కుటుంబ ఆరాధన, వ్యక్తిగత అధ్యయనం కోసం కొన్ని సలహాలు
కుటుంబ ఆరాధన, వ్యక్తిగత అధ్యయనం కోసం కొన్ని సలహాలు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షుల సంఘాలు, 2009 జనవరి నుండి తమ కూటాలను కాస్త సవరించుకున్నాయి. వారం మధ్యలో జరిగే కూటాలన్నీ ఒకేరోజున జరిగేలా ఏర్పాటు చేశారు. కాబట్టి, అంతకుముందు పుస్తక అధ్యయనం కోసం కేటాయించిన సమయాన్ని తమ కుటుంబ ఆరాధన లేదా వ్యక్తిగత అధ్యయనం కోసం ఉపయోగించుకోవాలని అందరూ ప్రోత్సహించబడ్డారు. ఈ కొత్త ఏర్పాటును మీరు సరిగ్గా ఉపయోగించుకుంటున్నారా? దాని నుండి పూర్తిగా ప్రయోజనం పొందుతున్నారా?
కుటుంబ ఆరాధనలో ఏ సమాచారాన్ని పరిశీలించాలనే ప్రశ్న కొంతమందికి వచ్చింది. కుటుంబాలన్నీ ఒకేలా అధ్యయనం చేయాలనేది పరిపాలక సభ ఉద్దేశం కాదు. పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి కాబట్టి ప్రతీవారం ఆ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఎలా ఉపయోగించవచ్చో ఆయా కుటుంబ శిరస్సులు లేదా వ్యక్తులు నిర్ణయించుకోవడం మంచిది.
కొందరు ఆ సమయాన్ని కూటాలకు సిద్ధపడడానికి ఉపయోగిస్తున్నారు. అయితే కుటుంబ ఆరాధనలో ఇతర విషయాలు కూడా చేర్చవచ్చు. మరికొందరు తమ పిల్లల ప్రయోజనం కోసం ఆ సమయంలో బైబిలు సమాచారాన్ని చదువుతున్నారు, చర్చిస్తున్నారు, కొన్నిసార్లు దానిలోని కథలను నటిస్తున్నారు కూడా. కూటాల్లో చేసినట్లు ప్రతీసారి ప్రశ్నాజవాబుల పద్ధతిని ఉపయోగించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అది సరైన పద్ధతి కాకపోవచ్చు. ఆ సమయంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే ఉత్సాహంగా చర్చించుకోగలుగుతారు, ఆలోచనలను పంచుకోగలుగుతారు, మరింత సృజనాత్మకంగా ఆలోచించగలుగుతారు. దానివల్ల అందరూ సంతోషంగా ఉండడమే కాక ఆ సందర్భం చాలా రోజులు గుర్తుంటుంది.
ముగ్గురు పిల్లలున్న ఒక తండ్రి ఇలా రాశాడు: “మేము ఎక్కువ శాతం బైబిల్లోని వృత్తాంతాల ఆధారంగా కుటుంబ ఆరాధన చేస్తున్నాం. ప్రతీ ఒక్కరం ఆ అధ్యాయాలను ముందుగానే చదువుతాం. మా పిల్లలు దానికి సంబంధించిన ఏదోక విషయం గురించి పరిశోధించి, తాము నేర్చుకున్న విషయాలను కుటుంబ ఆరాధన చేసే సమయంలో చెబుతారు. 7 ఏళ్ల మైకెల్ తరచూ ఏదైనా ఒక బొమ్మ గీస్తాడు లేదా ఒక పేరా రాస్తాడు. 13 ఏళ్ల డేవిడ్, 15 ఏళ్ల కేట్లిన్ ఏదైనా బైబిలు వృత్తాంతంలోని ఒకానొక వ్యక్తి ఆలోచనలను గురించి రాస్తూ ఉంటారు. ఉదాహరణకు ఫరో దగ్గర పనిచేసే పానదాయకుల అధిపతికి, భక్ష్యకారుల అధిపతికి వచ్చిన కలలను యోసేపు వివరించడం గురించి మేము చదువుతున్నప్పుడు, యోసేపు చెప్పినట్లే జరగడాన్ని చూసి అదే చెరసాలలో ఉన్న మరో ఖైదీకి ఎలా అనిపించివుంటుంది అనే దాని గురించి కేట్లిన్ ఒక వ్యాసం రాసింది.”—ఆది. 40వ అధ్యాయం.
