రాజ్య ప్రచారకుల అవసరత ఎక్కువగా ఉన్నచోట మీరు సేవ చేయగలరా?
రాజ్య ప్రచారకుల అవసరత ఎక్కువగా ఉన్నచోట మీరు సేవ చేయగలరా?
“మేము అమెరికాలో ఎంతో సౌకర్యవంతంగా జీవిస్తున్నాము కానీ అక్కడి వస్తుపరమైన జీవన విధానం మాపైనా, మా ఇద్దరు కుమారులపైనా చివరకు ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపిస్తుందో అని చింతించేవాళ్ళం. నేను, నా భార్య ఒకప్పుడు మిషనరీలముగా సేవచేశాం, ఆ నిరాడంబరమైన, సంతోషభరితమైన జీవితాన్ని తిరిగి పొందాలనుకున్నాము.”
ఆ కోరికతో ప్రేరేపించబడిన రాల్ఫ్, పామ్ రాజ్య ప్రచారకుల అవసరత ఎక్కువగా ఉన్నచోట సేవ చేయాలనే తమ అభిలాషను వివిధ బ్రాంచి కార్యాలయాలకు తెలియజేయాలని 1991లో నిర్ణయించుకున్నారు. మెక్సికోలోని బ్రాంచి కార్యాలయం, తమ దేశంలో ఇంగ్లీషు మాట్లాడే ప్రజలకు ప్రకటించగల రాజ్య ప్రచారకులు వెంటనే అవసరమని తెలియజేసింది. వాస్తవానికి, ఆ క్షేత్రం “తెల్లబారి కోతకు వచ్చియున్న[ది]” అని ఆ బ్రాంచి పేర్కొన్నది. (యోహా. 4:35) త్వరలోనే రాల్ఫ్ మరియు పామ్ ఆ ఆహ్వానాన్ని అంగీకరించి 8 ఏళ్ళు, 12 ఏళ్ళు ఉన్న తమ కుమారులను తీసుకొని అక్కడికి వెళ్ళడానికి సిద్ధపాట్లు ప్రారంభించారు.
విస్తృత క్షేత్రం
రాల్ఫ్ ఇలా గుర్తుచేసుకుంటున్నాడు, “మేము అమెరికా నుండి బయలుదేరక ముందు సదుద్దేశంగల కొంతమంది సహోదర సహోదరీలు, ‘విదేశాలకు వెళ్ళడం చాలా అపాయకరం!’ ‘అక్కడికి వెళ్ళాక అనారోగ్యం పాలైతే ఏమి చేస్తారు?’ ‘ఇంగ్లీషు మాట్లాడేవారున్న క్షేత్రంలో ప్రకటించడానికి వెళ్ళడం ఎందుకు? అక్కడున్న ఇంగ్లీషు మాట్లాడేవారు సత్యం పట్ల ఆసక్తి చూపించకపోవచ్చు!’ అని మాతో అన్నారు. కానీ అప్పటికే మేము వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఎంతైనా, అది మేము తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం కాదు. మేము దానికోసం ఎన్నో సంవత్సరాలుగా ఏర్పాట్లు చేసుకున్నాం. అందుకే మేము అప్పులు చేయకుండా డబ్బు కూడబెట్టుకున్నాం, మేము వెళ్ళిన తర్వాత ఎదురవగల సమస్యల గురించి కుటుంబమంతా కూర్చొని ఎన్నోసార్లు చర్చించుకున్నాం.”
మొదట రాల్ఫ్, ఆయన కుటుంబం మెక్సికో బ్రాంచికి వెళ్ళారు. అక్కడి సహోదరులు కొత్తగా వెళ్ళిన వీరికి ఆ దేశపు మ్యాపు చూపించి, “ఇదంతా మీ క్షేత్రమే” అని చెప్పారు. ఈ కుటుంబం, మెక్సికో నగరానికి వాయవ్యంగా దాదాపు 240 కిలోమీటర్ల దూరంలోవున్న సాన్ మిగల్ డే ఆయెండెలో స్థిరపడింది, అక్కడ చాలామంది విదేశీయులున్నారు. వాళ్ళు వెళ్ళిన మూడు సంవత్సరాల తర్వాత ఆ పట్టణంలో 19 మంది ప్రచారకులతో ఇంగ్లీషు భాషా సంఘం ఏర్పడింది. అది మెక్సికోలో ఏర్పడిన మొదటి ఇంగ్లీషు భాషా సంఘం, అయితే చేయవలసిన పని ఇంకా ఎంతో ఉంది.
