పరిశుద్ధమైన నామానికి మచ్చ తీసుకురాకుండా జీవించాలి. (1 యోహా. 5:3) ‘మన దేవుడైన యెహోవా నామాన్ని ఎల్లప్పుడూ స్మరిస్తూ’ ఉండాలని మీరు గట్టిగా నిర్ణయించుకున్నారా?

18. యెహోవా గొప్ప నామాన్ని ఘనపర్చేవాళ్లంతా ఎందుకు భవిష్యత్తును నమ్మకంతో ఎదుర్కోవచ్చు?

18 యెహోవాను పట్టించుకోనివాళ్లు, ధిక్కరించేవాళ్లు త్వరలోనే ఆయనెవరో బలవంతంగా గుర్తించాల్సి వస్తుంది. (యెహె. 38:23) ఫరోలాంటి వాళ్లందరికీ ఆ పరిస్థితి వస్తుంది. ‘నేను అతని మాట వినుటకు యెహోవా ఎవడు?’ అని ఫరో అన్నాడు. కానీ, యెహోవా ఎవరో అతనికి ఎంత త్వరగా తెలిసివచ్చిందో కదా! (నిర్గ. 5:1, 2; 9:16; 12:29) అయితే, మనం మాత్రం యెహోవాను ఇష్టపూర్వకంగా తెలుసుకున్నాం. మనం ఆయన నామాన్ని ధరించినందుకు, ఆయన పేరు కలిగి ఆయనకు లోబడే ప్రజల్లో ఉన్నందుకు మనం గర్వపడుతున్నాం. కాబట్టి, కీర్తన 9:10లోని వాగ్దానం నెరవేరుతుందనే నమ్మకంతో మనం భవిష్యత్తును ఎదుర్కొంటాం. ఆ లేఖనంలో ఇలా ఉంది: “యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచి పెట్టువాడవు కావు. కావున నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు.”

^ పేరా 5 దేవుని పేరు, “అవ్వు” అని అర్థమిచ్చే హెబ్రీ క్రియాపదానికి ఉన్న ఓ రూపం. కాబట్టి, “యెహోవా” అంటే “తానే కర్త అవుతాడు” అని అర్థం.—ఆది. 2:4.

^ పేరా 13 తొలి క్రైస్తవులు దేవుని పేరును ఉపయోగించడానికి హెబ్రీ భాషలోని నాలుగు హల్లులతో (టెట్రగ్రామటన్‌) కూడిన పదాన్ని వాడారు. హెబ్రీ లేఖనాలను గ్రీకులోకి తర్జుమా చేసిన సెప్టువజింటు తొలి ప్రతుల్లో కూడా అదే పదాన్ని వాడారని ఆధారాలు చూపిస్తున్నాయి.