అందరి పరిస్థితులు ఒకేలా ఉండవు. కాబట్టి అందరూ ఒకే పద్ధతిని పాటించడం సాధ్యం కాకపోవచ్చు. కుటుంబ ఆరాధనలో లేదా వ్యక్తిగత అధ్యయనంలో పాటించగలిగే సలహాలెన్నో తర్వాతి పేజీలో ఉన్నాయి. బహుశా మీరు కూడా ఇంకొన్ని పద్ధతుల గురించి ఆలోచించవచ్చు.
[6, 7 పేజీల్లోని బాక్సు/చిత్రం]
టీనేజీ పిల్లలున్న కుటుంబాలు:
• యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం) పుస్తకాన్ని చదివి, చర్చించండి.
• ఒకవేళ మీరు బైబిలు కాలాల్లో జీవించివుంటే ఏమి చేసివుండేవారో ఊహించుకోండి. (కావలికోట మే 15, 1996 సంచికలోని 14వ పేజీలోవున్న 17-18 పేరాలు చూడండి.)
• స్వల్పకాల, దీర్ఘకాల లక్ష్యాల గురించి మాట్లాడండి.
• అప్పుడప్పుడు బైబిలు ఆధారిత వీడియోలను చూసి, చర్చించండి.
• కావలికోట పత్రికలో వచ్చే, “మన యువతకు” అనే శీర్షికలను పరిశీలించండి.
పిల్లలు లేని దంపతులు:
• కుటుంబ సంతోషానికిగల రహస్యము పుస్తకంలోని 1, 3, 11-16 అధ్యాయాలు చర్చించండి.
• బైబిలు చదువుతున్నప్పుడు పరిశోధించిన విషయాలను పంచుకోండి.
• సంఘ బైబిలు అధ్యయనానికి లేదా కావలికోట అధ్యయనానికి సిద్ధపడండి.
• ఇద్దరూ కలిసి ఎక్కువగా ఎలా పరిచర్య చేయవచ్చో చర్చించుకోండి.
ఒంటరి సహోదరులు, సహోదరీలు లేదా ఒక్కరే సత్యంలో ఉన్నవాళ్ళు:
• జిల్లా సమావేశాల్లో విడుదలైన కొత్త ప్రచురణలను అధ్యయనం చేయండి.
• కొత్త, పాత వార్షిక పుస్తకములను (ఆంగ్లం) చదవండి.
• మీ ప్రాంతంలోని ప్రజలు సాధారణంగా అడిగే ప్రశ్నలకు ఎలా జవాబివ్వాలో పరిశోధించండి.
• క్షేత్ర పరిచర్య కోసం అందింపులను సిద్ధం చేసుకోండి.
చిన్న పిల్లలున్న కుటుంబాలు:
• బైబిలు కథల్లోని వ్యక్తుల్లా నటించండి.
• తేజరిల్లు! (ఆంగ్లం) సంచికల్లోని 30, 31 పేజీల్లో వచ్చే మెమరీ గేమ్స్ వంటి వాటిని ఆడించండి.
• అప్పుడప్పుడు కొత్త పద్ధతుల్ని ప్రయత్నించి చూడండి. (కావలికోట ఫిబ్రవరి 15, 2011 సంచికలోని 11వ పేజీలోవున్న “మీరు చేసే కృషి వృథా కాదు!” అనే ఆర్టికల్ చూడండి.)
• కావలికోట పత్రికలోని “మీ పిల్లలకు నేర్పించండి” అనే శీర్షికలను పరిశీలించండి.