మెక్సికోలో పదిలక్షల మంది అమెరికా పౌరులు నివసిస్తున్నారని అంచనా వేయబడింది. అంతేగాక మెక్సికో పౌరుల్లోని చాలామంది ఉన్నతోద్యోగులు, విద్యార్థులు కూడా ఇంగ్లీషు మాట్లాడతారు. రాల్ఫ్ ఇలా వివరిస్తున్నాడు, “మేము మరెక్కువ మంది పనివాళ్ళు కావాలని ప్రార్థించాం. ఒక విధంగా చెప్పాలంటే, ‘దేశమును సంచరించి చూచుటకు’ మా ప్రాంతానికి వచ్చిన సహోదర సహోదరీల కోసం సంఖ్యా. 13:2.
మా ఇంట్లో ఎప్పుడూ ఒక అదనపు పడకగదిని సిద్ధంగా ఉంచేవాళ్ళం.”—పరిచర్యను విస్తృతపర్చుకోవడానికి వారు తమ జీవన విధానాన్ని మార్చుకున్నారు
త్వరలోనే, తమ పరిచర్యను విస్తృతపర్చుకోవాలనుకుంటున్న చాలామంది సహోదర సహోదరీలు వచ్చారు. వాళ్ళలో అమెరికా నుండి వచ్చిన బిల్, కాథీ ఉన్నారు. వాళ్ళు ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న క్షేత్రాల్లో అప్పటికే 25 సంవత్సరాలు సేవచేశారు. వాళ్ళు స్పానిష్ నేర్చుకోవాలనుకున్నారు, కానీ చాపాలా సరస్సు తీరానున్న ఆకీకీక్ పట్టణానికి వెళ్ళిన తర్వాత తమ ప్రణాళిక మారిపోయింది, సాధారణంగా అమెరికా వాసులు రిటైరయ్యాక ఆ పట్టణానికి వెళ్ళాలని కోరుకుంటారు. బిల్ ఇలా చెబుతున్నాడు, “మేము ఆకీకీక్లో, సత్యం తెలుసుకోవాలని ఆశిస్తున్న ఇంగ్లీషు మాట్లాడే ప్రజలను వెదకడంలో నిమగ్నమయ్యాం.” ఆ పట్టణానికి చేరుకున్న రెండు సంవత్సరాల్లో బిల్, కాథీ మరో సంఘం ఏర్పడడం చూశారు, అది మెక్సికోలో ఏర్పడిన రెండవ ఇంగ్లీషు భాషా సంఘం.
