కుటుంబం కోసం|యువత
ఒంటరితనంతో బాధపడుతుంటే ...
సమస్య
“నాకిద్దరు స్నేహితురాళ్లు ఉన్నారు, నన్ను వదిలేసి ఎప్పుడూ వాళ్లిద్దరే కలిసి ఉంటారు. వాళ్లిద్దరు కలిసి చాలా ఎంజాయ్ చేశారని ఎప్పుడూ వింటూ ఉంటాను. ఒకసారి నేను వాళ్లలో ఒకరి ఇంటికి ఫోన్ చేశాను, అప్పుడు ఇంకొక ఆమె కూడా అక్కడే ఉంది. వేరే ఎవరో ఫోన్ ఎత్తినప్పుడు వెనుక వాళ్లిద్దరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నట్లు వినపడింది. వాళ్లు నవ్వుకోవడం విన్నప్పుడు ఇంతకుముందుకన్నా ఇంకా ఎక్కువ ఒంటరిగా అనిపించింది.”—మేఘన. a
మీకు ఎప్పుడైనా ఎవరూ పట్టించుకోనట్లు ఒంటరిగా అనిపించిందా? అయితే బైబిలు ఇచ్చే సలహాలు మీకు ఉపయోగపడతాయి. ముందు అసలు ఒంటరితనం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
మీరు తెలుసుకోవాల్సినవి
అందరికీ ఎప్పుడోకప్పుడు ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. మనకు ఎంతమంది స్నేహితులున్నా సరే మంచి స్నేహితులు లేకపోతే ఒంటరిగానే ఉంటుంది. పేరున్న వాళ్ల చుట్టూ చాలామంది ఉంటారు. అయితే వాళ్లకు కూడా ఒంటరిగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ల చుట్టూ ఎంతమంది ఉన్నా నిజమైన స్నేహితులు లేకపోవడంతో ఒంటరితనంతో బాధపడుతుంటారు.
ఒంటరితనం ఆరోగ్యానికి చాలా ప్రమాదం. 148 పరిశోధనల ఫలితాలు చూసినప్పుడు నలుగురితో కలవకుండా ఉండేవాళ్లు త్వరగా చనిపోయే అవకాశం ఉందని, ఒంటరితనం వల్ల వచ్చే సమస్యలు “అధిక బరువు వల్ల వచ్చే సమస్యలకన్నా రెండింతలు ఎక్కువని,” “రోజుకు 15 సిగరెట్లు తాగడంతో సమానం” అని పరిశోధకులు వివరించారు.
ఒంటరితనం మనల్ని దిక్కుతోచకుండా చేస్తుంది. ఒంటరితనం వల్ల ఏమీ ఆలోచించకుండా, ఎవరు పడితే వాళ్లతో స్నేహం చేసేస్తాం. “ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటే బాగుండని తపనపడతారు. ఎవ్వరూ పట్టించుకోకుండా ఉండటం కన్నా ఎవరో ఒకరు పట్టించుకుంటే చాలు అనుకోవడం మొదలుపెడతారు. అది ప్రమాదానికి దారితీస్తుంది” అని 25 ఏళ్ల రాకేష్ అంటున్నాడు.
టెక్నాలజీ ఒంటరితనాన్ని దూరం చేయలేదు. “రోజూ వందమందికి మెయిళ్లు, మెసేజ్‌లు పంపించినా నాకింకా ఒంటరిగానే అనిపిస్తుంది” అని 24 ఏళ్ల నవ్య అంటుంది. 18 ఏళ్ల తరుణ్ కూడా అలానే అంటున్నాడు: “మెసేజ్ ఇవ్వడం చిరుతిళ్లతో సమానం, కానీ ఎదురెదురుగా ఉండి మాట్లాడడం భోజనం లాంటిది. చిరుతిళ్లు తినడానికి చాలా బాగుంటాయి, కానీ కడుపునిండా భోజనం చేస్తేనే తృప్తిగా ఉంటుంది.”
