కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చక్కని ప్రణాళిక తెచ్చిన ఫలితాలు

చక్కని ప్రణాళిక తెచ్చిన ఫలితాలు

దక్షిణ అమెరికాలోని చిలీ దేశంలో ఉన్న శాన్‌ బెర్నార్డో పట్టణంలో మారీయా ఈసాబెల్‌ అనే ఉత్సాహవంతురాలైన ఒక యౌవన ప్రచారకురాలు ఉంది. ఆమె, ఆమె కుటుంబీకులు స్థానిక మపూచీ తెగకు చెందినవాళ్లు. తమ మాతృభాషయైన మాపూడూన్‌గూన్‌లో ఒక కొత్త సంఘం స్థాపించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు వాళ్లు ఉత్సాహంగా మద్దతునిస్తున్నారు.

ఆ సంవత్సరం క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ తమ మాతృభాషలో జరుగుతుందని, అలాగే ఆ భాషలో 2,000 ఆహ్వానపత్రాలు అందుబాటులో ఉన్నాయని స్థానిక సంఘంలో ఓ ప్రకటన చేశారు. వాటిని పంచే పనిలో భాగం వహించడానికి తాను ఏం చేయాలా అని ఆమె ఆలోచించసాగింది. తోటి విద్యార్థులకు, టీచర్లకు సాక్ష్యం ఇచ్చి మంచి ఫలితాలు సాధించిన పిల్లల అనుభవాలను ఆమె గుర్తు చేసుకుంది. ఈ విషయం గురించి తన తల్లిదండ్రులతో కూడా మాట్లాడింది. స్కూల్‌లో ఆహ్వానపత్రాలను పంచిపెట్టడం కోసం మారీయా ఏదైనా ఉపాయం ఆలోచిస్తే బాగుంటుందని వాళ్లందరూ అనుకున్నారు. ఇంతకీ ఆమెకు ఏ ఉపాయం తట్టింది?

మొదటిగా, మారీయా స్కూలు యాజమాన్యాన్ని కలిసి స్కూలు మెయిన్‌ గేట్‌ వద్ద ఒక ఆహ్వానపత్రాన్ని అంటించడానికి అనుమతి కోరింది. వాళ్లు అనుమతి ఇవ్వడంతో పాటు ఆమె తీసుకుంటున్న చొరవను ప్రశంసించారు. ఓ రోజు ఉదయం వాళ్ల ప్రిన్సిపాల్‌, స్కూల్‌ అసెంబ్లీలో ఆ ఆహ్వానం గురించి మైకులో ఒక ప్రకటన కూడా చేశాడు.

ఆ తర్వాత, స్కూల్లోని ఇతర క్లాస్‌రూమ్స్‌కు కూడా వెళ్లి వాళ్లతో మాట్లాడడానికి మారీయా అనుమతి కోరింది. టీచర్ల నుండి అనుమతి లభించిన తర్వాత, ప్రతీ తరగతికి వెళ్లి మపూచీ తెగకు చెందిన వాళ్లు ఎవరైనా ఉన్నారేమో అడిగి తెలుసుకుంది. “మపూచీ వాళ్లు మహా అయితే 10-15 మంది ఉంటారని నేను అనుకున్నాను, కానీ చాలామంది ఉన్నారు. చివరికి నేను 150 దాకా ఆహ్వానపత్రాలను ఇచ్చాను” అని మారీయా అంది.

“ఎవరైనా పెద్దావిడ వచ్చి కలుస్తుందని ఆమె అనుకుంది”

ఒక స్త్రీ, స్కూల్‌ మెయిన్‌ గేట్‌ దగ్గర అంటించిన పోస్టర్‌ చూసి దాని గురించి తెలుసుకోవడానికి ఎవరితో మాట్లాడాలి అంటూ వాకబు చేసింది. ఆమెను పదేళ్ల మారీయా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆమె ఎంతగానో ఆశ్చర్యపోయింది. ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ మారీయా చిరునవ్వుతో ఇలా అంది: “ఎవరైనా పెద్దావిడ వచ్చి కలుస్తుందని ఆమె అనుకుంది.” ఆ స్త్రీకి ఆహ్వానపత్రం ఇచ్చి క్లుప్తంగా వివరించిన తర్వాత ఆమె ఇంటి చిరునామాను మారీయా తీసుకుంది. తద్వారా తను, తన తల్లిదండ్రులు ఆ స్త్రీ ఇంటికి వెళ్లి దేవుని రాజ్యం గురించి మరింతగా సాక్ష్యం ఇవ్వవచ్చని ఆమె అనుకుంది. ఆ జ్ఞాపకార్థ ఆచరణకు ఆ స్త్రీతో పాటు ఆసక్తి గల మరో 26 మంది మపూచీ ప్రజలు హాజరయ్యారు. మాపూడూన్‌గూన్‌ భాషా ప్రాంతంలో సేవ చేస్తున్న 20 మంది ప్రచారకులు వాళ్లందరినీ చూసి ఎంతో సంతోషించారు. ఇప్పుడక్కడ ఎంతో అభివృద్ధి సాధిస్తున్న ఒక సంఘం ఉంది.

మీరు ఏ వయసువాళ్లైనా జ్ఞాపకార్థ ఆచరణ, బహిరంగ ప్రసంగం, జిల్లా సమావేశం వంటివాటికి తోటి విద్యార్థులను గానీ ఉద్యోగులను గానీ ఆహ్వానించడానికి మారీయాలాగే చొరవ తీసుకుంటారా? ఇలాంటి సందర్భాల్లో చక్కగా సాక్ష్యం ఇవ్వడానికి ఉపయోగపడే సలహాల కోసం మన ప్రచురణల్లో పరిశోధన చేసి చూడండి. అలాగే, తన గురించి ధైర్యంగా మాట్లాడేందుకు పరిశుద్ధాత్మను ఇవ్వమని యెహోవాకు ప్రార్థించండి. (లూకా 11:13) మీరలా చేస్తే, చక్కని ప్రణాళిక తెచ్చే ఫలితాల్ని చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు, ఎంతగానో ప్రోత్సాహం పొందుతారు.