కెనడాకు చెందిన కెన్, జోయన్నా తమ జీవన విధానాన్ని మార్చుకుని రాజ్య కార్యకలాపాలకు మరింత సమయాన్ని వెచ్చించాలనుకున్నారు. వాళ్ళు కూడా మెక్సికోకు వచ్చారు. కెన్ ఇలా చెబుతున్నాడు, “ఎన్నో రోజులపాటు వేణ్ణీళ్ళు, కరెంట్, టెలిఫోన్ ఉండని ప్రాంతంలో నివసించడానికి అలవాటు పడేందుకు సమయం పట్టింది.” అయితే ప్రకటనాపనిలో పాల్గొనడం వల్ల మేమెంతో ఆనందాన్ని పొందాము. త్వరలోనే కెన్ పరిచర్య సేవకునిగా నియమించబడ్డాడు, ఆ తర్వాత రెండేళ్ళకు పెద్ద అయ్యాడు. వాళ్ళ కుమార్తె బ్రిటనీకి, కొంతమందే యౌవనస్థులున్న చిన్న ఇంగ్లీషు భాషా సంఘానికి వెళ్ళడం మొదట్లో కష్టమయ్యింది. అయితే ఆమె రాజ్యమందిర నిర్మాణ ప్రాజెక్టులలో పాల్గొనడం మొదలుపెట్టిన తర్వాత, దేశమంతటిలో ఆమె ఎంతోమంది మంచి స్నేహితులను సంపాదించుకుంది.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రానికి చెందిన పాట్రిక్, రొక్సాన్నా దగ్గర్లోనే ఇంగ్లీషు మాట్లాడే ప్రజలున్న మిషనరీ క్షేత్రం ఉందని తెలుసుకొని ఎంతో సంతోషించారు. “ఈశాన్య మెక్సికోలోవున్న మాంటెర్రీ అనే పట్టణానికి వెళ్ళివచ్చిన తర్వాత అక్కడ సహాయం చేయడానికి యెహోవా మమ్మల్ని నడిపిస్తున్నాడని భావించాము” అని పాట్రిక్ చెబుతున్నాడు. వారు ఐదు రోజుల్లోనే టెక్సాస్లోవున్న తమ ఇంటిని అమ్మేసి, “మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుము” అనే విన్నపానికి పౌలు ప్రతిస్పందించినట్లుగా, అక్కడికి వెళ్ళారు. (అపొ. 16:9) మెక్సికోలో వాళ్ళకు ఉద్యోగం అంత సులభంగా దొరకలేదు, కానీ కేవలం రెండు సంవత్సరాల్లో 17 మంది సాక్షులున్న చిన్న గుంపు 40 మంది ప్రచారకులున్న సంఘంగా మారడాన్ని చూసి వాళ్ళెంతో ఆనందాన్ని పొందారు.
జెఫ్, డెబ్ కూడా తమ పరిచర్యను విస్తృతపర్చుకోవడానికి తమ జీవన విధానాన్ని మార్చుకున్నారు. వాళ్ళు అమెరికాలో తమకున్న విశాలమైన ఇంటిని అమ్మేసి మెక్సికో తూర్పు తీరానున్న కాన్కన్ అనే నగరంలో ఒక చిన్న అపార్ట్మెంటులోకి మారారు. గతంలో వారు తమ ఇంటికి దగ్గర్లో ఏసీ హాళ్ళలో జరిగే సమావేశాలకు వెళ్ళేవారు. కానీ ఆ తర్వాత వాళ్ళు దగ్గర్లో జరిగే ఇంగ్లీషు అసెంబ్లీకి వెళ్ళాలంటే 8 గంటలు ప్రయాణించాల్సి వచ్చేది, అందులోనూ ఆ సమావేశం పైకప్పులేని స్టేడియంలో జరిగేది. అయితే కాన్కన్లో దాదాపు 50 మంది ప్రచారకులున్న సంఘం ఏర్పడడం చూసి ఎంతో సంతృప్తిని పొందారు.