ఇలా చేయండి
మంచినే ఆలోచించండి. మీరు ఇంటర్నెట్‌లో మీ ఫ్రెండ్స్ పెట్టిన ఫోటోలు చూస్తున్నారని అనుకుందాం. అందులో మీ ఫ్రెండ్స్ అంతా ఒక ఫంక్షన్‌లో దిగిన ఫోటోలున్నాయి. వాళ్లు మిమ్మల్ని అక్కడికి పిలవలేదు. అప్పుడు, కావాలనే మిమ్మల్ని పిలవలేదని అనుకోవచ్చు లేదా ఏదో మంచి కారణం ఉందని అనుకోవచ్చు. మీకు అన్ని విషయాలు తెలియవు కాబట్టి చెడుగా ఎందుకు అనుకోవాలి? మిమ్మల్ని ఎందుకు పిలవలేదని బుర్ర బద్దలుకొట్టుకునే బదులు, మంచి కారణాల గురించి ఆలోచించండి. కొన్నిసార్లు పరిస్థితులు కాదుగానీ మీ ఆలోచనా విధానమే మీరు ఒంటరివాళ్లు అనుకునేలా చేస్తుంది.—మంచి సలహా: సామెతలు 15:15.
వెంటనే ఒక నిర్ణయానికి రాకండి. ‘నన్ను ఎవ్వరూ ఎక్కడికీ పిలవరు, అందరు నన్ను ఎప్పుడూ దూరం పెడుతున్నారు’ అని మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచిస్తుండవచ్చు. అదే నిజం అని నమ్మితే, మీరు ఒంటరితనం అనే ఊబిలోకి ఇంకా ఎక్కువగా కూరుకుపోతారు. విషంలాంటి ఆలోచనలు మీ మనసులో చక్రంలా తిరుగుతుంటాయి. ఎలాగంటే: మొదట అందరూ మిమ్మల్ని వదిలేశారు అనుకుంటారు → మీ అంతట మీరే అందరికి దూరంగా ఉంటారు → ఒంటరితనంతో బాధపడతారు → మళ్లీ మొదటికే వస్తారు, అంటే అందరూ మిమ్మల్ని వదిలేశారు అనుకుంటారు.—మంచి సలహా: సామెతలు 18:1.
మీకన్నా పెద్దవాళ్లతో స్నేహం చేయండి. దావీదు అనే అతని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆయనకన్నా 30 ఏళ్లు పెద్దవాడైన యోనాతాను అనే స్నేహితుడు దావీదుకు ఉన్నాడు. వయసులో తేడా ఉన్నా దావీదు, యోనాతాను మంచి స్నేహితులు. (1 సమూయేలు 18:1) మీరు కూడా అలా స్నేహం చేయవచ్చు. “ఈ మధ్య నేను నాకన్నా పెద్దవాళ్లతో స్నేహం చేశాను, అలాంటి స్నేహానికున్న విలువను నేను చూశాను. నాకన్నా చాలా పెద్దవాళ్లైన మంచి స్నేహితులు కొంతమంది నాకున్నారు. వాళ్ల అనుభవం, స్థిరమైన స్వభావం నాకు చాలా ఉపయోగపడుతుంది” అని 21 ఏళ్ల మానస అంటుంది.—మంచి సలహా: యోబు 12:12.
ఏకాంతాన్ని ఆనందించండి. ఒక క్షణం, చుట్టూ ఎవరూ లేకపోతే వెంటనే కొంతమంది ఒంటరి అయిపోయినట్లు భావిస్తారు. కానీ ఒక్కరే ఉన్నంతమాత్రాన ఒంటరిగా ఉన్నట్లు అనుకోకూడదు. ఉదాహరణకు యేసు అందరితో కలిసి ఉండేవాడు, కాని ఆయన ఏకాంతాన్ని కూడా కోరుకునేవాడు. (మత్తయి 14:23; మార్కు 1:35) మీరు కూడా అలానే ఉండవచ్చు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లు ఉండే బదులు, ఆ సమయాన్ని ప్రశాంతంగా మీకున్న మంచివాటి గురించి ఆలోచించడానికి ఉపయోగించండి. అప్పుడు అందరూ మీతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు.—సామెతలు 13:20. ◼ (g15-E 04)
a కొన్ని అసలు పేర్లు కావు.
కుటుంబాలకు ఉపయోగపడే విషయాలు తెలుసుకోడానికి www.jw.org/te చూడండి