కుటుంబం కోసం | భార్యాభర్తలు
మీ వివాహబంధాన్ని కాపాడుకోండి
సమస్య
పెళ్లి రోజు మీరు ఒక ప్రమాణం చేశారు. మీ భార్యను/భర్తను ఎన్నడూ వదలనని, మనసావాచా కట్టుబడి ఉంటానని, ఎన్ని సమస్యలు వచ్చినా జీవితాంతం కలిసి ఉంటానని మాటిచ్చారు.
సంవత్సరాలు గడుస్తుండగా ఎన్నోసార్లు మీరు గొడవలు పడి ఉంటారు. మీ మధ్య దూరం పెరిగిందా? అయినా మీ భార్యతో/భర్తతో కలిసి ఉండాలని ఇప్పటికీ కోరుకుంటున్నారా?
మీరు తెలుసుకోవాల్సినవి
కలిసి ఉండడమే పరిష్కారం, విడిపోవడం కాదు.ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండడం ఈ రోజుల్లో చాలామందికి కష్టంగా అనిపిస్తుంది. మాటిచ్చామంటే “ఇక ఎటూ కదలకుండా కాళ్లకు సంకెళ్లు వేసుకున్నట్లే” అని కొంతమంది అంటారు. అయితే పెళ్లి రోజు, జీవితాంతం కలిసి ఉంటానని మీరిచ్చిన మాట అలలకు కొట్టుకుపోకుండా పడవను కాపాడే లంగరు లాంటిది. మేగన్ అనే స్త్రీ ఇలా అంటుంది, “పెళ్లి అనే బంధంలో ఉన్నాం కాబట్టి గొడవ అయినప్పుడు ఒకరినొకరు వదిలి వెళ్లిపోతామేమో అనే భయం ఉండదు.” a ఎన్ని సమస్యలు వచ్చినా మీ బంధం విడిపోదు, శాశ్వతంగా నిలుస్తుంది అనే నమ్మకం వాటిని పరిష్కరించుకోడానికి మంచి పునాది.—“ వివాహం శాశ్వత బంధం” బాక్సు చూడండి.
ఒక మాట: మీకు గొడవలవుతున్నప్పుడు మీ బంధాన్ని ఎలా పటిష్ఠం చేసుకోవాలో ఆలోచించాలే కానీ కలిసి ఉండాలా లేదా అని కాదు. మరి మీ బంధాన్ని ఎలా పటిష్ఠం చేసుకోవచ్చు?
ఏమి చేయవచ్చు
సరిగ్గా ఆలోచించండి. “జీవితాంతం కలిసుండాలి.” ఈ మాట విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? వలలో చిక్కుకున్నట్లా? లేదా ఒక మంచి భరోసా ఇస్తున్నట్లా? గొడవలు వచ్చినప్పుడు, విడిపోవడం ఒక్కటే మీ కళ్ల ముందు పరిష్కారంగా కనపడుతుందా? భార్యాభర్తల బంధం పటిష్ఠంగా ఉండాలంటే మీ పెళ్లిని శాశ్వత బంధంగా చూడాలి.—మంచి సలహా: మత్తయి 19:6.
పెరిగిన వాతావరణం. మీ తల్లిదండ్రులను చూసి జీవితాంతం కలిసి ఉండడం గురించి మీకు ఒక అభిప్రాయం ఏర్పడవచ్చు. వివాహమైన లియా ఇలా అంటుంది: “నేను ఎదిగే వయసులో నా తల్లిదండ్రులు విడిపోయారు కాబట్టి, పెళ్లి శాశ్వతంగా ఉండే బంధం కాదనే అభిప్రాయం నాలో వచ్చిందేమో అని భయపడతుంటాను.” కానీ మీరు, మీ వివాహబంధం జీవితాంతం ఉండేలా చేసుకోవచ్చు. మీ తల్లిదండ్రులు చేసిన తప్పుల్నే మీరూ చేస్తారని అనుకోవద్దు!—మంచి సలహా: గలతీయులు 6:4, 5.
సరిగ్గా మాట్లాడండి. మీ భర్తతో గానీ భార్యతో గానీ వాదిస్తున్నప్పుడు అనకూడని మాటలు అనకండి. “నేను వెళ్లిపోతాను!,” “నన్ను బాగా చూసుకునే వాళ్లెవరినైనా చూసుకుంటాను!” లాంటి మాటలు అంటే తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. అలాంటి మాటలు మీ బంధాన్ని చులకన చేసి ఉన్న సమస్యను పరిష్కరించే బదులు, మాటకు మాట పెరిగి ఒకరినొకరు అవమానించుకునేలా చేస్తాయి. బాధపెట్టే మాటలు అనే బదులు ఇలా అనండి: “మనిద్దరికీ బాధగానే ఉంది. ఇద్దరం కలిసి ఈ సమస్యని పరిష్కరించుకుందాం.”—మంచి సలహా: సామెతలు 12:18.
మీ మధ్య ఉన్న బంధానికి విలువ చూపించండి. మీ ఆఫీసు టేబుల్ మీద మీ భార్య/భర్త ఫోటో పెట్టుకోండి. వేరే వాళ్ల దగ్గర మీ భార్య/భర్త గురించి మంచి విషయాలు చెప్పండి. వేరే ఊరిలో ఉన్నప్పుడు తప్పకుండా రోజూ ఫోన్ చేయండి. మీరు మాట్లాడుతున్నప్పుడు “మేము,” “నేను, నా భార్య,” “నేను, నా భర్త” అని ఎక్కువగా ఉపయోగించండి. ఇవన్నీ చేయడం ద్వారా మీ మధ్య ఉన్న బంధానికి విలువిస్తున్నారని అందరికీ చెప్పిన వాళ్లవుతారు, మీ బంధం విలువైందని మీకు కూడా గుర్తుచేసుకున్న వాళ్లవుతారు.
చూసి నేర్చుకోండి. వివాహంలో ఒడిదుడుకులు తట్టుకుని నిలబడిన మంచి భార్యాభర్తలను చూసి నేర్చుకోండి. “జీవితాంతం కలిసి ఉంటానని మీరు చేసిన ప్రమాణం మీకెలా అనిపిస్తుంది? ఆ ప్రమాణం మీ వివాహ జీవితంలో ఎలా సహాయం చేసింది?” అని వాళ్లను అడిగి తెలుసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో ఇలా ఉంది: “ఇనుముచేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును.” (సామెతలు 27:17) ఈ మాటను గుర్తుంచుకుని, ఎన్నో సంవత్సరాలుగా కలిసి ఉంటున్న భార్యాభర్తల సలహాలతో మీ బంధాన్ని కాపాడుకోండి. ◼ (g15-E 06)
a వ్యభిచారం వల్ల మాత్రమే విడాకులు తీసుకోవచ్చని బైబిలు చెప్తుంది.
కుటుంబాలకు ఉపయోగపడే విషయాలు తెలుసుకోవడానికి www.jw.org/te చూడండి.