మెక్సికోకు చెందిన కొంతమంది సహోదర సహోదరీలు కూడా ఇంగ్లీషు మాట్లాడే ప్రాంతంలో ప్రకటించడానికి సహాయం చేయడం ప్రారంభించారు. ఉదాహరణకు, సాన్ మిగల్ డే ఆయెండెలో మొదటి ఇంగ్లీషు భాషా సంఘం
ఏర్పడిందని, మెక్సికో అంతా ఆ సంఘ క్షేత్రం క్రిందికి వస్తుందని రూబెన్, ఆయన కుటుంబం విన్నప్పుడు వాళ్ళు సహాయం చేయడానికి అక్కడకు వెళ్ళాలని వెంటనే నిర్ణయించుకున్నారు. అందుకోసం వాళ్ళు ఇంగ్లీషు నేర్చుకోవాలి, మరో సంస్కృతికి అలవాటుపడాలి, దూరప్రయాణాలు చేయాలి, ఎందుకంటే వాళ్ళు కూటాలకు హాజరయ్యేందుకు ప్రతీవారం 800 కిలోమీటర్లు ప్రయాణించాల్సివుంటుంది. రూబెన్ ఇలా చెబుతున్నాడు, “అక్కడ విదేశీయులకు సాక్ష్యమిచ్చే ఆనందం మాకు లభించింది, వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా మెక్సికోలోనే ఉంటున్నప్పటికీ మొట్టమొదటిసారి తమ స్వంత భాషలో సువార్త సందేశాన్ని విన్నారు. వారిలో కొంతమంది కన్నీళ్ళతో తమ కృతజ్ఞతను తెలియజేశారు.” రూబెన్, ఆయన కుటుంబం, సాన్ మిగల్ డే ఆయెండె సంఘానికి సహాయం చేసిన తర్వాత మధ్య మెక్సికోలోవున్న గువానజువాటొ పట్టణంలో పయినీర్లుగా సేవచేశారు, అక్కడ వాళ్ళు 30 కన్నా ఎక్కువమంది ప్రచారకులున్న ఇంగ్లీషు భాషా సంఘం ఏర్పడడానికి సహాయం చేశారు. ఇప్పుడు వాళ్ళు గువానజువాటొకు దగ్గర్లోవున్న ఈరాప్వాటో పట్టణంలోని ఇంగ్లీషు భాషా గుంపుతో కలిసి సేవచేస్తున్నారు.చేరుకోవడం కష్టమైనవాళ్ళకు ప్రకటించడం
విదేశీయులతోపాటు ఎంతోమంది మెక్సికోవాసులు కూడా ఇంగ్లీషు మాట్లాడతారు. వాళ్ళకు రాజ్య సందేశం ప్రకటించడం తరచూ ఎంతో కష్టం, ఎందుకంటే వాళ్ళు సంపన్నులుండే ప్రదేశాల్లో నివసిస్తున్నారు, అక్కడి ఇళ్ళల్లో ఎవరైనా తలుపుకొట్టినప్పుడు సాధారణంగా పనివాళ్ళే తలుపు తీస్తారు. ఒకవేళ ఇంటివాళ్ళు తలుపు దగ్గరకు వచ్చినా వాళ్ళు మన సందేశాన్ని వినడానికి ఇష్టపడకపోవచ్చు, ఎందుకంటే యెహోవాసాక్షులు స్థానికంగా ఉన్న ఒక చిన్న మతశాఖకు చెందినవారని వాళ్ళు భావిస్తారు. అయినప్పటికీ విదేశాలనుండి వచ్చిన సాక్షులు ప్రకటించడానికి వచ్చినప్పుడు అలాంటి గృహస్థుల్లో కొంతమంది వింటారు.
మధ్య మెక్సికోలోవున్న క్వారటారో నగరంలో నివసిస్తున్న గ్లోరియా ఉదాహరణ పరిశీలించండి. ఆమె ఇలా వివరిస్తోంది, “స్పానిష్ భాష మాట్లాడే సాక్షులు ముందొకసారి నా దగ్గరకు వచ్చారు కానీ వాళ్ళు చెప్పేది నేను వినలేదు. అయితే నా కుటుంబ సభ్యులు, స్నేహితులు సమస్యల్లో చిక్కుకోవడంతో నేనెంతో కృంగిపోయి ఏదైనా దారి చూపించమని దేవునికి ప్రార్థించాను. ఆ తర్వాత కొద్దికాలానికే ఇంగ్లీషు మాట్లాడే ఒక స్త్రీ మా ఇంటికి వచ్చింది. ఇంట్లో ఎవరికైనా ఇంగ్లీషు వచ్చేమో తెలియజేయమని ఆమె అడిగింది. ఆమె విదేశీయురాలు కాబట్టి ఆమెపట్ల నాకు ఆసక్తి కలగడంతో నాకు ఇంగ్లీషు వచ్చని ఆమెకు తెలియజేశాను. ఆమె మాట్లాడుతుండగా, ‘ఈ అమెరికా దేశస్థురాలు ఇక్కడేం చేస్తుంది’ అని నేను ఆలోచిస్తున్నాను. కానీ నాకు సహాయం చేయమని నేను దేవునికి ప్రార్థించాను. కాబట్టి నా ప్రార్థనలకు జవాబుగా ఈ విదేశీయురాలు వచ్చిందేమో.” గ్లోరియా బైబిలు అధ్యయనానికి అంగీకరించి, కుటుంబం వ్యతిరేకించినప్పటికీ ఎంతో వేగంగా పురోగతి సాధించి, బాప్తిస్మం తీసుకుంది. ఇప్పుడు గ్లోరియా క్రమపయినీరుగా సేవచేస్తోంది, ఆమె భర్త, కుమారుడు కూడా యెహోవా ఆరాధకులే.
తమ పరిచర్యను విస్తృతపర్చుకునేవారికి లభించే ప్రతిఫలాలు
రాజ్యప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్నచోట సేవచేయడం ఎంతో కష్టమైనదే అయినా ఎన్నో ఆశీర్వాదాలు లభిస్తాయి. ముందు ప్రస్తావించిన రాల్ఫ్ ఇలా చెబుతున్నాడు, “మేము బ్రిటన్, చైనా, జమైకా, స్వీడన్ వంటి దేశాల ప్రజలతో, చివరికి ఘానాకు చెందిన ఉన్నతశ్రేణి వర్గంవారితో కూడా బైబిలు అధ్యయనాలు నిర్వహించాం. ఈ బైబిలు విద్యార్థుల్లో కొంతమంది పూర్తికాల సేవ చేపట్టారు. గత సంవత్సరాల్లో మా కుటుంబం ఏడు ఇంగ్లీషు భాషా సంఘాలు ఏర్పడడాన్ని చూసింది. మా ఇద్దరు కుమారులు మాతోపాటు పయినీరు సేవ చేయడం ప్రారంభించి, ఇప్పుడు అమెరికా బెతెల్లో సేవచేస్తున్నారు.”
మెక్సికోలో ప్రస్తుతం 88 ఇంగ్లీషు భాషా సంఘాలు, అనేక గుంపులు ఉన్నాయి. అంత వేగంగా పురోభివృద్ధి జరగడానికి కారణమేమిటి? మెక్సికోలోవున్న, ఇంగ్లీషు మాట్లాడే చాలామందిని యెహోవాసాక్షులు ఇంతకుముందెన్నడూ కలవలేదు. తోటివారి నుండి వచ్చే ఒత్తిడి లేకపోవడంతో ఇతరులు చక్కగా విన్నారు, అదే వారి స్వదేశంలోనైతే అలాంటి ఒత్తిడి వాళ్ళను ఆటంకపరచి ఉండేది. ఇంకా ఇతరులు రిటైరయ్యాక ఆధ్యాత్మిక విషయాలకు సమయం లభించడంతో బైబిలు అధ్యయనానికి అంగీకరించారు. అంతేగాక ఇంగ్లీషు భాషా సంఘాల ప్రచారకుల్లో మూడింట ఒకవంతు కంటే ఎక్కువమంది పయినీర్లుగా సేవచేస్తున్నారు, అందుకే ఆ సంఘాల్లో ఆసక్తి ఎక్కువగా ఉండి, పురోభివృద్ధి జరుగుతోంది.
మీకు ఆశీర్వాదాలు లభిస్తాయి
భూవ్యాప్తంగా ఉన్న అనేకమంది తమ స్వంత భాషలో రాజ్యసందేశం ప్రకటించబడడం విన్నప్పుడు తప్పకుండా అనుకూలంగా ప్రతిస్పందిస్తారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తిగల చాలామంది సహోదర సహోదరీలు అంటే యౌవనస్థులు, వృద్ధులు, వివాహితులు, అవివాహితులు అందరూ రాజ్యప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారన్న విషయం ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. నిజమే, వాళ్ళకు కష్టాలు ఎదురవ్వవచ్చు కానీ యథార్థ హృదయంగల వ్యక్తులు బైబిలు సత్యాలను అంగీకరించినప్పుడు కలిగే సంతోషంతో పోలిస్తే ఆ కష్టాలు ఎంతో అల్పమైనవే. మీ దేశంలోనే గానీ విదేశాల్లోనే గానీ రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతానికి తరలి వెళ్ళడానికి అనుకూలించే విధంగా మీ పరిస్థితుల్లో మార్పు చేసుకోగలరా? * (లూకా 14:28-30; 1 కొరిం. 16:9) అలా చేసుకోగలిగితే మీకు ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు లభిస్తాయని మీరు ఎదురుచూడవచ్చు.
[అధస్సూచి]
^ పేరా 21 అవసరం అధికంగా ఉన్న చోట సేవచేయడం గురించి మరింత సమాచారం కోసం యెహోవా చిత్తం చేయడానికి సంస్థీకరించబడ్డాం అనే పుస్తకంలోని 111, 112 పేజీలు చూడండి.
[21వ పేజీలోని బాక్సు]
రిటైరయి, సంతోషంగా ఉంటూ ఇతరుల అవధానాన్ని చూరగొంటున్నారు
బెరిల్ బ్రిటన్ నుండి కెనడాకు వలస వెళ్ళింది. అక్కడామె ఎన్నో అంతర్జాతీయ కంపెనీల్లో మేనేజరుగా పనిచేసింది. గుర్రపుస్వారీ చేయడంలో ఆమె సిద్ధహస్తురాలు, అంతేగాక 1980 ఒలింపిక్స్లో కెనడా తరఫున పాల్గొనడానికి ఆమె ఎంపిక చేయబడింది. బెరిల్, ఆమె భర్త మెక్సికోలోని చాపాలాకు వచ్చిన తర్వాత తరచూ స్థానిక హోటళ్ళలో భోజనం చేసేవాళ్ళు. ఇంగ్లీషు మాట్లాడే, రిటైరయిన వాళ్ళు సంతోషంగా ఉండడం ఆమె గమనించి వాళ్ళకు తననుతాను పరిచయం చేసుకొని మెక్సికోలో ఏమి చేస్తుంటారని వాళ్ళను అడిగేది. అలా హోటళ్ళలో భోజనం చేయడానికి వచ్చి సంతోషంగా ఉన్నవాళ్ళు దాదాపు ఎప్పుడూ యెహోవాసాక్షులే అని తేలేది. దేవుణ్ణి తెలుసుకుంటేనే సంతోషం, జీవిత సంకల్పం లభిస్తాయంటే అలాగే చేయాలని బెరిల్, ఆమె భర్త అనుకున్నారు. కొద్ది నెలలపాటు క్రైస్తవ కూటాలకు హాజరైన తర్వాత బెరిల్ బైబిలును అధ్యయనం చేయడానికి అంగీకరించింది. బెరిల్ ఎన్నో సంవత్సరాలపాటు క్రమ పయినీరుగా సేవచేయగలిగింది.
[22వ పేజీలోని బాక్సు]
“వాళ్ళు మాతో ఉండడం మాకు ఆశీర్వాదమే”
రాజ్యప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న దేశాలకు తరలివెళ్ళే ప్రచారకులను స్థానిక సహోదరులు ఎంతో విలువైనవారిగా ఎంచుతారు. కరీబియన్లోవున్న ఒక బ్రాంచి కార్యాలయం ఇలా రాసింది, “ఇక్కడ సేవచేస్తున్న వందలాదిమంది విదేశీయులు ఇక్కడినుండి వెళ్ళిపోతే సంఘాల పటిష్ఠత దెబ్బతింటుంది. వాళ్ళు మాతో ఉండడం మాకు ఆశీర్వాదమే.”
సువార్త “ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు” అని దేవుని వాక్యం చెబుతుంది. (కీర్త. 68:11) కాబట్టి విదేశాల్లో సేవచేస్తున్నవారిలో చాలామంది అవివాహిత సహోదరీలే ఉన్నారంటే అందులో ఆశ్చర్యమేమీలేదు. స్వయంత్యాగ స్ఫూర్తి చూపించే అలాంటి సహోదరీలు ఎంతో సహాయాన్ని అందిస్తున్నారు. తూర్పు ఐరోపాలోని ఒక బ్రాంచి కార్యాలయం ఇలా తెలియజేసింది, “మా సంఘాల్లోని చాలా వాటిలో ఎక్కువశాతం మంది కొన్నిసార్లు దాదాపు 70 శాతం మంది సహోదరీలే. వాళ్ళలో చాలామంది కొత్తగా సత్యంలోకి వచ్చారు, వేరే దేశాల నుండి వచ్చిన అవివాహితులైన పయినీరు సహోదరీలు అలాంటి కొత్తవారికి శిక్షణనివ్వడం ద్వారా ఎంతగానో తోడ్పడుతున్నారు. విదేశాల నుండి వచ్చిన ఈ సహోదరీలను మేమెంతో విలువైనవారిగా పరిగణిస్తున్నాం.”
ఆ సహోదరీలు విదేశాల్లో సేవచేయడం గురించి ఎలా భావిస్తున్నారు? విదేశాల్లో అవివాహిత పయినీరుగా ఎన్నో సంవత్సరాలపాటు సేవ చేసిన, 30 ఏళ్ళు పైబడిన ఆంజెలికా అనే ఒక సహోదరి ఇలా చెబుతోంది, “ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నాను. ఒక ప్రాంతంలో సేవచేస్తున్నప్పుడు నేను ప్రతీరోజూ చిత్తడిగా ఉండే రోడ్లమీద ఎంతో కష్టపడి నడవాల్సి వచ్చేది, ఆ పరిసరాల్లోని ప్రజలు ఎన్నో కష్టాలు పడడం చూసి నేనెంతో కృంగిపోయేదాన్ని. కానీ పరిచర్యలో ప్రజలకు సహాయపడడంలో నేనెంతో సంతృప్తిని పొందాను. స్థానిక సహోదరీలు తమకు సహాయం చేయడానికి నేను వచ్చినందుకు నాకు తరచూ కృతజ్ఞతలు చెప్పడంతో నేనెంతో సంతోషాన్ని పొందాను. పయినీరు సేవచేయడానికి ఎంతో దూరం నుండి ఈ దేశానికి రావడంలో నేనుంచిన మాదిరి పూర్తికాల సేవను ప్రారంభించడానికి తనను పురికొల్పిందని ఒక సహోదరి చెప్పింది.”
యాభై ఏళ్ళు పైబడిన సూ అనే పయినీరు ఇలా చెబుతోంది, “తప్పకుండా సవాళ్ళు ఎదురవుతాయి, కానీ మనకు లభించే ఆశీర్వాదాలకు అవి సాటిరావు. పరిచర్య చేయడం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. నేను ఎక్కువ సమయం యౌవన సహోదరీలతో కలిసి సేవచేయడంలో గడుపుతాను కాబట్టి కష్టపరిస్థితులను ఎలా అధిగమించాలనే దాని గురించి నేను బైబిలు నుండి మన ప్రచురణల నుండి తెలుసుకున్న విషయాలను వాళ్ళకు చెబుతుంటాను. చాలా సంవత్సరాలపాటు అవివాహిత పయినీరుగా సేవచేయడంలో ఎదురైన సమస్యలను అధిగమించి నేను ఉంచిన మాదిరి, తమ జీవితంలో తమకు ఎదురవుతున్న సవాళ్ళను అధిగమించడం సాధ్యమేనని గ్రహించడానికి తమకు సహాయం చేసిందని వాళ్ళు తరచూ నాకు చెబుతారు. ఈ సహోదరీలకు సహాయం చేయడం నాకెంతో సంతృప్తినిస్తుంది.”
[20వ పేజీలోని మ్యాపు]
మెక్సికో
మాంటెర్రీ
గువానజువాటొ
ఈరాప్వాటో
ఆకీకీక్
చాపాలా
చాపాలా సరస్సు
సాన్ మిగల్ డే ఆయెండె
క్వారటారో
మెక్సికో పట్టణం
కాన్కన్
[23వ పేజీలోని చిత్రం]
కొందరు, మొట్టమొదటిసారి తమ భాషలో సువార్త సందేశాన్ని వింటున్న విదేశీయులకు సాక్ష్యమిచ్చే ఆనందాన్ని పొందారు